"ఎవర్నని ఏం లాభం, జరగాల్సిందంతా మా ప్రమేయం లేకుండానే జరిగిపోయింది. కన్నా తల్లితండ్రులన్న గౌరవం, అభిమానం వుంటే ఇలా ఇంటిలోంచి లేచిపోయి మాకు తలవంపులు తెచ్చి పైగా కోర్టు కేక్కుతావా? ఏం చూసుకునే నీకింత గర్వం. తప్పుడుపని చేసి పిల్లాడిని కనడం ఘనకర్యంలా లోకానికి నీవే చాటుకుంటున్నావు. నీది అతి తెలివో, తెలివితక్కువతనమో తెలియడం లేదు. ఇంకెవరన్నా అయితే ఈపాటికి ఉరేసుకునేవారు.....విశ్వనాధం తిరస్కారంగా అన్నారు.
"సార్! యుగయుగాలుగా జరిగిన కధఅది. అది నిన్నటి కధ. ఆ కధని ఈనాడు కొత్తమలుపు తిప్పాలనే మా ఆరాటం, చేసిన తప్పులో ఇద్దరూ భాగస్వాములయినప్పుడు ఆడపిల్లే వురేసుకోడం, మగాడు చాతి విరుచుకు తిరగడం అన్యాయమని లోకానికి నిరూపించాలనే మా ప్రయత్నం " సుమతి కల్పించుకుంటూ అంది.
"అమ్మా! కబుర్లకి కార్యాచరణకి చాలా తేడా వుందమ్మా. ఉపన్యాసాలు ఇవడం తేలిక తల్లి. రేపు ఇంక దీనికి భవిష్యత్తు ఏమి వుంటుందండి. పెళ్ళి, ఇల్లు, సంసారం ఇంక ఈ జన్మకి వుంటాయా? పెద్ద సంఘ సంస్కర్త బయలుదేరింది. ఈవిడ ఒక్కతి తిరగబడి న్యాయసుత్రాలు మార్చేస్తుందా?" సుమతి వంక హేళనగా చూశారాయన.
"ఒక్కొక్క రాయి చొప్పున వేస్తే మహా వారధి తయారైంది సార్. రూప లాంటి ధైర్యసాహసాలు గల అమ్మాయిలు నూటికి ఒక్కరు చొప్పున అయినా ఒక్కొక్క రాయి పునాదిలో వేస్తే కొన్నాళ్ళకి, కొన్నేళ్ళకి కొన్ని శాకాలాలకి ఈ ఉద్యమం ఎవరూ భేదించలేని పఠిష్టమైన, మహా శక్తివంతమైన చైతన్యంగా మారుతుంది సార్.మీరు కాస్త నిదానంగా మీ అమ్మాయిని అర్ధం చేసుకోడానికి ప్రయత్నించండి. మా ఆలోచనలు వినండి. ఈవాళ కాకపోయినా రేపయినా మా అభిప్రాయంతో ఏకీభవించి మాతో సహకరిస్తారని నా విశ్వాసం....."సుమతి మృదువుగా అంది.
పద్మావతి అప్పటివరకు శ్రోతలా మెదిలింది.
"మీరు చెప్పేది నిజమే అవచ్చు. కానీ కన్న తల్లిదండ్రులం బిడ్డ భవిష్యత్తు చేతులారా నాశనం చేసుకుంటుంటే భరించగలమా? చీకటి పారాదోలటానికి అది వత్తి అయి కాలిపోవడం ఏ తల్లిదండ్రులకిష్టం వుంటుంది సుమతిగారు!" బాధగా అంది పద్మావతి.
