Previous Page Next Page 
కిడ్నాప్ పేజి 19

    మరోసారి వాళ్ళను పిలిచాడు కోర్టుగుమస్తా.

    సరిగ్గా అదే సమయంలో__

    బోను నెమ్మదిగా కంపించడం ప్రారంభమైంది.

    "భూకంపం. మైలార్డు భూకంపం" ఒక లాయరు కంగారు పడుతూ అన్నాడు. ఆ మాటలకి__

    అందరూ బోనువేపు చూస్తూండగా__

    భూమి పెళ్ళలు పెళ్ళలుగా చీలిపోయి, ఒకపార బయటికొచ్చింది.

    "చెప్పానా భూకంపమని" ఒక లాయరు అన్నాడు.

    తర్వాత రెండు గునపాలు బయటికి రావడం, వాటితో పాటుకొన్ని ఇటుకలు, రాళ్ళు పైకెగరడం జరిగింది.

    "వచ్చేశాం. మేం వచ్చేశాం. అమెరికా వచ్చేశాం" అని అరుపులు, ఆ తర్వాత నల్లగా ముగ్గురు వ్యక్తులు, ఆ గొయ్యిలోంచి పైకొచ్చి ముఖానికి అంటుకున్న బురదను తుడుచుకున్నాక__

    అరుస్తూ చెప్పాడు సేతురాజు.

    "మనం అమెరికాకి వెళ్ళలే కోర్టులోకొచ్చి పడ్డాం"

    ఆ ముగ్గుర్నీ పోల్చుకున్న వెంటనే జైలరు ఆందోళనరావు ఆదిమానవుడిలా "వాళ్ళే! వాళ్ళే! నేను చెప్పిన సాధుపుంగవులు__వాళ్ళే- చూసారా వాళ్ళ సిన్సియార్టీ మాకు శ్రమ కలిగించటం ఇష్టంలేక, డైరెక్టుగా బోనులోకే ఎలా వచ్చేసారో చూసారా-"

    వాళ్ళను సి.ఐ. గుర్తించాక పి.పి. వాళ్ళని ప్రశ్నించడం ప్రారంభించారు.

    "మీరు డైరెక్ట్ గా భూమిలోంచి, బోనులోకి ఎలా రాగలిగారు?"

    "తప్పించుకోడానికి రాత్రినుంచి జైల్లోంచి సొరంగం తవ్వాం-డ్రైనేజీలో ఈదుకుంటూ ఇక్కడకొచ్చాం-"

    "జైల్లోంచి తప్పించుకోవడం, అందునా గొడ్డలి, పారలతోసహా తప్పించుకోవడం నేరం కాదా?"

    "చాలా పెద్దనేరం జడ్జీగారూ" పోతురాజు అన్నాడు.

    "మీరు జైల్లో మునుల్లా వున్నారని, మిమ్మల్ని విడుదల చేసెయ్యాలనీ జైలర్ అంటున్నాడు. దీని మీద మీ అభిప్రాయం?"

    "మొదట్నించీ మేమంటే ఆయన కిష్టంలేదు జడ్జీగారూ! నిజానికి మేం జైల్లోంచి తప్పించుకోవడమే కాకుండా, ఒక మర్డర్ కి కూడా ప్లాన్ చేశాం! ఆ మర్డర్ తర్వతహే కోర్టుకొచ్చి లొంగిపోదామనుకున్నాం."

    "ఎవర్ని మర్డర్ చెయ్యాలని ప్లాన్ చేశారు?"

    "దొరికితే హోమ్ మినిస్టర్ని, లేకపోతే ఈ జైలర్ని...." అక్కడున్న జైలర్ వేపు వేలుని చూపిస్తూ అన్నాడు.

    "ఎందుకూ?"

    "పెద్ద కక్షలూ, పగలూ ఏవీ లేవు సార్!"

    ఆ జవాబుకి నిర్ఘాంతపోయారు జడ్జిగారు.

    "ఎలా చంపాలనుకున్నారు?"

