Previous Page Next Page 
తుపాన్ పేజి 21

    అడ్డురానంత వరకు మనుష్యుడు  మహాప్రతాపవంతుడు. ఇనప జోళ్ళు  తొడుక్కొని నడిచే మనుష్యుడు  నేలక్రింద నలిగిపోయే  కోమల స్వరూపాల్ని చూస్తూ వికటానందంలో  ఊగిపోతాడు. ఆ ఇనుపజోళ్ళను  కూడా ఛేదించే  కఠినత్వం అడ్డుతగిలినప్పుడు, కంటినీటితో  తనకు తానే  జాలిపడుకుంటూ కూలిపోతాడు.

    నేను స్కూలు ఫైనలు పరీక్షనించి, మా అమ్మగారితో  కొల్లిపర వచ్చిన కొద్దిరోజులకు మా మేనమామతో, మా అన్నదమ్మలవారితో  వినాయకరావుగారు మా యింటికి వచ్చి, తన పెద్దకుమార్తె  శకుంతలను నాకు వివాహము చేయుటకు సంకల్పించినామనిన్నీ, అందులకు పెద్దలందరూ అంగీకరించవలసినదనినీ కోరినారు.'' శుభమస్తు! తథాస్తు!'' అని పెద్దలందరూ ఆసీర్వదించినారు. మంచి ముహూర్తాన తాంబూలాలు పుచ్చుకొన్నారు.

    '' నేనూ, శకుంతలా భార్యాభర్తలముగా చిన్నతనాన్నుంచి  పెరిగినాము. ఆ జీవితానికి ఫలంగా నాకీవరము ప్రసాదింపబడింది, తాంబూలాలు పుచ్చుకొన్నప్పటినుంచీ, పది ఏళ్ళ  ఈడునే శకుంతల నాకళ్ళకు  కనబడదు. తుర్రున బంగారు పిచ్చుకలా పారిపోయేది. అందమైన ఆమె నవ్వుల మోము దూరంగా కనబడి మాయమయ్యేది. నాకూ ఒక విధమైన సిగ్గువచ్చినది. పదిమందిలోనూ  ఆమెతో మాట్లాడుట తప్పేమో అనుకొన్నాను. తాంబూలాలు పుచ్చుకొన్నప్పటినుంచీ నన్నొక క్రొత్త వ్యక్తిత్వమావహించినది.

    మునుపటి విధంగా కాబోవు అత్తగారింటికి తరచుగా వెళ్లడము మానినాను. మా యింట్లోనూ పెళ్ళిపనులు ప్రారంభించినారు. వివాహము వైశాఖశుద్ద దశమినాడు. ఒకనాడు మా పురోహితుని భార్య మా అమ్మగారి దగ్గరకు వ్సచ్చి ఏవో మాట్లాడుతున్నది. ఆ ప్రక్కగదిలో కలలు కంటున్న నాకీ మాటలు వినిపించాయి. '' వాళ్ళిద్దరి స్నేహము అలాంటిదండి. నేను కాపరానికి వచ్చియిప్పటికి నలభై ఏళ్ళయినది. అప్పటినుంచీ వీళ్ళిద్దరి స్నేహమెరుగుదును. క్రిష్ణార్జునుల్లా  ఉండేవారు. వినాయకరావుగారికి, మీ వారికి సంతానము కలిగినప్పటినుంచీ వియ్యం అందడమనే గాఢమైన కోర్కె మీరెరుగనే ఎరుగుదురు. ఆ కోర్కె ఇప్పటికి ఫలించినందుకు శేషాచలపతిరావుగారు  కళ్ళారా చూచి ఎంతో ఆనందించి ఉందురు. కళ్ళెంట నీళ్ళు పెట్టకండంమ్మా, శుభసంయంలో  మంచిది కాదమ్మా. ఎప్పటి దుఃఖాలప్పటికి భగవంతుని చేతిలో విడిచి సంసారము మోస్తూనే ఉండాలి.'' ఆ మాటలు వింటూనే నేను లేచి మా తండ్రిగారి ఫోటో దగ్గరకి వెళ్ళి ఆయన కళ్ళలోనికి దీర్ఘంగా పారకించి చూచినాను. నాకు కళ్ళ నీరుతిరిగింది. ఏదో భక్తీ, ఏదో సంతోషమూ నన్నావహిస్తున్నవి.

    శుభముహూర్తంలో  కన్యాదానఫలం  చూరగొంటూ వినాయకరావుగారఖండ వైభవంగా తమ ప్రథమకుమార్తె వివాహము చేసి ధన్యుణ్ణయ్యాననుకొన్నారు.

    ఠీవీగా అలంకరించుకొని  మేమిద్దరము ముత్యాలపల్లకిలో  ఊరేగినాము. మా అక్కగార్లిద్దరూ ఆడబిడ్డ లాంఛనాలకై చెరియొక వేయిరూపాయిల  మూటలు అతిగర్వముగా అందుకొన్నారు. ఆ ఐదురోజులు మా అమ్మగారు బయట కానరాలేదు. ఆమె లోలోన  ఏమి కుళ్ళికుళ్ళి  దుఃఖించినదో, పైకి మాత్రం  అతి శాంత గాంభీర్యాలతో  వచ్చిన చుట్టాలను వేయికళ్ళతో కనిపెట్టి చూచినది. శకుంతల నా ఎడమ చిటికెన వ్రేలు పట్టుకొని నాతో అగ్నిహోత్రము చుట్టూ ఏడడుగులూ వేసినది. వసిష్ఠులు మా చేత  ఏ మంత్రాన్ని పఠింపచేసారో  కానీ ఆ పవిత్ర మంత్రాలకు కూడా అతీతమైన మహామంత్ర  ప్రభావమే నన్నప్పుడొక ఋషితుల్యుని చేసింది.

