Previous Page Next Page 
వెన్నెల మెట్లు పేజి 19


    
    అవమానంతో ప్రతిమ మొహం ఎర్రబడింది.
    
    అలా చెప్పారా నాన్నగారు? శ్రీరాం ని రౌడీగా చిత్రీకరించారా? తనని ట్రాన్ స్ ఫర్ చేయిద్దామని - అది అయ్యేపని కాకపోయినా చూశారా? తలుచుకుంటే వెగటేస్తూంది.
    
    ఇంతదాకా వచ్చాక పంతం కోసం అయినా శ్రీరాంని పెళ్ళి చేసుకోవాలనిపిస్తూంది తనకి.    

    ఇదంతా ఈయనతో ఎలా చెబుతుందీ?    
    
    "నాకు ట్రాన్స్ ఫర్ అక్కర్లేదు, డాక్టర్!" అంది మెల్లిగా.
    
    "దట్స్ మై గర్ల్" అన్నాడాయన ఆదరంగా.
    
    "నేను చెయ్యగలిగింది ఏమన్నా ఉంటే మాత్రం చెప్పు. తప్పకుండా చేస్తాను. ఆ ఈవ్ టీజర్ మళ్ళీ నీ జోలికి వస్తే నాతో చెప్పు. వాణ్ణి..."
    
    అతనితో కలిసే తను ఇప్పటిదాకా కాంటీన్లో కాఫీ తాగుతూందనీ, అతనింకా అక్కడే కూర్చుని తనకోసం ఎదురు చూస్తున్నాడనీ తెలిస్తే ఈయన రియాక్షన్ ఎలా ఉంటుందో!
    
    ప్రయత్నపూర్వకంగా నవ్వి, "అలాగే, డాక్టర్!" అంటూ బయటికి వచ్చేసింది.
    
    "ఎందుకు పిలిచారు?" అన్నాడు శ్రీరాం.
    
    జంకుతూనే చెప్పింది ప్రతిమ.
    
    శ్రీరాం పెదిమలు ఆగ్రహంతో వణికాయి.
    
    "అయితే మీరు గుంటూరు వెళుతున్నారా?"
    
    "అయ్యో! లేదు లేదు!"
    
    "అలా అయితే నాతో రండి!"
    
    "ఎక్కడికి?"
    
    "రిజిస్ట్రార్ ఆఫీసుకి."
    
    "ఇవాళ వద్దు! ప్లీజ్!"
    
    "టైం ఎక్కువ లేదు. ఇవాళే వెళ్ళాలి."
    
    "ప్లీజ్!"
    
    "సారీ! తేల్చేసుకోండి అటో ఇటో!" అన్నాడు నిశ్చయంగా.
    
    శృతి ఎటూ మాట్లాడకుండా ప్రతిమనే చూస్తోంది.
    
    చాలాసేపు అలాగే నుదుటిమీద చెయ్యి పెట్టుకుని కూర్చుండి పోయింది ప్రతిమ.
    
    ఆ తర్వాత, మధ్యాహ్నం డ్యూటీ ముగిశాక, శ్రీరాం ఫియట్ కారు ఫ్రంట్ సీటులో, అతని పక్కన కూర్చుని, రిజిస్ట్రార్ ఆఫీసుకి వెళ్ళింది.
    
                                                              * * * * *
    
    వారం రోజుల తర్వాత ---
    
    పోస్ట్ మాన్ రెండు కవర్లు అందించి వెళ్ళాడు కేశవరావుకి. రెండూ కూడా గవర్నమెంట్ ఆఫీసులనుంచీ వచ్చిన లెటర్సే అని చూడగానే తెలుస్తోంది.
    
    వాటిల్లో ఒక కవరులో ఏముంటుందో తెలుసు ప్రతిమకి. అందుకని పోస్ట్ మాన్ ని చూడగానే త్వరత్వరగా గదిలోకి వెళ్ళిపోయింది.
    
    వణుకుతున్న చేతులతో ఒక కవరు చింపాడు కేశవరావు. దాని సారాంశం ముందే గ్రహించగలిగాడు ఆయన. అందుకే గుండె దడదడలాడుతోంది.    

    ఆయన వూహ కరెక్టే! తనని సస్పెండు చేస్తూ ఆఫీస్ ఆర్డర్.
    
    నైరాశ్యం వహించింది కేశవరావుని. 'రామచంద్రప్రభూ! ఇంకెలా బతికేది నేను? దారి చూపించి కాపాడవయ్యా స్వామీ!" అనుకున్నాడు మనసులోనే.
    
    ఇంక ప్రతిమ ఒక్కతే దిక్కు ఈ సంసారానికి. తను సంపాదించి పెడితేనే అందరూ రెండుపూటలా తినగలిగేది.
    
    అలా ఆలోచించడం తప్పేమో అని ఒక్క క్షణం మాత్రం అనిపించింది ఆయనకి.
    
    తప్పే కావచ్చు! కానీ తప్పేది కాదు!
    
    తనకి జరుగుబాటు బాగా ఉన్నప్పుడు ఖర్చుకి వెనకాడకుండా కూతుర్ని ఖరీదైన చదువు చదివించాడు. ఇప్పుడు గడ్డురోజులొచ్చాయి. నిలబడి చెయ్యడం ప్రతిమ బాధ్యత. ప్రతిమ చేస్తుంది కూడానూ! కుటుంబం మళ్ళీ కుదుటపడే వరకూ పెళ్ళి వాయిదా వేసుకుంటుంది.
    
    జరిగినదంతా ప్రతిమకి చెప్పెయ్యాలి. తన ఉద్యోగం పోతుందని చెప్పేస్తే ఇంక పెళ్ళి సంగతి తలపెట్టదు ప్రతిమ. అసలు అదివరకే చెప్పేసి ఉండాల్సింది తను.
    
    ప్రతిమ అర్ధం చేసుకోగలదు. తఃనకా నమ్మకం బాగా ఉంది.
    
    యాంత్రికంగా రెండో లెటరు విప్పాడు. యథాలాపంగానే చదివాడు.
    
    తక్షణం షాక్ తగిలినట్లయింది. మెదడు మొద్దుబారి పోయింది.    

    మళ్ళీ చదివాడు.
    
    సస్పెన్షన్ ఆర్డర్ చదవగానే సన్నగా మొదలయిన ఒణుకు, ఇప్పుడీ నోటీసు చూడగానే విపరీతమయింది. మలేరియా వచ్చిన వాడిలా వణకడం మొదలెట్టాడు కేశవరావు.
    
    అది 'రిజిస్ట్రార్ ఆఫ్ మేరేజెస్' ఆఫీసు వారిచ్చిన నోటీసు.
    
    "ఫలానా వారి కొడుకైన శ్రీరాం మరియూ ఫలానా వారి కూతురైన ప్రతిమా, వివాహం చేసుకోదలచుకుని అప్లికేషను దాఖలు చేశారు. కాబట్టి ఎవరికే విధమైన అభ్యంతరాలున్ననూ ఫలాని తారీఖు లోపల తెలియజేసుకోవాలి" అని దాని సారాంశం!
    
    ప్రపంచం తలక్రిందులై పోయినట్లు అనిపించింది ఆయనకి.
    
    తన ఉద్యోగం ఊడినా ప్రతిమ ఉద్యోగంలో చేరితే తన యోగం బాగానే ఉంటుందని ఆశపడుతుంటే ---
    
    ఇదేమిటి?

 Previous Page Next Page