"అమ్మా! చాటుగా ఈపాపం కడిగేసుకుని, ఎవడినో మోసం చేసి పూస్తే ముడేయించుకుని అడుగడుగునా ఏ క్షణంలో ఈ నిజం పైకి వస్తుందోనని ప్రాణాలు అరచేతిలో వుంచుకుని భయపడ్తూ బతికే బతుకుమీద నాకాసక్తి లేదమ్మా, తప్పు చేసినా నేను చేసింది తప్పని, ఆ తప్పుని సరిదిద్దుకుని ధైర్యంగా పరిస్థితులకు ఎదురీది బతకాలనుందమ్మా నాకు. నాకు పెళ్ళి, మగాళ్ళు అంటేనే విరక్తి పుట్టింది. లోకం కోసం, పరువు కోసం ఆత్మవంచన చేసుకుని బతకలేనమ్మా. నా మార్గం నేను ఎంచుకున్నాను, దయచేసి నా మానాన నన్ను పోనిండి. దారిలో ఎన్ని ఆటంకాలు, ఎన్ని కంటకాలు, ఎన్ని క్రూర జంతువులు ఎదురవని అన్నీ అధికమించడానికి ప్రయత్నిస్తాను. అలా కానీ పక్షంలో అపుడే ఆత్మహత్య చేసుకుంటాను. జీవితం నేర్పే పాఠం నేర్చుకుంటాను. నాకు అడ్డు రాకండమ్మా" రూప చేతులు జోడించి స్థిరంగా అంది.
ఇంకేమనాలో తోచలేదు ఇద్దరికీ. సుమతి తరువాత ఒక గంట వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి శాంతంగా అంతా బోధపరిచింది. రూప చెయ్యబోయేది సాహసమే అయినా ఒక మంచి పని అని నమ్మించడానికి ప్రయత్నించింది.
"సరే పోనీ కోర్టు కేక్కినంత మాత్రాన సురేష్ దీన్ని పెళ్ళాడతాడని గ్యారంటి ఏముంది. చేసుకోనంటే అప్పుడింక ఏం చేస్తుంది? కోర్తువాళ్ళు పెళ్ళంటే చేసుకోమంటారు గాని బలవంతంగా కాపురం చేయించలేరుగదా! దీని మీద కసితో పెళ్ళయ్యాక హింసిస్తే ఏం చేస్తుంది?" ఆఖరికి విశ్వనాధంగారు అయిష్టంగానే అంగీకరించి సందేహాలు బయటపెట్టారు
కొంత దారిలో పడ్డారని సంతోషించింది సుమతి.
"అవన్నీ ప్రశ్నలు .....సమాధానాలకి మనం వేచి చూడాలి" నవ్వుతూ అంది.
"ఏది ఏమైనా రూప అన్నింటికి సిద్దపడే వుంది. వుయ్ ఆర్ ప్రిపెర్ డ్ ఫర్ ది వరస్ట్."
"పెళ్ళి కాకపోతే బతకలేనా! ఓ డిగ్రీ వుంది. ఏదో ఉద్యోగం చేసుకుంటూ ఆమాత్రం బతకగలను" రూప ధీమాగా అంది.
రూప స్థిర నిశ్చయం చూశాక విశ్వనాధంగారు తనేమి చెప్పినా లాభం లేదని రూప నిశ్చయం మారదని గ్రహించి నిట్టూర్చి పద్మావతి వంక చూశాడు.
"మరి మమ్మల్ని ఇప్పుడు ఏం చెయ్యమంటారు. రూపని ఇంటికి తిసికేడ్తాం" అంది పద్మావతి.
రూప చప్పున తల ఆడించి
"వద్దమ్మా ఈ గొడవలన్నీ తేలేవరకు నేనిక్కడ ఇలా అజ్ఞాతంలో వుండడమే మంచిది. వాళ్ళ వీళ్ళ ఆరాలు, ప్రశ్నలు అన్నీ మీరు తట్టుకోలేరు. నాకిక్కడ ఏ లోటు లేదు. ఆంటీ కన్నబిడ్డ కంటే ఎక్కువగా చూస్తున్నారు. మిరియ్యలేని ప్రోత్సాహం, ధైర్యం ఆవిడ యిస్తున్నారు. నేనిక్కడ వుంటాను" రూప స్థిర నిశ్చయంగా అంది.
"ఇన్నాళ్ళు అంటే ఎక్కడున్నావో ఏ సంగతి తెలియక దిగులు పడ్డాము. ఇప్పుడు తెల్సి తెల్సి ఎలా నిన్నక్కడ వదలి వెళ్ళగలనే" పద్మావతి బాధగా అంది.
