Previous Page Next Page 
ప్రేమ పురాణం పేజి 19


    
    మందుభాయిలు ఇదే అదనని పార్టీలు చేస్కోగా, జూదరి మనస్తత్వంగల పంటర్లు యిదికరెక్టనీ, కాదనీ భారీగా పందాలు వేసుకున్నారు.
    
    ఈ వార్తని పేపర్లకు పంపించారు పత్రికా విలేఖర్లు.
    
    చివరికి ఆలిండియా రేడియో (ఆకాశవాణికాబోలు) ఇదే వార్తని ప్రసారం చేయడం, అదే వార్త అచ్చుతప్పులు లేకుండా శేషు రేడియోలో వినబడ్డంతో కథక్లైమాక్సుకొచ్చేసింది.
    
    ఆ చుట్టుపక్కల వున్నవాళ్ళందరూ జెయ్ ని వెదుక్కుంటూ శేషు యింటికి వచ్చేశారు.
    
    వాళ్ళందరి చేతుల్లోను సరిపాత రేడియోలూ, ట్రాన్సిస్టర్లూ, మైకులూ, లౌడ్ స్పీకర్లూ, ఇక్ష్వకుల శాతవాహనుల కాలంనాటి పురాతనమైన గ్రామ్ ఫోన్లూ వున్నాయి.
    
    "ఏమిటివి?" అన్నాడు జెయ్ చంద్ర వాటిని చూసి బిత్తరపోయి.
    
    "శేషురేడియోనే బాగుచేశావంటే నువ్వు గొప్ప మెకానిక్కువై వుంటావు. నీ హస్తవాసి మంచిది. బాబ్బాబు! కాస్త వీటికి కూడా వులుకూపలుకూ తెప్పించి పుణ్యం గట్టుకో! నీ ఋణం వుంచుకోంలే!" అన్నారు అందరూ క్యూలో నిలబడి కాళ్ళావేళ్ళాపడుతూ.
    
    శేషువైపు చూశాడు జెయ్ చంద్ర.
    
    "ఊ అను!" అని ప్రోత్సహించాడు శేషు.
    
    "ఊఁ!" అన్నాడు అతను.
    
    అక్కడికి వచ్చిన వాళ్ళందరి కళ్ళలో ఆనందభాష్పాలు నిలిచాయి.
    
    అంతే!
    
    అదిమొదలు.....ఇంక జెయ్ చంద్రకి రోజెట్లా గడుస్తుందా అన్నదిగుల్లేకుండా పోయింది.
    
    (నిజానికి జెయ్ చంద్రకి ఆ దిగులెప్పుడూ లేదు. సితారని ఒక్కసారి చూస్తే అతనికింక అమృతం తాగినట్లే వుంటుంది.   నిజానికి అతనికి రోజెట్లా గడుస్తోందో అతని తరఫున దిగులు పడ్డవాడు కూడా శేషే.)
    
    దాంతో తిరిగి బిజినెస్ మొదలయిపోయింది.
    
    అడ్వాన్స్ డబ్బు కూడా బాగానే వచ్చింది.
    
    మహాదానందపడిపోయాడు శేషు. పాడినవాడు లేవకుండానే అన్నాడు - "రేయ్ జెయ్! ఇవాళ యింకా ఈ వెధవ మిరపకారమూ, ధనియాలపొడి, పాత నిమ్మకాయా వదిలేస్తున్నా! ఇవాళ నవకాయపిండివంటల్తో విందుభోజనం చేస్తా! జన్మకో శివరాత్రి!" అన్నాడు.
    
    "శివరాత్రినాడు విందుభోజనం చేయరు! పస్తు పడుకుంటారు" అన్నాడు జెయ్ చంద్ర నవ్వుతూ.
    
    సరే.....
    
    ఇంక ఆ రోజు నుంచి యిద్దరికీ ఫుడ్డు సమస్య తీరిపోయింది.
    
    నెల రోజులు తిరిగేసరికి శేషు కాస్త ఒళ్ళు చేశాడు కూడా.
    
    కానీ జెయ్ చంద్రేమో చిక్కి సగమైపోయాడు సితార గురించిన బెంగతో.
    
    అప్పుడు.....
        
    ఓ శుభోదయాన.......
    
