"నిజం అని నువ్వూ మీ అమ్మా అనుకున్నారా?"
"నేనేం అనుకోలేదు మా అమ్మ మాత్రం దీప ఒప్పుకుందేమో, లేకపోతే వాళ్ళ నాన్న ఎందుకు చెపుతాడు అంది."
"మంచిది మనూ! ఉన్నమాట చెప్పావు. మా బావ సంగతి మా ఇంటి పరిస్థితులు అత్తయ్యకి ఏది దాచకుండ ఇదివరకే చెప్పాను. ఇప్పుడు తన స్వార్ధంకోసం మాట మార్చేసింది. అడ్డురాకు నన్ను చెప్పనివ్వు. లోకులు అలా అనుకుంటున్నారు, ఇలా అనుకుంటున్నారు. ఆ లోకుల్లో మీరూ ఒకరయ్యారు. ప్రేమ, పెళ్ళి ఇంత ఆత్రత చూపుతున్నావు ఇంటికి మగవాడు మానాన్న చనిపోయారు. మేమెలా ఉన్నాము? ఎలా బ్రతకాలి? ఇదేమన్నా ఆలోచించావా? పోనీ సానుభూతిగా ఓ ఉత్తరం ముక్క రాశావా? నన్ను పెళ్ళాడటానికి మగాడిగా నిలబడి మా సంసారానికో దారి చూపించావా? అది మగాడి లక్షణమా?"
"అది కాదు దీపా!"
"సమర్ధించు కోటానికి ప్రయత్నించకు. నేను పెళ్ళి కొప్పుకుంటే మా సంసారాన్ని కనిపెట్టివుంటా నన్నాడు మా బావ. బాగానే వుంది. లంచం పెట్టి తన పబ్బం గడుపుకోవాలనే స్వార్ధపరుడు. నువ్వు...పాలమ్మటం పాడుపని, గేదెలని మేపటం దరిద్రం. ఊళ్ళో నలుగురు నాలుగు రకాలనుకుంటున్నారు. వాళ్ళకి తలఒగ్గాలి. మా అమ్మ పెద్దది. ఆవిడ మాటలు పట్టించుకోకు. నన్ను పెళ్ళిచేసుకుని నాతో వుండు, మీవాళ్ళు ఏ గంగలో దూకితే ఏం పని... పూర్తి స్వార్ధపరుడిలా మాట్లాడుతున్నావు. ఏ ఆధారంలేని మావాళ్ళకి బ్రతుకుతెరువు ఎలాగు? సరే, గేదెలు వద్దు పాలుపొయ్యటం వద్దు. పరువుగా గుట్టుగా ఇంట్లోంచి బయటకు రాకుండా మా వాళ్ళు వుంటారు. నన్ను పెళ్ళిచేసుకో. ప్రతినెలా మా వాళ్ళకి మూడువందలు పంపించు. ప్రేమ పెళ్ళి వినసొంపు గానే వుంటాయి. బరువు బాధ్యతలు వుండరాదు అంతేనా!" దీప తీవ్రంగా అంది.
"దీపా...! దీపా...! నువ్వు నన్నర్ధం చేసుకోటం లేదు." మన్ మోహన్ ఆవేశంగా అన్నాడు.
"అర్ధం చేసుకున్నాను మనూ! నన్ను ప్రేమించిన పిరికి వాడివి."
"పిరికి వాడిని కాదు. ఏం చేయమంటావో చెప్పు."
