Previous Page Next Page 
చిల్లర దేవుళ్ళు పేజి 21

    భీక్యా గొంతు చీల్చుకొని తిడ్తున్నాడు.
    నెత్తుటి మడుగులో కొన ఊపిరితో లక్ష్మి. చుట్టూ చేరారు లంబాడీలు. "అమీను పెళ్ళాం ముండాముయ్య. కరణం నోట్లో మన్నుపడా" అని తిడ్తూ కన్నీరు కారుస్తూ ఏడవసాగారు. లక్ష్మి చెయ్యెత్తి ఆగమన్నట్లు అందరికీ సంజ్ఞ చేసింది. ఓణీలతో కళ్ళు తుడుచుకొని మౌనం వహించారు ఆమె చెప్పేది వినాలని.
    "బద్లా, బద్లా, బద్లా(పగ తీర్చుకోవాలి)" అని ప్రాణం వదిలేసింది లక్ష్మి.
    లంబాడీలంతా గొల్లుమన్నారు.
    కట్టుబడిన లంబాడీలు అశ్రుతర్పణం చేశారు.
    తోళ్ళు లేస్తున్నదీ లెక్క చేయకుండా విడిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు భీక్యా.
    ఈ గడబడకు చుట్టుపక్కల ఇళ్ళవాళ్ళేకాక, గ్రామం మొత్తం మేల్కుంది. కానీ, ఒక్కరూ తలుపు తీయలేదు, ఒక్కరూ బయటికి రాలేదు.
                                                                        x        x    x
    కరణం ఇంటికి చేరి ఇద్దరూ మంచాలమీద కూలబడ్డారు, సిగరెట్ పొగ వదుల్తూ.
    "నువ్వు శాన బద్మాష్ ఉన్నవ్, ఇంటిమీదిగ్గిట్ల లంబాడోల్లోచ్చిన్రో లేదో పోలీస్ను పిలిపిస్తవ్, ఖతల్ (చంపిస్తావ్) చేయిస్తావు" అన్నాడు అమీను.
    "నేను ఖతల్ చేయమన్నానా? నువ్వు దాన్ని గుంజినవ్. అది రానంటే ఖతల్ చేసినవు. ఖతల్ చేసింది నువ్వు-బాజాబ్తా ఖతల్ ముకదామా (ఖూనీ కేసు) నడుస్తుంది. పోలీసైతే యెక్కువనా?"
    ఖతల్ ముకద్దమా అనేవరకు గుండె జల్లుమన్నది అమీనుకు. తాను ఊరికి వచ్చింది నిజంగా ఖూనీ చేయడానిక్కాదు. కరణాన్ని అతని అధికారాన్నీ కాపాడ్డానికి. వచ్చినందుకు కేసు సరిగ్గానే ఉంది. లంబాడీల కారణం ఇంటిమీద దాడికి సిద్దంగా ఉన్నారు. తను వారిని పట్టుకున్నాడు. వాళ్ళను నాలుగు బాది బుద్ధిచెప్పి పంపిస్తే కరణం ఊరిమీద ఇంటికి రూపాయి చొప్పున వసూలు చేసి పెడ్తానన్నాడు. వదిలి పెట్టినందుకు లంబాడీల దగ్గర్నుంచీ తృణమో పణమో పణమో రాల్తుందనుకున్నాడు. కానీ అంతా ఉల్టా(తల్లక్రిందులు) అయింది. లక్ష్మిని పట్టుకున్నప్పుడు కూడా తానిలా చేయాలనుకోలేదు. అది ఊరికే సిగ్గుపడి ఊరుకుంటే తానట్టే గడబిడ చేసేవాడుకాదు. లెంపకాయ తగలడంతో పట్టుదల హెచ్చింది. అదనా (హీనులైన) లంబాడీవాళ్ళు పోలీసుల మీదపడి కొడ్తారా? దాన్ని చెరిస్తే ఎవరి తాతకు చెప్పుకుంటారో చూతాం అనుకున్నాడు. అబ్బ, ఎంత బలముంది దానికి? అలా నెట్టితే ఎంత దూరంలో పడ్డాడు తాను! క్షణం ఆలస్యం అవుతే గొంతునులిమి చంపేదే. అల్లా దయవల్ల తటాల్న పిస్తోలు జ్ఞాపకం వచ్చింది. అలాకాకుంటే ఇప్పటికి తాను చచ్చి ఉండేవాడు. అసలు తనదే తప్పు, కరణం మాటమీద ఆడవాళ్ళను పిలిపించకుండా ఉండాల్సింది. ఇప్పుడేమో దీన్ని ఖూనీ కేసు చేస్తానంటున్నాడు కరణం. వాస్తవంగా ఇది ఖూనీ కేసే. కరణాన్ని ఏదో చిక్కులో పెట్టి తప్పుకోవాల - అనుకున్నాడు.
