Previous Page Next Page 
చిల్లర దేవుళ్ళు పేజి 19

    పాణి మాట్లాడలేదు. ముసలివాడు ఘటికుడే ననుకున్నాడు.
    'గడీ ముంగలి మనుషుల్ను చూసినావా?'
    'చూశానండీ!'
    'ఎందుకు పెట్టిన్ననుకున్నవ్?'
    తెలీదన్నట్లు చూశాడు పాణి.
    'కరణం దొరక్కుంటే లంబాడోల్లు ఊరిమీద పడితే పడవచ్చు. చూచినవుగద మనుషుల్ను, ఒక్కొక్కడు పదిమందికి జవాబు చెప్పుతడు. ఆ"
    వాళ్ళను తల్చుకుంటేనే ఒళ్ళు జల్లుమంది పాణికి.
    'అవునండీ!' అన్నాడు పాణి.
    'మన్సు బాగాలేదు. ఒక పాట పాడరాదు?'
    'ఫిడేలు -' అంటుండగనే ఎంకటి తెచ్చి అందించాడు.
    'ఈరేయి నన్నొల్ల నేరవా నా రాజ!' ఎంకిపాట పాడాడు పాణి. కళ్ళుమూసుకొని తన్మయులై విన్నారు రెడ్డిగారు.
    వనజ రెండు బాష్పబిందువులు రాల్చింది. ఆమెన్లోని మార్పుకు కారణం పాణికి అర్ధంకాలేదు.
    గుమ్మం పక్కన నుంచొని నాగుపాములా తలవూపుతూ ఆమూలాగ్రం పాటవిన్న మంజరిని ఎవరూ గమనించలేదు.
                                                                       x x x
    సూర్యుడు నూమిళ్ళచాటుకు చేరాడు. ఇంకా పూర్తిగా సాయంకాలం కాలేదు. అయినా ఊళ్ళో ఎక్కడా ఎండపొడలేదు. పశువులు ఇళ్ళకు తిరిగి వచ్చేవేళ అయినప్పటికీ అవి వస్తున్న జాడ కనిపించలేదు. వీధులు నిర్మానుష్యంగా ఉన్నాయి.
    కరణం ఇంటిముందరి లంబాడీగుంపు అల్లాగే ఉంది. వాళ్ళు అక్కడే భోజనాలు చేశారు. రాత్రికి రొట్టెలు వండుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రెండు మూడు పొయ్యిలు సైతం పెట్టుకున్నారు. పచ్చని పచ్చజొన్నపిండి మూటలు విప్పుతున్నారు ఆడవారు.
    అమాంతం వారిలో ఏదో సంచలనం బయల్దేరింది. అంతా ఒక్కసారి కర్రలు పట్టుకొని లేచారు 'కరణం-కరణం' అని. కరణం వెంకట్రావు మీసం మెలేస్తూ ఠీవిగా వసారాలో అడుగుపెడ్తూ- "ఏందిర దొంగలంజ కొడుకుల్లారా! ఇంటిమీద
హమ్ లా(దాడి) చేస్తానికి వస్తారు?' అని సుమారు గర్జించినట్లు అనేశాడు.
    "నీ పానాలు తింటం" అని కర్రలతో అతనిమీదికి దూకబోయారు లంబాడీలంతా.
    వెంటనే ఆకాశంలోకి తుపాకులు పేల్చిన ధ్వని వినవచ్చింది. లంబాడీలు బెదిరి అటువైపు చూచారు. సాయుధులైన పోలీసులు కనిపించారు. కర్రలు అక్కడే పారేసి కాలికి బుద్ది చెప్పారు లంబాడీలు. పోలీసులు వెంటబడి తరిమి ఆరుగురిని పట్టుకున్నారు. అయినా నలుగురు పారిపోయారు. మరికొందరు పోలీసులు ఆడవారిని లాఠీలతోనూ తుపాకి మడమలతోనూ బాదారు. 'యాడియే' అని మొత్తుకున్నారు నేలమీద పడిపోయిన ఆడవారు. పారిపోవడానికి ప్రయత్నించిన ముగ్గురు వయసులో ఉన్న ఆడవారిని రెక్కలు పట్టి లాక్కొచ్చారు పోలీసులు బండబూతులు తిడుతూ.
