Previous Page Next Page 
ప్రేమకు పెట్టుబడి కావాలి పేజి 19


    కాలేజీడే టైంలోనో, కల్చరల్ ఫంక్షన్స్ టైమ్ లోనో, కాలేజికి కిలోమీటరు దూరంలో వున్న ఆ ఆడిటోరియంకి వస్తారు తప్ప, మిగతా రోజుల్లో అటువేపు ఎవరూ రారు.

 

    స్టూడెంట్స్ దానిని లవర్స్ ఆడిటోరియం అని ముద్దుగా పిల్చుకుంటారు.

 

    మూడు నలభై ఐదు నిమిషాలు.

 

    చేతివాచీవేపు చూసుకున్నాడు మధు.

 

    ఆ సమయంలో అతను, ఆడిటోరియం పోర్టికోలో స్తంభం పక్కన చాటుగా నుంచుని, గార్డెన్ వేపు చూస్తున్నాడు.

 

    పదినిమిషాలు గడిచాయి.

 

    అతని గుండె లబ్, డబ్ మంటోంది.

 

    ఏ క్షణాన్నయినా అన్విత రావచ్చు. ఆమెతో ఏం మాట్లాడాలో రిహార్సిల్ చేసుకుంటున్నాడు.

 

    కెమిస్ట్రీ లెక్చరరు మధుమతి ఆడిటోరియంవేపు వెళ్లడం చూసిన తెలుగు లెక్చరరు సుబ్బారావు "ఒంటరిగా ఈవిడ అటు ఎందుకు వెళుతోంది" అన్న సందేహంతో ఇంకో దారి వెంబడి ఆడిటోరియంవేపు వస్తున్నాడు.

 

    సుబ్బారావును చూసి మధు, చెట్లమధ్య నుంచి పక్కకు తప్పుకుని పోదచాటున నిలబడ్డాడు.

 

    సుబ్బారావు స్తంభం పక్కకొచ్చి నుంచున్నాడు.

 

    దూరం నుంచి సుబ్బారావును చూసిన మధుమతి 'తన ఊహ కరక్టే' అనుకుని గబగబా, విసురుగా అతని దగ్గరకొచ్చి-

 

    "ఇద్దరూ కూతుళ్ళకూ పెళ్ళిళ్ళు చేశావు..... నీకిదేం బుద్ధి?" అంది గట్టిగా.

 

    "ఈ టైమ్ లో మీరు ఐటెందుకు వస్తున్నారో తెలియక నేనూ ఇటొచ్చాను.... దీనికి నా బుద్ధికీ ఏమిటి సంబంధం? నా కూతుళ్ళకు పెళ్ళీడొచ్చింది కాబట్టి  పెళ్ళి చేశాను. అది తప్పెలా అవుతుంది? సరిగ్గా ఈ టైమ్ లోనే ఈ ఆడిటోరియం దగ్గరికి రమ్మని, ఎవరో చెప్పారని, ఒక కుర్రాడు నాకు చెప్పాడు."

 

    "అయినా ఈ వయసులో ఈ దొంగాటలేమిటి?" అన్నాడతను.

 

    "నీ సంగతి, నీ మాటలద్వారా నాకెప్పుడో తెల్సిపోయింది. ఏంటీ లెటర్.... లవ్ లెటర్...... ఎందుకు రాశావ్? సారీ చెప్పకపొతే ప్రిన్సిపాల్ కి రిపోర్ట్ చేస్తాను" బెదిరిస్తూ అందామె.

 

    "లెటరేమిటి? నేను రాయడం ఏమిటి? అసలే బీపీ పేషెంటుని. న్నాను ఇరకాటంలో పెట్టకు."

 

    ఇద్దరి మధ్య గొడవ ముదిరిపోయింది.

 

    వైట్ డ్రెస్ లో మధుమతి, ఆమె చేతిలో లెటరు, మధుకి కొంతలో కొంత అర్థమైపోయింది.

 

    ఇంతలో ఆ గొడవకి అక్కడికి మిగతా లెక్చరర్లు, స్టూడెంట్స్ వచ్చేశారు. వాళ్ళందరి వెనుక మధు నిలబడ్డాడు. అప్పుడే అన్విత కూడా అక్కడకొచ్చింది.

 

    "మధుమతిగారూ! ఆ లెటరు సుబ్బారావు నీకు పంపలేదంటున్నాడు కదా! అసలు ఎవరిచ్చారు ఆ లెటరు?" ప్రశ్నించాడు నారాయణ.

 

    "ఎవరో కుర్రాడు?"

 

    "ఎవరా కుర్రాడు?"

 

    "ఎక్కడో చూసినట్టు గుర్తు...... ఎక్కడో తెలీదు...." ఏదో జ్ఞాపకం  తెచ్చుకుంటోందామె.

