Previous Page Next Page 
చిల్లర దేవుళ్ళు పేజి 20

    మాదిగవాళ్ళు లోతుగా తవ్వి స్తంభాలు పాతారు. కారణం వెళ్ళి వాటిని ఊపిచూచి "గట్టిగనే ఉన్నాయి" అని చేతులు దులుపుకుంటూ వచ్చి అమీను దగ్గర కూర్చున్నాడు. 'పగ్గాలు పెట్టి గట్టిక్కట్టుండి.  కదలొద్దు బద్మాషులు' అని ఆదేశించాడు కరణం.
    పోలీసులు ఆరుగుర్ని ఆరు స్తంభాలకు విరిచికట్టారు. అలా కట్టేప్పుడు ఒకని ఒంటిమీద కండువా కనిపించింది అమీనుకు. 'అబే బేవకూఫ్ (తెలివితక్కువ గాడిద) కండువెంద్కురావాన్కి, నికాల్ దేవ్ (తీసెయ్యి) అని ఆదేశిస్తే పోలీసు అదికాస్తా లాగేసి ఒంటిమీదనుంచే పగ్గంవేసి కట్టేశాడు.
    కరణం లేచి ఒక్కొక్క స్తంభం దగ్గరికి వెళ్ళి "కారణం వెంకట్రావంటే ఏమనుకున్నారు? లూటి చేయటాన్కి వస్తర్లే లూటీ. ఈ దెబ్బకు మీ అయ్య యాదికి రావాలే" అన్నాడు. అందరూ తలలు వంచుకున్నారు. కాని, ఘొఘ్లోత్ భీక్యా నేలమీద తుపుక్కున ఊసి "థూ! నీదొక మడిసి జలమా?" అన్నాడు. కారణం అమీన్ వైపు చూచాడు. అమీను పరిగెత్తుకొని వెళ్ళి "క్యాబోల్తారే" అని వాణ్ణి ఈ చెంప, ఆ చెంప శక్తి ఉన్నంతసేపు బాది "పీటో (కొట్టండి)" అని ఆదేశించి వగరుస్తూ మంచంమీద పడిపోయాడు.
    పోలీసులు కర్రల్తో బాదసాగారు లంబాడీల్ని. కొంతసేపు ఓర్చుకున్నారు కాని, తరవాత భరించలేక కేకలు పెట్టసాగారు "మల్లగిట్ల చెయ్యం సర్కార్! నీకూ సలాం పెడ్తం విడిచిపెట్టురి" అని. "అప్డే అయిపోయినాద్బే. ముంగల చూస్త తమాషా" అని గర్జించి చేత్తో సంజ్ఞచేశాడు పోలీసులకు ఆపమన్నట్లు అమీను. పోలీసులు బాదడం ఆపేశారు. దెబ్బలకు లంబాడీల చర్మం ఒక్కొక్కచోట చిట్లి రక్తం కారసాగింది. తుడుచుకోవడానికి వీల్లేకుండా చేతులు మీదినుంచే పగ్గాలువేసి కట్టేశారు. మెడదగ్గిర్నుంచి పాదాలదాకా కట్టివేశారు. కలుసైతం కదిపేట్టు లేదు. గాయాలూ, గుండె రెండూ మండుతున్నాయి. రోషం కళ్ళద్వారా నిప్పులు కురిపిస్తూంది. ఆ సమయంలో వదుల్తే పదిమందిని పొట్టపెట్టుకొని చచ్చేవారు.
    గడీలోంచి రెండు పెట్రొమాక్సులైట్లు పట్టుకొని మదారసాబ్ వచ్చి, అమీనుకు సలాంచేసి, వాటినక్కడ పెట్టి "సర్కార్! దొర సలాం చెప్పమన్నడు. దావత్ (విందు)కు ఇయ్యాళ్ళొస్తరో రేపొస్తరో అడిగి రమ్మన్నడు" అని అడిగాడు.