    వెంటనే జవాబు చెప్పలేదు ముగ్గురూ. ఒకరివేపు ఒకరు ఆనందంగా చూసుకుని_

    "మాకు యావజ్జీవ కారాగార శిక్ష ఖాయం!" అని జాతీయ గీతం పాదినట్టుగా బృందావనం చేశారు.

    "మరిక్కడ ఈ టీ.వీ.లోలా, బజాజ్ పాడుతా తీయగా లాగా పాడకూడదు. ఆన్సర్ టు ది పాయింట్....మీరు- ఎలా చంపాలనుకున్నారు?" అడిగారు జడ్జిగారు.

    "ఇలా...." అంటూ వీర్రాజు తన చేతిలోని గునపాన్ని జైలర్ వేపు విసిరాడు. ఒక్క ఉదుటున హాహాకారాలు చేస్తూ లేచిపోయారు అక్కడున్న అందరూ.

    సి.ఐ., పోలీసులూ అందరూ లేచి ఆ ముగ్గుర్నీ గట్టిగా పట్టుకున్నారు.

    "మీరు చాలా తెలివైన కేడీలు! మళ్ళీ జైలుకి రావడానికి ఇలాంటి ప్లాన్ వేస్తారని- నేనూహించ లేదొరేయ్!" అంటూ జుత్తు పీక్కున్నాడు ఆందోళనరావు.

    అయిదు నిమిషాల తర్వాత, హాలు సద్దుమణిగాక__

    జడ్జిగారు తీర్పు చదివారు.

    "ఫలానా, ఫలానా నేరాలు చేసిన కారణం వల్ల, ఈ ముగ్గురికీ నెలపాటు కఠిన కారాగార శిక్ష విధించడమైనది!"

    ఆ తీర్పు వినగానే_

    ముగ్గురూ విజిల్స్ వేసి, జాతర్ల లోలా డాన్సులు చేయడం ప్రారంభించారు.

    మరొక అరగంట తర్వాత, వాళ్ళు ముగ్గురూ సికింద్రాబాద్ జైలుకెళ్ళేదారిలో ఉన్నారు.
   
                              ౦    ౦    ౦

    ఇంట్లోనే సత్యనారాయణ వ్రతం చేయిద్దామని ముందురోజు రాత్రి, భర్త కాళేశ్వర ప్రసాద్ చేత ఒప్పించింది సుదేష్ణాదేవి.

    "ఇప్పుడెందుకూ?" అని మొదట ప్రశ్నించాడతను.

    "ఎందుకేమిటండీ...నా బాబుకి జ్వరం, వెంటనే తగ్గిపోతే, వ్రతం చేస్తానని మొక్కుకున్నాను."

    ఇలాంటి వ్రతాల్నీ, పూజల్నీ పెద్దగా నమ్మడు కాళేశ్వర ప్రసాద్. మరి భార్యతో వాదించ లేదతను.

    మర్నాడు ఉదయం పూజ శాస్త్రోక్తంగా ప్రారంభమై, పదకొండు గంటలకు ముగిసింది.

    ఫ్యాక్టరీలోని ఆడా, మగా అందరూ భోజనాలకు వచ్చారు.

    తేజ పేరుమీద, తేజ ఆరోగ్యం కోసం ఆ సత్యనారాయణ వ్రతం జరిగింది కాబట్టి, అందరూ తేజను అక్షింతలతో ఆశీర్వదించారు.

    "ఈ పూజతో నా బాబు మీదున్న దిష్టంతా పోయింది!" ఆ రోజు రాత్రి పడుకునేముందు భర్తతో అంది సుదేష్ణాదేవి.

    సరిగ్గా ఆ సమయంలో ఒక విషయం జ్ఞాపకానికొచ్చిందామెకు.

    "ఏమండీ! కోమలాంగీ, పిల్లలూ ఊరెళ్ళారనుకోండి....సత్తిపండు ఊళ్ళో వుండి, పూజకు రాలేదేమిటి?" ప్రశ్నించిందామె సడన్ గా.

 Previous Page Next Page