Previous Page Next Page 
వెన్నెల మెట్లు పేజి 20

   

    ఈ శ్రీరాంగాడు తన కూతుర్నీ ఎగరేసుకుపోతున్నాడా?
    
    వీడు క్రితం జన్మలో తన శత్రువా? అప్పుడు పగ తీర్చుకోలేక ఈ జన్మలో తనని సాధిస్తున్నాడా?
    
    తన ఉద్యోగానికి ఎసరు పెట్టిందీ వీడే! తన కూతుర్ని తన్నుకుపోతోందీ వీడే!
    
    అసలు ప్రతిమని వీడికి దూరంగా పంపెయ్యాలనే తాపత్రయంతోనే తను ఆ సోమసుందరంగారి కాళ్ళూ, రాజారాంగారి కడుపూ పట్టుకున్నాడు. ట్రాన్ స్ ఫరై కొన్నాళ్ళు దూరంగా ఉంటే వీడి మాయల్లోనుంచీ బయటపడేది ప్రతిమ. ఈ లోపలే పరిస్థితి ఇలా ముంచుకొస్తుందని అనుకోలేదు తను.
    
    వయసు వచ్చి విద్యాధికురాలైన తన కూతుర్ని కీలుబొమ్మలా ఆడించబోయి, ఆమెకి తెలియకుండానే ఆమెని ట్రాన్ స్ ఫర్ చేయించాలని చూడటం వల్లనే ప్రతిమ పంతం కొద్దీ శ్రీరాంని చేసుకోవాలన్న నిర్ణయానికొచ్చిందని కేశవరావు గ్రహించలేదు.
    
    తను నిలబడి ఉన్నది గట్టి నేలే అన్న భ్రాంతితో ఉన్నవాడు హఠాత్తుగా అది వూబినేల అని గ్రహించి, ఎవరో కాళ్ళు పట్టుకు గుంజుతున్నట్లు లోపలికి కూరుకుపోతూ, వేసిన ఆఖరు కేకలాంటిది వేశాడు కేశవరావు.
    
    "ప్రతిమ! దొంగ..."    
    
    ఆ తర్వాత కథాకళీ ఆడేశాడు ఆయన. ప్రతిమ గొంతు పిసికేస్తానన్నాడు. రోకలిబండ తీసుకొచ్చి తల పగల కొట్టబోయినట్లు అభినయం చేశాడు.
    
    "ఏమిటీ? ఏమిటీ?" అంటూ కీచుగొంతుతో అరుస్తూ పరిగెత్తుకు వచ్చింది సుందరమ్మ. విషయం అర్ధమైన తర్వాత ఒక్క శోకం పెట్టి తనూ రంగంలోకి దిగింది. కూతుర్ని శాపనార్ధాలు పెట్టింది. నమ్మకంగా పని చేస్తున్న పనిమనిషి, "ఇక రేపట్నుంచి పన్లోకి రానమ్మా!" అని హఠాత్తుగా నోటీసు ఇస్తే ఎంత గాభరాగా ఉంటుందో, అంత గాభరాగానూ ఉంది ఆవిడకి.
    
    బంగారు గుడ్లు పెడుతున్న బాతు తప్పించుకుపోతున్నట్లు ఆవేశ పడుతున్నాడు కేశవరావు.
    
    నడుముకి ఉన్న బెల్టు తీసి ఝుళిపించబోయాడు శంకర్. కానీ ప్రతిమ కళ్ళలో కనబడిన ఎరుపుజీర గమనించి తగ్గిపోయి, 'థూ' అని ఉమ్మేసి, బయటికి వెళ్ళిపోయాడు.
    
    ఇదంతా నిర్లిప్తంగా, విరక్తిగా చూసింది ప్రతిమ. ఏమిటిదంతా? ఇంత గొడవ దేనికి? అంత జరగరానిది ఏం జరుగుతోంది?
    
    ప్రపంచాన్ని నడిపించే అర్ధన్యాయం అర్ధనగ్నంగా ఆ ఇంట్లో విలయ తాండవం చేస్తోందని గ్రహించ లేకపోయింది ప్రతిమ. ఆర్ధిక అవసరాలు నైతిక విలువలనే మారువేషం వేసుకుని, గోముఖవ్యాఘ్రాల్లా గాండ్రిస్తున్నాయని గ్రహించలేకపోయింది ప్రతిమ.
    
    "ఇది మన ఇళ్ళలో పుట్టాల్సిన పిల్ల కాదు!" అని చివరికి తేల్చారు తల్లీ, తండ్రీ.
    
