Previous Page Next Page 
దీప పేజి 19


    "ఎన్నేళ్ళు ఎదురు చూడమంటావ్?"


    "ఈ నెల చాలు. ఏళ్ళు...ఏళ్ళు అని నన్నెక్కిరిస్తున్నావ్. అందుకే తక్కువ గడువు పెట్టాను. నిన్నాగమని ఆ తర్వాత పరిస్థితులు చెయ్యి జారిపోతే నీ జీవితం పాడుచేసిన వాణ్ణవుతాను. నీకే కాదు నాకూ వుంది పట్టుదల." రోషంగా అన్నాడు మన్ మోహన్.


    దీప పకపకా నవ్వింది. చటుక్కున నవ్వాపుజేసి "మంచిది. సరిగా నెల రోజులు చూస్తాను. ఆ తర్వాత వెంటనే పెళ్ళిచేసుకుంటానని చెప్పలేను. పెళ్ళి గాకపోయినా ఫరవాలేదు. ఆశ మాత్రం పెంచుకోను. నాటిన మొక్క చిగురు తొడిగిందా, వాడిపోయిందా తెల్సుకుంటాను అంతే." అని దీప ముందుకు కదిలింది.


    "దీపా! దీపా!" అనుకుంటూ శిలలా వుండిపోయాడు మన్ మోహన్.


                                       15


    దీప లలితని వప్పించి ఎన్ని విధాల బోధించాలో అన్ని విధాలా బోధించి ధైర్యం నూరిపోసి అర్ధమయేటట్లు వివరించి మధుసూదనంకి పెద్ద ఉత్తరం రాయించింది. పది రోజులయింది. మధుసూదనం వద్దనుంచి రిప్లయి రాలేదు.


    "నా ఉత్తరం చదివి ఆయన కోపం తెచ్చుకున్నారేమో! ఎప్పటికీ ఇహ ఆయన నా ముఖం చూడరేమో!" అంది లలిత.


    పరీక్షలు దగ్గర పడుతున్నాయని శ్రద్ధగా చదువుకుంటున్న దీపకి ఒళ్లు మండింది. పని కట్టుకునివచ్చి పలకరిస్తున్న అక్క అమాయకత్వానికి జాలిపడాలో మూర్ఖత్వానికి మందలించాలో తెలియలేదు.


    "నీకేం చెప్పాను తనమాట వినకపోతే నిన్ను తీసుకెళ్ళేది లేదని స్పష్టంగా రాశాడు. నీపై ప్రేమంటూ వుంటే బావ మనసు మార్చుకుంటాడు. కాబట్టి నీవు రాసిన ఉత్తరం వల్ల బావ నీకేం దూరంకాడు. అయేవాడు ఎలాగూ అవుతాడు."


    "అంతే అంటావా!" అమాయకంగా అడిగింది లలిత.


    "అంతే అని చాలాసార్లు చెప్పాను" తిరిగి పుస్తకంలో తల దూరుస్తూ అంది దీప.


    "ఉత్తరం చదివి ఏ నిర్ణయానికొస్తారో, ఏమంటారో."


    "బావ మూర్ఖుడయితే ఉత్తరం చదివి మూర్ఖులకి గురువవుతాడు. ఏ మూలనో మానవత్వం ఉంటే ఉత్తరం చదివి మనిషవుతాడు. ఇనుమును వేడిచేస్తే వంగుతుంది. మూర్ఖుడికి చరుకు తగిలితేగాని మారడు."


    "మీ బావని పదేపదే మూర్ఖుడనకే దీపా!"


    "మాటిమాటికి నా చదువుకి అడ్డం వచ్చి అంతరాయం కలిగించకు."


    "అలాగే, అడ్డం రాను. ఉత్తరం చూచుకుని మీ బావ వస్తారంటావా?"


    మధుసూదనం ఉత్తరం చూసుకుని మారిపోయి, బెదిరి వస్తాడని దీపకి నమ్మకం లేదు. అలా అని రాడని నిర్ధారణగా అనుకోలేక పోతున్నది. అక్కకి ధైర్యం నూరిపోయడానికి సమయానుకూలంగా మాట్లాడుతున్నది.


    "తప్పకుండా బావ వస్తాడు. బావ వచ్చిం తరువాత కరిగి నీరయి నామాట బైట పెట్టక కోపం చూపించు. గట్టిగా వుండు."


    "అక్కా! బావొచ్చాడేవ్." అంటూ నాని పరుగెత్తుకుంటు వచ్చాడు. దీప మాట పూర్తిచేయకముందే.