    అమీను సిగరెట్ పొగ ఊదుతూ "దొరకు వాలేకుంసలాం చెప్పు. ఇయ్యాల లంబాడోళ్ళ లగ్గం పట్టాలే. మస్తి బడ్ గయా. బన్యాగాడు సౌదలు పంపిండు. ఈడనే దావతైతాంది. రేపు పగటాళ్ళ దావత్కు ఆడికే వస్తమని అరజ్(విన్నవించు) చెయ్యి" అన్నాడు.
    "జీ హుజూర్! అట్లనే అరజ్ చేస్త" అని వెళ్ళిపోయాడు మదార్ సాబ్.
    నాలుగు కల్లుకుండలు గౌండ్లవాండ్లతో పట్టించుకొని వచ్చాడు ఒక మస్కూరు. "కలాలోండ్ల(గౌండ్లవాళ్ళకు)  మస్తి ఎక్కింది. హడ్డీ నరమ్ చేస్తా (ఎముకలు విరగ్గొడతా) అన్నాడు అమీను. అలా ఎందుకన్నదీ అర్ధంకాలేదు వారికి. మాట్లాడకుండా వెళ్ళి కల్లుకుండలు పెట్టి వచ్చేశారు వారు.
    "ఏంబే మాట్లాడరు. మస్తి ఎక్కిందా కండ్లకు?" అని ఉరిమాడు అమీను.
    "ఏం మాట్లాడం దొరా! మీరా సర్కారోరు. మేం బాంచోళ్ళం. పెడ్తే తింటం, కొడితే పడ్తం" అన్నాడొకడు. "అట్లను. కండ్లక్కనపడ్తలే, నలభై మంది జవాను లున్నరని! ఔర్ చార్ ఘడే లావ్ (కుండలుతే) అన్నాడు అమీను.
    "అట్లనే బాంచను"
    వెళ్ళిపోయారు గౌండ్లవారు. ఇంకో మస్కూరు గంపనిండా సారాయి సీసాలు తెప్పించి సావడిలో బెట్టించాడు. "మంచిదేనా? నీలు కలిపిన్రా?" అని అడిగాడు అమీను, సారాయి సీసాలు తెచ్చినవాణ్ణి. "నిప్పసువంటిది దొరా! నీలు కలుపుతాం సర్కారుకు?" అన్నాడు వాడు.
    ఒక బ్రాహ్మడు పొడుం పట్టుపట్టి పైనున్న చిన్న పంచతో ముక్కు తుడుచుకొని అమీను దగ్గరికి వెళ్తే సలాంచేశాడు అమీను. "పుత్రా పౌత్ర, ధన ధాన్యాభివృద్దిరస్తు" అని దీవించాడు బ్రాహ్మడు. "మేం వచ్చి ఇంతసేపైతే ఇప్పుడోస్తవులె. బాపనోండ్లకు భీ హవా (గాలి) తగిలినట్లున్నది" అన్నాడు అమీను వికటంగా. "ప్రభువులు మీరే అట్టంటే ఎట్లా? మీ ఛత్రచ్చాయన జీవిస్తున్నాం. పేదవాన్ని కదా! పొరుగూరికి సత్యనారాయణ వ్రతం చేయించటానికి పోయిన. ఊళ్ళోకి రాగానే తాము విచ్చేశారని తెలిస్తే, బియ్యం వగైరాలు యింట్లో పెట్టి దర్శనం చేసుకోవటానికి వస్తూనే ఉన్నా" అన్నాడు బాపండు.
    "ఠీక్ హై. చెయ్యి చూస్తవా?" అని చేయి చాచాడు అమీను.
    "మహాప్రభో! కండ్లు కనబడవు. చత్వారం. ఉదయమే వచ్చి చెప్పుతా జరిగింది జరిగినట్లు! శలవా?" అని అడిగాడు బాపడు.
    "అచ్చా జావ్....ఆ అచార్లు (ఊరగాయ పచ్చళ్ళు) పంపు. బాపనోండ్ల అచార్లు బలే మజాగుంటై" అన్నాడు అమీను.
    "చిత్తం. అట్లాగే" అని, "ఏదీ వదిలిపెట్టడు తురకవాడు" అని గునుసుకుంటూ వెళ్ళిపోయాడు బాపడు.
