ఆ అమ్మాయి మారుతీ కారులో వచ్చిందనుకో..... నువ్వు స్పోర్ట్స్ కారులో రావాలి. ఆ అమ్మాయి జీన్స్ వేసుకుని వచ్చిందనుకో....నువ్వు స్టోన్ వాష్ లో రావాలి, ఆ అమ్మాయి మెడలో గోల్డ్ చెయిన్ వుందనుకో..... నీ చేతికి బ్రాస్ లెట్ వుండాలి. ఆ అమ్మాయి డిస్కో అందనుకో..... నువ్వు భుజాలెగరేసి రెమో అనాలి. లేదా 'భలే-భలే' అనాలి. ఆ అమ్మాయి తాజ్ రెసిడెన్సీ అందనుకో..... నువ్వు హాలిడే ఇన్ అనాలి.
బర్త్ డేలు , వాలెంటైన్స్ లు మీ ఇద్దర్నీ కలిపే డయాస్ లు అవుతాయి. ఆకర్షణని నువ్వు తక్కువగా అంచనా వెయ్యకు. ఖరీదైన ఆకర్షణ ఖరీదైన ప్రేమను కొంటే, ఆ ఖరీదైన ప్రేమ విలువైన పెళ్ళికి పెట్టుబడి అవుతుంది.
ఈ సొసైటీలో వీటన్నిటికీ కావాల్సిందేమిటో తెలుసా....? సోషల్ స్టేటస్.
ఫర్ ఎగ్జాంపుల్ - నువ్వు కోటీశ్వరుడివి..... ఇంకో కోటీశ్వరురాలిని ప్రేమిస్తున్నావ్.
ఆ ప్రేమను వ్యక్తం చేయడం ఇలా కాదు. ఆలోచించు" చిన్నపాటి లెక్చర్ ఇచ్చి వెళ్లిపోయాడు మైదానం నారాయణ.
అవును - నిజమే!
ప్రేమలో పోటీ పెరిగిపోయింది. భౌతికవాదం పెరిగిపోయింది. భావుకత సెకండరీ -స్టేటస్ ప్రైమరీ.....
పాజిటివ్ వేలో అన్విత తనకు దక్కాలంటే అన్వితలో తనపట్ల ఆకర్షణను మొదట పెంచాలి.
ఇంకో మగాడు ఆమె దృష్టికి రాకూడదు.
తనకు పోటీ కాకూడదు.
అందం, చలాకీతనం, సున్నితత్వాలకు -స్టేటస్ కలిపితేనే ప్రేమకు పునాది ఏర్పడుతుంది.
లెక్చరర్ నారాయణ చెప్పిన విషయాలు మధు మనసులో బలంగా నాటుకున్నాయి.
'అన్విత' నాకే దక్కుతుంది. చాలాసేపు ఆలోచించిన మీదట దృఢంగా అనుకున్నాడు. అందుకోసం ఏమైనా చెయ్యటానికి మానసికంగా సిద్ధమైపోయాడతను.
* * *
"మీ లెక్చరర్ నారాయణ చాలా ప్రాక్టికల్ గా చెప్పాడు. నేను కూడా చెప్పేది అదే. ముందు నువ్వు రూమ్ మారిపో..... ఎందుకో తెలుసా? ఎప్పుడైనా నీ రూమ్ కి అన్విత రావచ్చు.... మంచి టేస్ట్ ప్రకారం నీ రూమ్ వుండాలి. దానికి కొంత ఖర్చు పెట్టక తప్పదు. మంచి డ్రస్సులు, హీరో హోండా, అంతా కలిపి ఒక లక్ష వేసుకో" లెక్కలు వేస్తున్నాడు సుల్తాన్.
"లక్ష అవుతుందా..... అంత డబ్బు మా నాన్న ఇస్తాడంటావా?" అనుమానంగా అన్నాడు మధు.
"ఇవ్వడు- అమ్మ ఇస్తుంది" అన్నాడు సుల్తాన్.
"ఓ పిల్లని ప్రేమించడానికని లక్ష కావాలనడిగితే ఏం బావుంటుంది? ఏదో అబద్ధం ఆడాలి. మా అమ్మతో నేనెప్పుడూ అబద్ధం ఆడలేదు" మధు మాటలలో అమాయకత్వం తొంగిచూసింది.
"ప్రేమకోసం ప్రపంచంలో హత్యలు జరుగుతున్న రోజులువి..... ఆమాత్రం అబద్ధం ఆడలేవా? అబద్ధం కూడా ఒక పెట్టుబడే అనుకో."
"మార్క్స్ కేపిటల్ లో లవ్ కూడా వుందంటారా.....?" ఎందుకో సందేహం వచ్చింది మధుకి.