    "ఖతల్ ముకద్దమలే ఖతల్ ముకద్దమా. ఖతల్ చేసింది నువ్వా నేనా? దాన్ని పట్టుకొని గుంజుతవ్. అది కొరకుతే నాకాన్నించి పిస్తోలు గుంజుకుని కాలుస్తవు. అమీనుసాబ్ పిస్తోల్ల కాలుస్తవులె. నీ పట్వారీ గిరి యాడుంటదో చూస్త. ముంగల గిరఫ్తార్ (అరెస్టు) చేసి హవాలాత్ల (కస్టడీలో) పెడ్త. ఊళ్ళనుంచే గవా (సాక్ష్యం) పుట్టిస్త" అని వికటంగా నవ్వాడు అమీను.
    ఆ నవ్వు సావిట్లోంచి వస్తున్న రోదన ధ్వనుల్ను చీల్చుకొని కరణం గుండెకు కన్నం వేసింది. కత్తిపోటుకు రక్తం చుక్కలేకుండా అయింది కరణం ముఖం.   
    అమీన్ గట్టివాడు. అదీకాక తురకవాడు. సర్కారుకు వాడు చెప్పిందే వేదం. నిజంగానే అరెస్టు చేసినా చేయొచ్చు. తాను జేలుకు వెళ్ళితే తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేవారు బోలెడుమంది. 'పట్వారి గేదె చస్తే ఊరంతా చూడడానికి వచ్చారు. కానీ పట్వారీ చస్తె ఒక్కడూ రాలేదు' అనే ఉర్దూ సామెత గుర్తుకు వచ్చిందతనికి. అదీకాక దొర, అమీను కలిసి సాక్ష్యం బనాయించినా బనాయించవచ్చును. వాస్తవానికి ఆ భూమి లంబాడీల పేరనేవుంది. దాన్ని నారయ్యకి అమ్మడం మోసం. దగా క్రింద మరొక కేసు తయారుకావచ్చు. తాను సర్వనాశనం అవుతాను అనుకుంటూ ఉండగానే-
    'అరే పట్వారీ జభీ భూల్గయారే (అప్పుడే మరచిపోయావురా). కలాల్ను(గౌండ్ల అతన్ని) ఖతల్ చేయించి మామిడి తోట్ల దఫన్ (పూడ్చి పెట్టలేదా) చెయ్యాలే. నా మీద్కే లేస్తవులే. చూస్కో నిన్ను దఫాయిస్తా (పూడ్చి పెట్టిస్తా).
    కరణానికి కంపరం పుచ్చుకొన్నది. ఆ కేసు అయిపోయి చాలాకాలం అవుతే కావచ్చు. బైటపడ్తే అదీ ప్రమాదమే. తాను సర్వనాశనం అయ్యే రోజు వచ్చిందనుకొని అమీను జుట్టు పట్టుకుంటే ప్రయోజనం లేదనుకున్నాడు.
    'సర్కార్! తాగిన నిషాల అన్నదానికి ఇంత చేస్తారు? మీరు  సర్కారు, నేను పట్వారీని, పిచ్చుకమీద బ్రహ్మాస్త్రం వేస్తరా. ఇప్పుడంత చెయ్యి జారిపోయింది. లంబాడీల్ను రిహా (వదిలిపెడతారా)చేస్తిరా, మీకూ ఖత్రే, నాకూ ఖత్రేనే. లంబాడీలు ఊరి మీద హమ్ల చెయ్యటానిక్కి వచ్చిన్రు. డాకా చెయ్యడానికి వచ్చిన్రు. గ్రామం హిఫాజత్ (రక్షణ) కొరకు పోలీసు వచ్చింది. బెదిరించడానికి గాలిలోకి బందూఖ్ లు కాల్చింది. లంబాడీలు వెనక్కు తిరిగి పోలీసుమీద బందూఖ్ లు కాల్చిన్రు. పోలీసు హిఫాజత్ కోసం తిరిగి బందూఖ్ లు కాల్చిన్రు. ఫరారైతున్న లంబాడీదానికి ఎదురుంగొచ్చిన గోలీ తగిలింది. లంబాడీ చచ్చింది. గట్లంటే మీకు ఖత్ర (అపాయము) లేదు, నాకు ఖత్ర లేదు. అట్లయిందని గవా (సాక్ష్యం) పుట్టిస్త. మా ఇంట్ల పాత బందూకులున్నయి. ఇస్త ముకద్దమ(కేసు) గట్టిపడ్తది. ఏమంటరు?' అన్నాడు కరణం.   