 

    గబగబా మధు వెనక్కి వచ్చి క్యాంటీన్ వేపు పరుగెత్తాడు క్యాంటీస కుర్రాడ్ని పట్టుకొని-

 

    "నువ్వు అర్జంటుగా సినిమాకెళ్ళిపో..... రేపు కూడా రావద్దు. మీ ఓనర్ తో నేను చెప్తాలే" అని అవాడ్ని బయటకు పంపించేసి ఊపిరి పీల్చుకున్నాడు మధు.

 

    'ఆ లెటర్ని ఎలాగైనా మధుమతి మేడమ్ దగ్గర్నించి తీసేసుకోవాలి నిర్ణయించుకున్నాడు మధు.

 

    
                                         *    *    *

 

    "ఏమైంది.....?" షాపులో అడుగుపెట్టిన మధుని అడిగాడు సుల్తాన్.

 

    "కథ అద్దం తిరిగింది" నీరసంగా చెప్పాడు మధు.

 

    "ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా వుండాలని చెప్పాను..... విన్నావు కాదు"

 

    "ఇలా జరుగుతుందనుకోలేదు" అన్నాడు మధు.

 

    "ఇలాంటివి మామూలే...... ఆ ఉత్తరాన్ని లాక్కోవాలి..... రేపు మేడమ్ దగ్గరకెళ్ళి అసలు విషయం చెప్పేయ్..... ఏ గొడవా వుండదు. ఈ లవ్ లెటర్ ఎక్సపరిమెంట్ ఫెయిలైంది కాబట్టి - ఇంకొకటి రేపటికి ఆలోచిస్తాను" చెప్పాడు సుల్తాన్.

 

    
                                           *    *    *

 

    కాలేజికి ఎదురుగా వున్న రెస్టారెంట్ రవి, రమణ, బుచ్చిబాబు, షాజహాన్ కూర్చున్నారు.

 

    "ఏమిటీ.....? మన మధుగాడు నిన్న అన్విత ఇంటికి వెళ్ళాట్ట?" అన్నాడు రవి.

 

    "ఇది న్యూస్?" అన్నాడు రమణ.

 

    "అన్వితకు లైన్ వేస్తున్నాడేమో?" అన్నాడు షాజహాన్.

 

    "వాడికి లైనొకటి..... అన్విత లాంటి వాళ్ళకి, పిరికివాళ్ళ అవసరం వుండదు" అన్నాడు రవి.

 

    "ఏ పుట్టలో ఏ పాముందో" అన్నాడు రమణ.

 

    "పుట్ట గురించి తెలిశాక, పాము గురించి కూడా తెలుస్తుంది కదా..... ఆ పాము అప్పుడే చస్తుంది. మధ్యాహ్నం ఆ కెమిస్ట్రీ మేడమ్ ఎపిసోడ్ ఏంట్రా? సుబ్బారావేమిటి, మధుమతికి లవ్ లెటర్ రాయడమేంటి? ఆయన బోర్డుమీద లెసనే రాయలేడు" అన్నాడు రవి.

 

    "ఈ సంవత్సరం కాలేజీలో కొత్త కొత్త విచిత్రాలు జరుగుతున్నాయి" అన్నాడు బుచ్చిబాబు.

 

    "అసలు ఆ లెటరు ఎవరు ఎవరికి రాశారో కనుక్కుంటే సస్పెన్స్ విడిపోతుంది"

 

    "మేడమ్ కి ఆ లెటర్ని ఎవరో కుర్రాడిచ్చాడట- వాడ్ని పట్టుకుంటే?" అన్నాడు రమణ.

 

    "వాడ్ని పట్టుకునే పూచీ నాది. రేపీ టైంకి సస్పెన్స్ విడిపోతుంది చూడు" షాజహాన్ చెప్పాడు.

 

    ఎందుకో రవికి మధు మీద అనుమానం వచ్చింది.

 

    తన అనుమానం అతను బయటికి వ్యక్తం చేయలేదు.

 

    వాలు కుర్చీలో కూర్చుని, ఆకాశంలోకి చూస్తున్నాడు మధు.

 

    లవ్ లెటర్, డ్రాపింగ్ ప్లాన్ ప్రకారం  జరగకపోవడంతో అతను బాగా డిస్టర్బ్ అయిపోయాడు.

 

    సరిగ్గా ఆ సమయంలో వచ్చాడు మైదానం నారాయణ.

 

    "ఈ రైటింగ్ ఎవరిది? నీదేనా?" జేబులోంచి తను రాసిన ఉత్తరాన్ని తీసి చూబెట్టేసరికి మధు ముఖం వెలవెలబోయింది.

 

    "ఎవరికి రాశావ్? మధుమతి మేడమ్ కా? మంచి వయసులో వున్న కుర్రాడివి. అందగాడివి, ఆస్తిపాస్తులున్నవాడివి. బోలెడు ఆస్తికి ఒక్కడే వారసుడివి.

