Previous Page Next Page 
కొత్తమలుపు పేజి 20

    ఉహు ఏమయినా సరే రాజీకి రాకూడదు. మైనర్ అన్న పాయింటు తప్ప రూప దగ్గర సాక్ష్యాలు ఏమి లేవు. ఆ పాయింటుతో ఈ కేసు గెల్చి తనని అడుగడుగునా అవమానిస్తున్న సుమతికి బుద్ది చెప్పాలి. ఆయనలో పంతం పెరిగింది. పట్టుదలగా కోర్టు కేక్కడానికే నిర్ణయించారాయన. శారదాంబ పరువు ప్రతిష్ట అంటూ గోల పెట్టింది. సురేష్ కి ఇంత చేసినా రూప మీద కసి పెరిగి లొంగిపోయి రాజీకి రావాలని లేదు. రాజి అంటే పెళ్ళాడాలి. తనమీద ఇంత కక్ష కట్టిన రూపని....ఇంపాసిబుల్ అనుకున్నాడు కోపంగా. తను చేసిన పని నలుగురిలో బైటికి వస్తుందని చిన్న తనంగా వున్నా, తండ్రి తగ్గిపోవడానికి ఇష్టపడకపోవడంతో చేసేదేం లేక వూరుకున్నాడు.
    ఇంత గొడవవుతుందని తెలిస్తే ఈ గొడవలో ఇరుక్కోకపోదును. అని పదే పదే పశ్చాతాప పడ్డాడు. గుడ్డిలో మెల్లన్నట్లు తను రూపకి ఉత్తరాలు అవి రాయలేదు. పెళ్లాడతానని మాటివ్వలేదు గనుక కేసు బలంగా నిలవదు. తండ్రి పంతం పట్టి కేసు గెలిపించొచ్చు  అని ఓదార్చుకున్నాడు. కేసు గెల్చినా ఓడినా ఇదంతా అనవసరంగా నలుగురి నోళ్ళలో పడ్డందుకు మాత్రం సురేష్ కి భాధగా వుంది.
    రూప కేసు నెలా పదిహేను రోజుల్లోనే హియరింగ్ కి వచ్చింది. జస్టిస్ సుబ్రహ్మణ్యం సుమతికి బాగా సన్నిహితులు. ఆ కేసు ఆయనకిందకి రావడంతో సుమతి ప్రత్యేకంగా ఆయనతో మాట్లాడి తొందరగా ఆ కేసు హియరింగ్ కి వచ్చేట్టు చూసింది. మూడు రోజుల తర్వాత రామనాధం నించి జవాబు రాకపోవడంతో కోర్టులో కేసు ఫైల్ చేసింది. ఈ నెలా పదిహేను రోజులలో రూప, సురేష్ కలిసి తిరగడం చుసినవాళ్ళందరి సాక్ష్యాలు సంపాదించింది. టైపు ఇన్ స్టిట్యుట్ లో , వారు గడిపిన హోటల్ బాయస్, వాళ్ళిద్దరిని చూసిన విశ్వనాధంగారి స్నేహితులు, రూప స్నేహితురాళ్లిద్దరు-ఇలా ఒక అరడజను మందిని కలిసి అవసరమైతే వారు రూప తరపున కోర్టులో సాక్ష్యం ఇచ్చేట్టు ఒప్పించింది.
    కోర్టులో సురేష్ మీద రూప కేసు వేసిన సంగతి విశ్వనాధంగార్కి స్నేహితులద్వారా తెలిసేసరికి కేసు కోర్టులో హియరింగ్ కి వచ్చేసింది.
    రూప ఇంట్లోంచి వెళ్ళిపోయిన ఆ నేల్లాళ్ళలో విశ్వనాధంగార్కి హటాత్తుగా ముసలితనం వచ్చేసినట్లు జుట్టు సగం నెరసి, కళ్ళు లోతుకు పోయాయి. దవడలు పిక్కుపోయాయి. ఆ నెల రోజులుగా పద్మావతి ఆవేదనకీ అంతులేకుండా పోయింది! ఆ మర్నాడు ఉదయం రూప ఇంట్లో లేదని గుర్తించగానే ఆమె స్థాణువైంది. రూప అంత సాహసం చెయ్యగలదని ఎన్నడూ అనుకోలేదు ఆమె, ఏదో పొగరుగా మాట్లాడడం తప్ప అంత ధైర్యంగా ఏ ఆధారంగా లేకుండా ఇల్లోదలగలదని కలలో కూడా అనుకోలేదు పద్మావతి.