"ఊ... చాలా రోషం వుందే? ఏం చేయమన్నావో చెపుతాను చెయ్యి, ఉన్న పొలము, ఇల్లు అమ్ముకు తినాలి తప్ప మరి మార్గంలేదు మా వాళ్ళకి. మా అమ్మ, తమ్ముడు, చెల్లెళ్ళు వాళ్ళ తినటానికి కావాలి. పిల్లలకి చదువుకి డబ్బవసరం. వాళ్ళ నెవరాదుకుంటారు? ఎలా గడుస్తుంది? కాబట్టి బ్రతుకు తెరువుకి వాళ్లకో మార్గం చూపక తప్పదు. ఎవరి బ్రతుకులు వాళ్ళు బ్రతకటం ఎంతమాత్రం తప్పుకాదు. లోకులంటావ్, వాళ్ళకేం పనిలేదు. గోరంతని కొండంతగా చేసి మాట్లాడుకుంటారు. ఇహ నా సంగతి, కట్నాలు, కానుకలు నాతో ఏం రావు. నేను నేనుగా కట్టుకోటానికి గుడ్డలు మాత్రం పుచ్చుకుని వస్తాను. నన్ను పెళ్ళాడగలవా?"
"నాకు కావలసింది నీవు దీపా! పైసా ఆశించను."
"మంచిది. మరోమాట. మన పెళ్ళి కావాలంటే అత్తయ్యని ఒప్పించవలసి ఉంటుంది. ఆ పని చేయగలవా?"
"ఓ పని చేస్తాను. నిన్ను తప్ప ఎవరినీ పెళ్ళాడనని అమ్మతో చెపుతాను. అమ్మ ఎన్ని సంబందాలు తీసుకొచ్చినా తిరస్కరిస్తుంటాను. ఎప్పటికైనా అమ్మ మనసు మారకపోదు. మనకోరిక తీరకపోదు. అలా గాకపోతే మరో పని చేద్దాము. రిజిష్టర్ మ్యారేజి చేసుకుని అమ్మ దగ్గరకు వెళ్దాము. ముందు బాధపడ్డా తర్వాత ఆశీర్వదించి ఆదరిస్తుంది."
"నాకిష్టంలేదు మనూ! అందరూ ఏమంటారో తెలుసా! దీప తెలివిగలది. కాలాంతకురాలు. ముందే గప్ చిప్ గా మన్ మోహన్ ని పెళ్ళాడి పెద్దింటి కోడలయింది అంటారు. ఇప్పటికే డబ్బెలా సంపాదించాలో దీపకి తెలిసినట్లు ఎవరికీ తెలియదని పేరు పొందాను. కాబట్టి అమ్మని ఒప్పించి నలుగురిలో పెళ్ళి చేసుకుందాము."
"ఎన్ని విధాలో చూశాను. అమ్మ ఒప్పుకునేటట్లులేదు దీపా! ఏం చేయాలో తెలియకనే నీ దగ్గర కొచ్చాను. కొన్నాళ్ళు వేచి చూద్దాము."
"కొన్నాళ్ళు? కొన్ని ఏళ్ళా?"
మన్ మోహన్ మాట్లాడలేకపోయాడు.
"నీకు ఉద్యోగంలేదు. చదువు పూర్తికాలేదు. ఓ పని చెయ్యి. ప్రేమించినమ్మాయిని ధైర్యంగా పెళ్ళాడు. నీ అంతస్తుదిగి వచ్చి నాతో కల్సిపో."
"చూసినవాళ్ళు నవ్వుతారు."
"నీకోసం ఏళ్ళ తరబడి ఆగుతాను. వయసు పెరిగి పోతుంటుంది. చూసిన వాళ్ళు నవ్వరా? ఏ నమ్మకంతో ఏళ్ళ తరబడి ఆగను. నా అంతస్తు నీ స్టేటస్ కి తగదు. లోకులు నవ్వుతారు. భయం. రేపు పెళ్ళయితే మా ఇంటికి రావటానికి సిగ్గు పడవలసి వస్తుంది. రేపు మా వాళ్ళు ఏదయినా అవసరం అయితే ఇంటి అల్లుడిగా నిలిచి ఏ మాదుకుంటావ్? ఏం చెయ్యవు. చెయ్యలేవు. నేనుమటుకు నీకు కావాలి. అంతేనా మనూ! మీ అమ్మ పట్టుదలకి లొంగి వచ్చి, మన పెళ్ళికి ఒప్పుకుందే అనుకుందాం. ఆ తర్వాత మీ అమ్మ మా వాళ్ళని చూడవద్దంటే చూడవుగా."
