Read more!
 Previous Page Next Page 
అనుభవాల అలలలో పేజి 2

    ఆమె కంట్లో కారిన పుసిని ఏవగింపుగా చూసి, కంపు భరించలేక కర్చీఫ్ తీసి ముక్కుకి సుతారంగా అడ్డుపెట్టుకుని "ఏయ్...నీక్కాదూ చెప్పేది. లే....సీట్లోంచి లే...." అంటూ గట్టిగా కసిరింది.

    ఈ తఫా ఆమె కళ్ళు తెరిచి చూసింది. పట్టుచీర...వళ్ళంతా దిగేసుకున్న నగలు ఉత్సవ విగ్రహంలా వున్న మూర్తిని పరికించి చూసి తన సీటు పక్కన చూసింది. సీటు ఇద్దరికి సరిపోను ఖాళీగా వుంది. "కావల్సినంత ఖాళీ వుంది కూర్చో" అంది ఆమె.

    ఉత్సవ విగ్రహమ్మగారికి కోపం వచ్చింది. "నీ పక్కనా ఛీ....ఛీ....కంపు" అంది మరింత గట్టిగా ముక్కు మూసుకుంటు.

    "నీ దగ్గర ఏ కంపూ లేదా? ఆ కంపు దాయటానికి సెంటు పులిముంటావు. చీర  మీద ఇంటిమెడ్ స్ప్రే చేసుకుని వుంటావు. గుప్పున కొట్టే పౌడరు కంపు. అన్నీ కంపులే...ఎవరి కంపు వారికి యింపు నా పక్కన చోటువుంది కూర్చో. నీ మీద కూర్చున్నట్లు నిన్ను లాగి నీస్థానం ఆక్రమించుకున్నట్లు నీవు చేసే అధికారం మాత్రం నే భరించలేను. నీ కంపు భరిస్తూ నీ పక్కన నేను కూర్చోలేదా! నా కంపు భరిస్తూ నీ పక్కన నేను కూర్చోలేదా! నా కంపు భరిస్తూ నీవూ నా పక్కన కూర్చోవచ్చు" ఖంగుమంటూ జవాబిచ్చి మళ్ళీ ఆయాసంతో కళ్ళు మూసుకుని సీటుకి జారబడింది ఆమె.

    పీనుగులా వున్న ఆమె ఏనుగులా ఘీకరించటం చూసి ఉత్సవ విగ్రహమ్మ ఆ పెట్టెలోని మిగతావారు నిర్ఘాంతపోయారు. అంత మాటన్న ఆ ముష్టిదాన్ని లాగి అవతల పారేద్దామన్న ఆవేశం తెచ్చుకున్నారు. అయినా ఊరుకున్నారు. ఆమెను ముట్టుకుంటే అంటురోగం అంటుకుంటుందన్న భయం. చేతులు చస్తాయేమోనన్న శంక. అలాగా జనం నోట్లో నోరు పెడితే అమ్మనా బూతులూ వర్షంలా పడతాయి. ఎడతెరిపి లేని ఆ బూతుల వర్షంలో బండ బూతులు లాంటి పిడుగులు మధ్య మధ్య రాలుతాయి. ఎందుకొచ్చిన గోల చాలా మంది పెద్దవాళ్ళలాగానే వీళ్ళు ఆలోచించి పెదవి కదపటానికి భయపడ్డారు.

    తన సీటులోంచి ఓ ఖరీదైన మనిషి లేచి "ఇలా కూర్చోండి మేడమ్!" అన్నాడు సంస్కారం వుట్టిపడే స్వరంతో.

    "థాంక్యూ" అంటూ సుతారమంతా మాటలలో వ్యక్తంచేసి ఆమెవేపు మరోసారి చీత్కారంతో చూసి సున్నితంగా ఆయ నిచ్చిన సీటులో చతికిలబడింది.

    ఆమె కళ్ళు తెరిచి చూసింది. తను కూర్చున్న సీటంతా ఖాళీగా వుంది. అది చూసి వెకిలిగా నవ్వుకుంది. పసిదాన్ని పడుకోబెట్టి తల కింద సంచి పెట్టుకుని ముడుచుకుని పడుకుంది పసిదాని మీద చెయ్యివేసి.

    కంపార్టుమెంటులో వాళ్ళకి కావల్సినంత కాలక్షేపం.

    "బెగ్గర్స్ ని కాల్చిపారేయాలి ఆ రూల్స్ మన దేశంలో వుంటే ఎంత బాగుండును" అతనన్నాడు.

    "ఎంత బాగా చెప్పారు!" ఉత్సవ విగ్రహమ్మ మెచ్చుకోలుగా అంది.

    "దరిద్ర నారాయణమ్మ. విష్ణుమూర్తిలా పోజు పెట్టి పడుకుంది."

    "దాని పిల్లో దేని పిల్లో పిల్లది బొద్దుగా బాగానే వుంది."

    "సరేలెండి గజ్జికుక్కకి కూడా ముద్దుగా వున్న కుక్క పిల్లలే వుడతాయ్."

    ఆమాట గొప్ప జోకయినట్లు అంతా నవ్వారు నోరు నొప్పిపుట్టేదాకా తలో రకంగా కామెంట్ చేస్తూనే వున్నారు టీ.సీ వచ్చింతర్వాత ఆమెని తన్ని తగలేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించుకు తృప్తిపడ్డారు.

    ఆమెకదేం పట్టలేదు. శవంలా పడుకుండిపోయింది. ఆమె శవంకాదు ఆమెలో జీవం వుందన్న గుర్తుగా ఆమె డొక్కలు ఎగిరెగిరి పడుతూనే వున్నాయి.

    రెండు స్టేషన్స్ దాటిపోయిం తర్వాత టీ.సి ఆ కంపార్టు మెంట్ లో ప్రవేశించాడు.

 Previous Page Next Page