"తెల్సిందికనక నిశ్చంతగా వుండవచ్చు. రూప గురించి మీరు బెంగ వద్దు. మేం అనుకున్నది సాధించేవరకు ఆమె ఇక్కడ వుండడమే మంచిది. వుండనిండి. మీరు నిశ్చింతగా వెళ్ళండి అంది సుమతి.
"అదే మంచిదిలే. వుండని" గొణిగారు విశ్వనాధంగారు.
కన్న ప్రాణం కనక పద్మావతి దిగులుగా, బాధగా రూపవంక దీనంగా చూసింది.
భర్త వంక ప్రాధేయపూర్వకంగా చూసింది.
విశ్వనాధంగారు ఆ చూపు తప్పించుకుంటు లేచి నిల్చుని "పద వెడదాం" అన్నాడు పద్మావతితో.
పద్మావతి పట్టుకున్న గొంతుతో సుమతి చెయ్యి పట్టుకుని "దానికి ఇంక మీరే దిక్కు" అంటూ కళ్ళలో తిరిగిన నీరు ఎవరికి చూపడం ఇష్టం లేనట్టు చకచక బయటికి వెళ్ళిపోయింది.
విశ్వనాధంగారు మౌనంగా సుమతికి నమస్కారం చేసి గబగబ బయటికి వెళ్ళారు.
రూప, సుమతి మొహాలు చూసుకున్నారు.
రూప కేసు కోర్టులో హియరింగ్ కి వచ్చింది. మొదటిరోజు లాయరు సుమతి గంభిరకంఠంతో కేసు ప్రెజెంట్ చేస్తుంటే కొత్తరకం కేసు అని తోటి లాయర్ల, జడ్జీ అందరూ చాలా కుతూహలంగా విన్నారు.
యువర్ అనర్! ఈనాటి ఈ కేసు ఒక ఆడపిల్లకి జరిగిన అన్యాయం గురించి, నా క్లయింట్ కుమారి రూప పద్దెనిమిది సంవత్సరాల కాలేజి అమ్మాయి. మంచి కుటుంబంలో పుట్టి, చదువు, సంస్కారం కల్గిన అయినింటి ఆడపిల్ల. ఆరునెలల క్రితం ఆమె సెలవులలో ఖాళీగా వున్నానని టైపు ఇన్ స్టిట్యుట్ టైపు నేర్చుకోడానికి వెళ్ళింది. అక్కడ ప్రతివాది సురేష్ ని కలిసింది. సురేష్ తో నా క్లయింట్ కి కాలేజిలో ముఖ పరిచయం మాత్రం వుండేది. కాలేజిలో అతను నా కయింట్ కి సీనియర్ అయినా అతను కాలేజి నాటకాలలో నటించి అనేక బహుమతులు పొందిన వాడవడంవల్ల కాలేజిలో అతన్ని చాలామంది ఎరుగుదురు. ఆకర్షనియంగా వుండి, చలాకీగా మాట్లాడే స్వభావం కలవాడు, కనక ఆడపిల్లలకి అతను హీరోగా చలామణి అయ్యేవాడు. అయినా అప్పుడు నా క్లయింట్ కి, అతనికి పరిచయం లేదు. టైపు నేర్చుకోవడానికి అంతమంది కొత్తవారి మధ్య ముఖ పరిచయస్థుడు సురేష్ కన్పించగానే నా క్లయింట్ సంబరపడింది. ఇద్దరూ పలకరించుకున్నారు, మాట్లాడుకున్నారు.
