కానీ జలీల్! పైకి రావాలంటే కేవలం రూల్సు తెలుసుకుంటే చాలదు! అంతకంటే ముఖ్యం ఆ రూల్సుని తెలివిగా విరక్కొట్టటమెలాగో కూడా తెలిసి వుండాలి.
జలీల్! చెప్పానుగా నాకు టాలెంట్ అంటే చాలా ఇష్టమని! నిన్ను ఎంకరేజ్ చెయ్యాలని వుంది నాకు. కాని ముందు నువ్వు కాస్త మారాలి!" అన్నాడు మహాజన్ అర్ధవంతంగా.
మహాజన్ కి సమాధానం చెప్పకుండా "స్పీడు పెంచు" అన్నాడు జలీల్ డ్రైవర్ తో.
ఉలిక్కిపడినట్లు కారు స్పీడు మరింత పెరిగింది.
అప్పుడు సుదూరంలో కనబడుతోంది ఎర్ర ఆర్టీసీ బస్సు క్షణక్షణానికీ బస్సుకీ, కారుకీ మధ్య దూరం తరిగిపోతోంది. ఒకసారి జలీల్ వైపు పరీక్షగా చూసి మళ్ళీ అన్నాడు మహాజన్.
"నేను చెప్పేది నీకు అంతగా రుచించనట్లుంది! పోనీ ఓ పని చెయ్! నువ్వు రాసిన కవితలని ఓ సంపుటంగా వేయిస్తాను నా ఖర్చుతో! అది నాకు అంకితమివ్వు ఆ పుస్తకానికి ఏదన్నా పెద్ద అవార్డ్ లేకపోతే నీకు ఏదన్నా బిరుదు వచ్చేటట్లు నేను చూస్తాను. అది మన చేతిలో పని! దానితో సాన్నిహిత్యం పెరుగుతుంది ఇదిమరీ అంత....కాదుగా! ఏమంటావు?"
సీరియస్ గా వున్న జలీల్ మొహం ప్రసన్నంగా మారింది. "నేను మీకు కృతజ్ఞత తెలుపుకోవాలి" అన్నాడు. జలీల్ మారినందుకు సంతోషిస్తూ అన్నాడు మహాజన్ "ఎందుకయ్యా చిన్నదానికి ఎందుకంత పెద్ద పెద్ద మాటలు?"
"ఇది చిన్న విషయం కాదు సర్! మీ మాటలతో చక్కటి పద్యం ఒకటి నాకు గుర్తువచ్చేలా చేసినందుకు మీకు కృతజ్ఞత తెలుపుకోవాలనిపిస్తుంది" అన్నాడు జలీల్ మళ్ళీ.
"చూశావా! నాలో అజ్ఞాతంగా కవి వున్నాడు! చెప్పు! ఏం పద్యం అది?" అన్నాడు మహాజన్ మహదానందంగా.
"హైస్కూలులో వున్నప్పుడు చదువుకున్నాను నేను పోతనగారి పద్యం! పొలం దున్నుకుని పేదగా బతుకుతున్న బావగారు పోతన్నని చూసి ఎప్పుడూ రాజాశ్రయంలో విలాసంగా జీవితం గడిపే శ్రీనాథుడు "నువ్వు కూడా నీ కావ్యాన్ని ఏ రాజుకన్నా అంకితం ఇచ్చి పేదరికం పోగొట్టుకోరాదా?" అంటే అందుకు పోతన్న ఏమన్నాడో తెలుసా?
"బాల రసాల సాల నవపల్లవ కోమల కావ్య కన్యకన్ గూళులకిచ్చి అప్పుడుపు కూడు భుజించుటకంటే సత్కవుల్ హాలికులైననేమి.... మిగతాది మీకు గుర్తుండే వుంటుంది! కోమలమయిన కావ్యకన్యను భ్రష్టులయిన వాళ్ళకి అంకితమిచ్చి, ఆ పడుపుకూడా తినడం కంటే మంచి కవులు భూమి దున్నుకుని పొట్టపోసుకోవడమే మేలని కదా!" అని అర్ధమనుకుంటాను. మీరు రసజ్ఞులు. కవి హృదయం మీకు బాగా తెలిసే వుంటుంది. యామ్ ఐ కరెక్టు సర్?"