    సావిట్లో ఎవరూ లేకపోవడం చూచి "లేస్తామా?" అన్నాడు కరణం.
    "అచ్చా" అని లేచాడు అమీను.
    ఇద్దరూ లోపలికి వెళ్ళిపోయారు. కొన్ని కల్లుకుండలూ, సారాయి సీసాలు బైట పెట్టారు పోలీసులకోసం. అంతా వాటిమీద పడ్డారు.
    రాత్రి పదిగంటలదాకా తాగారంతా - కొందరు లోపల, కొందరు బయట. ఎక్కడి సీసాలు అక్కడే, ఎక్కడి కుండలక్కడే పడివున్నాయి. అమీనూ, కరణమూ బయటకువచ్చి మంచాలమీద కూలబడ్డారు సిగరెట్లు పీల్చుథూ.
    "ఇంతైతే లంబాడి దయ్యాల్నేమి అనకపోతిరి" అంటించాడు కరణం.
    "ఠైరో (ఆగు), వాండ్ల బాప్ దాదా యాదికొచ్చేటట్లు చేస్త. దేఖో(చూడు)" అని, "కౌన్ హైరే వహా (ఎవడ్రా అక్కడ)?" అన్నాడు.
    "జీ సర్కార్" అని ఒక పోలీసు వచ్చి సలాం కొట్టాడు.
    "ఔరతోంకో పకడ్ లావ్(ఆడవాళ్ళను పట్టుకురా)!"
    "అచ్చా సర్కార్" అని వెళ్ళిపోయాడు.
    అందెల మోతతో లంబాడీ ఆడవాళ్ళంతా వచ్చేశారు. అమీను ఆదేశం మేరకు సావడిముందు వారందర్నీ వరుసలా నుంచోపెట్టారు పోలీసువారు-తూలుతూనే.
    అమీన్ ఒక్కొక్కదాని దగ్గరికి వెళ్ళి "చూచినవా, నీ మొగుని గత్ ఏమైందో? కరణంమీది కురుకుతర్లే కరణం మీదికి" అంటూ సాగిపోతున్నాడు.
    "ఓహ్ బుల్బుల్! ఎంత ఖూబ్సూరత్ గున్నవే (అందంగావున్నావే). రాపోదాం" అని చేయిపట్టుకొని లాగాడు లక్ష్మిని అమీను. మరోచేత్తో లాగి లెంపకాయకొట్టింది లక్ష్మి.
    నిశ్చేష్టుడై నుంచుండిపోయాడు అమీను. మైకం సగం దిగింది.
    "మస్తీ ఎక్కింది. నా లచ్చిమిని పడ్తావుబే" అని గింజుకొని అటూ ఇటూ ఊపి స్తంభాన్ని ఊడలాక్కొని సింహంలా లంఘించాడు భీక్యా అమీను మీదికి. వెనక్కు పరిగెత్తాడు అమీను. పదిమంది పోలీసులు వాణ్ణి పట్టుకొని ఎదురుగా ఉన్న చింతచెట్టుకు కట్టేశారు.
    "కరణపోని నెత్తురు చూస్త, నా లచ్చిమిని గుంజిపిస్తాడు?" అని పండ్లు పంటపట కోరుకుతున్నాడు భీక్యా.
    అమీను ఉగ్రుడైపోయాడు. "కమ్రేమే ఫేంకో (గదిలో పారేయండి)" అని ఆదేశించాడు.
    ఇద్దరు పోలీసులు వచ్చి లక్ష్మిని పట్టుకున్నారు. విదిలించికొట్టింది. ఇద్దరూ పడిపోయారు. పారిపోవడానికి ప్రయత్నించింది. అమీను ఒక్క గంతువేసి ఆమె చేయి పట్టుకున్నాడు.
    భీక్యా వాగుతూనే వున్నాడు. కట్లు తెంచుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు.
