Previous Page Next Page 
యమదూత పేజి 19

 

    పట్టు తప్పించుకోగానే, ప్రచండ వేగంతో ఈదుతూ ఒడ్డు చేరుకుని, పరుగెత్తి దినకర్ ఎత్తుకొచ్చిన మోటార్ సైకిల్ మీద ఎక్కాడు ఆ వ్యక్తి. స్టార్టు చేసి ముందుకి పోనిచ్చాడు.

 

    అతన్ని అందుకోకపోతే తనకి జరిగే నష్టం ఎంతటిదో తెలుసుగనుక, బాధని లెక్కచేయకుండా తనుకూడా త్వరత్వరగా ఒడ్డుకి చేరుకున్నాడు దినకర్.
    
    అప్పటికే రెండు మూడు వందల గజాల దూరం వెళ్ళిపోయాడా వ్యక్తి దినకర్ మోటార్ సైకిల్ మీద! షిట్!.... అనుకున్నాడు దినకర్.
    
    ఇంతలో...
    
    దిక్కులు పిక్కటిల్లే శబ్దం వినబడింది!
    
    వెంటనే పెద్దమంటతో పేలిపోయింది మోటార్ సైకిల్!
    
    నిర్జీవమయిన చలనంతో ఆకాశంలోకి ఎగిరి, తర్వాత ముక్కలు ముక్కలుగా కిందపడింది ఆ వ్యక్తి శవం!

 

    దిగ్భ్రమ పొంది చూస్తూ ఉండిపోయాడు దినకర్! అతనికి అనిపించింది.
    
    తనని చంపడానికే ఆ బాంబుని మోటార్ సైకిల్ బాక్సులో పెట్టి ఉంటారా ఎవరన్నా?
    
    అది నిజమే అయితే బాంబుని ఎవరు పెట్టి వుంటారు? ఎందుకు?
    
    అసలు తనెవరు? ఒక స్త్రీని చంపినా హంతకుడా?
    
    కాకపోతే ఏమీ ఎరగని మంచివాడా?
    
    ఆ సంగతి చెప్పగలిగిన ఒక వ్యక్తి అతి దారుణమయిన చావు చచ్చాడా?
    
    వాడు తనని చూసి ఎందుకు అంతగా భయపడిపోయాడు?
    
    ప్రశ్నలు! ప్రశ్నలు! ప్రశ్నలు!
    
    గాడ్! ఓ గాడ్!
    
    అప్పుడు కనబడ్డాడు అతనికి! పట్టువదలని విక్రమార్కుడిలా తనని తరుముకు వస్తున్న ఇన్ స్పెక్టర్ జలీల్!
    
    రోడ్డుకి ఇవతలవైపు తను వుంటే, రోడ్డుకి అవతలివైపు ఇన్ స్పెక్టర్ జలీల్ వున్నాడు.
    
    తనని తరుముతూ ఒకవైపు పోలీసులు!
    
    తనని చంపడానికి కృతనిశ్చయంతో వున్న హంతకులు ఒకవైపు.
    
    మధ్యలో -
    
    తనెవరో తనకే తెలియని తను!
    
    ఓ టెన్షన్ తో తనకున్న మతికూడా పోతుందేమో అనిపించింది దినకర్ కి.
    
    దినకర్ జలీల్ ని చూసిన క్షణంలోనే, ఇన్స్ పెక్టర్ జలీల్ కూడా దినకర్ ని చూశాడు.
    
    అదే సమయంలో వేగంగా వస్తున్న ఒక ఎర్ర ఆర్టీసీ డిస్ట్రిక్టు బస్సు ఆ స్పాట్ ని సమీపించింది. రోడ్డుమీద ఉన్న పెద్ద గుంటని తప్పించడానికి బస్సుని సడెన్ బ్రేకు వేసి, స్టీరింగు గబగబా పక్కకు తిప్పాడు డ్రయివర్. బస్సు స్పీడు తగ్గిన ఆ కొద్ది క్షణాలలో, దినకర్ బస్సువైపు పరిగెత్తడం కనబడింది జలీల్ కి.
    
    మళ్ళీ వేగం పుంజుకుని వెళ్ళిపోయింది ఆర్టీసీ బస్సు.
    
    బస్సుతోబాటు మాయమైపోయాడు దినకర్!
    