    "దీపా! నీ నోటివాక్యం ఎంత మంచిదే. నువ్వన్నట్లే ఆయనొచ్చారు." లలిత పొంగిపోతూ దీప బుగ్గమీద ముద్దు పెట్టుకుంది.


    దీప కళ్ళు తడిగా మారాయి. "నే చెప్పిన పాఠం మర్చిపోకు" అంది.


    లలిత తలవూపి వాకిట్లోకి వెళ్ళింది.


    "ఈ పూటకి ఇహ చదువు సున్నా" అనుకుంది దీప.


    మధుసూదనం ఎప్పటిలా పిల్లలకి బొమ్మలు, స్వీట్సు ఆదిలక్ష్మమ్మని పలకరించాడు. లలితతో కబుర్లు చెపుతూ కూర్చున్నాడు. దీప చెప్పిందంతా లలిత మర్చిపోయింది. పక్కగదిలో వున్న దీప మధుసూదనం ఆంతర్యాన్ని అంచనావేస్తూ మాటలింటూ వుండిపోయింది. లలిత ఇంటి సంగతులు చెప్పుతున్నది.


    "దీప ఏది!" అడిగాడు మధుసూదనం.


    "పక్క గదిలోవుంది, పిలవనా?" లలిత అడిగింది.


    "వద్దులే, వెళతాను"


    మధుసూదనం వస్తున్నట్లు తెలుసుకున్న దీప పుస్తకం తెరిసింది.


    మధుసూదనం సరాసరి గదిలోకి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. "పోట్లాటకి సిద్ధమయి వచ్చాడా! మరేదయినా అడగటానికి వచ్చాడా బావ!" అనుకుంది దీప. పుస్తకంలోంచి తల ఎత్తలేదు. అన్నింటికి సిద్ధంగానే కూర్చుంది.


    "దీపా!"


    "ఆ..."అని తల ఎత్తి అప్పుడే బావని చూస్తున్నట్లు ముఖంపెట్టి "ఏమిటి?" అంది దీప.


    "బాగా చదువుకుంటున్నావా?"


    "ఊఁ"


    "పరీక్షలు దగ్గర పడ్డాయి కదూ?"


    "ఆ...."


    "పరీక్ష కెళతావుగా?"


    "ఊ"


    "చదువు కుంటున్నట్లున్నావు తర్వాత మాట్లాడుకోవచ్చులే ఏమున్నాయి. మామూలు మాటలేగా! నే అడ్డం దేనికి చదువుకో అంటూ కుర్చీలోంచి లేశాడు మధుసూదనం.


    దీప "ఊ" కొట్టి ఊరుకుంది.


    దీపకి ఓ పక్క ఆశ్చర్యం, మరో పక్క అనుమానం వేస్తున్నాయి. "బావ పదేళ్ళ క్రితమే ఈ ఇంటి అల్లుడయాడు. కలతలతో దూరం అయే బదులు కల్సిపోదామనుకున్నాడా? లేక ఏదో పధకం పన్ని బైలుదరి వచ్చాడా?" ఏదీ ఊహించ లేక పదేపదే ఆలోచిస్తూ ఉండిపోయింది దీప.


    రాత్రయింది. తెల్లవారింది. మధుసూదనం మామూలుగానే వున్నాడు. ముందుగానే దీప గట్టిగా చెప్పిన మాటలని బట్టి లలిత ఉత్తరాల సంగతి ఎత్తలేదు. తాను బెదిరిస్తూ ఉత్తరం రాయటం దానికి లలిత ఇచ్చిన రిప్లయి ఆ మాటలేం ఎత్తలేదు మధుసూదనం. చాటున కూడా ఉత్తరాల సంగతి మాట్లాడుకోలేదని లలిత నడిగి తెల్సుకుంది దీప.


    వారంరోజులున్నాడు మధుసూదనం. ఇంటిలో వుంటే లలితతో కబుర్లు బైటికెళితే పిల్లలను వెంటబెట్టుకెళ్ళటం చేశాడు. దీపతో పెద్దగా మాట్లాడే అవసరం కలగలేదు. దీప అంతవరకు రానివ్వలేదు. తప్పించుకున్నట్లే తిరిగింది. ఓ రోజు "డబ్బేమన్నా అవసరమా దీపా?" అని అడిగాడు మధుసూదనం. "అక్కరలేదు" అంది దీప. "నేనేం పరాయివాడిని కాదు అవసరమయితే అడుగు" అని మధుసూదనం ఇవతలి కొచ్చేశాడు. బావ మంచిగా అడిగాడా, చెడ్డగా అడిగాడా! మళ్ళీ ఆలోచించాల్సి వచ్చింది దీపకి.

 Previous Page Next Page