దానితో మహాజన్ మొహం మాడిపోయింది.
"కారు ఆపు!" అన్నాడు డ్రైవర్ తో కర్కశంగా కారు ఆగింది. అప్పటికే అది ఎర్ర బస్సుని ఓవర్ టేక్ చేసేసింది. కారు ఆగడంతో సడన్ బ్రేకుతో బస్సు కూడా ఆగవలసి వచ్చింది.
"మనం మళ్ళీ కలుస్తాం! కానీ ఇంత స్నేహపూరిత వాతావరణంలో కాదు" అన్నాడు మహాజన్.
జవాబు చెప్పకుండా బస్సువైపు పరిగెత్తాడు జలీల్. మహాజన్ కారు కదిలి వెళ్ళిపోయింది.
బస్సు డ్రయివరూ, కండక్టరూ, బస్సులోని ప్రయాణీకులూ యూనిఫారంలో వున్న ఇన్ స్పెక్టర్ ని చూడగానే భయపడ్డారు ఏం జరిగిందోనని.
రొప్పుతూ బస్సులోకి ఎక్కి అందరినీ పరీక్షగా చూశాడు ఇన్ స్పెక్టర్ జలీల్.
వాళ్ళలో దినకర్ లేడు!
ఏమైనాడు! మధ్యలో యెక్కడయినా దిగిపోయాడా?
అదే అడిగాడు కండక్టర్ ని.
"లేద్సార్! తాండపల్లి వదిలాక మళ్ళీ ఇదే ఆపడం" అన్నాడు కండక్టర్ భయభక్తులతో.
హఠాత్తుగా మరో అనుమానం వచ్చింది ఇన్ స్పెక్టర్ జలీల్ కి.
"అంటే... తాండపల్లి తర్వాత దారిలో ఎవరూ ఎక్కను కూడా లేదా?"
"లేదుసార్!" అన్నాడు కండక్టర్. ప్రయాణీకులు కూడా చాలామంది కండక్టరు మాటలని సమర్ధిస్తూ తలలు ఊపారు.
జలీల్ పెదిమలు సరళ రేఖలా బిగుసుకుపోయాయి. "ట్రిక్ బాస్టర్డ్!" అనుకున్నాడు ఆగ్రహాన్ని అదుపులో పెట్టుకుంటూ. అంటే దినకర్ బద్దు ఎక్కనే లేదన్నమాట! అక్కడే ఎక్కడో నక్కలా నక్కి దాక్కుని ఉంటాడు. ఒక క్షణంలో రోడ్డుకు అవతల దినకర్ కనబడటం, మరుక్షణంలో ఒకబస్సు ఆగడం కాస్తవేగం తగ్గడం ఆ తర్వాత క్షణంలో బస్సుతో బాటు దినకర్ కూడా అదృశ్యమవడంతో తనకి సహజంగానే అనిపించింది - దినకర్ ఆ బస్సులో ఎక్కి పారిపోయి ఉంటాడని! దినకర్ అంతకు ముందుసారి అలాంటి ట్రిక్కే ప్లే చేయడంతో తన ఆలోచన అటేపోయింది!
అప్పుడనిపించింది ఇన్ స్పెక్టర్ జలీల్ కి-
ట్రయిన్డ్ పోలీస్ బ్రెయిన్ ని కూడా కన్ ఫ్యూజన్ చెయ్యగలుగుతున్నాడంటే -
ఈ దినకర్ ఎవడోగాని మామూలు క్రిమినల్ కాదు! అతనొక ఈవిల్ జీనియస్ అయి ఉండాలి!
నిశ్చయంగా!
కానీ - ఎవరతను? ఎటు వెళ్ళిపోయాడిప్పుడు?
* * *
అంతకు ఓ నలభై నిమిషాల ముందు -
రైల్వే స్టేషన్ లో అయోమయంగా చూస్తూ నిలబడి ఉంది డాక్టర్ నిశాంత.
