ఈసారి నిజంగా దుఃఖం ఆగలేదు. అక్కడే రోడ్డు చివర ఓ బండ మీద కూర్చుని తనివితీరా ఏడ్చి ఇంటికెళదామని అనిపించింది. పోగొట్టుకున్నది రాయి కాదు రవ్వ! అని తెలిస్తే ఎంత బాధగా వుంటుందీ?
* * *
నేను వెళ్ళేసరికి అత్తయ్య కారాలు మిరియాలూ నూరుతోంది.
"ఏమిటంత ఆలస్యం? కారెందుకు ఒద్దన్నావూ?" అని అరిచింది.
"డాక్టర్ వాకింగ్ చెయ్యమన్నాడు" అని ఆమె మొహంలోకి చూశాను.
నేను ఆశించిన భావాలు కనిపించాయి.
"ఒంట్లో ఎలా వుందీ అనడిగింది.
"బావుంది" అన్నాను.
"మరి డాక్టర్ దగ్గరికి ఎందుకెళ్ళావు?' జయంతి వచ్చి ఆరాగా అడిగింది.
"డైటీషియన్ దగ్గరికి వెళ్ళానులే స్లిమ్ గా, ఫిట్ గా వుండడానికి" అన్నాను.
జయంతికి తగలవలసిన చోటే తగిలింది. ఆమె చాలా లావు! మొహం నల్లగా చేసుకుని "ఇప్పుడు లావయ్యావనా?" అంది.
"అవలేదు. కానీ ఇలా మెయిన్ టైన్ అవ్వాలిగా" నవ్వుతూ అన్నాను.
"ఎందుకూ?" కాస్త నిష్టూరంగా అడిగింది అత్తయ్య.
"ఎందుకేమిటీ? అందంగా ఆకర్షణీయంగా కనిపించడం ఎవరికైనా అవసరమేకదా!" అన్నాను.
"పెళ్ళి కావలసిన పిల్లవి కాదూ! మోడలింగ్, ఏక్టింగ్ చెయ్యబోవడం లేదూ....మరింకెందుకూ?" విపులంగా అడిగింది జయంతి.
"జయంతీ! మనిషికి కొన్ని అభిరుచులుంటాయి. కొంతమందికి రుచిగా తినడం, మరికొంతమందికి ఇంటిని అలంకరించుకోవడం....ఇంకా కొంతమందికి ఒంటిని అందంగా వుంచుకోవడం! ఇందులో ఆశ్చర్యం ఏముందీ?" అన్నాను.
నా మాటలకి ఇద్దరూ మూతులు ముడుచుకున్నారు.
మేం పేరంటానికి వెళ్ళినచోట అందరూ అత్తయ్యని "మీ అబ్బాయికింకా పిల్లలులేరా? పెళ్ళయి ఏడాది అయిందిగా?" అనడిగారు.
"మావాడు అమెరికా వెళ్ళాలిట. ఇక్కడ పిల్లలు పుడితే అక్కడ క్లెయిమేటుకి ఎడ్ జస్ట్ అవడం కష్టం అని చూస్తున్నారు" అంది అత్తయ్య.
'ఓసినీ....నీ నాలికకి నరం లేదుకదే! ఆ ప్రియంవదకి కోపం వచ్చి ఒక తన్ను తంతే నీ మొగుడూ, కొడుకుల చేతకానితనం బయటపడుతుందని చెప్పక ఎంత బాగా కవర్ చేస్తున్నావే' అనుకున్నాను.
పెళ్ళానికి శ్రీమంతం జరుగుతుంటే ఆ భర్త తనేదో ఘనకార్యం చేసేసినట్లు అక్కడక్కడే తచ్చాడడం, వరుసైన వాళ్ళ పరిహాసాలు చూడడానికి ఎంత బావున్నాయో! ఎత్తుగా వున్న కడుపు...అసాలు ఎబ్బెట్టుగా లేదు. ఆ అమ్మాయిది సామాన్యమైన అందమైనా ఈ గర్భంవలన చాలా అందంగా అనిపిస్తోంది. సృష్టిలోని అతి పెద్ద వింత! ఒక మనిషి ఇంకో మనిషిని తయారు చెయ్యడం, జన్మనియ్యడం ఎంతటి పవిత్రమైన పనో వ్యక్తిత్వం నిర్మించడం కూడా అంతే గొప్పపని! చాలామందికి ఈ విషయం తెలీదు. ఒక మనిషి వ్యక్తిత్వం అనేది చిన్నప్పుడు తన పనులు తను చూసుకోలేని స్థితిలో తల్లి చేతిలో, వయసు వచ్చాకా తన కోర్కెలు తీరడానికి మార్గంగా కనపడే ప్రియురాలి చేతిలో....ఇలా స్త్రీమీద పురుషుడు ఆధారపడడం నేర్చుకుంటాడు. అతని ఈ పారసైటిక్ నేచర్ ను సంస్కరించి అతన్ని స్వతంత్రుడిగా మార్చడం ఆమె చేతిలో పనే! కానీ అతన్ని గుప్పెటలో పెట్టుకోవటం కోసం చాలామంది స్త్రీలు మన దేశంలో అతన్ని స్వతంత్రంగా ఏ పనీ చేసుకోనివ్వరు.....అతన్ని అప్రయోజకుడిగా తీర్చిదిద్దుతాయి. నా కడుపున ఓ మగబిడ్డ పుడితే అతన్ని పరిపూర్ణంగా తీర్చిదిద్దుతాను. స్త్రీతో ఎలా ట్రీట్ చెయ్యబడాలో, స్త్రీని ఎలా ట్రీట్ చెయ్యాలో నేర్పుతాను అనుకున్నాను. కానీ నాకా అదృష్టం వుందా?
