Previous Page Next Page 
ప్రేమ పురాణం పేజి 20

 

    రాంపండు యిలాంటి విషయాల్లో ఎన్నో ఢక్కామొక్కీలు తిన్నవాడిలా వున్నాడు.
    
    అంచేత బొత్తిగా నదురూ బెదురూ లేకుండా నిలబడి గుడ్లగూబలా చూస్తూ--"మా రేడియో రిపేర్ చేస్తావా?" అన్నాడు.
    
    "నే చేయనుగాక చేయను!" అన్నాడు అతను ఖండితంగా.
    
    తక్షణం అతనికి గుర్తొచ్చింది.
    
    వీడు రాంపండు అయితే అవుగాక!
    
    కానీ వీడు సితారకి తమ్ముడుకూడా! అంటే తనకి అయితే గియితే బామ్మర్ది.
    
    "సరే!" అని బద్దకంగా వెనక్కి తిరిగాడు పండు.
    
    (నీ అంతు చూస్తా! అన్న భావం పలికిస్తూ)
    
    "ఆగు!" అన్నాడు అతను.
    
    ఆగి, గుడ్లగూబలా చూశాడు రాంపండు. "రేడియో తేనా?" అన్నాడు.
    
    "వద్దు!" అన్నాడు అతను.
    
    "మరి!"
    
    "నేనే వచ్చి రిపేర్ చేస్తా."
    
    "సరే! తెల్లారేక రా" అని వెళ్ళిపోయాడు రాంపండు.
    
    రాంపండు వెళ్ళిపోయాక అప్పుడనిపించింది అతనికి.
    
    అవునూ! ఆ విషయం అర్జెంటుగా తెల్లారగట్లే వచ్చి తనకి చెప్పాల్సిన అవసరం రాంపండుకి ఏముందీ?
    
    చటుక్కున ఏదో అనుమానం వచ్చి టాయ్ లెట్ లో చూశాడు జెయ్.
    
    అక్కడుండే మగ్గు మిస్సింగు!
    
    'ఓరి రాంపండూ!' అనుకున్నాడు పళ్ళు పటపటకొరుకుతూ.
    
    ఆ తర్వాత అతనికి యింక నిద్రపట్టలేదు.
    
    అందుకని గబగబ లేచాడు.
    
    తలకి షాంపూ పట్టించి అరగంటసేపు అభ్యంగన స్నానమాచరించాడు.    
    
    "బ్రూట్" సెంటు రాశాడు.
    
    సరికొత్త బాగీ ప్యాంట్ తొడిగాడు.
    
    లూజు షర్టు వేసుకున్నాడు.
    
    లోట్టో షూస్ ధరించాడు.
    
    జుట్టు పదిసార్లు సరిగ్గా 'రేపుకుని' హిప్పాకెట్లో స్క్రూడ్రైవరూ యింకొన్ని ఇన్ స్ట్రుమెంట్స్ దోపుకుని 'రాజు వెడలె' అన్నంత లెవెల్లో సితార ఇంటికి వెళ్ళాడు.
    
    అక్కడే వున్నారు సితార నాన్నారు.
    
    పాపం ఆయనకు చిత్రమైన జబ్బుంది.
    
    ఆయనకు కనబడితే వినబడదు. వినబడితే కనబడదు.
    
    ఒకవేళ ఈ రెండూ జరిగినప్పుడు నోటెంబడి మాటరాదు.
    
    ఆ రోగమేమిటో ఇప్పటిదాకా ఏ ఘనవైద్యుడికీ కొరుకుడు పళ్ళేదు.
    
    జెయ్ చంద్ర వెళ్ళిన టైంలో ఆయనకి కనబడట్లేదు.
    
    మాట మాత్రం మామూలుగానే వస్తోంది.
    
    "పైకిదారి ఎటండీ?" అని అన్నాడు.
    
    "రామనామ తారకం! భక్తిముక్తి ప్రదాయకం!" అన్నాడాయన.    

 

    ఇక లాభంలేదని తడుముకుంటూ, వెదుక్కుంటూ మేడమెట్లమీదగా పైకెళ్ళాడు జెయ్ చంద్ర.
    
