అప్పటివరకు నా క్లయింటు అమాయకంగా అతని ఆకర్షణలో పడిపోయింది తప్ప పెళ్ళి విషయం అడగాలని కూడా ఆలోచించలేదు. తల్లిదండ్రుల మాటలతో తెలివి తెచ్చుకుని మర్నాడు సురేష్ తో జరిగింది చెప్పి తల్లిదండ్రులు పెళ్ళి చేసుకోమంటున్నారు అని చెప్పింది. సురేష్ మోహంలో పెళ్ళి ప్రస్తావన రాగానే రంగులు మారాయి. చదువులేదు, ఉద్యోగం లేదు ఇప్పటినించి పెళ్ళేమిటని, ఉద్యోగం వచ్చాక, ఐదారేళ్ళు తరువాతే పెళ్ళి అంటూ ఆ ప్రస్తావన అంగీకరించలేదు. పైగా రూపతో నీ తల్లి దండ్రులు తెచ్చిన సంబంధం చేసుకోమనగానే నా క్లయింట్ నిర్ఘంతపోయింది. అతని చదువయి, ఉద్యోగం వచ్చేవరకు తను వేచి వుంటానని ప్రాధేయపడినా అతను ఖచ్చితంగా పెళ్ళికి ఒప్పుకోలేదు. ఇన్నాళ్ళు ఏదో ఇద్దరం సరదాగా ఎంజాయ్ చేశాం దీనికి పెళ్ళికి ముడిపెట్టకు. నీకు నచ్చిన వాడిని చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపో అని సలహా యిచ్చాడు. నా క్లయింట్ ఆ మోసానికి బాధపడి ఏడ్చింది. కోపంగా తిట్టింది. ఎలా చేసుకోవో చూస్తానని బెదిరించింది.
సురేష్ ఆ కోపానికి బెదరలేదు. నిర్లక్యంగా వెళ్ళిపోయాడు. సురేష్ పెళ్ళి చేసుకోనని తిట్టినా సంగతి ఇంట్లో తెల్సి తల్లితండ్రులు చివాట్లు పెట్టి, జరిగింది ఇంక ఇల్లు కదలడానికి వీల్లేదని కట్టడి చేశారు. కూతురు ఏదో అమాయకంగా ఆకర్షించబడి ప్రేమ అనుకుంది అనుకున్నారు తప్ప సెక్స్ సంబంధం వుందని తెలియలేదు వారికి. దురదృష్టవ శాత్తు సురేష్ జాగ్రత్త తీసుకున్నా నా క్లయింట్ నెల తప్పింది.
నా క్లయింట్ కి భయంతో దిక్కు తోచలేదు. మళ్ళి సురేష్ ని కల్సి బతిమాలి ఎలాగైనా వివాహానికి ఒప్పించాలని చూసింది. సురేష్ తన తప్పేమీ లేదని తను జాగ్రత్త తీసుకున్నానని ఇంకెవరితోనో తిరిగి ఆ నేరం నా మీద మోపి పెళ్ళి చేసుకోవాలని నాటకం అడుతున్నావని నీచంగా అవమానించాడు. కనీసం డాక్టరు దగ్గిరకు తీసికెళ్ళడానికి కూడా ప్రయత్నించలేదు. తనకేం పట్టనట్టు చేతులు దులుపుకున్నాడు.
అతను చేసిన అనుమానం నా క్లయింట్ లో ప్రతీకార జ్వాలలు రేపింది. ఇద్దరూ కల్సి చేసిన తప్పులో తనోక్కరే ఎందుకు శిక్షింపబడాలన్న ఆవేశం వచ్చింది. తన జీవితాన్ని ఫణంగా పెట్టయినా ఈ అన్యాయం కోసం పోరాడాలని, సురేష్ కి బుద్ది చెప్పాలని, మగాళ్ళకి ఒక గుణపాఠం నేర్పలన్నా కసి, పట్టుదల పెరిగింది.