"ఆ రోజునించి ఇద్దరిమధ్య క్రమంగా పరిచయం పెరిగింది. ఇద్దరూ కల్సి టాంక్ బండ్ మీదకి షికారు వెళ్ళేవారు. తరువాత పబ్లిక్ గార్డేన్సు, ఆ తరువాత సినిమాలకి, హోటళ్ళకి టిఫిన్లకి.....ఇలా మూడు నెలలకి ఇద్దరిమధ్య ఆకర్షణ, ప్రేమ, అరంభమయింది. నా క్లయింట్ రూప సురేష్ అందానికి, అతని మాటల చాతుర్యానికి, అతని పొగడ్తలకి లోబడిపోయింది. అతను చూపే ప్రేమ అంతా నిజమని నమ్మింది. గుడ్డిగా అతని మాటలు నమ్మింది. సురేష్ కి తనపట్ల నిజంగా ప్రేమవుందని నమ్మి మొదట్లో అతను చేసే చిన్నచిన్న ప్రేమకాలపాలకి అడ్డు చెప్పలేదు. ఒకసారి ముందు చెయ్యి పట్టుకోడంతో ఆరంభించి ముద్దులవరకు వెళ్ళినా అతని ప్రేమలో, ఆకర్షణలో పడిపోయినా నా క్లయింట్ అభ్యంతరం చెప్పలేదు. నా క్లయింట్ నించి అభ్యంతరం లేకపోవడంతో ఆ చిన్నచిన్న ప్రేమ కలపాలతో సంతృప్తి పడక ఇంకా ముందుకు వెళ్ళాలనిపించింది.
ఒకరోజు ముందు చెప్పకుండా మంచి సర్ప్రైజ్ చూపిస్తానని హోటల్ ద్వారకాకి ఆహ్వానించాడు. ఏ పుట్టినరోజు పార్టీ ఇస్తాడు గాబోలని నా క్లయింట్ నిరభ్యంతరంగా వెళ్ళింది. ఆ రోజు నా క్లయింట్ ని హోటల్ రూములోకి ఆహ్వానించి దగ్గరికి లాక్కోగానే నా క్లయింటు భయపడింది. అతనిలో ఆవేశం చూడగానే అతను ఏం కోరుతున్నది అర్ధంకాగానే భయపడింది. పెళ్ళికి ముందు సెక్స్ ఇష్టం లేదని అతన్ని వారించింది. మొహంవేశంలో వున్న సురేష్ కి ఆ మాటలు నిరాశ, కోపం కల్గించాయి. "ఇన్నాళ్ళు కల్సి తిరిగాం. ఇప్పుడు దీనికి మాత్రం ఏం తప్పు సెక్స్ లేని ప్రేమ నిలవదన్నాడు. నీకేం భయం లేదు. ఫామిలి ప్లానింగ్ సాధనం ఉపయోగిస్తానన్నాడు .
నా క్లయింటు అతని మాటలకి , ఆ ఆకర్షణకి లొంగిపోతున్నా వద్దని, భయమని, ఏదన్నా అయితే ఇంట్లో ప్రాణం తీస్తారని భయపడ్తూ ఆరాటంగా అతన్ని వారించింది. నా క్లయింటు సురేష్ ప్రేమని నమ్మింది. మనసారా అతన్ని ప్రేమించింది. అతనిలో ఆకర్షణకి పిచ్చిగా లోబడింది. అతను ఆవేశంతో మైకంతో ఆమెను ఆక్రమించుకుంటుంటే ఆ ఆకర్షణకి లోబడి వారిస్తుంటే అతనికి కోపం వస్తుందని సురేష్ ని ఏ పరిస్థితుల్లోను దూరం చేసుకోవడం ఇష్టం లేని నా క్లయింటు క్రమంగా వారించే శక్తి కోల్పోయి అతనికి లొంగిపోయింది.
"అలా హోటల్లో ఐదారుసార్లు వారిద్దరూ కలిశారు. ఈలోగా వారిద్దరూ కల్సి తిరగడం అనేకసార్లు చుసిన నా క్లయింటు తండ్రికి అయన స్నేహితులు చెప్పారు. అంతవరకు రూప ఇంట్లో ఆలస్యంగా రావడానికి చెప్పే కారణాలు నిజమని నమ్మారు తల్లిదండ్రులు. సంగతి తెలియగానే ఆ రోజు నా క్లయింటు తండ్రి కూతురు ప్రవర్తన సంగతి విని ఇంట్లో భార్యని కూతురిని అదుపులో పెట్టలేదని నానా తిట్లు తిట్టారు.
నా క్లయింటు ఇంటికి రాగానే తల్లిదండ్రులు తలవాచేట్లు చివాట్లు పెట్టారు. పరువు ప్రతిష్ట మంటగాలిపావని తిట్టారు. ఇన్నాళ్ళు తిరిగావు అతను నిన్ను పెళ్ళి చేసుకుంటాడా అని నిలేశారు.