    తను సాధించ దలచినదానికి వీళ్ళు అడ్డు వస్తున్న కారణంగా తను అనుకున్నది సాధించడానికి ఇల్లోదలడం తప్ప గత్యంతరం లేదని, తను పిరికిదానిలా ఏ ఆత్మహత్య చేసుకోనని తను చేరవలసిన గమ్యం చేరాక తన ఉనికి తెలియ పరుస్తానని, అంతవరకు తన గురించి ఆందోళన పడనవసరం లేదని రూప రాసిపెట్టిన ఉత్తరం చూశాక కాస్త మన స్థిమితం చిక్కింది.
    ఏ అఘాయిత్యం చెయ్యలేదని మనసు నిబ్బరపడినా ఎక్కడికెళ్ళిందో , ఏమైందో ఎలా బతుకుతుందో , ఒంటరిగా ఎక్కడ ఏం అవస్థలు పడుతుందోనని హడలిపోయింది. ఆ వుత్తరం తీసికెళ్ళి భర్త మీద విసిరికొట్టి రూప ఇంట్లోంచి వెళ్ళడానికి ఆయనే కారణం అని విరుచుకుపడింది.
    విశ్వనాధంగారూ రూప అంతపని చెయ్యగలదని ఎన్నడూ అనుకోలేదేమో నిర్ఘాంతపోయాడు. ఉత్తరం చదివి ఆ ధైర్యానికి విస్తుబోయాడు. అయన, పద్మావతి ఆ నెలరోజులలో మానసిక వ్యధతో చిక్కి సగంయ్యారు.
    రూప ఏదని అడిగిన వారికీ శలవులు కనక అమ్మమ్మగారి వూరు వెళ్లిందని చెప్పుకున్నారు. మళ్ళి రూపనించి ఏ ఉత్తరమన్నా వస్తుందేమోనని ఇద్దరూ ఆరాటంగా చూశారు.
    నెలరోజుల తర్వాత అయన కొల్లిగ్- లాయరు సుమతి తనని కలిసి రూప  కేసులో సాక్ష్యం చెప్పవలసిందని కోరిందని అనంగానే అయన నిర్ఘాంతపోయారు. ఆయన మొహం నల్లబడింది. రూప కోర్టు కెక్కుతుందని వినగానే అన్నాళ్లుగా ఆయన రూప కోసం పడిన ఆరాటం, బాధ తాను తొందర పడ్డానన్న భావం ఆన్నిపోయి మళ్ళి రూపమీద కోపం ముంచుకు వచ్చింది.
    ఈ దెబ్బతో తమ పరువు నడివీధి కెక్కుతుందని అయన కోపం పట్టలేకపోయారు. లాయరు దగ్గర కెళ్ళడం, కేసు పెట్టించడం ఎలా చేసిందో అయన కేమి అంతుబట్టలేదు. ఎక్కడ వుందో, ఏ ధైర్యంతో ఇదంతా చేస్తుందోనని ఆలోచించారు. ఆఖరికి లాయరు సుమతిని కలిస్తే రూప విషయం తెలుస్తుందేమోనని అనే కలిశారు ఒకరోజు.
    సుమతి-రూప విశ్వనాధంగారి స్నేహితురాలీని కలిశాక ఈ విషయం వాళ్ళు విశ్వనాధంగారికి చేరవేస్తారని విశ్వనాధంగారు తన దగ్గిరకు వస్తారని ఎదురు చూస్తూనే వుంది. కేసు విషయం చెప్పాలని, రూప తన దగ్గిర వున్న విషయం చెప్పడమా? మానడమా? అని ఆలోచించింది.