    నా చిన్ననాటి యీ అందాలబాల నాతో ఈ జీవితమార్గాన్ని ఏడు కాదు ఏడు కోట్లడుగులున్నూ నడవవలసిందే! ఆమె అడుగు లతిసుకుమారము లైనవి. పవిత్రరేఖా చిహ్నతములు. ఆ అడుగునపైన ఎర్రటి పారాణి నా హృదయంలో రాగాలుదిద్దినది. అప్పట్ల నా శకుంతల దేవివలె ప్రకాశించినది.

    '' నేనూ, శ్రీనాథమూర్తి బావా వచ్చినాము, తలుపుతీయండి'' అని ఆమె అన్నపలుకులు, నన్నంతవరకూ  ఆవరించుకొని ఉన్న బాల్యత్వాన్ని క్రిందకు లాగిపారవేసినవి. నేనప్పుడు పురుషుణ్ణయి, '' నేనూ, శకుంతలా వచ్చినాము, తలుపు తీయం''డని నెమ్మదిగాను   అతి  గంభిరంగాను సుమంగళీ  సమూహము ఎదుట పలికితిని.
   
                                                5

    హేమకుసుమదేవి చేతిలోని బొమ్మలను  మేమంతా....ఈనాడు ! నిశాపతి నందిపర్వతము  వెళ్ళుటగాని, అక్కణ్నుంచి  తిరువాన్కూరు  రాష్ట్రము  వెళ్ళడముకాని కల్పమూర్తికి, తీర్ధమిత్రునికి నిజం గోచరించలేదు. సందిత కచేరీలకో, సరదాకో  వెళ్ళినాడని  వాళ్ళిద్దరూ అనుకొన్నారు. నిశాపతి వెళ్ళిన నెలరోజులకు  హేమకుసుమ  నన్ను చూచి, '' ఏమయ్యా త్యాగతి, నువ్వు నాకు ఆడయారులో కనపడినప్పటినుంచి నిన్నేక్కడో చూచినట్లే జ్ఞాపకం. మా నాన్నగారు, '' ఈయన మనకు బంధువుడు, నాకు చాలా స్నేహితుడు, ఇతనంటే నాకు కుమారుడికన్న ఎక్కువప్రేమ. నీ చిన్ననాడే  దేశాంతరాలకు  వెళ్ళిపోయినాడు. ఇన్నాళ్ళకు తిరిగి వ్సచ్చాడు'' అని అన్నాడే! నువ్వు  దేశాంతరాలకు  వెళ్ళక మునుపు యీ యింటికి  తరచుగా వచ్చేవాడవా?'' అని ప్రశ్నించింది.

    నేను : ఔను. కాని నీకు జ్ఞాపకము ఉండనంత చిన్నతనము.

    ఆమె : నేనతి  చిన్న బిడ్డనై ఉన్నప్పుడు కూడా నన్నేరుగుదువన్న మాట!

    నేను : సందేహము లేకుండా! నిన్ను ఎత్తుకున్నాను. నీకు నీళ్ళు పోశాను. నీకు బట్టలుకట్టాను. నిన్ను....

    ఈ మాటలన్నీ నే  ననడముతోనే, ఆమె అతి సిగ్గుపడి పోయి తల వాల్చుకొన్నది. ఆమె సిగ్గును  గమనించనట్టు  నటించి '' కాని, అవన్నీ  ఏనాటిమాటలో నేనిప్పుడు ముసలివాణ్ణి. నీవు తగిన వరునితో  నీ సంసార యాత్ర అతి సుఖంగా సాగించడం  చూచి, సంతోషించాలని  కాని పెట్టుకొని ఉన్నాను'' అన్నాను.

    '' నీవు ముసలివాడి  వేమిటయ్యా ? నీకున్న శక్తి కల్పమూర్తికి కూడా ఉందోలేదో. శిల్పశాస్త్రప్రకారంగా నీ ముఖము  మహా అందమైనదని చెప్పలేము. కాని ఏదో నిర్వచింపలేని రేఖాసంయోగంచేత , ఏదో భావాతీతమైన  సౌష్టవకల్పనచేత నీ మోము మహా  సౌందర్యపూరితమే అయినది. నీ ప్రపుల్ల ముఖం ముందర నేను అందమైన వనుకొన్నవారి అందరి ముఖాలు తెల తెలపోతుంటవి. నీవెప్పుడూ మూలిగ ఎరగవని నా దృఢభిప్రాయము. నీ మనసులో  కలతకాని, నీ హృదయంలో బాధకాని, నీ భావంలో వక్రత కాని   ఉంటుందని నే నూహించుకోలేను. కాని ఇంకా నీవు నాకు క్రొత్తే! నీలోని అద్భుతమైన, అతిసుందరములైన, అతిదివ్యములైన పథములు కొన్ని తెరమరుగునే ఉన్నవని నేను నిశ్చయించుకొన్నాను.
 

 Previous Page Next Page