Previous Page Next Page 
తుపాన్ పేజి 19

    త్యాగతికథ చక్కని పట్టుబైండు పుస్తకంలో వ్రాసి వుంది. ఆ పుస్తకం నిండా భారతీయ చిత్రలేఖనా విధానాన అలంకారచిత్రములు  నిండి యున్నవి.తన అక్కగారి చిన్ననాటి చిత్రములు, తన బావగారి చిత్రము,తండ్రిగారివి, తల్లిగారివి ఎన్నో ఉన్నవి. వాని అన్నింటిలో తన అక్క చిత్ర మెక్కడ రచింపబడినా  అది ఒక దేవలోకసుందరి చిత్రంలా ఉన్నది.

    తన పడకగదికి ముందున్న చదువు గదిలో హేమం సోఫాలో పడుకుని, తలకు ఎడమప్రక్కగా చిన్న రోజుచెక్కబల్ల మీద పద్మములో నుంచి వచ్చే కర్ణికలా ఉన్న విద్యుద్దీపం వెలుగున,ఆ పుస్తకం చదువుకుంటున్నది. కథ రెండు ప్రకరణాలు జరిగేసరికి హేమం ఎందుకో పడుకుని చదవలేక పోయింది. పుస్తకం హృదయాని కద్దుకుంది. ఆమె కళ్ళ వెంట జలజల నీటి బిందువులు రాలినవి. తన శ్ర్ముతిపథంలో చిన్ననాటి రోజులలో సంచరించిన దేవవీరుడై వెలిగి, దేశాలు తెగించి పారిపోయిన తన మూర్తిబావే త్యాగతా! ఆ ప్రశ్న ఆమె ఆశ్చర్యమున లీనమై ఆమె హృదయమునకు మరియు ఆందోళన తెచ్చినది. ఈ సంఘటనలోని మహా రహస్య మేమిటి? ఆమె తీవ్రాలోచనలలో మునిగినది. ఒకసారి కోపం ఒకసారి విషాదం ఆమెను ఆలమివేసినవి!

    త్యాగతీ! ఎంతవాడవయ్యా నీవు! నిన్ను బావా అని పిలవాలా? లేక త్యాగతీ అని సంబోధించాలా ? అహో! ఎంత అందంగా కథ మొదలు పెట్టాడు. బావ అనే మాటలో ఉన్న ఏదో చిత్రానుభవము ఆ కథా సౌదర్యములోనుంచి తొణికిసలాడి, వెల్లువలై ప్రవహించి వచ్చి, తన్ను ముంచివేసింది.

    ఈ రహస్య వ్యక్తతలోనుండి బయటపడిన బావ తనకు ఎక్కువ సన్నిహితుడా? లేక తన స్నేహితుడై తనకు  పెట్టని కోటయై, వివిధ రీతుల గురువైన త్యాగతీ తన హృదయంలో ఇంతలో ఏకీభవించడంలేదేమి?

    చిన్నతనాన్నుంచి తన అక్క తన కొక దేవతే. ఇప్పుడు ఆ అక్క చరిత్ర ఎంత చక్కగా వర్ణించాడు ఈ కవి! తన బావకవి. త్యాగతి శిల్పి మాత్రమని తాను విన్నది.అతని చిత్రాలూ,ఏవో తన ఇంటికి తెచ్చి చూపించిన లోహవిన్యాసాలు తక్క, ఇతరాలు తానెప్పుడూ చూడలేదు. ఆ లోహ శిల్పాలు కొత్త అందాలతో, భావాలతో నిండి, మనోహరంగా ఉన్నవి. తానీ లోహశిల్ప విధానము నేపాలులో నేర్చుకొన్నానని త్యాగతి చెప్పినాడు, తన చరిత్ర పూర్తిగా ఒక్కనాడైనా అతడు చెప్పలేదు. కారణము? పాపారావు బాబయ్య రాగానే ఏదో సంచలనము కలిగినది. ఆ కారణంగా తన కీ గ్రంథము వచ్చి వుంటుంది.

    హేమసుందరి ఆ గ్రంథము మూసివేసి హృదయమునకు మరల నొకసారి అద్దుకొని, ఇటునటు పచారుచేసినది. ఒకమారు పడకగదిలోనికి పోయి, హృదయమున నా గ్రంథ ముద్దుకొనియే  ఆమె తన మృదుల పల్యంకముపై బోర్లగిల పండుకొన్నది.