    కానీ.....రూప ధైర్యంగా "చెప్తాను ఆంటీ! నేనెలాగు కోర్టుకి రావడం అది అందరికి తెలుస్తుంది. ఆ తర్వాత నేనెటు వెళ్ళింది తెలుసుకోవాలంటే పెద్ద కష్టం కాదు. ఎలాగూ తెలుస్తుంది అబద్దం ఎందుకు ఆడడం. నేనిష్టమై ఇల్లు వదిలాను. నన్ను బలవంతంగా ఇంటికేవరు తీసికెళ్ళలేరు." అంది రూప.
    విశ్వనాధంగారు, పద్మావతి వచ్చే వేళకి సుమతి, రూప డ్రాయింగు రూములోనే కూర్చున్నారు. రూపని అక్కడ చూడగానే విశ్వనాధం మొహం ఎర్రబడింది. కూతురు వంక కసిగా చూసి పళ్ళుకొరికి-
    నీవింట్లోంచి లేచిపోయిననాడు నా కూతురు చచ్చిందని ఒక ఏడుపు ఏడ్చుకున్నాం. నీకింకా ఇలా మమ్మల్ని, మా పరువుని నడిబజారులో కెక్కించడానికి బతికేవున్నావన్నమాట. నీకేం అపకారం చేశామని మామీద ఇలా కత్తి కట్టావే? నిన్ను కనడమే నా తప్పయితే దానికి శిక్ష ఇప్పటికే అనుభవిస్తున్నాను. మమ్మల్ని యింకా ఈ మాత్రంగానైనా బతకనియదల్చుకోలేదా? కోర్టు కెక్కి అందరిలో మమ్మల్ని మొహం ఎత్తుకోనియకుండా చేసేంత అపకారం నీకేం చేశామే.....నిన్ను కన్నా, మొదటిపిల్లవని అల్లారుముద్దుగా పెంచాం కోరినవన్నీ కాదనకుండా చేశాం......యిందుకా మాకీ శిక్ష?" ఆయన గొంతు రుద్దమయింది. పద్మావతి కళ్ళనిండా నీరు తిరిగింది.
    రూప తలదించుకుంది.
    సుమతి లేచి నిలుచుని "విశ్వనాధంగారూ! ముందు మీరిలా కూర్చోండి. దయచేసి ఆవేశపడకండి.....అమ్మా మీరు కూర్చోండి. మనం ప్రశాంతంగా మాట్లాడుకుందాం" సుమతి వినయంగా అంది.
    అయన కోపం ఈసారి సుమతిమీద తిరిగింది. ఆమె వంక కోపంగా చూస్తూ "అమ్మా! మీరు చదువుకున్నవారు, న్యాయవాదులు. ఒక ఆడపిల్ల యిలా ఇంట్లోంచి లేచివెళ్ళి తెలివితక్కువగా ముందాలోచన లేకుండా కోర్టు కెక్కుతుంటే దానికి బుద్ది చెప్పి, నచ్చచెప్పి తప్పు తెలియపరచాల్సింది పోయి, కేసుకోసం, డబ్బుకోసం ఇలా దాని చేత కేసు ఫైల్ చేయిస్తారా? మీరు ఆడవారు. ఒక ఆడపిల్లని కన్నతండ్రులు వ్యధ మీకర్ధం కాదా? చిన్నపిల్ల తెలియక తప్పటుగు వేస్తున్నప్పుడేనా మాకు తెలియపరచాల్సిన బాధ్యత మీకు లేదా? మా దగ్గర ఇలా దాచి దాన్ని మీరు ప్రోత్సహించడం ఏమన్నా బాగుందా?" ఆవేశంగా కడిగేశారు.
    సుమతి మొహం అరక్షణం రంగు మారింది. అంతలో నిలదొక్కుకుని చిరునవ్వుతో ప్రశాంతంగా "ముందు మీరిలా కూర్చుంటే ఎందుకిలా చెయ్యాల్సివచ్చిందో అన్నీ వివరంగా చెబుతాను" అంది.
    "నాన్నా....ఇందులో మీరు ఆమెని అనడానికి ఏమి లేదు. నా కోరిక మీద, నా పట్టుదలవల్ల ఆవిడా కేసు ఫైల్ చేశారు. దయచేసి ఏమన్నా అనదలిస్తే నన్ను అనండి కానీ ఆమెని ఏమి అనకండి" రూప కాస్త కరుకుగా అంది.

 Previous Page Next Page