"తన భవిష్యత్తు తను కుటుంబం పరువు ప్రతిష్ట కూడా లెక్కచేయకుండా కోర్టు కెక్కి న్యాయం కోసం పోరాడాలని నిర్ణయించుకుంది. అప్పుడు ఒకరాత్రి నన్ను రహస్యంగా కల్సి నా సహాయం కోరింది. ఆమె కధ విని ఆమె ధైర్యానికి ఆశ్చర్యపడ్డాను. చేసిన పని తప్పని తెలుసుకుని తప్పుని సరిద్దిద్దుకుని న్యాయం కోసం పోరాడుతున్న ఆమెకి అన్ని విధాల సహాయపడాలని నిర్ణయించాను. ఆమెకి అండగా నేనుంటానని మాటిచ్చాను. కోర్టు కేక్కదానికి తల్లితండ్రులు అంగికరించని పక్షంలో ఆమెకి అండగా వుండి ఆశ్రయం ఇస్తానని అభయం ఇచ్చాను.
కోర్టుకెక్కే ముందు అతని తండ్రిని కల్సి పరిస్థితి వివరించి అయన సహాయం కోరమని సలహా యిచ్చాను. అతని తండ్రి కూడా ఒక న్యాయవాది అయివుండి ఆడపిల్లకి జరిగిన అన్యాయానికి బాధపడి సహాయపడడం అటుంచి హీనంగా, అవమానకరంగా మాట్లాడి, పంపించాడు. సురేష్ తండ్రి నా క్లయింట్ తండ్రి ఆఫీసు కెళ్ళి కూతుర్ని బజారులో వదిలి పెళ్ళి చేసుకోమని మావాడి మీదకి తోల్తారా అంటూ అందరి ఎదుట అవమానపరిచాడు.
దాంతో నా క్లయింట్ తండ్రి అవమానం భరించలేక, పైగా కూతురు నెల తప్పిందని గుర్తించి నా క్లయింట్ కోర్టు కెక్కుతుందని విని తిట్టి కూతురిని గదిలో బంధించారు. దాంతో నా క్లయింట్ ఇంట్లోంచి తప్పించుకుని నా ఆశ్రయం కోరింది. ఆ అమ్మాయికి అండగా వుండి, ఏమయినాసరే, ఎంత ఖర్చయినా ఆమెకి న్యాయం జరిగేటట్టు చూడాలని నిర్ణయించుకుని ఈ కేసు ఫైల్ చేశాను.
"యువర్ అనర్! ఇది నా కేసు పౌండేషన్. నా క్లయింట్ ఇంకా మైనరు. నా క్లయింట్ మొదట్లోనే ప్రతివాదిని పెళ్ళి చేసుకుంటావా అని అడగకపోవడం తెలివి తక్కువతనాన్ని చాటుతుంది. అతని ప్రేమని నమ్మి ఆ ప్రేమ పెళ్ళివరకు వెళుతుందని ఆశించి అతనితో సంబంధం పెట్టుకుంది. ఇప్పుడు అతని బిడ్డకి తల్లి అవబోతున్న తరుణంలో ఆమెకి న్యాయం జరిగేట్టు చూడమని కోర్టు వారికీ విన్నవించుకుంటున్నాను."
కోర్టులో కలకలం బయలుదేరింది. ఈ కొత్తరకం కేసు అందరిని ఆకర్షించింది. ప్రెస్ రిపోర్టర్లు వివరాలు రాసుకున్నారు. ప్రెస్ ఫోటో గ్రాఫర్ల ఫాష్ బల్బులు వెలిగాయి.
జడ్జిగారు కుతూహలంగా విన్నారు కేసు.
"యు కెన్ ప్రొసీడ్ విత్ ది కేస్" అన్నారు.
"యువర్ అనర్ నా క్లయింట్ రూప, ప్రతివాది సురేష్ కల్సి తిరగడం చుసిన నలుగురయిదుగురు సాక్షులని ప్రవేశపెట్టడానికి అనుమతి కోరుతున్నాను" అంది సుమతి.
"గ్రాంటెడ్" అన్నారు జడ్జీ, "డిఫెన్స్ లాయరు! ఆర్ యూ రెడీ!"
"సురేష్ తరపున రామనాధంగారు లేచి నిల్చుని "ఎస్ సర్" అన్నారు. అయన మొహం కళ తప్పివుంది. ముద్దాయి అయన కొడుకని తెల్సి రిపోర్టర్లు ఉత్సాహంగా న్యూస్ రాసుకుంటున్నారు. తోటి లాయర్లు ఈ కేసులో జయాపజయాలు ఎవరివైపు వుంటాయని ఆలోచిస్తున్నారు.