    కరణపు వాకిలి యుద్ధం ముగిసింతర్వాత రణరంగంగా ఉంది. కర్రలన్నీ చెల్లాచెదురుగా పడివున్నాయి. కాళ్ళతొక్కిడికి పగిలిపోయిన ఎర్రని గుడ్డల మూటలలోంచి పచ్చని జొన్నపిండి నేలమీదపడి పడివున్నాయి. కాళ్ళతొక్కిడికి పగిలిపోయిన ఎర్రని గుడ్డల మూటలలోంచి పచ్చని జొన్నపిండి నేలమీదపడి చెదిరిపోయింది. లంబాడీల చేతుల గాజుముక్కలూ, మెళ్ళోంచి తెగి జారిపడిన పూసలు చల్లినట్లు పడి ఉన్నాయి. పారిపోతుంటే జారిపోయిన పైపంచల బారు కొంత దూరందాకా కనిపిస్తూంది. 
    కచ్చడపు బండినుంచి అమీన్ సాబ్ దిగ్గానే ఒక మస్కూరు పరిగెత్తి కోమటింట్లోంచి చాకలివానితో మంచం తెప్పించివేశాడు. బక్కగా పొడుగ్గా ఉండి ఖాఖీ యూనిఫారంలో ఉన్న అమీను, తన చేతిలోని కత్తి కర్ర మంచం మీద పెట్టి కూర్చొని 'అరే మస్కూర్, నీళ్ళ ఘడా ఏది బే?' అన్నాడు.
    'సర్కార్! ఇప్పుడే తెస్త, నీ బాంచను' అని పరిగెత్తాడు మస్కూరు. క్షణంలో కుమ్మరివానితో నాలుగు కుండలు పటించుకొని వచ్చాడు. కుమ్మరి వంగి అమీనుకు సలాం చేశాడు. కుండలు పెట్టడానికి సావట్లోకి వెళ్ళుతుంటే 'ఏంబే? మస్తీ ఎక్కిందిబే నీకి, సర్కారు వస్తరని ఎర్కైభీ ఘడాల్పెట్టవ్! చమ్డ ఒలిపిస్తా (చర్మం)' అని ఉరిమాడు అమీను.
    "మస్కూరాయ్ని రాంగనె పట్టుకొస్తనే ఉంటిని గులాపోన్ని."
    "ఆ. జవాబ్చీ చెప్పుతవ్ బే బద్మాష్!" అని లేచి కర్ర తీసుకొని బాదాడు కుమ్మరిని. దెబ్బలు తప్పుకోడానికి చేయి ఎత్తేవరకూ చేయిజారి పడిపోయి పగిలిపోయాయి కుండలు.
    "ఘడాల్ఫొడ్తావురే. బువ్వతిన్లే?" అని మరి నాలుగు బాది "బేగారోల్లకు భీ మస్తీ ఎక్కొందిరే" అని, "పో, మల్ల పొయ్యి ఘడాల్తేపో మాకీ...." అని మంచంమీద కూలబడ్డాడు అమీను. కుమ్మరి కుండలు తేవడానికి వెళ్ళిపోయాడు.
    అక్కడ నుంచొని ఉన్న మస్కూర్ను చూచాడు అమీను. "అబే తెరీమాకీ...బహన్ కీ....ఖందిళ్ళు (లాంతర్లు) లింటవ్ బే" అని కేకలు వేశాడు.
    మస్కూరువాడు పరిగెత్తాడు. వాని స్థానంలో మరొకడు వచ్చి నుంచున్నాడు. అమీను ఒక్కసారి నలువైపులా పరికించి "అబే బన్యాగాడింక (కోమటి) రాలే. పిల్వుపో బన్యాగాన్ని" అన్నాడు, చార్మినార్ సిగరెట్టు ముట్టిస్తూ. ఆ మస్కూరువానికి చెవుడు. కర్ర గద్దున క్రింద పెట్టుకొని వాడలాగే నుంచున్నాడు. మళ్ళీ అమీను "బన్యాగాన్ని పిలుస్తవా, చమ్డాతీయమంటవా?" అని గర్జించి కర్ర పట్టుకొని లేచాడు.
