Previous Page Next Page 
అక్షరయజ్ఞం పేజి 20

 

       వీనస్...
   
    తన పరిధిలో తనక్కావల్సిన ప్రతి విషయాన్ని క్షణాల్లో తెలుసుకోగల చలాకీ... చతురురాలు... ఆమె ఇప్పుడు తన చాంబర్ లో రివాల్వింగ్ చైర్ లో వుల్లాసంగా వూగుతూ ఫోన్ లో మాట్లాడుతోంది.
   
    "మాధుర్... నా తీపి శత్రువు... నా అందమైన శత్రువు... మై స్వీటెస్ట్ లవర్ ఎనిమీ... శిధిలమై పోయిన సంస్థను ఆసరా చేసుకుంటున్నాడా?" ఆమె అందంగా నవ్వింది ఫోన్లోనే.
   
    "గెలవాలనే- గెలిచి సాధించాలనే - మధ్యలో ఎన్ని మైలురాళ్ళున్నాయి? ప్రతి రాయి దగ్గర నేను పొంచి వుంటాను. ఎలా నెగ్గుతాడో? ఎలా దరిచేరతాడో చూస్తాను. ఈ రోజు కోసమే ఎన్నో రోజులుగా, నెలలుగా, సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నాను. నౌ ఐ యామ్ డిక్లేరింగ్ ది రియల్ వాచ్ విత్ హిమ్. థాంక్యూ ఫర్ యువర్ యూజ్ ఫుల్ ఇన్ ఫర్మేషన్..... బై...." ఆమె సుతారంగా ఫోన్ క్రెడిల్ చేసింది.
   
    అయితే వీనస్ కి బొత్తిగా తెలీని మరో యువతి ఆ వేపునుంచి మాధుర్ కి తోడుగా రంగప్రవేశం చేయబోతోందని ఇంకా తెలీదు.
   
                                                   *    *    *    *    *
   
    కేవలం ఇద్దరే వ్యక్తులు ఇప్పుడు ఆ శిధిల భవనాన్ని పరిశుభ్రం చేసే కార్యక్రమంలో మునిగి వున్నారు.
   
    కొన్ని నెలలుగా దాన్ని తమ నెలవుగా చేసుకుని వుంటున్న రకరకాల పక్షులు, గబ్బిలాలు నిశ్శబ్ద భంగం కావడంతో అశాంతిగా రెక్కలు టపటప లాడించుకుంటూ ఆందోళనగా అటూ, ఇటూ ఎగురుతున్నాయి.
   
    ఉదయం ఆరుగంటలకు పనిలోనికి దిగిన మాధుర్, భార్గవలు మధ్యాహ్నానికి బాగా అలిసిపోయారు. అయినా విశ్రమించక పోగుచేసిన చెత్తా చెదారాన్ని భార్గవ తీసుకెళ్ళి ఆవరణలో ఓ మూలగా వేస్తుంటే, మాధుర్ కనీసం కొంతకాలమైనా పనికొచ్చేలా వున్న వస్తువుల్ని సరిజేస్తున్నాడు.
   
    సరిగ్గా రెండుగంటలకు గంగాధరరావు ఇద్దరికి కేరియర్ పట్టుకొచ్చాడు.
   
    ఇద్దరూ హడావిడిగా భోజనం కానిచ్చి తిరిగి పనిలోకి వెళ్ళిపోయారు.
   
    గంగాధరరావు తిరిగి జీవం పోసుకుంటున్న తన శిధిలభవనాన్ని తృప్తిగా చూసుకుంటూ నిలబడిపోయాడు.
   
    అరాచక రాజకీయానికి, ఆధిపత్య దాహానికి బలై శిథిలమయి పోయిన జపాన్ ఆ దేశపు కొత్తతరం సరికొత్త రక్తాన్ని ఎక్కిస్తూ, జాతీయాభివృద్ది నాసికా రంద్రాల్లోకి, ఆశాభావపు ఆక్సిజన్ ప్రవేశపెడుతుంటే, వినాశనానికి ప్రతీకలైన జపాన్ పాతతరం ఎలా చూస్తుండిపోయిందో, అలాగే ఇప్పుడు గంగాధరరావు చూస్తుండిపోయాడు.
   
    కాలం కరిగిపోతూ వుంటే, ఆ భవనంలోని పాత వాసనలు ఇగిరిపోతుంటే ఓ విచిత్రమైన ఆనందోద్వేగానికి గురయి గంగాధరరావు నెమ్మదిగా ఆ ఇద్దరి దగ్గరికు వచ్చి పై కండువాతో వారి నుదుటిపై అలుముకున్న స్వేదాన్ని ప్రేమగా అద్దాడు.
   
