తమ వద్దనున్న టిక్కెట్లు కొందరు చూపారు...అప్పుడు అసలు విషయానికొచ్చారు. "ఆ పడుకున్న బిచ్చగత్తె ఆర్డినరీ క్లాస్ లో ప్రయాణం చేయతగిన మనిషని ఓ వేళ బండి బయలుదేరిం తర్వాత పొరపాటున ఎక్కినా యిది రిజర్వేషన్ క్లాస్ కాబట్టి మర్యాదగా వదిగి ఓ మూల నుంచోవాల్సింది పోయి మీదమీదకొచ్చి అడ్డమయిన మాటలు అని అసభ్యంగా ప్రవర్తించి అడ్డంగా సీటు మీద పడుకుందని. ఆమె దగ్గరనుంచి వచ్చే స్మెల్ కీ ఒకరికి ఎలర్జీ వస్తే వేరొకరికి వాంతి వచ్చిందని, అవన్నీ అలా వుంచి విషయానికొస్తే ఆర్డినరీ క్లాస్ కాదుగదా. ఏ టిక్కెట్లూ కొనలేదని....గౌరవనీయులైన బాధ్యతగల టీసీగారూ! దాని సంగతి మీరే చూడాలి"...అంటూ తలో మాట చెప్పారు...
సదరు యీ టీసీ మహాశయునికి ఎవరి మీదన్నా అధికారం చెలాయించటం, మీదపడి అరవటం కరవటం మహా ఇష్టం. కాని టీసిగారి శ్రీమతిగారు ఈయనగారికన్నా యెక్కువ చదివిన నాలుగాకులు ఎక్కువ నమిలిన మనిషి... టీసీ భర్తగారిని డ్యూటీకి పంపిస్తూ అరవటం, కరవటం చేసింది. టీసీగారు రుసరుసలాడుతూ డ్యూటీకొచ్చాడు. ఎవరిని కరవాలో ఎవరిపై అరవాలో తెలియక మకతిక పడుతున్న సమయంలో ప్రయాణికులు గౌరవించి విషయం విన్న వించగానే బహు కోపంవచ్చింది. తన అధికారం చలాయించటానికో అధమురాలు దొరికిందన్న సంతోషమూ కలిగింది. రక్తం లావాలా మరిగింది, గుండె పొంగింది, పిడికిళ్ళు బిగుసుకున్నాయి.
ఏదో ఘనకార్యం చేసేవాడిలా ఓసారి రొప్పి గుర్రంలా సకిలించి వికృతంగా ముఖంపెట్టి ముక్కు మూడుసార్లు ఎగబీల్చి "ఏయ్, లేవే, ఉల్లూకాబచ్చా" అన్నాడు. గతిరాత్రి చూచిన హిందీ సినిమాలో మాట గుర్తుంచుకున్న టీసి.
ఆమె లేవలేదు.
ఆమెని తందామా అంటే కాలుకింద అయింది. సీటు ఎత్తయింది. అందుకని మోకాలుతో ఆమె డొక్కలో కుమ్మి, "లెవ్వే, ఈ రైలు నీ తాతగాడి సొమ్ములా ఈ పెట్టె నీ బాబుగాడి సొత్తులా సత్యభామలా ఫోజిచ్చి మరీ పడుకున్నావే. యహ లెవ్వే..." అంటూ కరచినట్లే అరిచాడు టీసి.
ఆమె వికృతంగా మూలిగి నెమ్మదిగా లేచి కూర్చుంది.
"ఏమే వళ్ళు బలిసిందటే, రిజర్వేషన్ క్లాస్ కంపార్టు మెంట్ లో కూర్చున్నావ్!" మళ్ళీ అరిచాడు టీసీ.
ఆమె మొహంలో వ్యంగ్య వీచిక క్షణంలో మెరిసి మాయమయింది.
"రిజర్వేషన్ క్లాసులో ప్రయాణం చేయాలంటే వళ్ళు బలిసి వుండాలా బాబూ!" అతి నెమ్మదిగా అడిగింది.
"పిచ్చిగా వాగకు చమ్డాలూడదీస్తాను. ఆర్డినరీ క్లాస్ టిక్కెట్టుతో ఈ క్లాసులో ప్రయాణించటం నేరం. అసలు నీ దగ్గర టిక్కెట్ ముక్క వుంటూందా! వుందా అని అడుగుతున్నాను" టిక్కెట్టు లేదంటే తర్వాత కరుద్దాము ముందు అరుద్దామని అరచి మరీ అడిగాడు టీసి.
"టిక్కెట్టువుంటే ఈకంపార్టుమెంట్ లో ప్రయాణించవచ్చుకదా!" ఆమె మామూలుగా అడిగింది.
టిక్కెట్ లేని కారణాన వెధవ ప్రశ్నల్తో కాలయాపన చేస్తున్నది. తన డ్రస్ చూసి వణకాల్సింది పోయి తాపీగా ప్రశ్నలు. దీనిని....దీనిని టిక్కెట్టు లేకపోతే నాలుగు వుతకాలి.
"టీసీ ఉగ్రనరసింహమూర్తి అయ్యాడు. టిక్కెట్ నీవుకొని చస్తే నిక్షేపంగా ప్రయాణించవచ్చు. అసలు నీ దొంగ ముచ్చుముఖం చూస్తూనే తెలుస్తున్నది నీవు టిక్కెట్ కొనలేదని. టిక్కెట్ చూపించవే దొంగలం...."