చిత్రం భళారే విచిత్రం
-మల్లిక్
డియర్ రీడర్స్......
"హాల్లో!..... హౌవ్వార్యూ!
ఇప్పటిదాకా బాగానే ఉండి ఉంటారు. ఎందుకంటే ఇంకా ఈ నవల చదవడం మొదలుపెట్టలేదు కనుక!
మేం కష్టపడి నవల్రాస్తే (మూడు నెలలో ఆరునెలలో కూర్చుని) ఎబ్బే....ఏం బావుందీ అంటూ మీరు చప్పరించేస్తారు. అదే సినిమా అయితేనో!....
"అబ్బో.....చాలా బాగుంది"
"హమ్మో బాగుంది -"
"వారెవ్వా..... కథ సూపర్ గా ఉంది. సినిమా హిట్టే! కనీసం వందరోజులు గ్యారంటీ" అంటారు.
ఇవేమీ కాకపోయినా కనీసం "ఆ సినిమానా? ఫరవాలేదు... చూడొచ్చు" అనైనా అంటారు.
మీకు ఇంతగా నచ్చిన సినిమాల్లో ఏముంటుందీ? చిన్నప్పటినుండీ మీరు చూస్తున్న సీన్లే ఉంటాయి. సినిమానిండా... ఇప్పటికీ కొన్ని వందల సార్లు ఆ సీనులు చూసి ఉంటారు సినిమా చూస్తున్నప్పుడు ముందువచ్చే సీనులూ, డైలాగులు కూడా మీరు చెప్పేయగలుగుతారు.
అయినా మీకు ఆ సినిమాలే నచ్చుతాయ్.
యామై రైట్ ? !
రైట్!!
అందుకే నేను ఏదో రాసి రిస్క్ తీసుకోదలచుకోలేదు. మీకు అన్ని విధాలా నచ్చే ఆ సినిమా టైపు కథనే మీకు చెప్పి మీ మనసుల్ని రంజింప చెయ్యాలని బంగారందో, ఇత్తడిదో, ఏదో ఒక కంకణం కట్టుకున్నాను.
మరి రెడీగా ఉన్నారా? కథ చెప్తాను ? ?
రెడీ...............
***
సంక్షిప్త కథ
గోపి, రాధ ఒకే కాలేజీలో చదువుతుంటారు. గోపి బాగా డబ్బున్న కుటుంబంలోంచి వచ్చినవాడు. రాధ బీదపిల్ల. రాధకి ఒక దగ్గే తల్లి (పేరు కామాక్షమ్మ), ఒక కుంటి తమ్ముడూ (పేరు సుబ్రమణ్యం) ఉంటారు. గోపి తండ్రి పేరు పరంధామయ్య, అన్నయ్య శంకరం, వదిన అన్నపూర్ణ, చెల్లెలు కళ్యాణి, శంకరం నాలుగేళ్ళ ముదురు మాటల కూతురు దీప.
గోపికి రాధకి మధ్యన మొదట్లో కీచులాటలు జరిగినా తర్వాత, తర్వాత వాళ్ళ మధ్య ప్రేమ అంకురిస్తుంది.
రాధని ఆమె బావ నాగభూషణం పెళ్ళిచేసుకోవాలని ఉవ్విళ్లూరుతుంటాడు. రాధ, గోపీల ప్రేమకు కామాక్షమ్మ ఆశీర్వాదం లభిస్తుంది. కానీ గోపివాళ్లింట్లో వాళ్ళ పెళ్ళికి అందరూ వ్యతిరేకిస్తారు. తక్కువ అంతస్తులో ఉన్న రాధని కోడలుగా స్వీకరించడానికి అంగీకరించడు పరంధామయ్య. కాని గోపీ రాధనే పెళ్ళిచేసుకుంటానని చెప్తాడు. పరంధామయ్య గోపీని ఇంట్లోంచి తరిమేస్తాడు. గోపీ ఊరి చివర ఉన్న గూడెంలో మకాం పెడ్తాడు. గోపీమీద దీప బెంగ పెట్టుకుంటుంది. గోపీ దీపని, వదిన అన్నపూర్ణని కలుసుకోవడానికి వాళ్ళింటికి అర్థరాత్రిపూట దొంగచాటుగా వస్తుంటాడు. అది చూసిన శంకరం గోపీని అనుమానిస్తాడు. అన్నపూర్ణకి, గోపీకి మధ్య అక్రమసంబంధం ఉందని అభాండం వేస్తాడు. గోపి బాధతో గూడేనికి వెళ్ళిపోతాడు. మనసు విరిగిన శంకరం తాగుడుకు బానిస అవుతాడు. అంతేకాకుండా భూతలస్వర్గం బార్ లో కాబరే డాన్స్ చేసే బిజిలీ వలలో పడి ఇంటినీ, అన్నపూర్ణనీ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తాడు. అప్పుడు గోపీ డబ్బున్న షేక్ వేషం వేసుకుని బిజిలీని వల్లో వేస్కుంటాడు. గోపీ వలలో పడ్డ బిజిలీ శంకరాన్ని ఛీ కొడుతుంది. శంకరం కళ్ళు తెరుచుకుంటాయ్ . గోపీ తన షేక్ అవతారం చాలిస్తాడు. శంకరం, అన్నపూర్ణ ఇద్దరూ కలుస్తారు.
