Read more!
Next Page 
అనుభవాల అలలలో పేజి 1

                                         అనుభవాల అలలలో
   
                                                                         ---కురుమద్దాలి విజయలక్ష్మి
   

    అంతటా సద్దుమణిగింది.

    పచ్చజండా వూపితే ముందుకు పరుగు తీయటానికి సిద్దంగా ప్లాట్ ఫామ్ మీద ఎక్స్ ప్రెస్ వుంది.

    ఆ స్టేషన్ లో ఎక్స్ ప్రెస్ ఆగేది ఇరవై నిమిషాలు.

    మీల్స్ తినేవారి కోసం అంత టైము తీసుకుంటుంది.  మీల్స్ పేకెట్లు, టీ, కాఫీ, బుక్స్, ఎక్కే దిగే ప్రయాణీకులు ఆ యిరవై నిమిషాలు సంతకన్నా ఘోరంగా వుంటుంది. ఇహ బైలుదేరుతుందనగా సద్దుమణుగుతుంది.

    గార్డ్ పచ్చజండా వూపాడు.

    చూశాను లేవోయ్ అన్నట్లు సమాధానంగా కూత పెట్టింది డీసిల్ యింజను.

    ఇంక బైలుదేరటమే ఆలశ్యం.

    సరిగ్గా అప్పుడే ఓ యువతి చంకలో జారుతున్న పిల్లని పైకి ఎగలాక్కుంటూ మరో చేత్తో మూటలా వున్న సంచిని గట్టిగా పట్టుకుని ఫ్లాట్ ఫామ్ మీదకు పరుగున వచ్చింది.

    ఎక్స్ ప్రెస్ బొయ్__యి....యి. యి యి యి మంటూ గావు కేక పెట్టి బైలుదేరింది.

    ట్రైన్ బైలుదేరటం చూసి నాలుగంగల్లో ట్రైన్ వద్దకొచ్చి సంచీవున్న చేత్తోనే కమ్మి పట్టుకుని ఆ కంపార్టు మెంట్ లోకి లంఘించింది.

    "పిచ్చి ముండ చస్తావే" అటుగా వెడుతున్న పోర్టరు పైకే తిట్టాడు. నడుస్తున్న ట్రైనులోకి ఎక్కిన ఆమెను చూసి.

    ఎక్స్ ప్రెస్ వేగం పుంజుకుని ప్లాట్ ఫారం విడిచింది.

    ట్రైను బయలు దేరటానికి సిద్దంగా వుందని పరుగెత్తటం. ఆ ట్రైను తప్పిపోతే జీవితమే వృధా అన్నట్లు భయం కంగారుతో కనపడిన పెట్టె కమ్మీ పుచ్చుకుని సంచీ బరువు పిల్ల బరువు మోస్తూ పెట్టెలోపలికి దూకటం దీనితో ఆమెకి ఆయాసం వచ్చింది. కళ్ళు మూసుకుని రొప్పుతూ కొద్దిసేపు వుండిపోయింది.

    అది సెకండ్ క్లాస్ కంపార్టుమెంటు కూర్చున్న వాళ్ళంతా ఖరీదైన వాళ్ళే ఎక్కువ మంది ఆడవాళ్ళు వున్నారు. బైలుదేరిన రైలులో ఎక్కిన ఆమెని అందరూ పరీక్షగా చూశారు.

    చిక్కి శల్యమైన దేహం. కమురు కంపు కొట్టే అతుకుల చీర ఆలుగడ్డ లాంటి ముతక జాకిట్టు....తైల సంస్కారం లేని తలకట్టు. చేతి మీద కనిపించే పుండు నుంచి రశి కారుతున్నది......దాని మీద రెండు మూడు ఈగలు నాట్యం చేస్తున్నాయి. చేతిలో సంచీ రంగు నవరంగుల్లో ఏ రంగో గాని ప్రస్తుతం నీరు కావి దిగి దుమ్ము కొట్టుకొని వెలిసిపోయిన గొడుగు గుడ్డలా వుంది. ఎటొచ్చీ బాగున్నదల్లా ఆమె చంకలో బొద్దుగా ముద్దుగా వున్న పిల్ల....అంతే.

    ఓ సారి అంతా ఆమెని పరీక్షగా చూసి ముఖం తిప్పుకున్నారు.

    ఆమెకింకా ఆయాసం తగ్గలేదు. కళ్ళు తెరిస్తే చీకట్లు కమ్ముతున్నాయి. వళ్ళు తూలిపోతున్నది. శక్తినంతా కూడకట్టుకుని గబుక్కున ఎదుటి సీట్లో కూలబడింది.

    ఆ సీట్లో కూర్చున్న ఆమె విషసర్పం మీద పడ్డట్లు వులిక్కిపడి వెంటనే లేచి నిలబడింది. "ఏయ్....లేలే..." అంది. కాస్త గట్టిగా.

    ఆమె వినిపించుకోలేదు. సీటుకి తలఆన్చి ఆయాసంతో ఇంకా డొక్కలు ఎగరేస్తూనే వుంది.

Next Page