Previous Page Next Page 
జనపదం పేజి 19

 

    ఊళ్ళో ఎన్నికల కోలాహలం జోరుగా వుంది. పోలీసులు నిష్క్రమించారు. బలరామయ్య రంగానికి వచ్చేశాడు. వచ్చేశాడనే కాని ఊళ్ళో ఠికానా లేదతనికి. రావడం జీపులో వచ్చాడు. చేరడం గడీలో చేరాడు. కూర్చోవడం బంకుల్లో కూర్చున్నాడు. ఒక్కసారి గడీని, గడీ ముందరి స్థలాన్ని కూలిపోయిన గుర్రాల కొట్టాన్ని చూచాడు. అనేక పూర్వస్మ్ర్టుతులు అతని మెదడులో కదలాడాయి. ఆ పూర్వ వైభవం ఆ జవనాశ్వాలు , ఆ రచ్చబండ, ఆ అధికారం! ఆ దొరతనం! ఆ పెత్తనం! ఆ రాజాఠీవి ! వెంటనే మరికొన్ని దృశ్యాలు కళ్ళ ముందాడాయి. తానా ఊళ్ళో ఉండలేకపోవడం  , పారిపోవడం, మళ్ళీ రావడం కూలిన గోడలు, కూలిన ఆశలు - ఆశయాలు. గోడల మీద నినాదాలు, గుండెలో గుబగుబలు , గుబులు భయం అన్నీ చెదిరిపోయాయి.
    ఇది ప్రస్తుతం వర్తమానం కనిపిస్తుంది. పూర్వ వైభవం లేదు. మధ్యన కన్న పీడకల లేదు. తాను తన ఊరికి రాగలిగాడు. భయం లేకుండా ఉండకలుగుతున్నాడు. మళ్ళీ గుర్రాల కొట్టానికి కప్పు వేయించాలా! గుర్రాలను పెంచాలా? బంకుల్లో నిలువుటద్దం అమర్చాలా? దాస దాసీ జనాన్ని కుర్చుకోవాలా! రచ్చబండలు సరిచేయించాలా! గడీలో మరొక దొరసాన్ని తేవాలా?
    మరొక దొరసాని!
    ఆ ఆలోచన ఎందుకు వచ్చిందో తెలీదు బలరామయ్యకు. అమాంతంగా తనను తలచుకున్నాడు. మడతలు పడుతున్న శరీరాన్ని చూసుకున్నాడు. ఏదో సిగ్గనిపించింది. కాలానికి కళ్ళెం పట్టినవాడేవడు? దాన్ని వెనక్కు తిప్పిన మొనగాడేడి ? ఆడే అర్ధం చేసుకున్నట్లున్నాడు బలరామయ్య ఒక చిరునవ్వు నవ్వాడు - నవ్వుకున్నాడు.
    ఆ నవ్వులో అనేక అర్ధాలున్నాయి. ఈ అధికార పరిధి పెరిగింది. అది రాష్ట్ర వ్యాప్తమైంది. గుర్రాలెం పనికొస్తాయి? కార్లు కావాలి. ఊరును పట్టుకొని ఉంటాడా తాను! గడీ ఎందుకు? పట్నంలో బంగాళా కావాలో, రచ్చబండ లెందుకు? రచనగారులు కావాలి. అయినా తాను ఈ ఊరికి వచ్చాడు. ఎన్నికలలో తన విజయం ఈ ఊరి మీదా ఈ ప్రాంతం మీద ఆధారపడి ఉంది. అందుకే ఇక్కడ్నుంచి బిచానా ఎత్తడానికి వీల్లేదు. విడిదిగా ఉండుంది గడీ. అందుకు పెద్ద మరమత్తులు అవసరం లేదు.
    ఇంతలో రాముడు వచ్చాడు నమస్కరించాడు.
    ఎగాదిగా చూచాడు దొర - ఆశ్చర్యపోయాడు. ఎంత మారాడు మనిషి ! ఎంత మారింది కాలం!
    రాముడు ముందున్న కుర్చీలో కూర్చున్నాడు.
    దొర చిరచిరలాడాడు. కోపం సహితం వచ్చింది. దిగమింగాడు. అవును ఇప్పుడు పని అతనితోనే! అతడు స్థానికుడు. తాను లేకుండా పోయినాడు.
    ప్రతి నమస్కారం చేశాడు బలరామయ్య.
    "ఎట్లున్నది?" అడిగాడు దొర.
    "అంత బాగున్నది. అందరు మన చేతులనే ఉన్నరు'."
    "ఏమున్నారో! వీర భద్రం వస్తే?"
    "వస్తే ఏమైతది? వాడేమన్నా కూడు పెడ్తాడా? గుడ్డ పెడ్తాడా?"