లాయరు సుమతి తన సాక్షులని ఒక్కొక్కరిని పిల్చింది. టైపు ఇన్ స్టిట్యుట్ యజమాని, హోటల్ బాయిస్, హోటల్ మేనేజర్ విశ్వనాధంగారి స్నేహితులు అందరిచేతా రూప, సురేష్ కల్సి తిరగడం చూసినట్టు సాక్ష్యాలు చెప్పించింది. వారందరిని రామనాధం గారు క్రాస్ ఎగ్జామ్ చేశారు. అయన సాక్షులని ఎంత తికమక పెట్టె ప్రశ్నలు వేసినా సాక్ష్యులంతా రూప, సురేష్ కల్సి తిరగడం ద్రువపరిచారు.
విశ్వనాధంగారిని క్రాస్ ఎగ్జామ్ చేస్తూ ఆడపిల్లని కట్టడి చేసి జాగ్రత్త పెట్టుకోకుండా బాధ్యత రహితంగా వదిలి ముద్దాయి మీద నేరం మోపటం బ్లాక్ మెయిలింగ్ చెయ్యడం కాదా అంటూ ప్రశ్నించారు రామనాధంగారు.
అబ్బాయిలు రోడ్డుమీద తిరిగి ఆడపిల్లలకి కడుపులు చేయడంలో వారి తల్లిదండ్రుల బాధ్యత ఎంత వుందో అలాగే అమ్మాయిలని కట్టడి చెయ్యటంలోను అమ్మాయి తల్లితండ్రుల బాధ్యత అంతే వుంటుందని జవాబిచ్చారు. మోసగాళ్ళు ఎవరో, మర్యాదస్తులు ఎవరో ముందే తెలుసుకోలేని ఆడపిల్లలు గోతిలోకి దిగితే ఆ నేరం తల్లితండ్రులది మాత్రమే కాదు అలాంటి మోసగాళ్ళని కనడమే కాక, కొడుకు చేసిన తప్పుని ప్రోత్సహించే తండ్రులు నేరస్థులే అన్నారు విశ్వనాధం.
విశ్వనాధంగారిని క్రాస్ ఎగ్జామ్ చేస్తూ వారి పిల్లదే తప్పు అని నిరూపించాలని చాలా తాపత్రయపడ్డారు రామనాధంగారు, విశ్వనాధంగారు చాలా తెలివిగా జవాబులు ఇవడంతో ఆ ఎత్తు పారలేదు.
సుమతి తరువాత సురేష్ ని ఎగ్జామ్ చేసింది. రూపతో కల్సి తిరిగినట్టు, రూపతో కొన్నాళ్ళు పట్టి ప్రేమకలాపాలు , తరువాత సెక్సు సంబంధం కలిగినట్టు, రూప వివాహం ఆడమని కోరితే నిరాకరించినట్టు అన్నీ తెలివిగా సురేష్ ఒప్పుకునేట్టు చేసి ఫాక్ట్స్ ఎస్టాబ్లిష్ చేసింది కోర్టులో. క్రాస్ ఎగ్జామ్ లో రామనాధంగారు సురేష్ పెళ్ళడతానని ఎన్నడూ చెప్పలేని, రూప చివరివరకు అసలు ఆ ప్రశ్న అడగలేదని, తన చదువు అవని కారణంగా, ఉద్యోగం వచ్చి స్వతంత్రంగా తన కాళ్ళ మీద నిలబడేవరకు పెళ్ళి ప్రయత్నం లేదన్నట్లు జవాబులు చెప్పించి సురేష్ పొరపాటు కాదని, రూపదే పొరపాటన్న పాయింటు ఎస్టాబ్లిష్ చెయ్యడానికి ప్రయత్నించాడు అయన.
రూపని క్రాస్ ఎగ్జామ్ చేస్తూ రకరకాల తికమక ప్రశ్నలడిగి ఆమెదే తప్పని నిరూపించడానికి ప్రయత్నించారుగాని, రూప కుండబద్దలు కొట్టినట్లు జరిగినదంతా అక్షరం పొల్లుపోకుండా చెప్పింది. ఆమె ధైర్యానికి కోర్టులో అంతా ఆశ్చర్యపడ్డారు.
సుమతి తన ఆఖరు సాక్షిగా రామనాధంగార్ని బోను ఎక్కించింది.