Previous Page Next Page 
ఎర్ర సముద్రం పేజి 20

 

                                       9


    ఆడిటోరియం ముందున్న మైదానంలో అటువేపు ఓ నాలుగు వందల మంది, ఇటువేపు ఓ నాలుగు వందల మంది చీలిపోయి వున్నారు. మధ్యలో ఓ పదిహేను మందిదాకా  తీవ్రంగా  ఘర్షణ పడుతున్నారు.
    అటువైపు, ఇటువైపు ఉన్న స్టూడెంట్స్ ఆవేశంగా చేతులు పైకెత్తి గాలిలో ఊపుతూ నినాదాలు చేస్తున్నారు.
    అంతకంతకు వారిలో ఆవేశం పెరుగుతోంది. అది ఏ క్షణంలోనయినా అవధులు దాటవచ్చు.
    ఇకేమాత్రం ఆలస్యం చేసినా ఆ తరువాత మిగిలేది విధ్వంసమే.
    ఆలోచిస్తూనే సుడిగాలిలా  ఆ రెండు గ్రూపుల మధ్యకు  చూసుకొచ్చాడు నాగ్-
    ఓసారి పెద్దగా  అరిచాడు- మరోసారి -మరోసారి- నాగ్ కేకలకు  ఆ రెండు  గ్రూపుల్లో  రియాక్షన్ కనపడింది. కలకలం తగ్గింది__ఆవేశంతో ఊగిపోతున్న  వారి పిడికిళ్ళు కొద్దిగా వదులయ్యాయి.
    "మైడియర్ ఫ్రెండ్స్..... ఓ  క్షణం ఆగండి....." నాగ్ కంఠం ఆ ప్రాంతంలో ఓసారి మార్మోగింది.
    ఒకే క్షణంలో ఎవరో మంత్రించినట్లుగా అయిపోయారు. అందరూ ఆసక్తిగా నాగ్ వైపు దృష్టి మరలించారు.
    "ఇప్పుడు మన మధ్య తలెత్తిన వైషమయాలకు ఇలా విడిపోతూ యుద్ధం చేసుకోవటం పరిష్కారం కాదు...." కదను తొక్కనున్న తమ ఉద్రేకానికి అడ్డుపడ్డం ఇష్టంలేని కొందరు స్టూడెంట్స్ నాగ్ వైపు అసహనంగా చూసారు.
    "ఆట  ఎక్కడో  మొదలయింది- వారు ఆడుకోవటం ప్రారంభించారు. మనం వారి ఆటకు ఆయువుపట్టనే పావుల్ని కదిలించారు. మనలో కదలిక ప్రారంభమైంది. వ్యక్తిత్వం లేనివారు ఆడించే ఆటలో వ్యక్తిత్వం సంతరించుకుంటున్న  మనం దాన్ని ఈ దశలోనే సమాధి చేసుకోవటం మరెన్నిటికో సమాధి గుణపాఠాలవుతాయి....."
    నాగ్ ప్రసంగం నచ్చని ఓ ఉద్రేకి తెరవబోయిన నోరును కనురెప్పపాటులో క్రాంతి నొక్కేసాడు.
    "అసలు గేమ్ ఎక్కడ ప్రారంభమయింది? ఎందుకు ప్రారంభమైంది? ఏం ఆశించి ప్రారంభించారు? వీటికి సమాధానం రాబట్టుకోకుండా రంగంలోకి దిగితే విలువైన ఓ విద్యా సంవత్సరాన్ని పోగొట్టుకుంటాం....."
    వారిలో ఆవేశం క్రమేపి పల్చబడుతోంది-
    నాగ్ భావాలు నచ్చిన ఒక్కొక్కరు అతనికి చేరువగా రావటం ప్రారంభించారు.