 

    పరువు- ప్రతిష్టలున్న కుటుంబం నుంచి వచ్చినవాడివి. నీలోని హార్మోన్స్ నీకు తెలియకుండానే యాక్టివేట్ అయితే, వయసులో వున్న అమ్మాయిని చూసుకోవాలి. అంతేగానీ- నడివయసులో వున్న మధుమతిగారి మీద దృష్టిపడటం ఏమిటి?" సీరియస్ గా అడిగాడు మైదానం నారాయణ.

 

    "కాదు....." సంకోచంగా చెప్పాడు.

 

    "ఫర్వాలేదు చెప్పు."

 

    "ఎవరికీ చెప్పనంటే ధైర్యంగా చెప్తాను."

 

    "చెప్పు?"

 

    "అన్వితకు."

 

    ఆశ్చర్యపోలేదు నారాయణ.

 

    "ప్రేమించడం తప్పుకాదు. నేను చిన్నప్పుడే ప్రేమించే పెళ్ళి చేసుకుందామను కున్నాను. కారణాంతరాలవల్ల వీలుపడలేదు. నువ్వు అన్వితను ప్రేమిస్తున్నావ్. ఆ అమ్మాయికి లవ్ లెటర్  రాశావ్. కానీ ఆ లవ్ లెటర్  ని నువ్వే స్వయంగా ఆ అమ్మాయికిచ్చే ధైర్యం లేకపోతే ఎలా?

 

    నీలాగే నేనూ కాలేజీ రోజుల్లో ఐశ్వర్యారాయ్ లాంటి అమ్మాయిని ప్రేమించాను. ఎదురుపడి చెప్పే ధైర్యంలేక నీలాగే ఉత్తరం రాశాను. అయితే  అప్పుడు నేను చేసిన తప్పేమిటంటే, లెటర్ కింద భాగంలో సంతకం పెట్టాను. ఆ క్షణం నుంచే విధి నాతో ఆడుకోవటం మొదలుపెట్టింది. ఆ లెటరు తీసుకెళ్ళిన కుర్రాడు వేరే అమ్మాయికిచ్చాడు. ఆ అమ్మాయికి ఇద్దరు రౌడీ అన్నయ్యలున్నారు . దాంతో విధిలేక మీ మేడమ్ మెడలో తాళి కట్టాను"

 

    "మీతో విధి ఆడుకున్నట్టుగానే, నాతో కూడా ఆడుకుంటుందంటారా? భయం, మొహమాటం..... సిగ్గుతో అలా చేశాను."

 

    "ప్రేమలో మొహమాటలకు, అపార్థాలకు తావులేదు. జీవితంలో నువ్వు ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఎదగాలంటే ఎవరి సహాయం లేకుండా నీకు సంబంధించిన విషయాలను డైరెక్ట్ గా డీల్  చేసుకో...... అందులో మొదటిది ప్రేమ. అది నీ మనుగడకు నిచ్చెనలాంటిది. అండర్ స్టాండ్ ?" చెప్పి ఆగాడు నారాయణ.

 

    "ఈ ఉత్తరం మీకెలా వచ్చింది?" అడిగాడు మధు.

 

    "నీ రైటింగ్ నాకు తెలుసు కాబట్టి..... మధుమతి మేడమ్ కి నా మాటంటే గురి కాబట్టి ఆ విషయం వదిలెయ్. నువ్వు అన్వితను చాలా సీరియస్ గా ప్రేమిస్తున్నావా..... అందుకోసం మీ అమ్మా, నాన్నల్ని వ్యతిరేకించగలవా?"

 

    "ఎస్!"

 

    "అందులో కష్టసుఖాల గురించి ఒకసారి ఆలోచించి చెప్పు."

 

    "ఎస్!" రెండోసారి చెప్పాడు మధు.

 

    "గుడ్!"

 

    "మామూలుగా ఓ అబ్బాయి, ఓ అమ్మాయి కలుసుకోవడం, ఇష్టపడడం, లవ్ లెటర్స్ రాసుకోవడం, దొంగచాటుగా సినిమాలు, షికార్ల వెళ్ళడం, దిసీజ్ ఆర్డినరీ లవ్. ఒకమ్మాయిని నువ్విష్టపడితే, ఆ అమ్మాయిని నువ్వు నీ ఆకర్షణీయమయిన బిహేవియర్ ద్వారా, జోక్స్ ద్వారా, ఖరీదైన అలవాట్ల ద్వారా, చిన్న చిన్న గిప్ట్ ల ద్వారా ఆకర్షించడం ఇదొక పద్ధతి.

 

    ట్రెండ్ మారిపోయింది....బిజినెస్..... లైఫే ఒక బిజినెస్ అయిపోయింది. లవ్ బిజినెస్ లో పార్ట్ అయిపోయింది. కట్నం తర్వాత వచ్చే కానుకలన్నీ వడ్డీలాంటివి.

 

    మొత్తం ట్రెండ్ మారిపోయింది. మోడ్రన్ యూత్ వ్యవహారసరళి మారిపోయింది. ఇష్టా- యిష్టాలు మారిపోయాయి. ప్రేమన్నది కాస్ట్ లీ వ్యవహారమైపోయింది.

 Previous Page Next Page