రిమాండ్ షాపుకెళ్ళి, మూడు జతల బట్టలు తీసుకున్నాడు. ఇరవై నాలుగు గంటల్లో మధు స్వరూపం పూర్తిగా మారిపోయింది. పల్లెట్టూరి నుంచి అమాయకంగా కాలేజికీ వచ్చిన మధుకి, హీరోహోండా మీద కాలేజీకి, ఆల్ట్రా మోడ్రన్ గా వచ్చిన మధుకి చాలా తేడా వుంది. ఇప్పుడు ఫ్రెండ్స్ సర్కిల్ పెరిగింది. ఫ్రెండ్స్ లో మధు వాల్యూ కూడా పెరిగింది. రవి, రమణలు అతని కెందుకో దూరంగా వుంటున్నారు. సడెన్ గా మధులోని మార్పు వారికేం అర్థం కావడంలేదు.
క్లాస్ రూమ్ లోంచి బయటికొచ్చి, హీరోహోండా ని స్టార్ట్ చేస్తూ 'హలో' అని తనని విష్ చేసిన అన్విత, అతని వేపు ఆశ్చర్యంగా చూసింది. అన్విత కారు కాలేజ్ గేట్ దగ్గరికి వచ్చేసరికి గుంపులు, గుంపులుగా విష్ చేసే స్టూడెంట్స్ గ్రూప్ లో ఈ మధ్య మధు కన్పించడం లేదు. మధులోని ఆకస్మికమైన ఈ మార్పుకు కారణం ఏమిటి? మొట్టమొదటిసారి చాలాసేపు దీర్ఘంగా మధు గురించి ఆలోచించింది అన్విత.
ఒక ఆడపిల్ల మగవాడి గురించి ఆలోచించిందంటే, దానర్థం ఇష్టం ప్రారంభమైందని, ఇష్టం ప్రారంభమయ్యాక ఆడపిల్ల ప్రవర్తన చాలా భిన్నంగా వుంటుంది. తను మాట్లాడాలని కోరుకునే మగవాడిని ఎట్రాక్టు చేయడం కోసం ప్రయత్నిస్తుంది.
అద్దం ముందు కొన్ని గంటలు గడుపుతూ, తన అందాన్ని మెరుగులు దిద్దుకుంటుంది. లేటెస్ట్ డ్రెస్సులు, లేటెస్ట్ ఫ్యాషన్లు, మాటల్లోనూ, నడకలోనూ మార్పు, ఆటోమేటిగ్గా చోటు చేసుకుంటాయి.
అన్వితలోని మానసికమైన మార్పు గురించి ఎవరికీ తెలీదు. నానమ్మ మాత్రం కొంతలో కొంత గుర్తించింది.
"ఏమిటీ..... బేబీ..... ఈ మధ్య నీ స్టయిల్ లో సమ్ థింగ్ స్పెషల్ కనిపిస్తోంది లవ్ వ్యవహారమా?"
"నీకు తెలీకుండా నేనెవర్నయినా ప్రేమిస్తానా!" అంది అన్విత. వాళ్ళిద్దరూ నాన్నమ్మ, మానవరాళ్ళలా వుండరు. క్లోజ్ ఫ్రెండ్స్ లా వుంటారు.
"ప్రేమించు. తప్పేంలేదు. సీరియస్ గా ఎవర్నీ ప్రేమించక. దాని కోసం మనసుని పాడుచేసుకోక. లవ్ ఈజ్ జస్ట్ ఫర్ సేక్. కాలేజీలోని లవ్ లీజర్ పీరియడ్స్ లాంటిది. జోవియల్ లైఫ్ కి సింబల్స్ మాత్రమే- కుర్రాళ్ళతో తిరగడం, వాళ్ళచేత ఖర్చు పెట్టించడం- సరదా, సరదా కబుర్లు- గ్యాసిప్స్- ఇదంతా లేటెస్ట్ మోడల్ ఫ్రెండ్ షిప్.
ఫ్రెండ్ షిప్ ఈజ్ నాటెటాల్ ఎ లవ్.