    తనూ, డాక్టర్ నిశాంత, దినకర్ కలిసి రైలు స్టేషన్ కెళ్ళినప్పుడు రైలుకింద పడిన దినకర్ చావు తప్పించుకుని ఇలాగే చాకచక్యంగా కదులుతున్న ఇంకో రైలు ఎక్కేసి వెళ్ళిపోవడం గుర్తుకొచ్చింది ఇన్స్ పెక్టర్ జలీల్ కి.
    
    ఇప్పుడు కూడా దినకర్ మళ్ళీ అదే ట్రిక్కు ప్లే చేశాడని గ్రహించగానే కోపంతో జేవురించింది ఇన్ స్పెక్టర్ జలీల్ మొహం. వెంటనే ఏం చెయ్యాలో స్ఫురించక అటూ ఇటూ చూశాడు. అటువైపే వస్తున్న ఒక పోలీసు జీపు అతనికి కనబడింది. రిలీఫ్ గా ఫీలయ్యాడు.
    
    వెంటనే రోడ్డు మధ్యకి వచ్చేసి జీపుని ఆపమన్నట్లు రెండు చేతులూ ఊపడం మొదలెట్టాడు.
    
    జీపు స్పీడు తగ్గింది కానీ జీపులో వున్న పోలీసులు ఇన్ స్పెక్టర్ జలీల్ ని గుర్తుపట్టగానే, "మనకెందుకీ లంపటం!" అనుకున్నట్లు మళ్ళీ స్పీడు పెంచారు. ఆగకుండానే వెళ్ళిపోయింది జీపు. ఇన్ స్పెక్టర్ జలీల్ డిపార్టుమెంటులో ఇమడ లేకపోతున్న మనిషి అని అందరికీ తెలుసు. అతని వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం అంటే కొరివితో తలగోక్కోవడమే అవుతుందని వాళ్ళలో చాలామందికి అనుభవం.
    
    దూరమై వెళ్ళిపోతున్న జీపువైపు అసహనంగా చూశాడు జలీల్. డిపార్టు మెంట్ లో తనకున్న పరపతి ఏమిటో అతనికి చెంపమీద కొట్టి చెప్పనంత ఇదిగా అర్ధం అయింది. తాత్కాలికంగా నిస్పృహ ఆవహించింది అతన్ని. కానీ ప్రయత్నపూర్వకంగా మనసుని అదుపులో పెట్టుకుని, ఇంకేమయినా వాహనాలు అటువైపు వస్తాయేమోనని చూశాడు. అతను అనుకున్నట్లే అల్లంత దూరాన కనబడింది ఒక తెల్ల మెర్సిడెన్ బెంజ్ కారు. రాజహంసలా జారుతూ వస్తోంది అంది.
    
    అది తనని సమీపించగానే చెయ్యి చూపించి ఆపాడు ఇన్స్ పెక్టర్ జలీల్.
    
    కారులో వున్నాడు బిజినెస్ మాగ్నెట్ మహాజన్.
    
    విండోస్ కి వున్న నల్లటి అద్దాలు కిందికి దింపి, ఇన్ స్పెక్టర్ జలీల్ వైపు చిరునవ్వుతో ఆదరంగా చూశాడు.
    
    "వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ ఇన్ స్పెక్టర్!"
    
    "ముందు వెళ్ళిన బస్సులో ఒక క్రిమినల్ వున్నాడు సర్! అతన్ని ఎలాగైనా పట్టుకోవాలి!" అన్నాడు జలీల్ దృఢంగా.

 

    నవ్వాడు బిజినెస్ మాగ్నెట్ మహాజన్.
    
    "మోస్ట్ సిన్సియర్ ఆఫీసర్! అవునా?"
    
    పొగడ్తలు ఇష్టం లేనట్లు ఇబ్బందిగా చిరునవ్వు నవ్వాడు జలీల్.
    
    "కమాన్! గెటప్" అన్నాడు మహాజన్.
    
    జలీల్ కారులో ఎక్కి డ్రయివర్ పక్కసీటులో కూర్చున్నాడు.
    
    "పోనియ్! టాప్ స్పీడ్" అన్నాడు మహాజన్ డ్రైవర్ తో.
    
    ఆ ఫారిన్ కారు లేడిని తరుముతున్న చిరుతలా ముందుకు వురకడం మొదలెట్టింది. కానీ కనుచూపుమేర దూరంలో ఎక్కడా కనబడలేదు ఎర్రబస్సు.
    
