Previous Page Next Page 
రీవెంజ్ పేజి 19

    ఆ ప్రదేశం నిశ్శబ్దంగా వుంది. పెద్దగా జనసంచారం లేదు.

    మిత్రాకి అతను కనిపించడం కలో నిజమో అని అనుమానం వచ్చింది.

    ఆ రోడ్ తిన్నగా వుంది.

    అతన్ని చేరిన తరువాత ఏం మాట్లాడాలి అని అనుకొని వేగం తగ్గించాడు మిత్రా. వీలయినంత అతన్ని అనుసరించటం మంచిదనుకొని, దూరంనుంచే గమనించ సాగాడు.

    అజ్ఞాత వ్యక్తి ఓ పది నిమిషాలు నడిచి, పక్కనే చిన్న సందులా వుంది అందులో ప్రవేశించాడు.
    మిత్రా వెంబడించాడతన్ని.

    అజ్ఞాత వ్యక్తి ఆ సందులో వున్న ఓ పబ్లిక్ టెలిఫోన్ ని సమీపించాడు. చుట్టూ ఓసారి పరిశీలించి ఎవరూ గమనించటం లేదని తెలుసుకొని టెలిఫోన్ బూత్ లోకి వెళ్ళాడు.

    అక్కడ దృశ్యాన్ని చెట్టు చాటునుంచి గమనిస్తున్న మిత్రా నిర్ఘాంతపోయాడు.

    అజ్ఞాత వ్యక్తి టెలిఫోన్ బూత్ నుంచి ఓ వ్యక్తిని లాగాడు. అతన్నెక్కడో చూసాననిపించింది మిత్రాకి. కాని అతనెవరయింది గుర్తుకు రాలేదు. ఆ వ్యక్తిని చంపినట్లున్నాడు. అతని తల వాలిపోయి వుంది. చేతులని వేళాడుతున్నాయి. అజ్ఞాత వ్యక్తి అతన్ని లాక్కుంటు వెళ్ళి పక్కనే వున్న డ్రయినేజిలోకి దొర్లించాడా శవాన్ని.

    మిత్రా తట్టుకోలేక పోయాడా దృశ్యాన్ని చూసి, వేయాలనుకున్న కేక మిత్రా నోటిలోనే ఆగిపోయింది.

    మిత్రా ఇక వుండలేక పరుగుపెట్టాడు.

    అప్పటికే ఆలస్యం జరిగింది.

    ఆ అజ్ఞాత వ్యక్తి మిత్రాని చూశాడు. అతను పరుగు పెడుతు మెరుపులా రివాల్వర్ తీసి మిత్రాకేసి గురిచూసి కాల్చాడు.

    మిత్రా చెపు పక్కనుంచి జూమ్ ... అనే శబ్దంతో బుల్లెట్ దూసుకుపోయింది. ఆ వ్యక్తెవరో సామాన్య వ్యక్తిలా లేడనిపించింది.

    జీవితంలో అతి విచిత్ర పరిస్థితి మిత్రా కెదురయింది.

    అతను ఏ వ్యక్తిని చంపడానికి వెంటాడాడో ఆ వ్యక్తే ప్రస్తుతం మిత్రాని చంపడానికి వెంటాడు తున్నాడు.

    అదృష్టవశాత్తూ అతను పేల్చిన మిగతా రెండు బుల్లెట్స్ కూడా మిత్రాకి తగలలేదు.

    అంత వేగంగా ఎప్పుడూ పరిగెట్టక పోవటం వలనవిపరీతమయిన ఆయాసం వస్తుంది. దానికి తోడు హెల్ప్ చేయటానికిఎవరూ లేరు కూడా ఆ పరిసరాల్లో. హాస్టల్ వైపు పరుగెత్తటం సేఫ్ అనుకొని ఆయాస పడుతూనే హాస్టల్ సమీపానికి వచ్చి వెనక్కి చూస్తే రెయిన్ కోటు వ్యక్తి కనిపించలేదు. ఓ క్షణం ఊపిరి పీల్చుకున్నాడు. అయినా హాస్టల్ లోకి పారిపోవటం శ్రేయస్కరమనుకొని హాస్టల్ వైపు చూశాడు.

    దాదాపు అన్ని రూమ్ లు మూసే వున్నాయి ఒక రూమ్ తప్ప.

    మరో ఆలోచన లేకుండా తలుపులు తెరిచి వున్న ఆ రూమ్ లోకి వెళ్ళాడు మిత్రా.

    ఆ రూమ్ లో ఎవరూ లేరు. బహుశ టాయిలెట్ కి వెళ్ళి వుంటారనుకుని, కిటికీలోంచి బయటకు చూశాడు మిత్రా.

    దూరంగా రెయిన్ కోటు వ్యక్తి హాస్టల్ వైపుగా రావటం కనిపించింది. చేసేదిలేక ఆ రూమ్ మూసి తలుపుల సందునుంచి రెయిన్ కోటు వ్యక్తిని చూశాడు మిత్రా.

    అతను దాదాపు ఆ రూమ్ కి దగ్గరగా వచ్చి చుట్టూ చూడసాగాడు. కాస్త దూరంగా హాస్టల్ గేట్ దగ్గరకొచ్చి సెటిలయ్యాడు.

    మిత్రాకి అప్పటికిగాని అతను చేసిన తప్పేమిటో అర్ధం కాలేదు.

    అసలు అతను చేజ్ చేయటం మొదలు పెట్టగానే తన హోండా మీద పారిపోవలసింది.

    అప్పటికి పరిగెత్తి ఐదు నిమిషాలు కావొస్తున్నా మిత్రాలో ఆయాసం తగ్గలేదు. చేసేదిలేక పక్కనే కూజాలోని మంచినీళ్ళని వంచుకుని తాగాడు. ఆయాసం కొంచెం తగ్గినట్లు అనిపించింది. తరువాత ఏం చేయాలో ఆలోచించసాగాడు.

    ఇంతలో దూరంగా ఎవరో వస్తున్న చప్పుడు వినిపించింది.

    ఒకవేళ ఆ వస్తుంది ఈ రూమ్ కే అయితే నానా రభసా అవుతుంది. అనవసరంగా తన ప్రాణాల్ని తనే తీసుకున్నట్లు అవుతుంది. మిత్రా వేగంగా ఆలోచించి లేచి తలుపుకున్న గడియతీసి వెంటనే ఆ రూమ్ లో వున్న మంచం క్రిందకు దూరాడు. అదృష్టవశాత్తూ అక్కడ కొన్ని సామానులు ఉన్నాయి. రెండు లెదరు సూట్ కేసులు మరికొంత సామాను వాటిని అడ్డంగా పెట్టుకుని వచ్చేది ఎవరై వుండవచ్చని చూడసాగాడు మిత్రా.

    నిజానికి ఆ వచ్చేది ఆ రూమ్ లో వుండవలసిన వ్యక్తులే. అతనే గనుక రూమ్ తలుపులు వేసుకొని లోపల వుండి వుంటే పరిస్థితులు మరో విధంగా తలుపువుండి వుండేయి. ఇద్దరు వ్యక్తులు తలుపు తెరుచుకుని లోపలకు వచ్చారు. మిత్రాకి మంచము క్రింద నుంచి చూచాయిగా అంతా కనిపించ సాగింది.

 

 Previous Page Next Page