                                   *    *    *    *    *

జె.జె. ఎంఫైర్ అంతటా ఓ విచిత్రమైన గంభీరత నెలకొంది....సిబ్బంది మెదళ్ళలో సవాలక్ష ప్రశ్నలు సుడులు తిరుగుతున్నాయి. కానీ ఒక్కదానికీ సరైన సమాధానం చెప్పుకోలేకపోతున్నాడు.
   
    హఠాత్తుగా జె.జె.వచ్చారు.
   
    ఎలా వచ్చారో- వచ్చి  ఏ నిర్ణయాలు తీసుకున్నారో తెలీదు.
   
    అదే సమయానికి ఆయన వారసురాలు, ఆయనకు అత్యంత ఇష్టురాలు మౌనిక కూడా వచ్చింది. ప్రస్తుతానికి ఆమె ఎంఫైర్ కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఆమె ఏ నిర్ణయాలు తీసుకుందో తెలీదు. అసలామె ఆఫీసులో అంతగా ఎవర్నీ కలవటం లేదు. ఎవర్నీ తన ఛాంబర్ కి పిలిపించుకోవడం లేదు.
   
    జె.జె. ఎక్కువకాలం న్యూయార్క్ మాన్ హట్టన్ ఐలెండ్ సెవెంత్ ఎవెన్యూలో వుంటుంటారు. అదే జె.జె. మేగా ఎంఫైర్ కేంద్రస్థానం. అక్కడి నుంచి ఎవరికి ఏ ఆదేశాలు వస్తున్నాయో, ఏ ఆఫీసుకి ఏ వార్తలు చేరుతున్నాయో అంతా అనూహ్యంగా వుంది.
   
    ఆ మధ్య జె.జె.ని కలిసిన ఒకరిద్దరు పెద్ద అధికారులకు ఆయన మనస్సులోని భావాలు చూచాయగా కూడా అంతుబట్టలేదు.
   
    రాజకీయవేత్తలు, వరల్డ్ రిచ్ కుటుంబాలలోని సభ్యులు సామాన్యంగా తన మనస్సులోని భావాలను ఎవరికీ తెలియనివ్వరని ఒక ప్రాచీన సామెత.
   
    వారి గుండె లోతుల్లోని భావాలు ఏ పోస్టుమార్టంలో అటాప్సీతో కూడా బయటపడనంత లోతుల్లో ఇంకిపోయి వుంటాయంటారు.
   
    ఒకప్పుడు జె.జె.కి అత్యంత ఆప్తుడు (ఇప్పటికీను) సీనియర్ మోస్ట్ రిటైర్డ్ ఉద్యోగిని అయిన రమణయ్య తరచూ మౌనిక ఛాంబర్ లోకి వెళుతున్నాడు. దానికేమిటి భాష్యం...? ఎలా దీన్ని విశ్లేషించాలి?
   
    పైకి అరవేయేండ్లే వయస్సున్నట్లు కనిపించినా జె.జె. ఎప్పుడో డెబ్బై దాటేశాడు. సాధారణంగా ప్రపంచంలో అతి భాగ్యవంతమయిన కుటుంబాలలోని పెద్దలు తమకు అరవై దాటగానే మరో వంద సంవత్సరాలు ముందుకి ఆలోచించి ఏది? ఎవరికీ? ఎలా? ఎంత? లాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటుంటారు.
   
    మరిప్పుడది జె.జె. ఎంఫైర్ లో జరిగింది?
   
    వరల్డ్ జె.జె. ఎంఫైర్ కి చెందిన ప్రతి ఆఫీసులో, ఫ్యాక్టరీలో, షోరూమ్ లో, బ్యాంక్స్ లో యివే ఆలోచనలు సుడులు తిరుగుతూ సిబ్బందిని పిచ్చెక్కిస్తున్నాయి.
   
                                                    *    *    *    *    *
   
    మాన్ హట్టన్ ఐలాండ్...
   
    సెవెంత్ ఎవెన్యూ...
   
    120 అంతస్తుల ఆ అంబర చుంబి సౌధంలో ఆఖరి అంతస్తు జె.జె. పర్సనల్ రెసిడెన్స్... ఆయా అప్పుడప్పుడు 120వ అంతస్తు టెర్రస్ మీదకు వచ్చి అక్కడ పొందికగా అమర్చిన క్రోటన్స్ మధ్య పచార్లు చేస్తూ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటాడు.
   