"ఎందుకుండదు! ఇచ్చి పుచ్చుకునే ప్రతిమారకంలోనూ పెట్టుబడి వుంటుందనేదే కదా కేపిటల్ సారంశం" సూక్ష్మంగా చెప్పాడు సుల్తాన్.
"రేపు పెదపాడు వెళతాను" చెప్పాడు మధు స్థిరంగా.
"అంటే సీరియస్ గా కార్యరంగంలోకి దిగుతున్నావన్న మాట. గుడ్.... దట్స్ ద స్పిరిట్" అన్నాడు సుల్తాన్.
సూట్ కేసుతో నడుచుకుంటూ వస్తున్న కొడుకుని చూసి, ఆశ్చర్యపోయాడు భీమవరం సోమరాజు.
"ఫోన్ చేస్తే బస్టాండ్ కి ఎద్దులబండి పంపేవాడ్నిగా" అన్నాడు ఆయన.
"ఫోన్ వచ్చిందా..... ఎప్పుడొచ్చింది? నాకు తెలీదే" అన్నాడు మధు ఆశ్చర్యపోతూ.
"మనకి ఫోన్ వచ్చిందని అబ్బాయికి ఒక కార్డు ముక్క రాయండని అంటే ఎందుకూ దండగ అని అన్నారుగా" అదే సమయంలో లోన్నించి వచ్చిన తల్లి అంది.
"నా పిసినారి నాన్న ఫోనెలా పెట్టించాడో?"
"పదే పదే ఏలూరు వెళ్ళి వస్తుంటే, నలభైయాభైదాకా అయిపోతోందట. ఒక ఫోన్ కాల్ చేస్తే రెండు రూపాయలతో పనయిపోతుందని అదాలోచించే ఫోన్ పెట్టించారు. ఖర్చయితే ఎందుకు పెట్టిస్తారు?" దీర్ఘాలు తీస్తూ, వెటకారం ధ్వనించేలా అందామె.
మధ్యగదిలో సూట్కేసు పడేసి, ఒక మూలన టేబుల్ మీదున్న ఫోన్ డబ్బావైపు చూశాడు మధు. రిసీవర్ పక్కన పెట్టేసి సరిగ్గా పెట్టాడు.
"ఆ రిసీవర్ పక్కనే వుండనీరా. అనవసరంగా డబ్బులు దండగ" అన్నాడు తండ్రి.
"డబ్బులు దండగేంటి?" అనుమానంగా ప్రశ్నించాడు మధు.
"అదేపనిగా ఫోన్ మోగుతుంటే మనకు లాస్ కాదేంటి- అందుకే పక్కన పెట్టేశాను" తన తెలివితేటలకు తానే మురిసిపోతూ అన్నాడు తండ్రి.
"ఫోన్ మోగితే లాస్ వుండదు" అసలు లాస్ ఎప్పుడొస్తుందో చెప్పాడు మధు.
"చూశావటే...... మనోడ్ని పట్నం పంపించబట్టే కదా ఇన్ని తెలివి తేటలొచ్చాయి. ఒరేయ్- ఆ నారాయణగాడు బాగున్నాడా ? నీకు తిండి అవీ పెడుతున్నాడా? ఓసారి వాడ్ని తీసుకురా. నువ్వు బాగా చదువుతున్నావ్ కదా- అలా పొలం వెళ్ళి వస్తా" వరుసగా ప్రశ్నలు వేసి, జవాబులు వినకుండా బయటకు వెళ్ళిపోయాడు తండ్రి.
భోజనం దగ్గర కూర్చున్నప్పుడు తల్లితో చెప్పాడు మధు-
"నాకో లక్ష కావాలి."
"లక్షా! ఎందుకు? ఏలూరులో పొలంకొని, వ్యవసాయం చేస్తావా?" ఆశ్చర్యంగా అడిగిందామె.
"లేదు."
"మరి దేనికి లక్ష?"
"అందరూ బైక్స్, మంచి బట్టలు, షూస్, బ్రేస్ లెట్స్, రేబాన్ కళ్ళజోళ్ళతో కాలేజీకి వస్తుంటే నాకు సిగ్గుగా వుంది."
"మీ నాన్నని అడుగు" అందామె.
"నాన్నని అడిగితే చదువు మానేయమంటాడు. ఇదంతా నా చదువుకి పెట్టుబడి. తర్వాత పెద్ద ఉద్యోగం వస్తే మన డబ్బు మనకు వడ్డీతో సహా వచ్చేస్తుందా లేదా?"
"వచ్చేస్తుందనుకో..... అయితే ఓ పని చెయ్యి- ఏలూరు రామస్వామి బంగారు షాపుందా....?"
"నాకు తెలీదు."
"ఉందిలే! నా ఒంటిమీద గొలుసు, గాజులు ఇస్తాను. ఇలాంటివే రోల్డుగోల్డువి చేయించు- ఇవి తీసుకెళ్ళు కుదవపెట్టు. పంటలు పండాక విదిపించేద్దాం."