    "ఊరిమీది కెందుకొచ్చిన్రు. జమీన్ పంచాయత్ ల కద?"
    "యాది భూంపంచాయతుండి? భూమి లంబాడోల్ల పేరనే ఉన్నది."
    "నారయ్యగారు కాష్తు(సేద్యం) చేస్తున్నడు కాదు?"
    "నారయ్య దున్నుకుంటే నా ఇంటి మీదెందుకు పడాల్నుండి? కాబట్టి ఇది డాకే. జరా దొరను కట్టుకోవాలే."
    "అచ్చా! ఖరారబోలా(బాగా చెప్పావు). లాప్ (శవం) లంబాడొండ్ల హహలా (అప్పగించి) చేసి పోద్గాల లంబాడోల్ను పట్కపోత. రఖమ్ (డబ్బు) ఎంతిస్తనంటవు?"
    "ఇంటికి రూపాయి, నాలుగు నూర్లిస్త."
    "నై బస్ నై హోతా" (చాలదు)
    "నేనొక నూరిస్త."
    "హజారు (వేయి) కావాలె."
    "హజారు ఎట్ల హుజూర్! సాత్ సౌ (ఏడు వందలు) ఇస్త."
    "హజారు కంటె ఏక్ పైసా కమ్ నై"- లేచి నుంచున్నాడు అమీను.
    "అచ్చా(మంచిది)"   
                                                                       x     x     x   
    లోకానికి తెల్లవారిందే కాని ఆ ఊరికి తెల్లవారలేదు. ఒక్క తలుపూ తెరవలేదు. గడీముందుతప్ప ఊడ్చు చానిపి (కళాపి) చల్లలేదు. సావిట్లో ఏడుపులూ పెడబొబ్బలూ ఇంకా వినవస్తూనే ఉన్నాయి.
    పండ్లపుల్లలు వేసుకొని మంచాలమీద కూర్చొని ఉన్నారు అమీనూ, కరణమూ. దూరంగా అయిదారుగురు పోలీసులు తుపాకులు పట్టుకొని నుంచొని ఉన్నారు. ఒక మస్కూరు పరుగెత్తుకొని వచ్చి సలాంచేసి రొప్పుతూ 'లండాడీ తండలకు తండలే(మూకలు) వస్తాన్నయుండి' అని చెప్పాడు. కరణానికీ, అమీనుకూ కంపరం పుచ్చుకుంది. ఒకరి ముఖం ఒకరు చూచుకొన్నారు. దీర్ఘంగా ఆలోచించారిద్దరూ. అమాంతంగా ఏదో ఆలోచన వచ్చినట్లు, రెండు కచ్చడాలు అయిదు పెద్ద బండ్లు ఫౌరన్ (తక్షణమే) తయ్యారు కావాలే అని ఒక మస్కూరుకు ఆదేశించాడు కరణం. వెంట పోలీసుల్ని తీసుక వెళ్ళమన్నాడు అమీను.
    క్షణంలో రెండు కచ్చడాలు తయారైనాయి. కనిపించిన బండినల్లా పట్టుకొని అయిదు బండ్లు తయారుచేశారు మస్కూర్లు. గుంజలకు కట్టిన లంబాడీలను విప్పి, నడుముకు తాడుకట్టి బండ్లకు కట్టారు. ఒక కచ్చడంలో అమీనూ, మరొక కచ్చడంలో కరణమూ, తాయారూ కూర్చున్నారు.
    బండ్లు వరవేగంతో సాగిపోతున్నాయి. బండ్ల వెనుక త్రాళ్ళు లాగుడుకు పరిగెత్తే లంబాడీలకురాత్రంతా తిండిలేదు, చావుదెబ్బలు తగిలాయి. పైగా దుఃఖంతో కుమిలిపోతున్నారు. ఎద్దుల్తో పరిగెత్తగలరా? పరిగెత్తలేక పడిపోయినవారిని లాక్కుపోతున్నాయి కచ్చడాలు. వాటి వెనక పోలీసుల బండ్లు పరిగెత్తుతున్నాయి.
