Previous Page Next Page 
అక్షరయజ్ఞం పేజి 19

 

      తన కలల్ని కాలరాసిన కఠినాత్ముడు.
   
    తన ఆశల్ని, ఆశయాల్ని, భవిష్యత్ ని సర్వనాశనం చేసిన కాలనాగు.
   
    వెతకబోయిన తీగ కాలికి తగలబోతోంది.
   
    ఎప్పటికయినా థానే ఎదురువెళ్ళి, కవ్వించి, కయ్యానికి దింపి ఎదురుదెబ్బ తీయాలని చూస్తున్న మనిషి ఎదురుకాబోతున్నాడు. ఈ అవకాశాన్ని జారవిడుచుకోకూడదు.
   
    రక్తం కారకుండా పీకలు కోయగల భరద్వాజ- నాగరికంగా, న్యాయపరంగా వెన్నుపోటు పొడవగల భరద్వాజ. తన అస్థిత్వాన్నే ప్రశ్నించిన భరద్వాజ- తన పేదరికాన్ని పరిహసించిన భరద్వాజ- రెండు నాలుకల విషసర్పమైన భరద్వాజను తను వదలకూడదు.
   
    ఒక ప్రక్క గంగాధరరావు చెప్పే వివరాల్ని వింటూనే దుఃఖభాజకమైన జ్ఞాపకాల తెరల్ని పైకి లేపుతున్నాడు మాధుర్.
   
                                  *    *    *    *    *
   

    "మనకందిన వివరాల ప్రకారం ఇప్పుడు మాధుర్ గంగాధరరావు అనే మనిషితో ఎక్కడికో బయలుదేరి వెళ్ళినట్లు తెలియవచ్చింది. ఎవరా గంగాధరరావు? మీకేమయినా తెలుసా అంకుల్?"
   
    మౌనిక ప్రశ్నకు రమణయ్య క్షణం ఉలిక్కిపడ్డాడు.
   
    ఆమె మాధుర్ మీద చూపిస్తున్న ఆసక్తికి ఆశ్చర్యపోయాడు.
   
    రమణయ్య కొన్ని క్షణాలు మౌనంగా ఆలోచిస్తూండిపోయాడు.
   
    తీగ కదలబోతోంది.
   
    డొంకంతా కదలక తప్పదు.
   
    ఇప్పుడు గంగాధరరావు బయటకొస్తే భరద్వాజ తప్పక బయటకొస్తాడు. దాని పర్యవసానం...?
   
    తప్పక ఓ ప్రళయాన్ని సృష్టిస్తుంది.
   
    ఆ సత్యానికి తనే ప్రధాన సాక్ష్యం.
   
    తను అదృశ్యమైపోతే...?!
   
    "ఈ ప్రపంచంలో నేను తాతగారితోపాటు సమానంగా గౌరవించేది, అభిమానించేది మిమ్మల్నే అని మీకు తెలుసు. మీరిప్పుడు నాకు సహకరించక పోతే నేను ఓడిపోవటం ఖాయం. నేను ఓడిపోవటం మీకు ఇష్టమే అయితే...." ఆ పైన మాటల్ని మ్రింగేసింది మౌనిక.
   
    ఆమె మాటల్లో ధ్వనించిన నిష్టూరానికి రమణయ్య చాలా బాధపడ్డాడు.
   
    "ఈత రానివాడు హిందూ మహాసముద్రం లోతు కొలుస్తాడనడంలో రెండు అర్ధాలు స్ఫురిస్తాయమ్మా! ఒకటి అలా అన్నవారిలో మూర్ఖత్వం మూర్తీభవించినట్లు- రెండు హిందూ మహా సముద్రం లోతు కొలిచే లక్ష్యాల్ని సాధించేందుకు అతను క్షుణ్ణంగా నేర్చుకోగలను అనే ఆత్మవిశ్వాసం- నాకు నిన్ను చూస్తుంటే రెండో రకానికి చెందుతావనే నమ్మకమే కలుగుతోంది..."
   
    నిశ్శబ్దంగా వున్న ఆ ఛాంబర్ లో మౌనిక పచార్లు చేస్తుంటే రమణయ్య చెప్పుకుపోతున్నాడు.
   
