మరో రెండురోజుల తర్వాత మధుసూదనం లలితతో ప్రయాణం అయ్యాడు. సుబ్బు చిన్న ఇంకా చిన్నవాళ్ళు కాబట్టి ఇక్కడే వుంటారు. నానిని అక్కడ చదివిస్తానని ప్రయాణం చేయించాడు మధుసూదనం. "ఇప్పటినుంచి దేని కక్కావాడు" అంది దీప. "నాకు తోడుంటాడు, బావకి వీడంటే ప్రేమేకదా! అలవాటయితే మీ బావ పూర్తిగా ఇంటిపట్టున వుండొచ్చు" అంది లలిత, నిజమేననిపించింది దీపకి.
సామానులు వాకిటిలో పెట్టారు. మధుసూదనం దీపని పక్కకి పిల్చాడు. అనుమానంగా దీప మధుసూదనం దగ్గరకు వచ్చింది.
"దీపా! నువు పంపిన కానుక నా దగ్గరుంటే భరించలేను. అది నీ దగ్గరే భద్రంగా వుండనియ్యి. నే ఇచ్చిన కానుక మాత్రం పొరపాటున కూడా పారవేయకు" అని చిన్న పెట్టె దీప చేతిలో వుంచి తొందరగా ఇవతలికి వచ్చి లలితతో బండెక్కాడు మధుసూదనం.
బండి కనుమరుగయిందాకా చూసి లోపలికి వచ్చింది దీప.
"బావ ఏమిటే ఇచ్చాడు దీపా!" అంది ఆదిలక్ష్మమ్మ.
దీప పెట్టె తెరిచి చూసింది. తను అక్కచేత రాయించిన బెదిరింపు లేఖ కవరుతో సహా భద్రంగా వుంది. మరో చిన్న కాగితం మీద రెండు పంక్తులు రాసింది. "దీపా! నువు నిజంగా దీపమే. దీపం పురుగు మాత్రమే దీపం దగ్గరకు వస్తుంది. వేడికి మాడిపోతుంది. నేను దీపం పురుగుగా మారదలుచుకోలేదు. నీ బావ మధుసూదనం" అని దీప చదువుకుని తృప్తిగా శ్వాస వదిలింది. లలిత ఇంత ఘాటు ఉత్తరం రాయలేదని... వెనక తన ప్రోద్భలం వుందని... బావ గ్రహించలేనంత పిచ్చివాడు కాదు. అందుకే ఉత్తరం తన చేతిలో పెట్టి పోయాడు అని దీప తెల్సుకుంది.
"ఏముందే ఆ పెట్టెలో" మళ్ళీ అడిగింది ఆదిలక్ష్మమ్మ.
"బావ మంచితనం..." అని నవ్వుతూ గదిలోకి వెళ్ళిపోయింది దీప.
16
"అమ్మాయ్ దీపా! రంగయ్యొచ్చాడు. నిన్ను పిలుస్తున్నాడు" ఆదిలక్ష్మమ్మ చెప్పి గదిలోంచి వెళ్ళిపోయింది.
"నాతో అవసరం ఏమిటో?" అనుకుంటు చదువుతున్న పుస్తకాన్ని పక్కన పెట్టిలేచి బైటికి వెళ్ళింది దీప.
అన్నపూర్ణమ్మగారి పాలేరు రంగయ్య వసారాకింద మెట్టుమీద నుంచొని వున్నాడు.
"ఎందుకు రంగయ్యా వచ్చావ్?" అంది దీప.
"దండాలమ్మ చిన దొరసానమ్మా" ఎప్పుడూ అంతే రంగయ్య పెద్దింటి అమ్మగార్లను అమ్మగోరూ అంటూ నమస్కారం పెడతాడు. చిన్నవాళ్ళయితే చిన దొరసానమ్మా అని నమస్కారం పెడతాడు. మరీ పూర్వం మనిషి "మేం నీకు నమస్కారం పెడుతున్నామా, నీవు మాకు పెడతానికి, పెట్టకు" అనేది దీప. "అయ్ బాబోయ్ ఎంత తప్పు ఎంత తప్పు" అని కంగారు పడిపోయేవాడు రంగయ్య.
"ఎనభై ఏళ్ళు నిండుతున్నాయి. ఈ నమస్కారాలు మటుకు మానవు. సరేలే ఇదెప్పుడూ వుండేదేగా! ఎందుకొచ్చావ్! నాతో ఏదయినా పని వుందా?"
"అన్నపూర్ణమ్మ అమ్మగోరు పంపించారు చిన దొరసానమ్మా."
"దేనికట...?"
"అప్పుడెప్పుడో మీరు అమ్మగోరింట్లో వంటచేస్తానన్నారుట అప్పుడు అక్కరలేదన్నారుట మరి...ఇప్పుడేమో అవసరం పడ్డాదిట సాయంత్రం నుంచి రమ్మన్నారు."
కోపంతో దీప కనుబొమ్మలు మండిపడ్డాయి. పౌరుషంతో ముక్కు పుటాలు అదిరాయి. పెదవి గాటు పడేటట్లు మునిపంటితో నొక్కి పట్టింది కింది పెదవిని. అన్నపూర్ణమ్మ ఈ విధంగా కబురుచేయటంలో అర్ధం నీవు వంటలు చేయటానికి పనికివస్తావు మా ఇంటిలో నీ స్థానం వంట మనిషిగా, అని... దీప గ్రహించింది.
"మతిమరుపు ముండావాణ్ని మర్చేపొయ్యా. ఇంకో మాట కూడా చెప్పమన్నారు. చదువులేని వాళ్ళకి వందరూపాయలు, చదువుకున్న వాళ్ళకి నూటయాభైట అన్నారు. నా కర్ధంకాక ఏంటమ్మగోరూ అంటే, నువ్వో మొద్దువి నీకేం అర్ధమవుతుందిరా. ఇలాంటివి అర్ధంగావాలంటే చదువుకోవాలి అన్నారు. అమ్మగారికి ఏం చెప్పమంటారు చినదొర్సానమ్మగారూ?" తల గోక్కుంటూ చెప్పాడు రంగయ్య.
"రంగయ్యా! అమ్మగార్ని నే తర్వాత కలుసుకుంటాను. మర్చిపోకుండా వెంటనే వెళ్ళి ఈ మాట చెప్పు. గేదెలను, ఆవులను కొని పాలవ్యాపారం చేయాలని అనుకుంటున్నదిట చినదొరసానమ్మగారు మంచి పాలిశావు (పాలేరు) కావాలట మూడు పెద్దనోట్లు ఇస్తారుట కొంచెం చదువుకున్న వాడిని కుదిర్చి పెట్టమను. అర్ధమయిందా వంట సంగతి నేనే వచ్చి చెపుతాలే ఈ సాయం చేయమను."
"అలాగే చిన దొరసానమ్మగోరూ."
"ఇంక వెళ్ళు, మర్చిపోకుండా చెప్పు."
"అలాగే, అలాగే"