    బండ్లు బైల్దేరిపోయిన కాసేపటికి లంబాడీ ముఠాలు పెద్ద కేకలు వేస్తూ, ఏడుస్తూ గ్రామంలో ప్రవేశించాయి. సావిట్లో శవం తప్ప ఏమీ కనిపించలేదు. శవాన్ని చూచి ఆడవాళ్ళు సావిట్లో దూరి పెద్దగా ఏడ్వసాగారు. పోలీసులు పారిపోయారని తెలిసి వెంబడించారు లంబాడీలు. పరుగెత్తుతే కనుచూపు మేరలో బండ్లు కనిపించాయి. ఆ గుంపునుచూచి పోలీసులు తుపాకులు పేల్చారు.
    'హవామే గోలీ చలావ్ (గాలిలోకి పేల్చండి) . కోయీ నహిమర్నా' అని ఆదేశించాడు అమీను.
    ఒక్కసారి నలభై తుపాకులు గాలిలో పేలాయి.
    లంబాడీలు బెదిరిపోయారు.
    బండ్లు సాగిపోయాయి.
    కొంతదూరం వెళ్ళింతర్వాత లంబాడీలలో ఎవరూ బండ్లవెంట పరిగెత్తలేకపోయారు. పరిగెత్తలేక పడిపోతే బండ్లు లాక్కుపోతున్నాయి. భూమి రాపిడికి చర్మంలేచి రక్తం కారుతూంది. ఆ మంటలకు తట్టుకోలేక పరిగెత్తుదామంటే సత్తువ లేకుండా ఉంది. ఈ విధంగానైతే వారు పోలీసు స్టేషనుకు ప్రాణాలతో చేరడం అసంభవం అని తేల్చుకున్నాడు అమీను.
    'బండ్లెక్కించున్రి కొడుకుల్ని' అన్నాడు.
    బండ్లన్ని ఆగాయి. ఒక బండి ఖాళీచేసి, అందరి కాళ్ళకూ బంధాలు పెట్టి, ఆ బండిలో ఎక్కించారు పోలీసులు. ముందు కరణం బండి, తరువాత అమీను బండి, ఆ తర్వాత లంబాడీలదీ, దాని వెనుక మిగతా బళ్ళూ సాగేయి.
    బండ్లు పోలీసు స్టేషన్ చేరేవరకల్లా మధ్యాహ్నం అయింది. కాళ్ళ బంధాలు విప్పితే బండి దిగి పోలీస్ స్టేషన్ వరండాలో చేరారు లంబాడీలు. అక్కడున్న మంచినీళ్ళ కుండ చూచి ప్రాణాలు లేచి వచ్చాయి నీళ్ళడుగుతే అల్యూమినియం గ్లాసుతో నీళ్ళు తెచ్చిచ్చాడు ఒక సాయెబు. ఆ నీళ్ళు త్రాగమని నిరాకరించారు లంబాడీలు. 'అరే పానీ (నీళ్ళు) తాగకుంటే చచ్చెటట్లున్నరు. కుమార్ కు బులాకె పానీ పిలావ్(కుమ్మరినీ పిలిపించి నీళ్ళు తాగించండి) అన్నాడు అమీను. ఒక జవాను పరిగెత్తి వెళ్ళి కుమ్మరివానితో కుండలో నీళ్ళు పట్టించుకోని వచ్చాడు. ఒక్కొక్కడు కుంచెడు నీళ్ళు త్రాగాడు. ఓపిగ్గా అందరికి నీరు తెచ్చి పోశాడు కుమ్మరి. కొద్దిగా సత్తువ వచ్చింది. శరీరాలు చూసుకుంటే నెత్తుటిమయం. తలగుడ్డలు తీసి గాయాలు ఒత్తుకున్నారు. తరువాత అందరి కాళ్ళకూ, చేతులకూ బేడీలూ వేశారు పోలీసులు. వారందర్నీ పోలీసు స్టేషన్ ముందున్న వేపచెట్టుకింద కూర్చోపెట్టి వెళ్ళిపోయాడు అమీను. కరణమూ వెళ్ళిపోయాడు. అతనితోపాటే బండిలో తాయారు భద్రప్రదేశానీకి చేరుకుంది. దూరంగా వున్న పిట్టగోడమీద కూర్చొని బీడీలు పీకుతున్నారు ఇద్దరు పోలీసులు.

 Previous Page Next Page