స్టేషన్ లో ఆగివున్న రైల్లో దినకర్ కోసం వెతికి అతను కనబడకపోవడంతో తన దగ్గరికి వచ్చాడు ఇన్స్ పెక్టర్ జలీల్.
"వీడెవడోగానే అసాధ్యుడిలా ఉన్నాడు. వాడ్ని తరుముకుంటూ వెళ్ళాలి నేను! మీరు నా వెంట రావడం మీకూ నాకూ కూడా ఇబ్బందే. దినకర్ స్పృహ లేకుండా దొరికిన ఆ స్పాట్ ని రేపువెళ్ళి చూద్దాం. ఇవాళ్టికి మీరు ఇంటికి వెళ్ళిపొండి" అని తనతో చెప్పి వద్దని వారిస్తున్నా వినకుండా వెళ్లి, తన కోసం టిక్కెట్టు కొని తెచ్చి ఇచ్చాడు జలీల్.
చాలా సజ్జనుడయిన ఆ ఇన్స్ పెక్టర్ ని చూస్తే తనకి చిరాకే తప్ప కోపం రావట్లేదని గ్రహించింది నిశాంత. అతను దినకర్ ని ముప్పుతిప్పలు పెడుతున్నాడు నిజమే!
కానీ -
అతను తప్పు చెయ్యడం లేదు.
తన డ్యూటీని చెయ్యవలసిన దానికంటే వందరెట్లు ఎక్కువ దీక్షతో చేస్తున్నాడు. అందులో అతన్ని తప్పు పట్టవలసిందేమీ లేదు.
తన దగ్గర శెలవు తీసుకుని పరుగులాంటి నడకతో స్టేషన్ బయటికి వెళ్ళిపోయాడు జలీల్.
జలీల్ వెళ్ళిపోయాక ఫ్లాట్ ఫారంమీదే ఆలోచిస్తూ ఉండిపోయింది తను.
ఒక వైపున దినకర్ వేటాడబడుతున్న జంతువులా పారిపోతూ ఉంటే, తను నిశ్చింతగా ఇంటికి ఎలా వెళ్ళిపోతుంది?
ఆమెకి అనిపించింది.
దినకర్ తనకి ఎక్కడ దొరికాడో, అక్కడికే ఇంకొక్కసారి తనే వెళ్ళి చూస్తే?
ఇన్ స్పెక్టర్ జలీల్ కంటే ముందు తనొక్కతే వెళ్ళి క్షుణ్ణంగా అంతా చూసి రావడం ఉత్తమం!
అలా నిర్ణయించుకుని, ట్రెయిన్ లో తిరిగి వచ్చి, నేరుగా కోర్టుకి వెళ్లి, అక్కడ పార్క్ చేసి ఉంచిన తన కారుని తీసుకుని, ఆ స్పాట్ కి బయలుదేరింది డాక్టర్ నిశాంత.
కారు వెళుతుంటే, ఆలోచనలు...
స్టీరింగు ఒకసారి అటూ, ఒకసారి ఇటూ తిరిగినట్లుగా...
కాసేపు ముందుకీ....కాసేపు వెనక్కీ...
ఒకదానికొకటి సంబంధంలేని ఆలోచనలు! జ్ఞాపకాలు! దృశ్యాలు!
దినకర్ కి ఆ పేరు తనే పెట్టింది. అతని అసలు పేరేమిటో అతనికే తెలియదు.
ఎందుకని ఆ పేరే పెట్టవలసి వచ్చింది?
తను చదివిన మెడికల్ కాలేజ్ లో ఒక క్రికెట్ ప్లేయరుండేవాడు దినకర్ అని.
ఆ పేరు యధాలాపంగా గుర్తు వుండిపోయి తను ఇతనికి పెట్టేసిందా? అయి ఉండవచ్చు.
ఆ పేరుతో అతన్ని చాలా రోజుల పటు పిలిచిన తర్వాత ఒక శుభోదయాన స్ఫురించింది తనకి!
తన పేరుకీ, అతని పేరుకీ అవినాభావ సంబంధం ఉందని!
నిశాంత, దినకర్!