    నిజంగానే ఓ శుభమే జరిగింది. జెయ్ చంద్ర రాత్రంతా 'సితారా! సితారా!' అనీ, 'జిందగీ జిందగీ' అనీ 'మై లవ్, మైలవ్' అని త్రీ లాంగ్వేజ్ ఫార్ములా ప్రకారం కలవరిస్తూ దిగులుపడి, తెల్లారగట్ల ఎప్పుడో మాగన్నుగా నిద్రలోకి జారుకున్నాడు.
    
    అప్పుడతనిమీద దబ్బుమని ఎవరో పడ్డారు. అదిరిపడి కళ్ళు తెరిచాడు జెయ్ చంద్ర. అతని ఎదురుగా రాంపండు నిలబడి వున్నాడు.
    
    రాంపండంటే సితారకు తమ్ముడు.
    
    తనకు కాబోయే బామ్మర్ది!
    
    కానీ రాంపండంటే జెయ్ కి అలర్జీ.
    
    తనంటే రాంపండుకి కూడా అంతే అలర్జీ వుందని అతనికి డౌటు.
    
    రాంపండు ఒక ఫుట్ బాలూ, ఒక పంపర పనసకాయా, రెండు సొరకాయలూ, రెండు ములక్కాడలూ, ఒక మిరపకాయా కలిపి చేసినట్లుంటాడు.
    
    నిరంతరం ఏదో అన్వేషిస్తున్న శాస్త్రజ్ఞుడిలా అన్నిటినీ జిజ్ఞాసగా కెలుకుతూ వుంటాడు రాంపండు.
    
    అతగాడికి అతిపిన్న వయసులోనే సోషలిజం బాగా వంటపట్టింది.
    
    అందరివస్తువులూ, అన్నివస్తువులూ కూడా తనవే అనుకుంటాడు.
    
    అందుకనే ఆ ఇంట్లోకి వచ్చాక జెయ్ చంద్రవి రేజరుసెట్టూ, రెండు ప్యాంట్లూ, నాలిగ్గీసుకునేబద్దా -- ఇవన్నీ పోయాయి ఒకదాని తర్వాత ఒకటిగా.
    
    వీటిల్లో ఏవీ రాంపండుకి పనికి వచ్చేవి లేవు.
    
    అయితే అతనిది కాకి బుద్దికదా!
    
    కాకి తనకి ఏం కనబడితే అది ఎత్తుకెళ్ళిపోతుంది.
    
    హెయిర్ పిన్స్, సబ్బుపెట్టి, స్పూనులు వీటిలో ఏవీ దానివి పనికి వచ్చేవి వుండవు.
    
    అది సబ్బుతో మొహం రుద్దుకోదు. (రుద్దుకున్నా కాకి నలుపునలుపేగానీ తెలుపుకాదు కదా.)
    
    సొగసుగా తలదువ్వుకుని హెయిర్ పిన్స్ పెట్టుకోదు.
    
    పురుగుల్ని స్పూనుతో పట్టుకుని తినదు.
    
    అయినా కనబడితే చాలు ఎత్తుకుపోతుంది.
    
    జెయ్ చంద్ర యింట్లో నుంచి ఎత్తుకెళ్ళిన రెండు ప్యాంట్లూ, టంగ్ క్లీనరూ, రేజరూ తన ట్రంకులో భద్రపరిచాడు రాంపండు.
    
    అతని ట్రంకుపెట్టి తెరిచి చూసే భాగ్యం ఎప్పుడైనా, ఎవరికైనా కలిగితే-
    
    ఇంకా చిత్రాతి చిత్రమైన అనేక వస్తుజాలం కనబడుతుంది వాళ్ళకి.
    
    పక్కింటి తాతయ్యగారి కట్టుడుపళ్ళూ...
    
    ఎదురింటి కామాక్షి మొగుడుగారి తాలూకు నిరోధ్ పాకెట్టూ, గతసంవత్సరం కీర్తిశేషులైన ఓ పిల్లి తాలూకు తోక, ఎవరిదో తెలియని గాజు కన్ను.....ఇంకెవరిదో పేషెంటు తాలూకు ఎనిమా ఆపరేటసూ....
    
    చిత్రమైన వస్తువులు ఎత్తుకొచ్చేసే విచిత్రమైన స్వభావం అతనిది.
    
    తన ఎదురుగా నిలబడి వున్న రాంపండుని ఎగాదిగా చూశాడు అతను.
    
    ఇంత తెల్లారుఝామునే వీడికి యిక్కడేం పనీ?
    
    "ఎందుకొచ్చావు?" అన్నాడు క్రూరంగా.

 Previous Page Next Page