    అప్పుడే తలంటిపోసుకుని అరవిచ్చిన గులాబిలా కనబడుతున్న సితార అతన్ని చూడగానే నిర్ఘాంతపోయి, అంతలోనే తేరుకుని చరచరా పక్కగదిలోకి వెళ్ళిపోయింది.
    
    "రేడియో ఎక్కడండీ?" అన్నాడు జెయ్ చంద్ర.
    
    "వల్లకాట్లో!" అంది సితార కోపంగా పక్కగదిలోనుంచి.
    
    "ఇగో! ఇట్రా!" అని పిల్చాడు రాంపండు గుడ్లగూబలా చూస్తూ.
    
    "వస్తున్నా!" అంటూ ఆ గదిలోకి వెళ్ళాడు అతను.
    
    అక్కడుంది పాతకాలపు జర్మన్ ఎయిర్ మెక్ రేడియో.  

 

    భోషాణమంత పెద్దది.
    
    "ఏం రోగం దీనికి?" అన్నాడు అతను.
    
    "పెద్దరోగం" అన్నాడు రాంపండు.
    
    "అంటే?"
    
    "అర్ధరాత్రప్పుడు వున్నట్లుండి అదే ఆన్ అయి పాడుతూ వుంటుంది."
    
    "అంతేనా?"
    
    "తెల్లారేక యింక సౌండు రాదు. ఒకవేళవచ్చినా ప్రోగ్రాములు దానిష్టం."
    
    "ఇంతకుముందు రిపేరు వచ్చిందా?"
    
    "పాతికేళ్ళయింది కొని. ఇన్నాళ్ళూ లక్షణంగా పన్జేసింది. నిన్నట్నుంచి ఏమయిందో మరి!"
    
    "నీకెన్నేళ్ళు?" అన్నాడు అతను రాంపండుని.
    
    "పది" అన్నాడు రాంపండు బద్దకంగా.
    
    "పదేళ్ళయితే వందేళ్ళ ముసలిపీనుగులా మాట్లాడతావేం?' అని మనసులో తిట్టుకుని-
    
    "మీ అక్కయ్యకి?" అన్నాడు జెయ్ చంద్ర మాటలు కలుపుకునే ఉత్సాహంతో.
    
    బోర్ గా చూశాడు రాంపండు. కానీ ఏం మాట్లాడలేదు.
    
    క్షణాల్లో రేడియోని విప్పి శవపరీక్ష చేసినట్లు చూశాడు జెయ్ చంద్ర.
    
    లోపమెక్కడుందో అతనికి అర్ధం అయింది.
    
    దాన్ని సెట్ చేసి మళ్ళీ ప్రాణాలు పొయ్యడం అతనికి కష్టమైన పనేంకాదు.
    
    అయినా వెంటనే దాన్ని రిపేర్ చేయదల్చుకోలేదు అతను.
    
    రిపేర్ చేసేస్తే యింక ఈ యింట్లో ఎక్కువసేపు వుండడానికి కారణం దొరకదు.
    
    అందుకని మొహం విషాదంగా పెట్టాడు అతను.
    
    "ఏమయింది?" అన్నాడు రాంపండు.
    
    "వైరింగులో ఎక్కడో ఫాల్టు వుండాలి. మెయిన్ ఎక్కడుంది?" అన్నాడు అతను.    

 

    చత్వారం వచ్చిన గుడ్లగూబలా చూశాడు రాంపండు.
    
    "నాతోరా."
    
    రాంపండు వెనకే అతను నడిచాడు. పక్కగదిలోకి వెళ్ళారు యిద్దరూ.
    
    అక్కడే కూర్చుని బోట్నీ చదువుకుంటున్న సితార స్ప్రింగులా లేచి, చురుగ్గా చూసి, ఆ పక్కగదిలోకి వెళ్ళిపోయింది.
    
    అక్కడున్న వైరింగ్ ని వుత్తుత్తగా టెస్ట్ చేశాడు అతను.

 Previous Page Next Page