Previous Page Next Page 
గోడచాటు ముద్దు పేజి 20

   

     "అదృష్టమంటే నీదేనే పిల్లా పగలూ, రాత్రి గొడవంతా మీదే" రెండో వాక్యాన్ని మయూష చెవిలో రహస్యంగా అంది మాలతి.
   
    "పో వదినా" రెండు చేతుల్తో ముఖాన్ని కప్పుకొని లోపల కెళ్ళిపోయింది మయూష.
   
    రాత్రి పదిగంటలు దాటాక ఇంటికొచ్చాడు తండ్రి పీతాంబరం.
   
    "రేపట్నుంచి పదిహేను రోజులు సెలవు పెట్టాను. ఎక్కడెక్కడో వున్న బంధువుల్ని స్వయంగా పిలవకపోతే బాగుంటుందా?
   
    "అసలు విషయం ఏవిటో చెప్పరుగదా అంతా తొందరాయే."
   
    "తొందరేవిటే తొందర మధ్యాహ్నం అమ్మాయి కల్సిందిగదా. అమ్మాయి పిల్లాడికి బాగా నచ్చేసిందట మయూషకు బంగారానికి, మంగళసూత్రాలకు, పెళ్ళి బట్టలకూ, మనింటిల్లిపాది బట్టలకూ లక్ష రూపాయలూ మిగతా పెళ్ళి ఖర్చులకు లక్ష రూపాయలూ పంపించాడు నవనీత్."
   
    ఆ మాటకు "ఆ" అంటూ నిర్ఘాంతపోయింది శారదాంబ.
   
    "ఇదేదో కలలా వుంది సుమండీ" అంది తన్మయత్వంతో.
   
    "కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆపలేం అన్నది యిందుకే.....మయూష ఏదీ రేపు దాన్ని బజారుకు తీసికెళ్ళి ఆ నగలూ నట్రా కొనేయ్. అలాగే నీకూ, కోడలిపిల్లకు...." చెప్పుకుపోతున్నాడు పీతాంబరం.
   
    "ఇంతకీ పెళ్ళి ముహూర్తం ఎప్పుడో చెప్పారుకాదు" ఆనందంగా అడిగింది శారదాంబ.
   
    "పూర్తిగా నెలరోజుల్లేదు" ఆవిడలాగే దీర్ఘం తీస్తూ అనుకరిస్తూ బాత్ రూమ్ లో కెళ్ళాడు పీతాంబరం.
   
                                         *    *    *    *
   
    మర్నాడింకా పూర్తిగా తెల్లవారలేదు.
   
    పెరట్లోంచి పక్షుల అరుపులు మెల్లగా విన్పిస్తుండగా మయూషకు మెలకువ వచ్చింది.
   
    ఇవాళ కాలేజీకి ఎర్లీగా వెళ్ళి తన పెళ్లి విషయం ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అందరికీ చెప్పాలి అని అనుకుంటూ తన రూమ్ లోంచి బయటి కొచ్చి నెమ్మదిగా డాబా ఎక్కిందామె. పక్కింటి పెరట్లో లైటు కనిపిస్తే అలవాటుగా అటువేపు చూసింది. గోడవారగా నిల్చుని కిందకు చూసింది.
   
    "హలో" ఆ పిలుపుకి ఒక్కసారి కంగారుగా నూతివేపు చూసింది మయూష.
   
    గాయత్రి మొగుడు.
   
    నీళ్ళ బకెట్ ని మోసుకొస్తూ తలపైకెత్తి మయూషవేపు చూస్తూ "గుడ్ మార్నింగ్" అని అన్నాడు గట్టిగా.
   
    అతగాడి చొరవకి ఆశ్చర్యపోయింది మయూష.
   
    వాళ్ళావిడ ఇంకా లేవలేదేమో. కాండిడేట్ కు కొంచెం ధైర్యం వచ్చినట్టుంది అనుకుందామె.
   
    "ఏయ్ అమ్మడూ ఉదయాన్నే నువ్వు ఈ గోడ దగ్గర ఎందుకు నిలబడుతున్నావో అర్ధమైపోయిందిలే. అందుకోసమేగా" లైటు వెలుతురుపడిన అతని ముఖం తెల్లగా కన్పిస్తోంది.
   
    తను అన్నీ చూస్తున్న విషయం అతనికి తెల్సిపోయిందా? వాళ్ళావిడ క్కూడా తెల్సిపోతే తన పరువుపోతుంది. ఎందుకంటే గాయత్రికి, తన వదినకూ ఇటీవల దోస్తీ కుదిరింది.
   
    తను లేనపుడు ఇంటికి రెండుసార్లు వచ్చి వెళ్ళిందట గాయత్రి.
   
    ఎందుకో మయూషకు అతనితో మాటలు కలపాలనిపించింది.
   
    "మా సీన్లు చూడగాలేంది నాతో మాట్లాడితే తప్పా" కొంటెగా నవ్వుతూ అడిగాడతను.
   
    "ఏం....సీన్లు....నేను చూసాను?"
   
    "అదే.... గోడచాటు...." ఆ మాట అతను గర్వంగా అన్నాడు. మయూష నెమ్మదిగా సిగ్గుపడింది. కంగారుగా వెనక్కి వెళ్ళబోతున్న పుడు....
   