    "ఈ ప్రపంచంలో ఏ యువతీ చేయలేని సాహసం చేయబోతున్నావు. తలుచుకుంటే ఏ పనయినా ఒక్క మగాడే కాదు చేయగలిగేది అని నిరూపించబోతున్నావు. ఆడది అబల కాదు సబల అనేది పాత వాసన కొడుతోంది. అందుకే ఆడది సబల కాదు సాహసి అని నీ ద్వారా నిరూపణ కాబోతోందని నాకానందంగా వుందమ్మా! చెప్పేదానికి చేసేదానికి చాలా తేడా వుంది. నథింగ్ బీట్స్ ఎక్స్ పీరియన్స్... ఇంక నువ్వు నన్నేం వివరాలు అడగవద్దు. వివరంగా నువ్వే ప్రతి విషయాన్ని కదిలించి చూడు... కష్టాల్ని కలిచివేయ్.... నీకే కొత్త కొత్త విషయాలు... అనూహ్యమైన సంఘటనలు ఎదురవుతాయి.
   
    ఇప్పుడు నిన్ను నేను సమర్దిస్తున్నాను. రేపెప్పుడయినా మీ తాతగారికి నేను ఎదురుపడాల్సి వచ్చినా భయపడను."
   
    అనుభవాలతో పండిపోయి అరమగ్గినట్టున్న  రమణయ్య కళ్ళు వుండుండి చలిస్తున్నాయి. ఎన్నో ఏళ్లనాటి జ్ఞాపకాలు లీలగా అతని మనోనేత్రం ముందునుంచి ముత్యాల్లా జారిపోతున్నాయి.
   
    మౌనిక అప్పుడు రమణయ్య అంతరంగ మధనాన్ని సరిగ్గా  అంచనా వేయగలిగింది. అందుకే మరింకేమీ ఆమె రెట్టించలేదు. ఇతరులు చెప్పడంకన్నా తనంతట తాను తెలుసుకుంటేనే సముచితంగా వుండే విషయాలు.... వ్యక్తులు తనకిప్పుడు తారసపడటం తథ్యం... ఆమె ఆలోచనలిలా వుండగా ఆయన తిరిగి చెప్పడం ప్రారంభించాడు.
   
    "గంగాధరరావు మంచివాడు. తనను తాను నాశనం చేసుకునేంత సాత్వికుడు... మోస్ట్ కన్జర్వేటివ్...లౌక్యం అంటే అసలేమీ తెలీనివాడు- తాతల ఆర్జనను పెంచుకోకున్నా ముందు తరానికి మిగుల్చుకుందామని వ్యాపారానికి అడుగిడిన అల్పసంతోషి! ఏం జరిగింది? ఎలా జరిగింది? ఎవరివలన జరిగింది? అంతా ఒక మిస్టరీ... ఆయనకు మాధుర్ జతపడటం ఒక అద్భుతమైతే.... ఆ మధుర్ కి నువ్వో మధ్యతరగతి ఆడపిల్లలా పరిచయం కాబోవటం అత్యద్భుతం."
   
    రమణయ్య కంఠంలో లీలగా ఉద్వేగం తొంగిచూసింది.
   
    దాన్నామె పసిగట్టి మరింత ఉత్సాహపడుతోంది.
   
                                               *    *    *    *    *
   
    "ఈ భరద్వాజను నేను కలుస్తాను."
   
    మాధుర్ మాటలకు ప్రక్కలో బాంబుపడ్డట్టు అదిరిపడ్డాడు గంగాధరరావు.
   
    అతనికో క్షణం ఏం మాట్లాడాలో అర్ధంకాలేదు.
   
    మాధుర్ కేసి భయంగా, వెర్రిగా చూశాడు.
   
    "రెస్పాన్సేం ఇవ్వరేం?" మాధుర్ కాళ్ళకడ్దొస్తున్న చెత్తను ప్రక్కకు నెడుతూ అడిగాడు.
   
    "ఈ సంస్థ పునరుజ్జీవనం పొందాలని కాని, పుట్టెడు ఆస్తి సంపాదించాలని కాని నాకిప్పుడు లేదు. ఈ దేశంలో మేధస్సుండి ఉపయోగించు కోలేకపోతున్న వాళ్ళు చాలామంది వుండవచ్చు. మేధస్సు వున్నవాళ్ళను గుర్తించి ఉపయోగించుకునే వాళ్ళూ వుండవచ్చు. నాకిప్పుడా మీమాంస లేదు. నా పరిధిలోకి వచ్చిన నిన్ను... నీ కష్టాల్ని, నీ తెలివితేటల్ని...నీ ఫ్రస్టేషన్ ని చూసి మనిషిగా ఒకింత చలించాను. నిన్ను నిన్నుగా నీ వాళ్ళకు నీవుగా వుపయోగపడతావనీ, దానికోసం ప్రమాదాల్ని కొని తెచ్చుకుంటానంటే రెస్పాన్స్ సడన్ గా ఎలా ఇవ్వగలను?"
   
