"అయ్యో, తీసికెళ్ళకేంరా మదనా తీసుకెళ్ళావు. ఆ వామాలస్వామి... ఆగుడి... ఆ వైభవం... ఆ అది....ఆ ఇది" అంటూ బామ్మగారు సినిమా గుర్తు తెచ్చుకుని ఓ దండం పెట్టుకుని చెంపలేసుకున్నారు భక్తితో.
"కాబట్టి నాన్నమ్మా! ఏ మంచిభక్తి సినిమా వచ్చినా ఆఖరికి ఎవడయినా "రేప్ చేయటం నా హాబీ" అంటూ పరమ దరిద్రపు చెత్తసినిమా తీసి దానిలో ఓ నిమిషం రామున్నో, కృష్ణున్నో చూపించినా ఆ వేషం దేముడిని చూపించటానికి నిన్ను ఆ సినిమాకి తీసుకెళతాగాని నా బొందిలో ప్రాణముండగా ఇంగ్లీషు భారతంకి మాత్రం తీసుకెళ్ళను" ఖచ్చితంగా చెప్పేశాడు మదన్ గోపాల్.
"సినిమా చాలా దరిద్రంగా వుంటుందని మదనుడెంత బాధపడుతున్నాడో చూడవేపిల్లా! ఇలాంటి దిక్కుమాలిన సినిమాలు చూస్తే పెళ్ళికావల్సిన పిల్లలు పాడయిపోతారు. పెద్దదాన్ని మీ మంచికే చెబుతున్నాను. ఆ సినిమా కెళ్ళకు. పిచ్చితండ్రి నా విషయంలో ఎంత జాగ్రత్తో" అని గీతామకరందం పుస్తకం తీసుకుని వెళ్ళిపోయింది బామ్మగారు.
నీ పిలక నాచేతికి చిక్కకపోదు అన్నట్లు చుర చుర చూసి వెళ్ళింది వైజయంతి.
"గండం గడిచింది. యింకేం రానున్నదో? ముందు ముందు" అనుకున్నాడు మదన్ గోపాల్ ఛాతీ మీద చెయ్యేసుకుని.
8
"డిటెక్టివ్ రామదూత T. ప్రైవేటు ప్రాక్టీసు." పని చేయుకాలము. అన్ని వేళలు. అందరికి ఆపదలో వున్నవారికి మాత్రమే (గమనిక)
తనుండేగది వాకిలిముందు నేమ్ ప్లేటు తగిలించి "అమ్మయ్య ఇప్పటికయింది. నాగది సర్దుకోటం ఈ బోర్డు తగిలించటము" అనుకున్నాడు రామదూత. ఆ తర్వాత హోటలు కెళ్ళి రెండు ప్లాస్కులనిండా కాఫీ పోయించుకుని త్రివేణి వక్కపొడి పొట్లం కొనుక్కుని వచ్చాడు. అందరినీ రమ్మని ఆహ్వానించాడు.
రామదూత పిలిచినవేళ మంచిదే ఎవరికి ఆ సమయంలో పనిలేకుండా వుంది. పైగా ఆదివారం. కలిసొచ్చే సమయంలో నడిచొచ్చే కొడుకు పుడతాడన్నట్లు. ప్రఖ్యాత విఖ్యాత ప్రముఖ గిముఖ, బహుముఖ పరాక్రమం అరి వీరభయంకరులయిన రామదూతగారు ఓపని తలపెడితే అది సక్సెస్ కాకుండా వుండటమా! ఇంపాజిబుల్.
సౌభాగ్యమ్మ, శారదాంబ, బామ్మగారు, వైజయంతి, త్రిలోకసుందరి, యింట్లోవున్న పిల్ల కాయలు, మదన్ గోపాల్, అతని తోకలా చక్రవర్తి బిలబిల లాడుతూ రామదూత గదిలోకి వచ్చారు.
వాకిలివేపు ఓగది ఖాళీగావుంటే టులెట్ బోర్డు కట్టటం రామదూత వచ్చిఅడిగితే వైజయంతి ఇవ్వననటం సౌభాగ్యమ్మ అది చూడటం. సౌభాగ్యమ్మ అమ్మమ్మ పుట్టిల్లు రామదూత నానమ్మ అత్తారిల్లు ఒకే ఊరుకావటం మాటల్లో ఆబాదరామాయణ బంధం బయటపడి రామదూతకి ఆగది దక్కటం జరిగింది. గది యిచ్చినప్పటినుంచీ వంటరి మగాడు అంటూ గుణుస్తూనే వుంది వైజయంతి. "మగాడు మంచివాడా! కాదా! కావాలి. వంటరిగావున్నా జంటగావున్నా చెడ్డవాడు చెడ్డవాడే" అంది సౌభాగ్యమ్మ. "బీరకాయపీచు చుట్టరికం తిరగేయటం. అది పట్టుకుని అడ్డమైన వాళ్ళకీ ఇల్లివ్వటం నీకు అలవాటేగా" అనుకుంది వైజయంతి.
"రండి రండి. వెల్ కమ్. వెల్ కమ్. నా ఈ చిన్న రూమ్ లో కుర్చీలు పరుచుట అసాధ్యము కావున చాపలు పరిచి తిని దయచేసి అందరూ నిశ్శబ్దముగా కూర్చుండ ప్రార్ధన." వినయంగా చేతులుకట్టుకుని తల కాస్తవంచి అందరినీ ఆహ్వానించాడు రామదూత.