    "ఇఫ్ ఐయామ్ నాట్ రాంగ్, మీ పేరు జలీల్! అవునా?" అన్నాడు మహాజన్.
    
    ఆశ్చర్యంగా మహాజన్ వైపుచూసి అవునన్నట్లు తలపంకించాడు జలీల్. తన పేరు ఈయనకెలా తెలుసు?
    
    అడగని అతని ప్రశ్నకు జవాబులా అన్నాడు మహాజన్.
    
    "ఆ మధ్య ఏదో పత్రికలో మీరు రాసిన కవితలు చదివాను. మీ ఫోటో కూడా వేసినట్టున్నారు. సాహిత్యం అంటే చెవికోసుకునే వాళ్ళు మీ డిపార్టుమెంటులో వున్నారంటే ఆశ్చర్యమే! ప్రజల్లో పోలీసులంటే వున్న ఇమేజ్ వేరు. చిన్నప్పుడు నేనూరాసేవాడిని కవిత్వం అప్పుడప్పుడు. కవితలు చదవడానికి మాత్రమే పరిమితం అయిపోయింది ఆ అభిలాష ఇప్పుడు! టైం ఫాక్టర్! యూసీ! ఊపిరి సలపని పనులు!"
    
    వింటూ మర్యాదపురస్కారంగా తల పంకించాడు జలీల్.
    
    "రాసిన ప్రతి అక్షరంలోనూ ఏదో సందేశం అందించాలనే తపన కనబడుతూ వుంటుంది మీ కవిత్వంలో! కానీ..." అని ఆగాడు మహాజన్. ఏమిటన్నట్లు ప్రశ్నార్ధకంగా చూశాడు జలీల్.
    
    "మీరు చెప్పే నీతులన్నీ మీరే పాటించాలనుకుంటే మాత్రం కష్టమే!" అని నవ్వాడు మహాజన్.
    
    "పాటించని నీతులు చాటి చెప్పడమెందుకు?" అన్నాడు జలీల్ నిర్మొహమాటంగా అతను మాట్లాడుతుంటే కట్టె విరిచినట్లుంది.
    
    మళ్ళీ నవ్వాడు బిజినెస్ మాగ్నెట్ మహాజన్. తర్వాత వేదాంతిలా చెప్పడం మొదలెట్టాడు.
    
    "సక్సెస్ ఫుల్ పీపుల్ అందరికీ జీవితం మూడు రకాలుగా వుంటుంది. ఒకటి: అందరికీ తెలిసినవాళ్ళ పబ్లిక్ లైఫ్. లేకపోతే వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్; రెండు: వాళ్ళ ప్రైవేట్ లైఫ్. కాని ఇది నిజంగా ప్రైవేట్ గా వుండదు. తమ ప్రైవేట్ లైఫ్ ని కూడా పబ్లిగ్గా బతికేస్తుంటారు వీళ్ళు విపరీతమయిన పబ్లిసిటీతో! జనానికి తమ ప్రైవేట్ లైఫ్ ఇలా వుంటుందనే ఒక ఇమేజ్, ఒక భ్రమ కలిగిస్తుంటారన్నమాట! మూడోది: వాళ్ళ సీక్రెట్ లైఫ్! ఎక్కువమందికి తెలిసే అవకాశంలేని ఈ సీక్రెట్ లైఫ్ లో వాళ్ళు బయటచేప్పే నీతులూ, నియమాలూ అన్నీ తీసి వంకెకి తగిలించేసి, పరమ జుగుప్సకరమయిన జీవితం గడిపేస్తూ వుంటారు. అదే బాగుపడేవాళ్ళ లక్షణం! యంగ్ మాన్! ఇది అర్ధం చేసుకో! నీ గురించి చాలా విన్నాను నేను. నువ్వు చాలా టాలెంట్ వున్న ఆఫీసర్ వని చెప్పారు. టాలెంట్ ఎక్కడ వున్నా లైక్ చేస్తాను నేను. అయితే నీలో ఒకటే లోపం!"
    
    మాట్లాడకుండా సీరియస్ గా వింటున్నాడు జలీల్.
    
    "నీకు పోలీస్ మాన్యువల్ అంతా కంఠతావచ్చుట. కలలోనైనా సరే ఇండియన్ పీనల్ కోడ్ అంతా తలకిందులుగా కూడా వప్పచెప్పెయ్యగలవుట. రూల్సన్నీక్షున్నంగా తెలుసుట నీకు!

 Previous Page Next Page