    లక్ష్మి అమీను మీదికి చెయ్యెత్తింది. మరో చేత్తో పట్టుకున్నాడు అమీను. నలుగురు పోలీసులు వచ్చి గదిలోకి లాక్కుపోతున్నారు లక్ష్మిని. లంబాడీ ఆడవాళ్ళంతా లాక్కుపోయేవాళ్ళమీద పడిబాదారు. గిచ్చారు. కొరికారు. వెనకనుంచి పోలీసులు వాళ్ళమీద పడి లాఠీల్తో బాది లాక్కుపోయారు.
    లక్ష్మిని గదిలో పడేశారు.
    ముక్తకంఠంతో "లచ్మీ!" అని కేకవేశారు లంబాడీలంతా-మగా ఆడా అంతా.
    చింతచెట్టుకు కట్టిన భీక్యా "లచ్చిమీ!" అని ఊరు బద్దలయేంత కేకపెట్టాడు.
    అమీను గదిలో ప్రవేశించాడు. గది తలుపు వేయబోయాడు, కిందపడి ఉన్న లక్ష్మి కాళ్ళను నేలకు బలంగా ఆనించి కూర్చొని రెండు చేతుల్తోనూ ఒక తలుపును బలంగా పట్టుకొని మరొక తలుపుతో కలవనీయకుండా ఉంచడానికి ప్రయత్నిస్తూంది.
    బూటుకాలుతో లక్ష్మి చేతులమీద తన్నాడు అమీను. పట్టు విడిపోయింది. తలుపు పడిపోయింది. గడియవేశాడు అమీను.
    బయటినుంచి భీక్యా కేకలూ ఆడవారి అరుపులూ వినవస్తున్నాయి.
    "అబ్ కహా జావోగే బుల్బుల్ (ఇప్పుడెక్కడికి పోతావ్)?" అని ఎదురుగా గోడకర్చుకొని వగరుస్తున్న లక్ష్మి మీదికి ఉరికాడు అమీను. పెట్రోమాక్సు వెలుగుకు మెరిసిపోతూంది లక్ష్మి. పిచ్చివాడైపోయాడు అమీను. కామం కళ్ళల్లో బుసలుకొట్టింది. లక్ష్మి వక్షం పట్టుకోవడానికి ప్రయత్నించాడు. దెబ్బతిన్న బెబ్బులిలా రెండుచేతులతోనూ నెట్టేసింది లక్ష్మి.
    "ధన్" మని పడిపోయాడు అమీను.
    పరిగెత్తీ అమీను మీద కూర్చుంది లక్ష్మి. రెండుచేతులూ మెడమీద పెట్టి నొక్కసాగింది.
    ఉక్కిరిబిక్కిరైనాడు అమీను. పిస్తోలు తీసి లక్ష్మి గుండెలో షూట్ చేశాడు ఒకటి, రెండు, మూడు గుండ్లు కాల్చాడు.
    "కెవ్వు" మని కేకపెట్టి క్రిందపడిపోయింది లక్ష్మి. ఆవిన్ని వెనక్కు నెట్టి తలుపుతీసి బయటపడ్డాడు. అమీను- "చినాల్ కహీకి" అంటూ బట్టలు దులుపుకుంటూ.
    నిషా దిగిపోయింది. కళ్ళల్లో రక్తం తొణికిసలాడింది. కరణం కనిపిస్తే "పట్వారీ చెయ్యబట్టే ఇదంతా" అంటూంటే అమీను నోరు మూశాడు కరణం. "ఇగ్గో మీకు సలాం చేస్త. కాళ్ళు పట్టుకుంట. గీ లంబాడోల్ల ముందర పరువు తియ్యకండి" అని చెయ్యిపట్టి ఇంటివైపు తీసికెళ్ళాడు అమీన్ను - ఇద్దరు పోలీసుల్ను వెంటరమ్మని సంజ్ఞచేస్తూ.
    "యాడియె" అని పెద్దగా ఏడుస్తూ గదిలోకి ఉరికారు లంబాడీ ఆడవాళ్ళంతా. కట్టుపడ్డ మగలంబాడీలంతా పెద్దగా విలపించారు. 

 Previous Page Next Page