ఇంటికి వచ్చేశాక కూడా ఆ ఆలోచనలు మనసుని ప్రశాంతంగా వుండనీయలేదు.
ఊహ తెలిసిననాటి నుండీ ఆడపిల్ల తనకి కాబోయే భర్త గురించి ఎన్నెన్నో వూహించుకుంటుంది. ఇది ప్రకృతి సహజం. పోలీస్ ఆఫీసరైనా, దేశాన్ని పాలించే నేత అయినా తన పురుషుడి గురించి కలలు కనదు అనడం ఒట్టిమాట! కానీ పురుషుడు పెద్దగా వూహించుకోడు. కలలు కంటాడు. కానీ అవన్నీ కామానికి సంబంధించినటువంటివి! ఆమెకి తృప్తి లభించడానికి కేంద్రం మనసు! అతనికి శరీరం! ఈ తేడా ఎందరో భార్యాభర్తల్ని విడదీసింది. మనస్పర్ధలు తెచ్చిపెట్టింది. స్త్రీ పురుష సంబంధాలనేవి లాకర్ కోడ్ లాంటివి, సరైన కాంబినేషన్ ఎవరు తిప్పితే వారికి లాకర్ తెరుచుకుంటుంది. చాలా సందర్భాల్లో ఈ కోడ్ తెలిసిన వాళ్ళు జీవిత భాగస్వాములు కాకపోవచ్చు! ఇదే పాయింట్ ఎందరో రచయితలనూ సినిమా దర్శకులనూ బ్రతికించేస్తోంది.
ఆనంద్ కోడ్.....ప్రియంవదకి తెలుసా?
* * *
నేను ఆ మాట అనగానే అందరూ ఎలా రియాక్ట్ అవుతారని ఆశించానో అలాగే రియాక్ట్ అయ్యారు.
"నువ్వు ఉద్యోగం చేస్తావా? ఎందుకూ...?" కోపంగా అడిగాడు ఆనంద్.
"అసలు చదువుకి ఒప్పుకోవడమే తప్పయింది" సాధింపుగా అంది అత్తయ్య.
మావయ్య మౌనంగా కూర్చున్నాడు.
"నాకేం తోచడంలేదు. అదే పిల్లలుంటే ఎంచక్కా పొద్దుపోయేది" ఎక్కడ కొట్టాలో నాకు తెలుసు.
"నీ మొహానికి అదొక్కటే తక్కువ" హేళన చేశాడు ఆనంద్.
"ఉన్నవాళ్ళం ఏం సుఖపడుతున్నాం కనుక" సాగదీసింది నెయిల్ పాలిష్ పెట్టుకుంటూ జయంతి.
"అవేం మాటలు జయంతీ?" అన్నాడు వినోద్.
అతను ఆ మాట అనగానే నేను అభినందనగా చూశాను.
మరు నిమిషం జయంతి "మీరు ఇక్కడనించి వెళతారా? ఇది మా ఫ్యామిలీ మేటర్" అంది.
'నీ ఫ్యామిలీ అతడేనే....ఇది నాకు సంబంధించిన నా ఫ్యామిలీ మేటర్' అని చెవులు మెలేసి చెప్పాలనిపించినా ఓర్చుకున్నాను.
"ఎక్కడ ఉద్యోగం చేయాలనుకుంటున్నావూ...?" అడిగాడు మావయ్య.
"నాన్నా" అని ఏదో చెప్పబోయిన ఆనంద్ ని ఆపి "మా ఫ్రెండ్ ఆఫీసులో చేస్తావా? గురుమూర్తికి ఏదో కంప్యూటర్స్ కోచింగ్ సెంటర్ వుంది" అన్నాడు మావయ్య."
"ఎక్కడైనా సరే!" అన్నాను. నాకు స్వేచ్చకావాలి. ఆ పంజరంలో రోజంతా బంధింపబడి వుండి వుండీ పిచ్చెక్కుతోంది.
"మనిషన్నాకా ఏదో ఒక వ్యాపకం వుండాలిలేరా...!" అన్నాడు ఆనంద్ తో మావయ్య.