కొంచెం మన మనసుని ఆనందంగా, ఆహ్లాదకరంగా ఉంచుకోవడానికి రోమాన్స్ ఉపయోగపడుతుంది. సీరియస్ ఇన్ వాల్వ్ మెంట్ వుండకూడదు" చెప్పింది అన్నపూర్ణమ్మ.
నాన్నమ్మ థీరీకి ఆశ్చర్యపోయింది అన్విత.
సోకాల్డ్ కాంటెంపరరీ సొసైటీని అబ్జర్వ్ చేసిన అనుభవం అది.
కాస్మోపాలిటన్ సర్కిల్స్ థీరీ అది.
"సీరియస్ ఇన్ వాల్వ్ మెంట్ ఉండకూడదంటే-" ప్రశ్నించింది అన్విత. జూలు కుక్కల్లా తిప్పుకో. తోక ఊపుకుంటూ నీ చుట్టూ తిరిగే జూలు కుక్కల్ని ఆడించు, అవసరమయితే పార్టీల పేరుతో బిస్కట్లు పడెయ్. నువ్వేం ఖర్చు చెయ్యకు. వాళ్ళే ఖర్చు చేస్తారు. మగవాడి ఖర్చుతో మగవాడిని నవ్వించడమే రోమాన్స్ లో ఫస్ట్ పార్ట్. లవ్ పార్టనర్స్ వేరు- లైఫ్ పార్టనర్స్ వేరు. అప్పుడే నువ్వు మహారాణిలా వుండగలవు."
నాన్నమ్మ చెప్పిన విషయాలకు భిన్నంగా వున్నాయి అన్విత ఆలోచనలు అన్వితకు తెలిసిన ప్రపంచం వేరు. నాన్నమ్మకు తెలిసిన ప్రపంచం వేరు.
ఇద్దరూ రాజీపడేది మాత్రం ఒక్కచోట మాత్రమే.
డబ్బే అన్నిటినీ శాసిస్తుందనే నమ్మకం.
* * *
అన్విత ఉండే పోష్ కాలనీలో, అన్విత ఇంటికి కుడిపక్కన కొంచెం దూరంలో మూడంతస్తుల కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతోంది. కూలీలు ఎవరి పనిలో వారున్నారు. ఆ బిల్డింగ్ ముందు హీరో హోండాని ఆపాడు మధు.
హోండా హుక్ కున్న బ్యాగ్ ను తీసుకుని, భుజానికి తగిలించుకుని, ఆ బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్ లో కెళ్ళాడు.
బ్యాగ్ లోంచి కెమెరాను తీసుకుని, అన్విత ఇంటివేపు యాంగిల్ చూశాడు. జూమ్ ఫిక్స్ చేసి, టెలీలెన్స్ ఎడ్జెస్ట్ చేసి, అన్విత బెడ్ రూమ్ వేపు చూశాడు.
రెండు కిటికీలు, ఆ కిటికీలకు వేలాడుతున్న కర్టెన్లు కనిపించాయి మధ్నాహ్నం నాలుగు గంటలు దాటింది.
ఏసమయంలోనైనా అన్విత ఆ కిటికీ తెరచి బయటికి చూడొచ్చు, ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు మధు.
క్షణాలు- నిమిషాలు అసహనంగా గడుస్తున్నాయి.
జూమ్ లెన్స్ తో కిటికీల వేపు, పోర్టికోవేపు, స్విమ్మింగ్ ఫూల్, గార్డెన్ వేపు చూస్తున్నాడు. పనిమనుషులు తప్ప మరెవరూ కన్పించలేదు.
సరిగ్గా ఐదుగంటల పదిహేను నిమిషాలైంది.
జూమ్ లెన్స్ తో విండో కర్టెన్ వేపే చూస్తున్న మధుకి, ఆ కర్టెన్ ని ఎవరో పక్కకు తీస్తున్న దృశ్యం కన్పించగానే-
ఎలర్టయ్యాడు.
అన్విత.....!
