"ఎలా వుంది..... మన ఐడియా?" అంటూ మధువైపు చూశాడు సుల్తాన్.
మధు కెమెరా తీసి అన్నీ ఎడ్జెస్ట్ చేసుకుని, కుడివైపు చూస్తున్నాడు. సిటీలోంచి ఆ దిశగానే కారు రావాలి.
"కారక్కడ కనబడగానే నువ్వు టెలిఫోన్ రిసీవర్ అందుకో..... వెనక్కి తిరిగి నుంచుని మాట్లాడుతున్నట్టు నటించు- నీకు అపోజిటివ్ గా నేను నిలబడతాను. అంటే రోడ్డుమీదున్న అన్వితకు నీ వీపు మాత్రమే కన్పిస్తుంది. నేనస్సలు కన్పించను. ఫోటోలు తియ్యడం ఈజీ- అర్థమైందా?" మధు అన్నాడు.
"నీ బ్రెయిన్ ఈ మధ్య చాలా షార్ప్ గా తయారవుతోంది....." కామెంట్ చేశాడు సుల్తాన్.
అయిదు నిమిషాలు గడిచాయి.
"సార్! కారొస్తోంది" అరిచాడు టెలిఫోన్ కుర్రాడు.
మధు వెంటనే తలతిప్పి కుడివైపు చూశాడు.
స్టీరింగ్ ముందు కూర్చుంది అన్విత.
"రెడీ....." ఫోన్ రిసీవరు అందుకుని తన పొజీషన్ లో తను నిలబడ్డాడు సుల్తాన్.
రోడ్డుకడ్డంగా ఎవరో కుర్రాడు నిలబడ్డం, కారు ఆపమని సంజ్ఞ చేయడంతో కారుని స్లో చేసింది అన్విత.
గ్లాస్ విండోస్ ని కిందకు దింపి "వాట్ హేపెండ్?" అందామె. ఆమెను చూడగానే ఆమెకు తెలుగు తెలీదేమో అని అనుకున్న టెలిఫోన్ కుర్రాడు-
"మేడమ్! యువర్ ఫ్రెండ్..... యువర్ ఫ్రెండ్" అంటున్నాడు గ్లాస్ రూంలో మాట్లాడుతున్న సుల్తాన్ వైపు చూపిస్తూ.
అన్విత ఆ దిశగా చూసింది.
ఆ వ్యక్తి వీపు తప్ప మరేమీ కన్పించడంలేదు.
కారు డోర్ తెరిచి బయటికొచ్చి నిలబడి, టెలిఫోన్ బూత్ వైపు అడుగులు వేస్తోంది.
డైరెక్ట్ యాంగిల్...... వండ్రపుల్ ఫోజ్.
సుల్తాన్ మోచేయి పక్కన కెమెరా ఫేస్ ను వచ్చేస్తోంది. నేను టేబుల్ కింద దాక్కుంటాను నువ్వు ఎఇసీవారు పెట్టేసి బయటికెళ్ళిపోయి, మేనేజ్ చేసి పంపించెయ్, అంటూ మోకాళ్ళమీద కిందకు వంగి, టేబుల్ వెనక నక్కి కూర్చున్నాడు.
గబుక్కున రిసీవర్ని క్రెడిల్ మీద పెట్టేసి, డోర్ తీసుకుని బయటికొచ్చాడు సుల్తాన్.
అపరిచిత వ్యక్తిని చూడగానే లోనికి రాబోయిన అన్విత ఆగిపోయింది.
"ఏం కావాలి మేడమ్? ఫోన్ చేస్తారా? పదకొండు కాల్స్ కి ఒక కాల్ ఫ్రీ" సుల్తాన్ చెపుతున్నదేమిటో ఆమెకు అర్థం కాలేదు.
కోపంగా టెలిఫోన్ బూత్ కుర్రాడివైపు చూసింది.
"మీ ఫ్రెండ్స్....." ఏదో చెప్పబోయాడు వాడు.
టెలిఫోన్ కుర్రాడు తనని ఫూల్ చేస్తున్నాడని అనుకున్న అన్విత.
"ఇడియట్!" అని వాడివైపు చూసి సర్ర్ మని వెనక్కి వెళ్ళిపోయి కారెక్కి ముందుకెళ్ళిపోయింది.
కారు ముందుకెళ్ళిపోగానే బయటికొచ్చాడు మధు.
"సక్సస్!" అన్నాడతను.
"సక్సస్ ఏమిటి సార్...... ఇడియట్ అని తిడితేను?"
"తిట్టే కదా..... పదిరూపాయలు తీసుకో!" అంటూ సుల్తాన్ పదిరూపాయల నోటు ఆ కుర్రాడి చేతిలో పెట్టాడు.
"ఫోన్ కాల్స్ డబ్బులు?"