    మాధుర్ గంగాధరరావుకేసి పరిశీలనగా చూశాడు.... తన ప్రయత్నానికి పూర్తి విముఖత ఆయన కళ్ళలో కనిపించడాన్ని కూడా చూశాడు.
   
    "వ్యాపారంలో సమస్యల్ని స్క్రాప్ క్రింద అమ్మేయాలి.... లాభాన్ని, సంతోషాన్ని కొనుక్కోవాలి. ప్రమాదాల్ని, నష్టాల్ని ఎంతో కొంతకు వదిలించుకోవాలి. నేనదే చేద్దామనుకుంటున్నాను. ప్రయాణం కొనసాగించు..... దారిదే అని మార్గదర్శకులయి... ఆ తరువాత జాగ్రత్త ఆ దారి పొడవునా ముళ్ళు, గోతులు వుంటాయి.. వాటి వెనుకే ప్రమాదాలు పొంచి వుంటాయంటే ప్రయాణాన్ని కొనసాగించాల్సిన వాడు ఎలా ఫీలవుతాడు...?" మాధుర్ ఆయన్ని ఒప్పించేందుకు సున్నితంగా వ్యవహరిస్తున్నాడు. అతనేంమాట్లాడలేకపోయాడు.   
   
    "ప్రమాదాలకన్నా ప్రమాదం అవమానం.... భయానికన్నా భయం ఛీత్కారం... అవన్నీ నేననుభవించాను. నాలోని యాంటీబాడీస్ చాలా బలపడ్డాయి. మానసికంగా రాటుతేలాను. మొరటువాడ్నయ్యాను- ఇలా ఆశ చూపి అలా లాగేసుకోవడం న్యాయమా? ఆలోచించండి."
   
    గంగాధరరావు కొద్దిగా మెత్తబడ్డాడు.
   
    "మీరింకేం భయపడకండి... నేనేం కావాలని కాలు దువ్వడం లేదు. నిలదొక్కుకుందామని కాలుని కదిలిస్తున్నాను...." మాధుర్ మాటలింకా పూర్తికాలేదు.
   
    "నిర్భయంగా, నిశ్శంసయంగా ముందుకు సాగండి. మీకు నేనుంటాను అండగా నాన్నగారేం అడ్డుపడరని నా ఆశాభావం."
   
    ఆ మాటలు వినిపించిన వేపుకు ఇద్దరూ ఒకేసారి చూసారు.
   
    అక్కడో యువకుడు...
   
    అతనే గంగాధరరావుకున్న ఒకే ఒక్క కొడుకు భార్గవ... మాధుర్ గుర్తుపట్టాడతన్ని. ఓ క్షణం అతనివేపు ప్రశంసంగా, కృతజ్ఞతగా చూశాడు.
   
    స్నేహపూర్వకంగా చేయి చాపాడు.
   
    అతను రెండే రెండంగల్లో మాధుర్ ని చేరి చేయి కలిపాడు.
   
    చెట్టంత ఎదిగిన తన కొడుకే మాధుర్ తో చేతులు కలిపినప్పుడు తనింకేం చేయగలడు? అందుకే తనలో పెల్లుబుకుతున్న భయాన్ని తనలోనే దాచుకుంటూ మాధుర్, భార్గవలకేసి నిస్సహాయంగా చూస్తుండిపోయాడు.
   
    నిజానికి భరద్వాజను దెబ్బతీయాలని ఆయనకీ వుంది. కాని భరద్వాజ దుర్మార్గం, తెలిసినవాడిగా యింతకాలం ఆ సాహసం చేయలేకపోయాడు.
   
    ఇప్పుడు తన ఎదురుగా వున్న ఆ యిద్దర్నీ ఆపే సాహసం కూడా చేయలేకపోయాడు.
       
    వేట మొదలు కాబోతోంది. ఈ అవకాశం ఇంత త్వరగా వస్తుందనుకోలేదు మిస్టర్ భరద్వాజా... అతి త్వరలోనే నీ కోటకి తొలి గండిని నేనే కొట్టబోతున్నానని మనస్సులోనే అనుకుంటూ కృతజ్ఞతగా భార్గవ కళ్ళలోకి చూసాడు మాధుర్.
   
                                *    *    *    *    *

 Previous Page Next Page