కర్టెన్ ని తీసి, గార్డెన్ వేపు చూస్తోంది.
కొన్ని సెకన్లు.....
జూమ్ ని క్లోజప్ లోప ఫిక్స్ చేశాడు. గాలికి ముఖమ్మీద పడుతున్న జుట్టును, పక్కకు తీసుకోవడానికి పైకొచ్చిన చేతివేళ్ళు..... క్లిక్ .... క్లిక్.... క్లిక్.....
అంతలోనే విండో కర్టెన్ క్లోజయింది.
సరిగ్గా 5.25 నిమిషాలైంది.
ఓపికతో ఎదురుచూస్తూనే వున్నాడు మధు.
ఆకాశంలో ఎరుపురంగు బూడిరంగుగా మారుతోంది.
యధాలాపంగా పోర్టికోలోకి చూసిన మధుకి, అప్పుడే అక్కడకొచ్చి నిలబడిన అన్విత!
కారువేపు నడుస్తోంది.
సైడ్ యాంగిల్ లో కొన్ని ఫోటోలు తీసుకున్నాడు. అన్విత కారు డోరు ఓపెన్ చేస్తున్నప్పుడు.
క్లిక్.... క్లిక్.... క్లిక్....
అంతలోనే ఆ కారు మెయిన్ గేట్ లోంచి బయటికెళ్ళిపోయింది. వెంటనే హీరో హోండా ఎక్కి స్టార్ట్ చేసి, ఆ కారుని ఫాలో అయ్యాడు మధు.
అరగంట తర్వత ఆ కారు ఓ డిపార్టుమెంటల్ స్టోర్స్ ముందు ఆగింది పార్కింగ్ లో కారు పార్క్ చేసి, లోనికి నడిచింది అన్విత. ఆ కారుకి కొంచెం దూరంలో హీరోహోండాని పార్క్ చేసి, లోనికి నడిచాడు మధు.
చాలాపెద్ద డిపార్ట్ మెంట్ స్టోర్స్ అది. లోనికి ప్రవేశించిన మధు నలువేపులా చూస్తున్నాడు. కార్నర్ 'రో'లో ఫారెన్ కాస్మిటిక్స్ కౌంటర్ దగ్గరున్న సేల్స్ గర్ల్ తో ఏదో మాట్లాడుతోంది అన్విత.
అటూ ఇటూ చూశాడు.
మేడమీద జంట్స్ వేర్ కౌంటర్. గబగబా మెట్లెక్కాడు. ఆ కౌంటర్ దగ్గర నుంచి ఏటవాలులో కన్పిస్తున్న ఫారెన్ కాస్మిటిక్స్ కౌంటర్ దగ్గర వున్న అన్విత వేపు చూశాడు. కౌంటర్ దగ్గర సేల్స్ బాయ్- "ఏం కావాలి సర్...." అడిగాడు వినయంగా. వాడ్ని అక్కడ నుంచి పంపెయ్యకపోతెగాని తను ఫోటోలు తియ్యలేడు,
"హేంకీస్..... వున్నాయా....." బనీన్లు వేపు చూస్తూ అడిగాడు.
"ఉన్నాయి సార్!"
"తీసుకురండి...."
ఆ కుర్రాడు హేంకీస్ ప్యాకెట్స్ ని తీస్తున్నాడు పక్కన తిరిగి.
గబుక్కున బ్యాగ్ లోంచి కెమెరా తీసి, క్షణంలో జూమ్ ఫిక్స్ చేసి, లెన్స్ ఎడ్జస్ట్- బటన్ నొక్కుతున్నాడు మధు.
అన్విత ప్రతి మూవ్ మెంట్ ని కెమెరా కేచ్ చేస్తోంది.
క్లిక్.... క్లిక్..... క్లిక్.....
అన్విత ముందుకు కదిలింది. కౌంటర్ దగ్గర కేష్ పెచేసి , చేతిలో ప్యాకెట్స్ తో బయటకు వెళ్లిపోయింది.
"సార్..... హేంకీస్!"