"పదకొండు కాల్స్ కు ఒక ఫోన్ కాల్ ఫ్రీ కదా? ఫ్రీ కాల్ ఇప్పుడు చేశానన్న మాట..... మిగతా కాల్స్ రేపు చేస్తానులే" ముందుకు నడుస్తూ అన్నాడు సుల్తాన్.
అప్పుడు రాత్రి ఏడుగంటలు దాటింది.
ఇంటికొచ్చిన అన్వితకు టెలిఫోన్ బూత్ దగ్గర జరిగిన సంఘటన పదే పదే గుర్తుకొస్తోంది. దానిక్కారణం ఆ టెలిఫోన్ బూత్ ముందు ఆగిన హీరోహోండాని ఆమె గుర్తుపట్టింది. అది మధుదే..... కానీ మధు అక్కడ కన్పించలేదు.
మధు గురించి ఆలోచించడం ఈ మధ్య ఆమెకు చాలా ఉత్సాహంగా వుంది.
ఉదయం తొమ్మిది గంటలు.
కాలేజీ కెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్నాడు మధు.
బనీస్ కోసం సూట్ కేస్ తెరిచి, బనీస్ తీసుకుంటూ, సూట్ కేస్ బ్యాక్ పాకెట్ లోంచి బయటకు కన్పిస్తున్న ఫోటోను అప్రయత్నంగా బయటకు తీశాడు.
ప్రేమ ఫోటో.....
సగం చిరిగిపోయిన ఫోటోలో లంగా- వోణీల్లో ప్రేమ.
అన్విత ఆరాధనా సముద్రంలో కొట్టుపోయిందతని మనసు.
ప్రేమ ఇప్పుడు తన ఎదురుగా వుంటే, అన్వితా వుండేదా?
అన్విత లాంటి అమ్మాయిలవేపు తను కళ్ళెత్తయినా చూసేవాడా.....?
ప్రేమ....
ప్రేమ.....
'ఆ ఫోటోను లైఫ్ సైజ్ చేయించి, తన బెడ్ రూమ్ లో పెట్టుకోవాలి' అని నిర్ణయించుకుని ఆ ఫోటోని జేబులో పెట్టుకున్నాడు.
* * *
హీరోహోండా ఫోటో స్టూడియో ముందు ఆగింది
. కెమెరాని, రీల్ ని, ప్రేమ చిన్ననాటి ఫోటోనీ ఆ ఫోటోగ్రాఫర్ కిచ్చి-
"ఈ రీల్లో ఫోటోల్ని సాంపిల్ ప్రింట్ వెయ్యండి..... ఈ ఫోటో లైఫ్ సైజ్ కి ఎన్ లార్జ్ చెయ్యండి" చెప్పాడు.
"చిన్న ఫోటో కదా! నెగెటివ్ తీసి, ప్రింట్ చెయ్యాలి. చిన్న టచప్స్ చెయ్యాలి. ఖర్చవుతుంది" చెప్పాడు ఫోటోగ్రాఫర్.
"ఫర్వాలేదు. సాయంత్రం వస్తాను" వెళ్ళిపోయాడు మధు.
* * *
మధ్యాహ్నం.......
క్యాంటీన్ కళకళలాడుతోంది.
క్యాంటీన్ లోకి అడుగుపెట్టిన మధుకి మిత్రబృందం స్వాగతం పలికింది.
రవి, రమణ వాళ్ళతో వున్నారు.
"ఏమిటీ! ఈ మధ్య కాంటీన్ కి అసలు రావడంలేదు. క్లాస్ లై పోగానే మాయమైపోతున్నావ్" సరదాగా అడిగాడు షాజహాన్.
"పరీక్షలు దగ్గరపడుతున్నాయి కదా..... ప్రిపేర్ అయిపోతున్నాడేమో?" అన్నాడు బుచ్చిబాబు.
"డిస్టెంక్షన్ కోసమేమో!" వెటకారంగా అన్నాడు రమణ. కొన్నినెలలుగా మధు గురించి చాలా విశేషాలు సేకరించాడు రవి. సుల్తాన్ తో స్నేహం, పార్టీలు, అన్వితకు దూరంగా వుంటున్నట్టు నటిస్తూనే, ఆమెకు దగ్గరకు కావడానికి చేసే ప్రయత్నాలు వగైరా...."
ఎప్పుడో ఒకప్పుడు తగువు పెట్టుకోవాలని అదునుకోసం చూస్తున్నాడు రవి.
సరిగ్గా దొరికాడనుకున్నాడతను.
అందరూ టీ తాగుతున్న సమయంలో మధు పక్కకొచ్చాడు రవి.
"నిన్ను చాలా రోజుల వరకు అసలు పట్టించుకోలేదు. పట్టించుకున్న తక్కువగా అంచనా వేశాను" అన్నాడతను సిగరెట్టు వెలిగిస్తూ.