    "మరి తరుణోపాయం ఏమిటో ఆలోచించండి" అంది సుందరమ్మ.
    
    "దీన్ని ముక్కలుగా తరిగి కాకులకూ, గెద్దలకూ వెయ్యడమే!"
    
    "అఘాయిత్యపు పనులు చెయ్యబోకండి! నలుగురూ మనకే గడ్డి పెడతారు."    
    
    "మరి ఏం చేసి అఘోరించమంటావ్ ఏడూ!"
    
    "ఈ కాగితం పెళ్ళికంటే తూతూమంత్రంగా తంతు ముగించి ఈవిణ్ణి సాగనంపడం ఉత్తమం. ఒక్కసారి వాళ్ళింటికి తగలడి చెప్పిరండి...సాధ్యమైనంత త్వరలో ముహూర్తం చూసి ముడిపెట్టేస్తాం, ఈ కాగితం పెళ్ళిళ్ళు పెట్టి మా వంశాన్ని బయటపడెయ్య వద్దని! వెళ్ళండి!"
    
    కేశవరావు కాసేపు ఆలోచిస్తూ కూర్చుండిపోయి, తర్వాత హఠాత్తుగా ఏదో తట్టినట్లు లేచి, చెప్పులు వేసుకుని బయటికి నడిచాడు.
    
    శిలాప్రతిమలాగే నిశ్చలంగా నిలబడిపోయి, ఇదంతా చూస్తోంది ప్రతిమ.
    
                                                                 * * * * *
    
    "చెప్పి వచ్చారా?" అంది సుందరమ్మ, కేశవరావు తిరిగి రాగానే.
    
    "ఆ చెప్పే వచ్చాను."
    
    "ఏమన్నా అన్నారా?"
    
    "ఆ! రేపొద్దున్నే వస్తామన్నారు."
    
    "రేపొద్దున్నే వస్తారా? ఎవరి సంగతండీ మీరు చెప్పేదీ?"
    
    "బ్రాహ్మలతో చెప్పి వచ్చానే! రేపొద్దున్నే వస్తారు."
    
    "ఇప్పుడు బ్రహ్మలెందుకూ నా శ్రార్ధం! దేనికోసం?" అంది సుందరమ్మ.
    
    "దాని కోసమే! రేపే ముహూర్తం!"
    
    "ఏమిటా అకటా వికటపు మాటలూ? సరిగ్గా చెప్పి చావకపోతే నాకెలా అర్ధమయి ఏడుస్తుందీ?"
    
    "నోర్మూసుకుని ఇలా చతికిలబడు! రేపటికేమేం సామాన్లు కావాలో లిస్టు రాయి. ఇప్పుడు టైం లేదు. కుండలూ అవీ బ్రాహ్మలే తెచ్చుకుంటారుట."
    
    "ఇంతకీ ఏమి..."
    
    మర్నాడు జరగబోయేది ఏమిటో చెప్పాడు కేశవరావు.
    
    విని కొయ్యబారిపోయింది సుందరమ్మ.
    
                                                                  * * * * *
    
    సౌందర్య నవ్వు వినబడుతోంది.
    
    ఈ మధ్య ఆ అమ్మాయి మరీ ఎక్కువగా నవ్వుతున్నట్లు అనిపించింది శ్రీరాంకు.
    
    కానీ అతనికి తెలుసు -- ఆ నవ్వులో శబ్దం తప్ప జీవం లేదనీ, తన తల్లి మరణం గుర్తు రాకుండా ఉండడానికి ఆ అమ్మాయి క్షణక్షణం నవ్వుతూ, అతిగా మాట్లాడేస్తూ, సంతోషం అనే మాస్కు వెనకాతల విషాదం దాచుకుంటోందనీనూ!
    
    సౌందర్య అంటే అపారమైన సానుభూతి కలిగింది శ్రీరాంకి.
    
    బయట షోరూంలో ఎప్పుడూ ఒక స్టీరియో ఆన్ చేసి ఉంటుంది.
    
    ఓసిబిస్తా, జంగిల్ డ్రమ్స్, బీజీస్ లాంటి ఫాస్ ట్ బీట్ కేసెట్ ని పెట్టి వింటోంది సౌందర్య. అప్రయత్నంగానే, లయబద్దంగా పాదాలు కదుపుతోంది. కస్టమర్సు ఎవరూ లేరు.
    
    తుఫానులా లోపలికి దూసుకొచ్చింది శృతి.
    
    "శ్రీరాం! శ్రీరాం! ఉన్నావా? లే! త్వరగా!" అంది విహ్వలంగా.

 Previous Page Next Page