    అప్పుడుగాని వినిపించింది కాదు మస్కూరుకు. వాడు కర్ర పట్టుకొని పరిగెత్తాడు. ఈలోగా నాలుగు కోడిపిల్లల్ని పట్టించుకొనివచ్చాడు నిజామొద్దీను. "ఏమ్! నిజామొద్దీన్ సాబ్! ఇంత ఊర్లె నాల్గె ముర్గి (కోడి) పిల్లలున్నాయి? ఔర్ చార్ ముర్గిపిల్లలన్న కావాలె" అన్నాడు అమీను. కోడి పిల్లల్ను పట్టుకొచ్చిన మస్కూరు వాటిని చావట్లొపెట్టి, "యాన్నుంచి తెమ్మంటరుండీ?" అని అమీనుకు వినబడకుండేట్లు మెల్లగా అడిగాడు నిజామొద్దీన్ను. "మాదిగిండ్లకు పోయి ఇంటికో కోడిపిల్లను పట్టితే" అని ఆదేశించాడు నిజామొద్దీన్. "అట్లనే చెయ్రి. ఆర్యసమాజంల కలుస్తారు, లంజాకొడుకలు" అన్నాడు అమీను. ఆ మాట విని సాగిపోతున్న మస్కూర్నుచూచి 'అరె! ఇంక ఈన్నే ఉన్నావు, ఉరుకు' అని గద్దించాడు నిజామొద్దీన్. మస్కూరు ఉరికాడు. ఇంతలో కోమటి వెంకయ్యను ప్రవేశపెట్టాడు మొదటి మస్కూరు.ముడతలు పడిన శరీరం, పీక్కుపోయిన కండ్లు, గిర్దావర్ క్షౌరపు తలగల కోమటి ఆఖరు దమ్ము బీడిపీకి, క్రింద పడేసి కాలుతో నలిపి, అమీనుకు సలాంపెట్టి మంచంకోడు పట్టుకొని క్రింద కూర్చున్నాడు.
    'పిలిచిన్రట?' అడిగాడు వెంకయ్య.
    'సర్కారోరొచ్చిన ఖబర్ (వార్త) మాలూమ్ కాలే (తెలియలేదా) చాలీస్ మంది పోలీసులున్నరు. నేనున్న. పటేల్ పట్వారీలున్నరు. ఇయ్యాళ్ళ బిర్యానీ ఉడకాలే,  బిర్యాని' అన్నాడు అమీను.
    'ఉప్పు మిర్పకాయలమ్ముకునేటోడ్ని. నాతాన యాడున్నదుండి అంత సామాను? ఉన్నకాడికిస్త'
    'ఏమన్నవ్? ఉన్నకాడ్కి ఇస్తవ్ లే. ఇల్లు లూటీ చేయిస్త లూటీ, లంబాడోల్లతోటి. నీతాన లేకుంటే మంగాకే దేవ్ (తెప్పించి యివ్వు) ఏమన్న హమేషా(ఎల్లప్పుడు) వచ్చేటోళ్ళమా మేం. ఏమంటవ్?'
    'గట్టనే లేరి' అని విసుక్కుంటూ లేచాడు కోమటి. 'సర్కారువాళ్ళు వచ్చినప్పుడల్లా పట్టిందంతా పుణ్యానికివ్వాలి నేను. ఒక పైసియ్యరు గాడిదకొడుకులు. పనేమో పట్వార్ది. దొరదిచేస్తడు' అని గునుసుకుంటూ వెళ్ళిపోయాడు.
    పగ్గాల్తో కట్టి లంబాడీల్ని పట్టుకొని వచ్చారు పోలీసులు.
    'లూటీచేయటాన్కి వస్తర్భేగాంవ్ మీద్కి (ఊరుమీదకు) నిలబెట్టి బందూఖ్ (తుపాకీ) తొ కాలుస్త ఏమనుకున్నారో. ఖూబ్ ఖాకె (బాగా తిని) తన్నుల్లేక మస్తి ఎక్కిందిరా మీకీ!' అని పళ్ళు కొరికాడు అమీను.