"దేని గురించి?" అడిగాడు మధు.
"దేని గురించో నీకు తెలుసు! నేను చెప్పడం దేనికి. తెలీదా?" కఠినంగా ఉంది అతడి గొంతు.
అతను తగువు పెట్టుకోవడానికి, రంగం సిద్ధం చేస్తున్నాడన్న విషయం అర్థమైపోయింది మధుకి.
అతని వ్యవహారాన్ని, వ్యక్తిత్వాన్ని ఎప్పుడో అంచనా వేశాడు మధు.
అదే సమయంలో క్యాంటీన్ ముందు స్కూటరాగింది. స్కూటర్ దిగి సుల్తాన్ లోనికొచ్చి రమణ ప్రక్కన కూర్చున్నాడు.
తెల్సినవాళ్ళతో కబుర్లాడుతున్నాడు. సుల్తాన్ ని చూడగానే మరింత చిర్రెత్తుకొచ్చింది రవికి.
"నా పట్టుదల, కసి, నీకు తెలుసా? స్నేహితుడ్ని శత్రువుగా చూడటం నాకిష్టం లేదు" అన్నాడు రవి.
"మాట్లాడితే డైరెక్ట్ గా మాట్లాడు. లేకపోతే మానెయ్" అన్నాడు మధు.
"నేనెవర్ని ఇష్టపడుతున్నానో నీకు తెలుసు. ఎవర్ని స్వంతం చేసుకోవాలను కుంటున్నానో తెలుసు- కాని రమణగాడు అడ్డం వస్తాడనుకుని వాడ్ని డబ్బుతో కొనేసి, మేనేజ్ చేసుకున్నాను. అనుకోని వ్యక్తివి నువ్వు అడ్డం వచ్చావు. అది మంచిది కాదని చెపుతున్నాను అర్థం చేసుకో"
ఆ మాటలకి రవి కళ్ళలోకి చాలా కోపంగా చూశాడు మధు.
"ఏ విషయం?" అడిగాడు మధు.
"అదే వద్దంటున్నాను. ఒరేయ్.... నేను పాలిష్ట్ పొలిటీషియన్ కొడుకుని, ఎంత పాలిష్డ్ గా వుంటే పనులవుతాయో నాకు తెల్సు.
సీ మై ఫ్రెండ్! డోన్ట్ యాక్ట్..... డోన్ట్ బీ ఫూలిష్. నాతో పెట్టుకోకు స్వరం హెచ్చిస్తూ అన్నాడు రవి.
"దేని గురించో స్పష్టంగా చెప్పు....! అప్పుడు నీకేం సమాధానం చెప్పాలో తెలుస్తుంది. చెప్తాను...." చాలా కూల్ గా అన్నాడు మధు.
అదే సమయంలో రవి చూపులు క్లాస్ రూంలోంచి వరండాలోకొచ్చిన ఆడపిల్లల మీద పడ్డాయి. మిగతా ఫ్రెండ్స్ తో పాటు అన్విత నడుచుకుంటూ కారువేపు వెళుతోంది.
కళ్యాణి, విమల తదితరులు తమ తమ లూనాలమీద వెళుతున్నారు. అన్విత కారు డోరు దగ్గర నిలబడింది.
"దేని గురించో నువ్వే చెప్తావ్. నీ నోటినుంచే చెప్పిస్తాను, నువ్వు చెప్పిన మరుక్షణం...... ఈ కాలేజీ గ్రౌండ్ లోనే...... నిన్ను....." అనుకుంటూ లేచి పరుగు పరుగు క్యాంటీన్ లోంచి బయటికెళ్ళాడు రవి.
గబుక్కున సుల్తాన్ రమణ పక్కనుంచి లేచి మధు దగ్గరికొచ్చాడు.
"ఏంట్రా..... ఎనీథింగ్ సీరియస్?"
"ఎస్! రవిగాడు.... అన్విత గురించి ఎంక్వైరీ చెయ్యడానికి. దేనికెళ్ళాడు అన్విజ దగ్గరకు?"
"ఏమో!"
రవి పరుగు, పరుగున అన్విత దగ్గరకెళ్ళి మూడు నిమిషాలసేపు ఏదో మాట్లాడాడు. క్యాంటీన్ లో కూర్చున్న స్టూడెంట్స్ కి వాళ్ళేదో గొడవ పడుతున్నారన్న విషయం అర్థమవుతోంది.
అయిదు నిమిషాలు గడిచాయి.
"ఒరేయ్ మధు! నువ్వు బయటపడక తప్పదు" గుసగుసలాడుతూ చెప్పాడు సుల్తాన్.
"ఇక్కడ నేను బయట పడకూడదు. కొంచెం ఆలోచిస్తే నీకే తెలుస్తుంది" స్వాంత్వనంగా అన్నాడతను.