    "ఏయ్ మయూషా ఆగు" అన్నాడతను ఒకింత బిగ్గరగా.
   
    అమ్మా కుర్రాడు చాలా ఫాస్టన్నమాట. తన పేరుని వాళ్ళావిడ చెప్పి వుంటుంది. అందుకే తన పేరు పెట్టికూడా పిలుస్తున్నాడను కుంది మయూష.
   
    తనని పేరు పెట్టి పిలవడంతో కోపం వచ్చిందామెకు.
   
    మళ్ళీ ముందుకెళ్ళి "ఏంటీ పేరు పెట్టి పిలుస్తున్నారు. మీ  ఆవిడతో చెప్పాలా?" కోపంగా అంది,
   
    "మా ఆవిడతోనా చెప్పుకోండి పిలవనా?" అంటూ "గాయత్రీ" గాయత్రీ...." అని రెండుసార్లు పిలిచాడు ఆ యువకుడు.
   
    ఆరింటికి పూర్తిగా తెల్లవారిపోయింది.
   
    లోనించి గాయత్రి వస్తుందేమోనని ఆసక్తిగా చూస్తున్న మయూషవేపు చిలిపిగా చూస్తూ అల్లరిగా నవ్వుతూ-
   
    "మా ఆవిదలేదు. పుట్టింటికెళ్ళింది పెద్దావిడ కూడా లేదు. కోడల్తో వెళ్ళింది. నేను ఖాళీ గోడదూకి ఇటు వచ్చెయ్యకూడదూ.....?" మరింతగా నవ్వుతూ అన్నాడతను.
   
    "ఆ!" నిర్ఘాంతపోయింది మయూష.

    పెళ్ళాం ఇంట్లో లేనపుడు మగాడు ఎలా హీరో అయిపోతాడో ఆ గాయత్రి భర్తను చూడగానే అర్ధమయింది ఆమెకు.
   
    "గోడదూకి రావడం ఎందుకు? మెయిన్ గేట్లోంచే వస్తాను. ఎప్పుడు రమ్మంటారు?"
   
    మయూష అలా అడిగేసరికి గాయత్రి భర్తకు పై ప్రాణాలుపైనే పోయాయి.
   
    అతనేదో సరదాగా అన్నాడు.
   
    నిజంగా వచ్చేస్తుందా. ఈ పెళ్ళాకాని పిల్లల్తో ఇదే గొడవట. సరదాకి కూడా సరసమాడకూడదు అని ఒకపక్క అనుకుంటూనే ఇంకోపక్క పిల్ల ఫాస్ట్ లా వుందే అనుకుని-
   
    "సినిమాకెళదాం వస్తావా?" అని అడిగాడు సరదాగా.
   
    "నేను రెడీ" ఉత్సాహంగా అందామె.
   
    "ఎప్పుడు? ఏ సినిమాకి?" అతనిలో ఉత్సాహం పెల్లుబికింది.
   
    మధ్యాహ్నం నాలుగ్గంటలకు సూర్యా ధియేటర్ గేట్ దగ్గర వుండండి వచ్చేస్తాను" చెప్పేసి గబగబా డాబామీంచి దిగిపోయింది మయూష.
   
    అతను ఆకాశంవేపు అలా చూస్తూ కాసేపు అచేతనుడైపోయాడు.
   
                                          *    *    *    *

    అతనితో ఎందుకలా మాట్లాడింది? తన గురించి అతనేవను కుంటాడు?
   
    స్నానం చేస్తూ ఆలోచిస్తోంది మయూష.
   
    ఒక కుర్రాడితో రహస్యంగా సినిమాకెళితే థ్రిల్ గా వుంటుందా?
   
    అందుకేనా అతనితో సినిమాకు వెళ్ళాలనుకుంది!
   
    తనని అతన్ని ఎవరయినా తెల్సినవాళ్ళు చూస్తే? త్వరలో పెళ్ళి పెట్టుకుని ఈ సరదా ఏమిటి తనకు?
   
    మరొక ఇరవై రోజుల్లో తన సరదాలన్నింటికీ దూరమైపోతుంది.
   
    భర్తతో వచ్చే సరికొత్త జీవితంలో ఇరుక్కుపోతుంది.
   
    ఒక్కసారిగా మధ్య తరగతి కుటుంబంలోంచి హైక్లాస్ లోకి వెళ్ళిపోతుందామె.
   
    కార్లు, పనివాళ్ళు, ఫ్లయిట్స్......
   
    మధ్య తరగతి జేవేఇతంలోని మాధుర్యం తనకు మరి కనిపించదా?
   
    ఇంతకీ
   
    మధ్యాహ్నం అతనితో సినిమాకి వెళ్ళాలా? వద్దా?
   
    వెళ్ళాలి వెళ్ళి భార్యలేనపుడు పరాయి ఆడదాని కోసం వెంపర్లాడడం మంచిదికాదని చెప్పాలి. చిన్న జర్క్ ఇస్తే కుర్రాడు డంగ్ అయిపోతాడు. అతన్ని ఏడిపించటం అలా వుంచి దొంగ చాటుగా ఒక వివాహితుడితో సినిమాకెళితే లభించే థ్రిల్ ఎలా వుంటుందో తెలుసుకోవాలనుకుంది.
   
                                                                          *    *    *    *

 Previous Page Next Page