నేను: నాకూ ఉన్నాయి కావలసినన్ని జేబురుమాళ్ళు.
శకుం: నాకూ ఉన్నాయి కావలసినన్ని బొమ్మలు.
నేను: అయితే నేను తక్షణం యింటికి వెళ్ళిపోతాను.
శకుంతలకు కన్నీళ్ళు తిరిగినయి.
''అమ్మా, మూర్తి బావ నా మీద కోపం వచ్చి నా జట్టు ఉండకుండా వెళ్ళిపోతున్నాడే!'' అని కళ్ళనీళ్ళు తుడుచుకొంటూ కోపంతో గిర్రున తిరిగి లోపలి హాలులోకి వెళ్ళిపోయింది. గుమ్మం దగ్గరే వాళ్ళ నాన్నగారు నుంచుని '' ఏమిటి తల్లీ! బావమీద కోపం వచ్చిందా?'' అని గబుక్కున ఎత్తి గుండె కదుముకొన్నారు. నా హృదయం ద్రవించిపోయింది. నా కంఠము బరువెక్కినది. పైకిరాని నా కంటినీరు నా కళ్ళను మండించినవి. తండ్రి మెడ కౌగిలించుకొని శకుంతల వెక్కి వెక్కి ఏడుస్తూ, ఆయన భుజములో మోమును దాచుకొన్నది.
వినాయకరావుగారు '' ఇదేమిటోయ్, ఎప్పుడూ లేనిది,ఇద్దరూ దెబ్బలాడుకొన్నారు! ఏమిటా తగాదా?'' అని ప్రశ్న వేశారు.
శకుంతల గభాలున తండ్రి మెడ చుట్టిన చేతులు వదిలి,క్రిందకు జారి నా దగ్గరకు పరుగెత్తుకొని వచ్చి,''బావా నామీద కోపము పోలేదూ?'' అని అడిగినది. '' నాకు కోపము లేదు: వేళాకోళంగా అన్నాను'' అని నవ్వాను.'' నే నివ్వాళ మీ యింట్లోనే భోజనం చేస్తాను. రా, మా యింటికి పరుగెత్తి వెళ్ళి, నా పెట్టేతీసి నీ బొమ్మల్ని ఇస్తాను. ఆ పెట్టెంతా నీ కోసం తెచ్చిందే! వెళ్ళిరామా, మామయ్యగారూ!''అని తలవాల్చే వినాయకరావు మామగారి నడిగినాను. ''పరుగెత్తుకొని వెళ్ళండి'' అని ఆయనగా రన్నారు. చేతులు చేతులు పట్టుకొని, మా హృదయాలు కలిసి మెలిసి, మా నవ్వులు పైకి పొర్లి ప్రవహించి మేము గాలిలో మా యింటికి తెలిపోతిమి.
నాకు పదమూడవ యేడు జరుగనప్పుడే, వినాయకరావుగారికి రెండవ కుమారిత జన్మించినది. శకుంతల ఒక్క నిమిషం చెల్లెలిని వదిలి ఉండేది కాదు. చెల్లెలికి హైమావతి అని వినాయకరావుగారు నామకరణం చేసినారు. హేమకుసుమదేవి అని ముద్దు పేరయినది. చెల్లెలిని వడిలో పడుకో పెట్టుకొనేది. చెల్లెలి ప్రక్కలో పడుకోనేది. చెల్లెలి మాటలే సర్వదా నాతో చెప్పేది. ఒకనాడు నావద్దకు పరుగెత్తుకొని వచ్చి ''బావా, ఎన్నాళ్ళకు నాకో చెల్లాయ్ పుట్టిందోయ్! నన్ను అక్క అని పిలుస్తుంది. నేనంటే ఆనమాలు కడుతూవుంది. ఎంత తెలివైందనుకొన్నావ్! ఆకలేస్తే కానీ ఏడవదు'' అని గబగబా చెప్పింది.
నాకు వాళ్ళ చెల్లాయి అంటే అసూయ పుట్టింది. నా మీదుండే ప్రేమంతా వాళ్ళ చెల్లాయిమీదే శకుంతల చూపిస్తుందని బాధపడ్డాను. ఏదైనా వంకతో ఆమెను ఆటలకు తీసుకుని పోయ్యేవాణ్ణి. చెల్లాయి కబుర్లు చెపుతుంటే యితర విషయాల్లోకి ఆమె మనస్సునుతిప్పుతుండేవాణ్ణి.
నేను గుంటూరు స్కూలు ఫైనలు క్లాసులో చేరడానికి వెళ్లేసరికి హేమకుసుమానికి రెండో యేడు వచ్చింది. ''మా చెల్లాయి నొకమాటేత్తుకొని మరీ వెళ్ళు బావా '' అని నన్ను బరబర ఉయ్యాల దగ్గరికి శకుంతల లాక్కొనిపోయినది. రెండు చిటికెలు వేసి 'హేం! హేం' అని పలకరించి శకుంతలను మా యింటికి లాక్కొనిపోయినాను. ఆ రోజున మే మిద్దరము ఒక నిమిషమైనా విడిచి ఉండదలచుకోలేదు. శకుంతల పాఠాలకాదినము శెలవే పుచ్చుకొన్నది.