మనూకి ఏం మాట్లాడాలో తోచలేదు. గోళ్ళు కొరుక్కుంటూ ఉండిపోయాడు. దీప మౌనంగా కూర్చుంది. కాసేపాగి... "అమ్మతో ఇలాగే అర్ధంలేని వాదన జరిపుంటావు. అందుకే అమ్మకు కోపం వచ్చింది. నీ తెలివేమయింది దీపా" తగ్గి మాట్లాడినట్లయితే అమ్మకెలాగూ నీపై ప్రేమవుంది కాబట్టి మెల్లగా తానే దిగి వచ్చేది" నెమ్మదిగా అన్నాడు.
దీప లేచి నిలబడింది. "చూడు మనూ అనవసరంగా మాటలు పడుతూ తగ్గి ఉండటం నటనయగారాలతో పనులు చక్కపెట్టుకోవటం నాకు చాతగాదు. నాదంతా ముక్కుసూటి వ్యవహారం. మొదటినుంచి నీకు తెలిసిన విషయమే. ఎవరో ఏదో అంటారని భయపడను. నేచేస్తున్న పని మంచిదయినప్పుడు సిగ్గుపడను. మగవాడివి, ఆ ధైర్యం ఆ తెగువ నీలో లేవు. పిరికివాడిని పెళ్ళాడిన ఏ ఆడది సుఖపడలేదు. కష్టం వస్తే నిలబడాలి. అవసరమొస్తే కాయ కష్టం చేయటానికి సిద్ధపడాలి. అలా నీవుంటే చాలా ఇష్టపడేదాన్ని మనూ! పిరికి తనమంటే చాలా అసహ్యం నాకు" అని దీప బిందెను నడుంకి ఎత్తుకుంది.
దీనికి పౌరుష మెక్కువని తెలిసే అన్నపూర్ణమ్మ కావాలని చాలా మాటలంది. అన్నింటికి సానునయంగా మాట్లాడుతూనే పదునైన జవాబు లిచ్చింది దీప. ఆ మాటలేవీ మన్ మోహన్ తో చెప్పలేదు. తెలిసిన పిల్లగా తనపై ప్రేమవుంది గాని కోడలిగా చేసుకోవటానికి సుతారము ఇష్టంలేదని గ్రహించి మన్ మోహన్ పిరికితనము, ఎలాగూ తెల్సుగాబట్టి దీప ఇవతలికి తప్పుకుంది. ఇప్పుడు మన్ మోహన్ ఒంటరిగా చూసి కర్ర విరగరాదు పాము చావరాదు అన్నట్లు మాట్లాడుతున్నాడు. దీప గట్టి నిర్ణయానికొచ్చింది.
"వెళుతున్నావా దీపా"
"ఊఁ"
"నన్నేం చేయమంటావ్! చెప్పి వెళ్ళు"
"స్వయం నిర్ణయం లేనివారు జీవితాంతం ఇతర్ల సలహామీదనే జీవిస్తారు. చెప్పాగా! పిరికివాడి భార్య సుఖపడలేదని."
"నా మీద ప్రేమలేదా దీపా."
"చిన్నప్పటినుంచి స్నేహంతో ఎలా ప్రేమిస్తున్నానో అలాగే ఇప్పటికీ ప్రేమిస్తున్నాను. పెళ్ళి అయిం తరువాత ప్రేమ వేరుగా వుంటుంది. అప్పుడు అలా ప్రేమిస్తాను. చాలా ఇంకేమయినా అడగాల్సి వుందా?"
"అమ్మని వప్పించి వస్తాను. మన పెళ్ళికి అభ్యంతరం లేదుగా?"