"మళ్ళీ వస్తా" కెమెరాతో పరుగెడుతున్న మధువైపు భయం - భయంగా చూశాడు ఆ సేల్స్ బోయ్.
* * *
కిందకొచ్చిన మధుకి కారుగానీ, అన్వితగానీ కనపడకపోవడంతో హీరో హోండా ఎక్కి నాలుగురోడ్ల జంక్షన్ కొచ్చాడు. ట్రాఫిక్ దగ్గర ఆగి చూశాడు.
ఎక్కడా కారు కనబడలేదు.
ఇంటికెళ్ళిపోయిందేమో?
పావుగంటలో అన్విత ఇంటికొచ్చాడు. పార్కింగ్ లో కాదు కన్పించక పోవడంతో టెలిఫోన్ బూత్ దగ్గరకొచ్చాడు.
సరిగ్గా అప్పుడే అక్కడకొచ్చాడు సుల్తాన్.
"నీకోసం రూమ్ కెళ్ళా..... కాలేజీకెళ్ళా..... క్యాంటీన్ లో కూర్చుని కూర్చుని వస్తున్నాను. కాలేజీకెళ్ళకుండా ఏం చేస్తున్నావ్?"
కెమెరా బ్యాగుని చూపించాడు మధు.
"తీశావా?"
"ఆ ప్రయత్నంలోనే వున్నా."
వాళ్ళిద్దర్నీ చూడగానే టెలిఫోన్ బూత్ కుర్రాడు కంగారుపడి పోయాడు.
"సుల్తాన్! ఇప్పుడు కారులో ఇటు అన్విత వస్తుంది. ఆమె ఎటెళ్ళినా, ఎక్కడికెళ్ళినా ఇటునుంచే ఇంటికెళ్ళాలి. టెలిఫోన్ బూత్ ఎదురుగా ఆ అమ్మాయి ఆగేటట్టు చూడు..... మిగతా విషయం నేను చూసుకుంటాను" సుల్తాన్ కు చెప్పాడు మధు.
"ఓ ఎస్ ..... నేను చూసుకుంటాను గదా? పది నిమిషాలు ఆపుతాను. ఆమెకి తెలియకుండా ఫోటోలెలా తీస్తావ్?"
"నేనెలా తీస్తానో చూడు..... ముందు నువ్వాపనిలో వుండు" చెప్పాడు మధు.
టెలిఫోన్ బూత్ లోకి అడుగుపెట్టాడు సుల్తాన్.
"ఏం సార్.... ఈ మధ్య కనిపించడం లేదు....?" అడిగాడు ఆ కుర్రాడు.
"ఇప్పుడు కనిపించాను గదా? ఓ డజన్ లోకల్ కాల్స్ చేసుకోవాలి. కన్ సెషన్ ఎంతిస్తావ్?" అడిగాడు సుల్తాన్.
"ఫోన్ కాల్స్ కి కన్ సెషన్ ఏమిటిసార్? వింతగా వుంది?"
"ఇస్తే చేస్తా...... తర్వాత నీ ఇష్టం."
ఒక్క క్షణం తటపటాయించి-
"అలాగే సార్! ఒక్క కాల్ కన్ సెషన్ ఇస్తా! పదకొండు కాల్స్ కి మీరు పే చెయ్యాలి" చెప్పాడతను.
"ఓ.కే! అన్నీ పర్సనల్ కాల్స్..... నువ్వు కొంచెం దూరంగా నిలబడాలి. అదీగాక ఓ ఫ్రెండ్ ఒకావిడ నాకోసం వస్తుంది..... స్పోర్స్ కారు..... నువ్వు రోడ్డు మధ్యన నిలబడు..... ఆ కారిక్కడకు రాగానే ఆ కారుని ఆపు..... కాసేపు ఆమెతో నువ్వు మాట్లాడుతూ వుంటే నేనొచ్చేస్తాను..... సరేనా?"
"అలాగే సార్!" అంటూ రోడ్డువేపు నడిచాడు ఆ కుర్రాడు.