    లోకేశ్వరికి మొదటినుంచీ ఈ రహస్యము తెలుసునా? తన అక్క అత్తగారు తమ్ము చూచుటకు రెండు నెలల క్రిందట వచ్చినది. ఆవిడ తన్నెంతో ఆదరించినది. తన్ను కౌగిలించుకొన్నది. ఉన్నంతసేపూ తనదగ్గరనే తన్ను కూర్చుండబెట్టుకొన్నది. తన కామెను చూచినప్పుడెంతో జాలి కలిగినది. తన కోడలికై, దేశాలు పట్టిపోయిన  కొడుకుకై ఆమె హృదయము ప్రక్కలై యుండుననీ, ఆమె జీవచ్చవంలా ఉన్నదనీ తాను భావించి  ఆమె దగ్గరగా టాను ఒదిగిపోయినది.

    ''హేమం అచ్చంగా శకుంతల పోలిక'' అని ఆమె అన్నప్పుడు తాను ద్రవించిపోయినమాట నిజం. టాను ఇంతైనా భేదం లేకుండా అన్ని మూర్తులా అక్క పోలిక అని అందరూ అంటూ వుంటే పొందిన విచిత్ర భావాల కంటే, అక్క అత్తగా రన్నప్పుడు పొందిన ఆనందమేదో విలక్షణమై, ఇతమిత్థమని తేల్చరానిదైపోయినది.

    త్యాగతి తన బావని కల్పమూర్తికీ, తీర్ధమిత్రునికీ, నిశాపతికి సోఫీకి  తెలియనే తెలియదు. తెలిసిఉంటే తనకూ తెలిసిపోయి వుండును. లోకేశ్వరి ఇంత రహస్యము దాచుకోగలిగిందా? తల్లిదండ్రుల ఉద్దేశ మేమిటి? ఆమె హృదయంలో ఏదో ఆలోచన పుట్టింది.ఆమె మోము కెంపెక్కింది. ఆమె మోములో చిరునవ్వులు నృత్యమాడినవి. ఆమె హృదయం అమితవేగముగ పరుగులువారింది. వెంటనే ఆమెకు కోపం వచ్చింది.కోపము తల్లిదండ్రులపై, త్యాగతిపై, లోకేశ్వరిపై-అందరిపై వచ్చింది. వెంటనే తన కోపానికి తాను నవ్వుకొంది. మంచం నుండి లేచి గ్రంథము తీసికొని చదవడానికి సోఫాపై చేరింది.                      

                                               (త్యాగతి కథ తిరిగి ప్రారంభము)

   
    దసరా సెలవులకు నే నింటికి పోయినప్పుడు టెన్నిసు లాగు, షర్టు ధరించి, నీలపు వెనీషియన్ కోటు ఎడమ మోచేతి వంకలో చమత్కృతిగా వేసుకొని, కాలికి టెన్నీసు జోడు తొడుక్కొని, చేతిలో టెన్నీసు  రాకేట్టుతో మా ఊళ్ళోదిగాను. బండి దిగి మా యింటికి వెళ్ళకుండానే శకుంతల యింటికి గబగబ వెళ్ళినాను. ''బావా, యిదేమి వేషమోయ్'' అని పరుగెత్తుకొని వచ్చి అతి ఆనందంగా శకుంతల నన్ను'' బావ పెద్దవాడవుతున్నాడు. నేనూ పమిట వేసుకుంటానంటే మా అమ్మ కోప్పడుతుంది, నీవు బంతి ఆడుతున్నావా? నాకు కూడా నేర్పుతావా బావా?''

    నేను: టష్. ఆడవాళ్ళు బంతి ఆడకూడదు. ఆడవాళ్ళు ఒప్పులకుప్పా వొయ్యారి భామా, చెమ్మ చెక్క చేరెడేసి మొగ్గా ఆడుకోవాలి.

    శకుం: పోనీలేమ్మా! నాకు నేర్పకపోతే నేను నేర్చుకొంటున్న సంగీత పాటలు నీకు వినిపించనే వినిపించను. నాకు సంగీతం మాష్టరు వచ్చాడని నీకు తెలియదుకాబోలు! నీ బ్యాట్ కంటే నా వీణ చాలా  అందంగా వుంటుంది.నా   వీణ   నీకు   చుపిస్తానా? నాకు సరిగమలు వచ్చాయ్. స్వరజతులు   మూడయ్యాయ్. మా మాష్టర్ నాకు ఎంతో తొందరగా సంగీతం వస్తుందన్నాడు.

    నేను: అంతా బడాయ్! నీకు సంగీతం కూడా వస్తుందా!

    శకుం: నీకు బంతి ఆట వస్తుందా! బడాయికి బ్యాట్ తెచ్చుకొన్నావు.

    నేను: గుంటూరు వచ్చి చూడు తెలుస్తుంది.

    శకుం:నేను సంగీతం పాడుతుంటే వచ్చి విను!

    నేను: ఓ తాయిలంగారికి నేను తెచ్చిన బొమ్మలన్నీ యిస్తావా?

    శకుం: నేను తాయిలంగారికోసం కుట్టిన జేబురుమాళ్ళు యిస్తానా
   

 Previous Page Next Page