అదే అనుకో! అయినా కోర్టుకెక్కిన ఈ ఒక్క పాయింటైనా మనకుండకపోతే కేసు ఫైల్ చెయ్యకపోయేదాన్ని. అందులో ఉత్తరాలులాంటి సాక్ష్యం లేదేమో మన కేసు అసలు నిలబడేది కాదు. సరే రేపు నోటిసు పంపిస్తున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో పద ఆ గదిలో పడుకో నీవు ఇదిగో మా పాప సరోజ గది ఇది. ఇవాళనించి నీవు మా పాపకి అక్కవి. దానికి తోచడం లేదని గోల చేస్తోంది. సరోజ కూడా చలాకి పిల్ల నీకు మంచి ఫ్రెండు అవుతుంది." అంటూ పాప గదిలోకి తీసికెళ్ళింది.
పక్కమీద నైట్ గౌనులో పద్దెనిమిది పంద్దోమ్మిదేళ్ళ అమ్మాయి నిద్రపోతోంది.
"ఈ అమ్మాయి ఎవరు? మీ చెల్లెలా?" అంది రూప కుతూహలంగా , ఆశర్యంగా.
సుమతి నవ్వి "కాదు నా కూతురు !" అంది.
రూప తెల్లపోయి "అదేమిటి మీకు పెళ్లవలేదు అంటారంతా" అంది తడబడి.
సుమతి అదోలా నవ్వుతూ , పెళ్ళైవుండాలా కూతురు వుండేందుకు? చూశావా నీకు తెలియకుండానే నీవూ యీ సమాజంలో ఒక మనిషివని నిరుపించావు ఈ ప్రశ్న అడిగి" అంది భుజం చరిచి.
రూప మొహం నల్లబడింది. "ఛా....ఛా....రూప! నిన్ను ఇన్సల్ట్ చెయ్యడానికనలేదమ్మా! మన రక్తంలో జిర్ణించుకుపోయిన ఈ పెళ్ళి , పిల్లలు సాంప్రదాయాలు, ఆచారాలు ఒక్క రోజులో పొమ్మన్నాపోవు అందుకే పాప నా కూతురనగానే ఆప్రయత్నంగానే పెళ్లవలేదుగా అన్నావు అది సహజం. మనం ఇవన్ని అధికమించడానికి చాలా రోజులు, ఏళ్ళు పడ్తుంది. కొన్ని తరాలు పట్టచ్చు. మంచో చెడో మార్పు అన్నది రావడానికి కొన్ని తరాలు పడ్తుంది. స్రీలు బాల్యవివాహాలు స్థాయి నుంచి ఆడది చదువుకుని గుమ్మం దాటి ఉద్యోగాలు చేసే స్థాయికి చేరడానికి ఎన్నేళ్ళు పట్టిందో చూశావా.
వీరేశలింగం లాంటి మహానుభావులు ఎంత చేసినా, ఎన్ని ఉపన్యసాలిచ్చినా ఇప్పటికి వితంతు వివాహాలు ఎన్ని జరుగుతున్నాయి. వితంతు వివాహాలు స్థాయే దాటని మన సమాజం అవివాహితుల మాతృత్వాన్ని ఆమోదిస్తుందా? రూపా! ఈనాడు నీవు వేసిన ఈ పునాది మీద భవంతి లేవడానికి కొన్నేళ్ళు పడ్తుంది. అంతా తలో రాయి వేసి కులతోద్దాం అన్నవారే తప్ప అంతా తలో చెయ్యి వేసి లేవనేత్తుదాం అనుకోరు. ఈ ఇక్కట్లన్ని అధికమించెందుకు చాల ఓర్పు ధైర్యం , సాహసం వుండాలి.
ఏమిటో! ఒకదాన్లోంచి ఒకదాన్లోకి వెళ్ళిపోతున్నాను. సరోజ నా కూతురు. పెంపుడు కూతురనుకో. ఇంక పడుకో ఉదయం మాట్లాడుకుందాం" అంది రూప భజం తట్టి. మూడు రోజుల తరువాత సురేష్ కి లాయరు నోటిసు పంపింది సుమతి.