ఒకరోజు గూడెంలో ఉండే రంగి నీళ్ళలో మునిగిపోతే గోపీ నీళ్ళలో దూకి ఆమెని పైకి తీస్తాడు. తరువాత ఆమె స్పృహలోకి రాకపోతే ఆమె పెదాలకి తన పెదాలు ఆనించి మౌత్ టు మౌత్ రెస్పిరేషన్ ఇస్తాడు. ఆమె శరీరం చల్లబడిపోతుంటే ఆమెమీద పడుకుని తన శరీరంలోని వేడిని ఆమె శరీరానికి అందిస్తాడు గోపి. కొంపలు మునిగి రాధ ఆ సన్నివేశాన్ని చూసి మరోవిధంగా ఊహించుకుంటుంది గోపి తనవాడుకాదని ఆమె భావిస్తుంది.
తన ప్రాణాలు కాపాడిన గోపిని రంగి ప్రేమిస్తుంది. గోపీ ఆ గూడెం వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ, వారికి నాయకుడిలా చెలామణి అవుతుంటాడు. గోపి తనవాడుకాదని భావించిన రాధ నాగభూషణాన్ని పెళ్ళి చేస్కోబోతుందని గోపీ స్నేహితుడు అంజిబాబు, చెల్లెలు కళ్యాణి ద్వారా తెలుసుకుంటాడు గోపి. అందరూ పోలేరమ్మ గుడికి పరుగు తీస్తారు. గోపీ తనకి అన్నయ్యలాంటివాడిని చెప్పి రాధ అనుమానాన్ని తొలగిస్తుంది రంగి.
నాగభూషణం పెళ్ళి ఆగిపోతుంది.
ఇప్పుడు ఇంకొన్ని విషయాలు బయటపడతాయ్. గోపీ అసలు తల్లి సరస్వతి గోపీకి తారసపడుతుంది. గోపీ పరంధామయ్య పెంపుడు కొడుకుని తెలుస్తుంది. గోపీ చిన్నప్పుడు శివరాత్రి రోజు శ్రీశైలంలో తప్పిపోతాడు. అప్పుడు పరంధామయ్య దంపతులకు దొరికితే వాళ్ళు పెంచుకుంటారు. సరస్వతి అంటే ఎవరో కాదు. రాధ తండ్రికి చెల్లెలు. సరస్వతి దగ్గర నాగభూషణం పెంపుడు కొడుకుగా పెరుగుతున్నాడు. అంటే రాధకి అసలు బావ గోపీయేనన్నమాట. కామాక్షమ్మ భర్త నారాయణరావు కూడా బ్రతికే ఉంటాడు. నాగభూషణం అతన్ని తన రహస్య స్థావరంలో బంధించి ఉంచుతాడు - విలువైన వజ్రాలు ఎక్కడఉన్నాయో తెలుసుకోవాలని. నాగభూషణం అంటే ఎవరో కాదు... రామదాసు అనే పేరు మోసిన స్మగ్లర్ నాగభూషణంగా చలామణి అవుతున్నాడు అన్ని రోజులూ.... ఆఖర్ని పోలీసులు రామదాసుని అరెస్టు చేస్తారు. అందరూ కలుస్తారు. గోపీ రాధల, కళ్యాణీ అంజిబాబు పెళ్ళి జరుగుతుంది.
అరెరే... కథంతా ఇలా ఫాస్టుగా ఫట్ ఫట్ మని చెప్పేస్తుంటే మీకేం నచ్చడం లేదా?
హుర్రే!.... ఎంత పొరబాటు జరిగింది.......
సరే.... అలాగయితే మీకు డీటెయిల్డ్ సుత్తి వేస్తా-అంటే కథ ఇప్పటిదాకా చెప్పిన దగ్గర్నుండీడైలాగుల్తో, పాటల్తో, ఫైట్సుతో వివరాతి వివరంగా చెప్తాను...ఓక్కే?
కాచుకోండి మరి.........
* * *