    "అయితే ఏం చేయమంటావు?"
    "జర ముల్లె ఇప్పాలే. ముష్టి ముండ కొడుకులు పైసంటే పడి చస్తరు. నోట్లు కొనాలె."
    "కొందాం" కాస్త బెరుగ్గా అన్నాడు దొర. "పైసకు లెక్కపెట్టేది లేదు. ఈ ఊరు నీ జమ్మేదారి. నాకు శానపనులుంటాయి."
    "మీరు ఊ అన్నరు కద. ఇంక చూడండి నా తడఖా!"
    దొర వచ్చాడని తెలిసి యాదగిరి వచ్చాడు. అతని వెంట మరి కొందరు వచ్చారు.
    "దండం పెట్తదొర" అని చేతులు కట్టుక నుంచున్నాడు.
    "ఏం కత ?" దొర ప్రతినమస్కారం చేయకుండానే అడిగాడు.
    "ఏమున్నది దొరా? ఎప్పుడున్న కతే. గరీబోల్లు, పనిపాటలు లేక చస్తాన్రు. జీతానికి పెట్టుకుంటే కాళ్ళ కాడ పడుంటరు."
    "పెట్టుకుంట. మరి నా పని కూడా చెయ్యాలే."
    "చెయ్యకేం చేస్తం బాంచను గులాపొల్లం."
    'అట్లనా> మల్ల వీరభద్రమొచ్చి భూములిస్తం , బువ్వ పెడతా మంటే గడీ మీద పడ్తరు, నమ్మేడిదున్నాదిరామిమ్ములను?"
    "బుద్ది గడ్డి తిన్నది ఎప్పుడు తింటది? - కాల్మోక్తం వచ్చిన వాళ్ళంతా ముక్త కంఠంగా అన్నారు.
    "సరే గాని గింజలు, గిట్ట రామయ్య దగ్గర తీసుకోండి. మల్ల బుద్ది కలిగుండాలె అ=ఇన్నరా?"
    "అట్లనే కల్మోక్తం" అని వాళ్ళు వెళ్ళిపోతుండగా శేషయ్య ఎదురు పడ్డాడు. శేషయ్య దొరకు దండం పెట్టాడు.
    "ఏం శేషయ్య ఎట్లున్నది?"
    "బాగానే ఉన్నదోరా! గని పల్లెలేముంటది? పట్న మెట్లున్నదో చెప్పకపోతిరి."
    పట్నానికేం బాగానే ఉన్నది. ఎన్నిక లొచ్చి నయ్ ఎరికే గద. నన్ను మినిష్టర్ను చెయ్యాలే. మీరందరు కలిసి. ఇగ నిన్ను పట్నమ్లనే ఉంచుత."
    "ఎంత మాటంటారు దొర! మేమెంత మినిష్టర్ను చెయ్యటమెంత?" ఒక్కసారి పట్నం చుపాల్నుండి."
    "పట్నం చూపిస్తాలేగని ఓట్లు గీట్లూ ఎయించెడి దున్నదా లేదా?"
    "ఎంతమాట! ఎంత మాట! దొరలకు కాక ఓట్లు ఇంకెవరి కేస్తముండి. ఒక్కమాట చెప్పుత ఎమనుకోకుండి . జర పత్రికని ఊళ్ళకి రావాల్నుండి . పత్రికల పడెయ్యరి చాలు. అందరు చచ్చుకొంటెస్తరు."
    "అట్లనే పత్రిక తెప్పించు రాముడు" ఆదేశించాడు దొర.
    ఊరికి గోలుకొండ పత్రిక రావడం ప్రారంభమైంది.
    ఎన్నికలు దగ్గర పడడంతో ఏడుకొండల వానికి మొక్కాడు బలరామయ్య. బలరామయ్య చాలా మారిపోయాడు. ఊళ్ళోని గుళ్ళో అర్చనలు చేయించాడు. భజనల కార్యక్రమంలో తానూ పాల్గొంటున్నాడు. తీరిక ఉన్నప్పుడు పండితులతో పురాణాలు చెప్పిస్తున్నాడు - పరమాత్ముని లీలలు గురించి , శివుని అజ్ఞా లేనిదే చీమ సైతం కదలదనీ పుట్టెడు అముదంలో పోర్లినా అంటెంత అంటుతుందనీ బోధిస్తున్నాడు. ఊళ్ళో ఒక కొత్త వాతావరణం ఏర్పడింది. పేకాటలు తాగుళ్ళు , ఊరు పురోగమిస్తుంది. నాగరికత నాట్యం చేస్తున్నది.

 Previous Page Next Page