    లంబాడీల్లో ఒకడు "గీ కరణపాయ్ని ..." అని ఏదో చెప్పబోతే "మూ బంద్ కర్ (నోరు మూయి) బాత్ భీ కర్తారే" అని ఉరిమాడు అమీను.
    చేత్తో నోరు మూసుకునాడు లంబాడీ.
    "మొగోల్లను ఖంబాలకు (స్తంభాలకు) కట్టురి. ఆడోల్లను కమ్రాల (గదిలో) పారెయ్యిరి" ఆదేశించాడు అమీను.
    "గుంజలాన్నుంచి..." అనే మస్కూరు మాట పూర్తికాకుండానే "ఇంద్లాయి ఉఖ్దాయించుకొచ్చి (పీక్కొచ్చి) పాతుబే" అని ఉరిమాడు అమీను.
    ఆ మాట విని నలుగురు మస్కూర్లు పదిమంది మాదిగల్ని తీసుకొని పరిగెత్తారు.
    కరణం సలాంచేసి ప్రవేశించాడు. "ఆవ్ పట్వారీ సాబ్! బైఠో" అని కుర్చీ చూపించాడు అమీను.
    కరణం కుర్చీలో కూర్చుంటూ ఒక చార్మినార్ సిగరెట్ తాను తీసుకొని పాకెట్ అమీనుకు అందించాడు. అమీను సిగరెట్ నోట్లో పెట్టుకోగానే కరణం నోట్లో పెట్టుకొని అగ్గిపుల్ల గీకి అమీను సిగరెట్టుకు అంటిస్తే "షుక్రియా (కృతజ్ఞత)" అన్నాడు అమీను. ఆ తరువాత తన సిగరెట్ కాల్చుకున్నాడు కరణం.
    "జనాబ్! ఇయ్యాళ్ళ ఈ ఊర్ని కాపాడిన్రు మీరు. పొద్దుననంగ వచ్చిన్రు లంబడోళ్ళు. ఇస్తే ఊళ్ళ వెయ్యి రూపాయలు వసూలుచేసి ఇయ్యి. లేకుంటే ఊళ్ళడాకా (దొమ్మి) చేస్తం అని కూచున్నరుండి. ఆ ముచ్చట ఈ ముచ్చట చెప్పి ఆగబట్టిన ఇప్పటిదాకా. ఇగ లంబడోల్లున్నరు, మీరున్నరు," అన్నాడు అమీను వైపు చూస్తూ కరణం. చివరి కొక విషపు చూపు విసిరాడు లంబాడీల వైపు.
    లంబాడీల ఒళ్ళు మండింది. అసలు విషయం దాచి తమను బందిపోటు క్రింద లెక్క కడ్తున్నారు. నోరు మెదుపుతే అమీనుకు కోపం వస్తుంది. నిజంగానే తుపాకుల్తో కాల్చి చంపినా చంపొచ్చు అనుకొని కిక్కురుమన లేదెవ్వడూ.
    కనిపించిన పందిరి స్తంభాన్నల్లా ఊడ పెరికి పట్టించుకొని వచ్చారు మస్కూర్లు. కరణం లేచి "లోతుకు తవ్వి పాతండి. ఊడపీక్కొని పారిపోతరు" అని గుంజులు పాతాల్సిన చోటు చూపించి వచ్చి కూర్చున్నాడు అమీను దగ్గర.
    "పారీపోతార్ జాన్తేనై (తెలియదా), జలాదేతూ (కాల్చిపారేస్తాం)" అని పిస్తోలు చూపించాడు అమీను లంబాడీలకు.
    నిజామోద్దీన్ సావిట్లోంచి బయటకువచ్చి "కోమటోని కాన్నుంచి ఇంక సామానురాలే. వంటెట్లయితదనుకున్నడో.  జల్దిపొయ్యి వట్టించ్కరాపో" అని ఒక మస్కూరుకు ఆదేశించి, "కుమ్మరి మల్లిగాడు పెళ్ళాంత కులుకుతాండా? బేగారి (వెట్టిపని) చేస్తడో, ఇనాం గుంజుకోవాల్నో అడిగి గుంజుకరా. వాని అమ్మ మిండడు నూర్తడా కారం మసాలాలు" అని మరొక మస్కూరుతో చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు వంటమనిషి.

 Previous Page Next Page