"నాన్నకి తెలిస్తే తోలుబొమ్మలాట ఆడేస్తాడు."
"నేను చూసుకుంటానులేరా పిచ్చి వెధవ!"
మనం ఒక్కొక్కప్పుడు చిన్న చిన్న విషయాలను, సంఘటనలను పట్టించుకోం. కొడుకు అవసరాన్నిఒ తీర్చడం కోసం తల్లి వెంటనే స్పందించింది. ఆ స్పందన విలువ వెంటనే తెలీదు. ప్రపంచంలో తల్లిదండ్రులు చేసే త్యాగాలు అలాగే వుంటాయి. వారు మనకోసం చేసింది అపురూపమైన త్యాగమని మనకు ఆలస్యంగా తెలుస్తుంది. అప్పటికే మన తప్పుల్ని మనం చేసేస్తాం.
* * *
బస్టాండ్ కి వెళ్ళేదారిలో కొత్తగా కట్టిన ఒక ప్లాట్ లోకి మారాడు మధు. కాలేజీకి వెళ్ళే దారి అది దూరంగా మునిసిపల్ పార్క్ - చుట్టూ కొత్తగా మొలకెత్తుతున్న రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లు.
నిశ్శబ్దంగా వుండే, ఆహ్లాదకరమైన వాతావరణం.
మెట్లెక్కి సెకండ్ ఫ్లోర్ లోకి వస్తే చిన్న వరండా, డ్రాయింగ్ రూం దానికి అనుకుని బెడ్ రూం.... బెడ్ రూమ్ లో డబుల్ కాట బెడ్. డ్రాయింగ్ రూంలో కేన్ చెయిర్స్ రెండు, ఎదురుగా సోఫా, మధ్యలో గ్రాస్ కార్పెట్ , గోడలకు అందమయిన పెయింటింగ్ పోస్టర్స్.
"నీ మనసులో అంతర్లీనంగా ఇంత తేస్తుందని నాకు తెలీదు" మెచ్చుకున్నాడు సుల్తాన్.
"ప్రతి వ్యక్తిలోనూ ఎంతో కొంత టేస్ట్ వుంటుంది" అది కళాత్మకంగా రూపుదిద్దుకోవడానికి ఇన్ స్పిరేషన్ కారణమవుతుంది. ఆ ఇన్ స్పిరేషన్ కొంతమందికి, ప్రేమించే ప్రియురాలు కావచ్చు...... ఇష్టమైన పుస్తకం కావచ్చు....... అభిమానించే ప్రదేశం కావచ్చు. ఆరాధించే అభిమానం కావచ్చు. సంతోషమూ, దుఃఖమూ కూడా కావచ్చు.
"ప్రతి సంతోషం వెనక ఎంతో కొంత దుఃఖం వుంటుంది" అంటాడు గాలిబ్."
"నాకో జామ్ కెమెరా కావాలి" అన్నాడు మధు.
"ఎందుకు?" ప్రశ్నించాడు సుల్తాన్.
"కెమెరా ఎందుకురా..... ఫోటోలు తియ్యడానికి. చాలా అర్జంట్" అన్నాడు మధు.
"నాకు తెల్సిన ఫోటోగ్రాఫర్ ఒకడున్నాడు. వాడి దగ్గరకెళ్దాం పద" ఇద్దరూ ఫ్లాట్ లోంచి బయటకొచ్చి రోడ్డెక్కారు.
నికాన్ ఎఫ్ 4 టెలీజూమ్.....
జపాన్ కెమెరా అది- పవర్ ఫుల్ జూమ్. ఒకటిన్నర కిలోమీటర్ల దూరం నుంచి తీసినా, అద్భుతమైన క్లారిటీ దాని గొప్పతనం. మంచి యంగిల్స్ లో అన్విత ఫోటోల్ని తియ్యాలి. తన బెడ్ రూమ్ ని అన్విత ఫోటోలతో నింపెయ్యాలి.
అప్పుడు అన్వితను తన ఫ్లాట్ కి ఆహ్వానించాలి.....
ఆమె ఆ ఫోటోలను చూసుకుని మురిసిపోవాలి.
అన్వితను ఎప్పుడు, ఎక్కడ ఎలా ఫోటోలు తియ్యాలో ఆలోచిస్తున్నాడతను.
* * *
రామస్వామి జ్యూయలర్స్ షాపు కెళ్ళి, తల్లి ఇచ్చిన నగల్ని కుదవపెట్టి, డబ్బు తీసుకుని హీరోహోండా డీలర్ దగ్గరకెళ్ళి, షోరూమ్ లో రెడీగా వున్న వెహికల్ ని తీసేసుకున్నాడు.