నా క్లయింట్ కుమారి రూప (మైనరు) తో ప్రేమ కలాపాలు జరిపి ఆ తరువాత ఆమె పెళ్ళి చేసుకోవాల్సిందిగా కోరగానే పెళ్ళి చేసుకోనని ఖచ్చితంగా మీ అభిప్రాయం చెప్పి ఆమెని మాటలతో అవమానపరిచినందుకు, మీ కారణంగా ఆమె ఇప్పుడు గర్భవతి అయినందువలన ఆ పుట్టబోయే బిడ్డకి తండ్రి మిరయినందున వెంటనే పెళ్ళాడాలని ఆమె కోరింది. అప్పుడు అవమానం చేసి చేతులు దులుపుకుని వెళ్ళిపోయారు. నా క్లయింట్ అనేక విధాల బతిమాలి, ఆశ చవక మీ తల్లి తండ్రుల దగ్గరికి వెళ్ళి పరిస్థితి వివరించి తనని తన కుటుంబాన్ని అవమానాన్నుంచి రక్షించడానికి వెంటనే పెళ్ళాడాలని కోరితే, మీ తండ్రి కూడా హీనంగా, నీచంగా మాట్లాడి పొమ్మన్నాడు.
నా క్లయింట్ కోర్టు ఎక్కి న్యాయం కోసం పోరాడుతానని బెదిరించినా లొంగలేదు. ఇప్పుడు నా క్లయింట్ మీ కారణంగా అవమానాల పాలై ఆమె పరువు , తల్లి తండ్రుల పరువు పోయి, అక్రమ సంతానానికి తల్లి అయ్యే తరుణంలో న్యాయం కోసం కోర్టు కేక్కుతోంది అని ఇందుమూలంగా తెలియజేయడం అయింది. ఎడ్వకేట్ సుమతి. బి.ఎ.బి.యల్. లాయరు నోటిసు చదవగానే సురేష్ కి ముచ్చెమటలు పట్టాయి. రూప ఎంతపని చేసింది. ఏదో బెదిరింపు అనుకున్నాడు గాని రూప ఇలా పరువు, మర్యాదలని కూడా లెక్క చెయ్యకుండా కోర్టుకేక్కుతుందని అతను ఎన్నడూ అనుకోలేదు. ఒక్కక్షణం అతని మెదడు పనిచెయ్యడం మానేసింది. కాగితం పట్టుకున్న చేతులు గజగజ వణికాయి. కోర్టు! కేసు! తను చేసిన పని ఊరంతా తెలుస్తుంది. పేపరులో పడ్తుంది. ప్రతివాళ్ళు తనని దోషిగా చూస్తారు. తన ప్ర్హెండ్సులో తన పరపతి ఏమవుతుంది! అన్నింటికంటే ముందు తండ్రి ఏమంటాడో!
ఆరోజు....రూప వచ్చి వెళ్ళిన రోజున సురేష్ ఇంటికి రాగానే తల వాచేట్లు చివాట్లు పెట్టడాయన కొడుకుని.
"చదువు సంధ్యల్లేకుండా ప్రేమలు ఆడపిల్లలు కావాల్సి వచ్చారా. ఆ పిల్ల వచ్చి నానా మాటలు అని పెళ్ళి చేసుకోకపోతే కోర్టుకెక్కుతానని బెదిరించింది. అప్రాచ్యుడా! నీ కిదేం తెగులు? వెధవేషాలు వేస్తావా? నీకు పెళ్ళి కావాల్సి వచ్చిందా ఇప్పటినుంచి" అంటూ కొడుకుని చెడామాడా తిట్టాడు.
ఆవేశం కాస్త చల్లారాక కొడుకు నుంచి అన్ని వివరాలు అడిగి రూప కోర్టు కెక్కితే సురేష్ ని దోషిగా నిలబెట్టేందుకు ఉత్తరాలులాంటి సాక్ష్యాలు ఏమి లేవని సంతోషించాడు. కొడుకుని తిట్టినా ప్లీడరు, వ్యవహారదక్షత గలవాడు గనక ముందుచూపుతో ముందరి కాళ్ళకు బంధంలా రూప తండ్రిని కల్సి నలుగురిలో నానా మాటలు అని వచ్చాడు. దాంతో ఆ తండ్రి రూప కట్టడిలో పెట్టి కోర్టుకెక్కితే పోయేది వాళ్ళ పరువేనని కూతురిని కొప్పడుతాడని ఆశించాడు. తల్లి కూడా చాటుగా కొడుకుని నానా మాటలు అంది.
అసలే రూపతో ఈ వ్యవహారం ఎందుకు నడిపానా అని పశ్చత్తాపడినా సురేష్, తల్లితండ్రులు తిట్టడంతో బుద్ది తక్కువయి దిన్లోకి దిగానని మనసులో లెంపలు వేసుకుని జరిగింది పిడకల అనుకుని మరచి పోవాలనుకున్నాడు. తీరా చూస్తే రూప అన్నంత పని చేసి లాయరు నోటిసు పంపేసరికి నీళ్ళు కారిపోయాడు. భయంగా తండ్రికి చూపించాడు అది.