నాతో బాటు నా పెట్టేలన్నీ సర్దినది. ''అత్తయ్యా! నేను మడికట్టుకు వచ్చి నీకు ఆవకాయలవీ సర్దిపెట్టనా'' అని అడిగింది. మా అమ్మ '' అక్కరలేదు నా బంగారుతల్లీ. నేనే సర్దుకొంటానమ్మా, నీవు బావకు సహాయం చేయి. చెల్లాయ్ ఆడుకొంటూ ఉందా? మేము దసరా వచ్చే సరికి చెల్లాయ్ నడవడం ప్రారంభిస్తుందిలే. వారానికో ఉత్తరం రాస్తుండేం'' అని మా అమ్మ అన్నది.
'' తప్పకుండా రాస్తానత్తయ్యా, బావచేత నాకో ఉత్తరం రాయిస్తుండండి. నేను నిరుడు రాసిన నాలుగింటికీ ఒక ఉత్తరానికే జవాబిచ్చాడు. యివ్వేళ వస్తుంది, రేపు వస్తుందని ఎదురు చూచి ఉత్తరం రాకపోతే నాకు ఏడ్పు కూడా వచ్చేది.''
'' ఈ పట్టు బావ ఉత్తరం రాయకపోతే బావతో మాట్లాడకు.''
'' నేను మాట్లాడుతానా! గుంటూరు వెడతాను. స్నేహితులతోనూ టెన్నిస్ ఆటలతోను మునిగిపోయి నన్ను మరచిపోతాడు.''
'' అమ్మా,శకుంతల మాటల్ని నిజమని నమ్ముతావేమో ? ఏమిటీ రాసేదని, నేను నిరుడు రాయలేదు.ఈ యేడు తప్పకుండా రాస్తాను.''
4
'' హేమా, నీవా నా డంత పాపవు, ఈనా డంత బాలికవు. ఆనాడు ఈనాటి అద్భుతమూర్తిగా ప్రత్యక్షమౌతావని నే నూహించుకోనైనా ఊహించుకోలేదు. ఇంగ్లీషు బాలికలవలె ఇట్టి స్వేచ్చామూర్తియైన విచిత్ర వ్యక్తిని కాగలవని నీవు ఉయ్యాలలో కాళ్ళూ చేతులు యెగరవేస్తూ కేరింతలాడేటప్పుడు, కలనైనా కనలేదు.
ఆ ఉదయాన్ని జరిగిన సంఘటన వలన నిశాపతి క్రుంగి కూలిపోయి '' శర్వరీభూషణరావుగారూ, అందరికన్నా నన్నే ఆమె ఎక్కువగా ప్రేమిస్తుందని అనుకొన్నాను, అపవిత్రమైన నా జీవితాన్ని పవిత్ర పథాలకు మళ్లించినాను: వివాహము వాంఛించినాను. కల్మష రహితురాలైన పవిత్రురాలైన ఆ బాలిక తన మోము అటు త్రిప్పినది. నేను బ్రతికి ఉండీ బ్రతుకని వాడనే....'' అని కంటనీరు పెట్టినాడు. నే నతనికడకు రెండంగలలో వెళ్ళి '' నిశాపతిరావుగారూ, నేను మీకో అద్భుత రహస్యాన్ని చెబుతున్నాను. హేమేకుసుమదేవి అసలు పేరు హైమావతి. ఈ బాలిక నా మరదలు. చాలాకాలం ఉత్తరాదిని సంచరించి వచ్చిన నన్నానవాలు పట్టలేదు. ఈ బాలిక చిన్నతనంలోనే, నేనూ మా అమ్మగారు ఉత్తరాదికి వెళ్ళిపోయినాము. ఆమెను వివాహము చేసుకొనుటకు మీరు మిక్కిలి అర్హులని నా నిశ్చితాభిప్రాయం. అయినా యీ బాలికలో కల్మషం లేదు. అబద్దము చెప్పలేదు. ఆమె అభిప్రాయము మార్చరానిది. నీ ఆవేదనల్ని ఉత్తమ క్షేత్ర సందర్సనంలో నెమ్మది నెమ్మదిగా మాయం చేసుకోవచ్చు. అదీకాక పరమ రహస్యము మనుష్య్డుడు గ్రహించలేడు. తన్ను ప్రేమించిన వారున్నారని అతనికీ తెలియదు. మీ హృదయం మీ ఆత్మా అర్ధం చేసుకొన్నా ఒక ఉత్తమవ్యక్తి ఉన్నది సుమండీ! ఆమె ఎవరో మీకే ముందు వ్యక్తం అవుతుంది. దాపురించిన కల్మషాన్ని దహించుకోవాలంటే మన చుట్టూ దావానలాన్ని చెలరేగ చేసుకోవాలి''అని అస్పష్టమైన మాటలతో ఆయనకు కూడా వినబడనంత మెల్లగా చెప్పినాను. నిశాపతి మరునాడు మైసూరులోని నందిపర్వతానికి ప్రయాణమైపోయినాడు.