    జె.జె. అతడి సౌధాన్ని చూసి యూరోపియన్ బిజినెస్ టైకూన్స్ అప్పుడప్పుడు ఔరా... ఒక ఇండియన్... అని..... ఇండియన్స్ లో ఇంత తెలివితేటలు కలవారున్నారా అని ఆశ్చర్యపోతూ వుంటారు. మరెప్పుడైనా అసూయ కూడా పడుతుంటారు.
   
    ఆయన అలవర్చుకున్న క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని, గంభీరతను, సాధించిన విజయాల్ని చూసి భయపడతారు. విచిత్రమయిన గగుర్పాటుకు గురవుతారు.
   
    అప్పుడు సమయం రాత్రి ఎనిమిది గంటలు. జె.జె. నైట్ డ్రస్ లో టెర్రస్ మీదకు వచ్చాడు. సిగార్ ని పెదాల మధ్య యిరికించుకుని, కళ్ళు చికిలించుకుని ఐలాండ్ కేసి చూడసాగాడు.
   
    లక్షలాది ఎలక్ట్రిక్ లాంప్స్  పవర్ ఫుల్ హేలో జెన్ లాంప్స్ శక్తివంతమయిన కాంతికిరణాల్ని వెదజల్లుతూ అద్భుతంగా కనిపిస్తున్నాయి.
   
    సూపర్ హైవేల మీద చీమలబారుల్లా కదులుతున్న కార్ల హెడ్ లైట్స్ కాంతి ప్రవాహంలా సాగిపోతోంది.
   
    స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ... కాగడా చేతబూని స్వేచ్చా స్వాతంత్ర్యాలకు ప్రతీకగా, నిత్యం పహరా కాస్తున్నట్టుంటుంది.
   
    స్కై స్ప్రేపర్స్, వెలుగుతున్న దీపపు స్థంభాలు.
   
    ప్రపంచంలోని అరవైశాతం వ్యాపారం ఆ ఐలాండ్ నుంచే నడపబడుతుందంటే ఇప్పటికీ ప్రతి ఒక్కరికీ ఆశ్చర్యమే.
   
    అక్కడ తీసుకునే ఒక నిర్ణయం ఎక్కడో బొబ్బర్లంకలో కొబ్బరిపీచు ధరని నియంత్రించగలదన్నా ఎవరూ నమ్మలేరు.
   
    మానవుడి అభ్యున్నతికి ఆ నగరం ఒక ప్రతీక.
   
    మక్కా ఆఫ్ ది బిజినెస్ వరల్డ్...
   
    సిటీ ఆఫ్ లైట్స్... ఫన్ సిటీ..... సిన్ సిటీ... నిద్ర ఎరుగని మహానగర న్యూయార్క్- మాన్ హట్టన్... న్యూయార్క్ మహానగరానికి పరిపుష్టిని చేకూర్చే ఐదు ఐలాండ్స్ లో ప్రధానమయిన ఐలాండ్ మాన్ హట్టన్.
   
    "అయ్యా!"
   
    పచార్లు చేస్తున్న జె.జె. ఆగిపోయాడు.
   
    ఎన్నో ఏళ్లుగా జె.జె.కి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని సయితం ఎంతో శ్రద్దాభక్తులతో, భయభక్తులతో, కృతజ్ఞతా భావంతో నిర్వర్తించుకుంటూ వస్తున్న డిక్ వాషర్ మెన్ అచ్చ తెలుగులో అయ్యా అని పిలిచాడు.
   
    డెబ్బై ఏండ్ల ఆ నీగ్రో జీనియస్ అంటే జె.జె.కి కూడా మహాప్రేమ.
   
    "చెప్పు... ఐ యామ్ ఇం కాన్షస్ డిక్" అన్నాడు ఫైవ్ ని పైపైన పీలుస్తూ.
   
    "కొద్దిరోజుల క్రితం మీకు, మన బేబీకి మధ్య ఓ ముఖ్యమైన నిర్ణయం జరిగిందని చూచాయగా అర్ధం చేసుకోగలిగాను. ఇఫ్ యు డోంట్ మైండ్ సర్... కెన్ ఐ..."
   
    జె.జె. పూర్తిగా వెనక్కి తిరిగి డిక్ వైపు చూస్తూ చిన్నగా నవ్వాడు.
   
    "హమ్మయ్యా! యూ ఆర్ ఇన్ ది గుడ్ మూడ్ తరువాత చెప్పడము మర్చిపోతానేమోనని బెంగ- నాకు బుల్లిపాపను అదే మౌనికను ఓసారి చూడాలని వుంది. ఈజిట్ పాజిబుల్ సర్."

 Previous Page Next Page