నోటిసు చూసి రామనాధంగారూ భయపడ్డారు. ఆడపిల్ల ఇంత ధైర్యంగా చేసిన పనికి సిగ్గుపడడం పోయి కోర్టు కెక్కుతుందని అయన ఎన్నడూ ఎదురుచుడలేదు. ఏదో కసితో, ఆవేశంతో వచ్చి బెదిరించిందని అనుకున్నాడాయన, ఆ నోటిసు లాయరు సుమతి ద్వారా రావడం ఆయనకి మరింత అనుమానం అన్పించింది.
కోర్టులో ఎప్పుడూ రామనాధంగారు, సుమతి ప్రత్యర్ధులే. ఇద్దరూ సమ బలాలతో తలపడ్తారుకేసులో. రామనాధంగారిని లాయరుగా పెట్టుకున్న వాళ్ళ ప్రత్యర్ధులు సుమతిని తన లాయరుగా ఎన్నుకుంటారు. రామనాధంగారు ఎదురుగా సుమతి కేసు టేకప్ చేస్తే ఆ కేసు మంచి పవర్ఫుల్ గా ఇంటరేష్టింగా వుంటుందని జడ్జీలు కూడా అనుకుంటారు. లాయర్లకి, క్లయింట్లకీ వారిద్దరి సంగతి తెలిసిపోయింది. సుమతితో కేసు వేస్తె అవతలి లాయరు రామనాధంగారని, రామనాధంగారితో కేసు వస్తే అవతల పార్టీ వాళ్ళు సుమతి దగ్గరికి వేడ్తారని అందరికి తెలుసు.
ఈరోజు ఈ నోటిసు తన కొడుక్కి.....లాయరు సుమతి ద్వారా రావడం తల కొట్టేసినట్లయింది ఆయనకి. పర్సనల్ గా తనని అవమానించే అవకాశం సుమతికి వచ్చినట్లు అయన మనసులో ఉడికిపోయాడు. ఆ నోటిసుకి జవాబివడం- రూపతో రాజీకి వచ్చి కోర్టు కేసు లేకుండా చేసుకోడం, సుమతి ముందు తలవొగ్గి తప్పు వప్పుకోవడం, మరింత చిన్నతనంగా, నామోషీగా అనిపించింది ఆయనకి. ఆ కోపం అంతా సురేష్ మీద చూపించి నానా తిట్లు తిట్టరాయన. ఎంత తిట్టినా కన్నకొడుకు, వాడిని కోర్టుకిడ్పించడం అంటే వాడి పరువు కాదు ముందు తమ పరువు ప్రతిష్టలే పోతాయని, ఎంత దులేపెసుకుందామన్నా ఇది తమ కుటుంబానికి సంబంధించినదని ఆయనకి తెలుసు. సురేష్ ని తిట్టినంత మాత్రానా ఈ సమస్య పరిష్కారం కాదని ఆయనకి తెలుసు, రూపతో రాజీ పడటం అంటే సుమతి ముందు తల వగ్గడం అన్నమాట. అయన ఆత్మాభిమానం, పౌరుషం అడ్డొచ్చింది.
ప్రతి కేసులో తనకి అడ్డు తగుల్తూ ముడోంతులు కేసులు గెలుస్తూ తనకీ ప్రతీ విషయంలో ప్రత్యర్ధిగా వున్న సుమతి ముందు తల ఒగ్గడమా! ఊహు ఇది సురేష్ మీద కోపం కాదు! ఇన్నాళ్ళకి తనమీద కసి తీర్చుకునే అవకాశం వచ్చింది. ఆ అమ్మాయి సుమతి దగ్గరికేలా వెళ్ళిందో . ఇంతమంది లాయర్లు వుండగా రూప సుమతి దగ్గరకే ఎందుకేళ్ళాలి? ఈ నోటిసు ఇప్పించడంలో సుమతి పాత్ర చాలా వుండే వుంటుంది. ఆ పిల్లకి ధైర్యం చెప్పి, ప్రోత్సహించి కేసు గెలిపించే పూచి నాదని హామీ ఇచ్చి మరింత పురెక్కించి నోటిసు ఇచ్చి వుంటుంది. తనమీద కోపం, కసి తీర్చుకునే అవకాశం వచ్చినందుకు ఆమెకు చాలా ఆనందంగా, గర్వంగా వుండివుంటుంది. ఊహిస్తుంటే రామనాధంగారి ఒంటిని తేళ్ళు, జేర్రెలు పాకాయి.