    దూరంగా ఆడిటోరియం మెట్లమీద నిల్చుని ఈ తతంగమంతా చూస్తూన్న ఓ వ్యక్తి కాస్త  కంగారుపడ్డాడు. అతని  భుజానికి వెళ్ళాడుతున్న సంచిలో రెండు సోడాబుడ్లు,ఓ డజనుదాకా గులకరాళ్ళు, ఏసిడ్ బాటిల్స్  ఉన్నాయి. ఓ చేత్తో వాటినే  నిమురుతూ వాటిని బయటకు తీసే అవకాశంకోసం ఆతృతగా ఎదురు చూస్తుండగా , ఆ సమయం ఆసన్నమైందని ఉత్సాహ పడుతుండగా, నాగ్ రావటం- వారిలో ఆవేశం క్రమేపి తగ్గుతూ రావడం కాస్తంత చికాకు కలిగించింది.
    "అసలు  సమస్య - కొత్తగా  ప్రభుత్వం రిజర్వేషన్స్ పెంచటం- ఆనాదిగా సాంఘికంగా  వెనుకబడ్డ మన సోదరుల్ని పైకి తెచ్చేందుకని నేననుకోవటంలేదు. దీనిలో ఏదో  రాజకీయముంది సామరస్యంగా  ఉన్న మనమధ్య చిచ్చుపెట్టడంకోసమే  ఈ ప్రయత్నం జరిగిందని నా అభిప్రాయం.
    మేం బాగుపట్టం ఇష్టంలేదు, అందుకే రిజర్వేషన్స్ ని వ్యతిరేకిస్తున్నారు అని ఒక సోదరవర్గం- ఇప్పటికే కృంగిపోతున్న మేము ఇంకా పెంచిన రిజర్వేషన్స్ మూలంగా ఏమైపోవాలని మరో సోదరవర్గం__ ఇద్దరిదీ కొట్టేయలేని వాదన_ ఇద్దరి మాటల్లోను న్యాయం- అన్యాయం ఉన్నాయి.
    అయితే ఇది తేల్చుకోవటానికి కొట్టుకుచావటం, రక్తపాతం పరిష్కారం కాదు ఈ ఆవేశంలో రోడ్లనబడి బస్సుల్ని, ప్రజల ఆస్తుల్ని తగలబెట్టటం పరిష్కారం కాదు. దేశ నిర్మాణానికి ఉపయోగపడాల్సిన మనమే నిర్మూలణానికి దిగజారబోవటం దారుణం....." నాగ్ ప్రసంగం అక్కడున్న అందర్ని మంత్రించింది.
    ఎవరూ కిక్కురుమనడం లేరు- స్మశానం నిశ్శబ్దం అక్కడ అలుముకుంది.
    "రెండు వర్గాలలోనూ అసంతృప్తివుంది. ఈ అసంతృప్తిని ప్రజల దృష్టికి, ప్రభుత్వ దృష్టికి తేవాలనే తపనా వుంది. ఈ తపనకు ఆవేశాన్ని జోడించవద్దు. వివేకాన్ని జోడిద్దాం. ఓ సరికొత్త రీతిలో మన అసంతృప్తిని బయటపెడదాం. మనల్ని విడతీసి పరిపాలించాలనుకొనే కుట్రదారులు, ప్రధాన సమస్యల మీంచి ప్రజల దృష్టి మరలించి మభ్యపెట్టాలనుకొనే కుహనాకారులు సిగ్గుపడేలా చేద్దాం.
    ఓ సరికొత్త రీతిలో మన అసంతృప్తి ఉద్యమాన్ని నడిపిద్దాం___ తీర్పు ప్రజలే చెపుతారు__
    మనల్ని వివేకంలేని ఆవేసపరులుగా చిత్రీకరిస్తూ వస్తూన్న రాజకీయ పార్టీలకు చెప్పుతో కొట్టినట్టు చేద్దాం.
    ప్రజలు గొర్రెలు- అని మురిసిపోతున్న పాలకుల కళ్ళు తిరిగేలా చేద్దాం- గొర్రెలకూ బుర్రలొస్తాయ్- మరో గంటకే మన సరికొత్త ఉద్యమం ప్రారంభమౌతుంది. అందరూ సమాయత్తం కండి" అని నాగ్  ఓ క్షణం తన ప్రసంగాన్ని ఆపి నలువేపులా పరిశీలనగా చూస్తూ "జై భరతమాత" అన్నాడు కంఠాన్ని చీలుస్తూ_"

 Previous Page Next Page