డైమండ్ రాజా - ఆఠీన్ రాణీ
మైనంపాటి భాస్కర్.
ఆరోజు పొద్దున్న అన్ని ప్రముఖ పత్రికలలోనూ ఈ క్రింది ప్రకటన కనబడింది.
"పాత సంవత్సరానికి గుడ్ బై!"
కొత్త సంవత్సరానికి స్వాగతం!!
పారడైజ్ హోటల్లో న్యూఇయర్ ఈవ్!!!
నేటి రాత్రి.....
మీకోసం .......ప్రత్యేకం! సింగిల్ సెన్స్ షన్
డైమండ్ రాజా చేసే వీనులకి విందు.
మరియూ--
స్వింగింగ్ సెన్సేషన్ ఆఠీన్ రాణీ
అందాల కనువిందు, వీటికి తోడుగా........
ఇండియన్, కాంటినెంటల్ వంటకాల విందు!
ఎక్జయిటింగ్ ప్రైజెస్!
మొఘలాయ్ , చైనీస్ డిషెస్!
లక్కీ ప్రైజెస్!
న్యూయోర్క్ కి రిటర్న్ టిక్కెట్లు!
ప్రవేశం: జంటలకి రూ. 1500 - సింగిల్స్ రూ. 1000-
హోటల్ రూంలపై ఏభై శాతం డిస్కౌంటు, స్పెషల్ ఆఫర్ : ప్రవేశరుసుం , వెల్ కమ్ డ్రింక్, ఒకరాత్రి విడిది, బ్రేక్ ఫాస్ట్ చెక్ అవుట్ లతో కలిపి : జంటకి రూ. 2500-
ఆలసించిన ఆశాభంగం!
"రిజర్వేషన్ లకై ఫోన్ చెయ్యండి!"
* * *
డైస్ మీద నిలబడి ఉన్నాడు డైమండ్ రాజా.
"డైమండ్ రాజా" అనే పేరు అతను ఈ బిజినెస్ లోకి వచ్చాక పెట్టుకున్నది కాదు......
అతని ఉహ తెలిసినప్పటినుంచి .....అతనికి తెలిసిన వారందరూ అతన్ని అదే పేరుతొ పిలుస్తున్నారు.
అప్పట్లో అతనికి తెలిసిన వాళ్ళంటే ఎవరూ?
కులీ, నాలీ చేసుకునే జనం, పుట్ పాత్ ల మీదే జీవితమంతా గడిపేసే నికృష్టజీవులు, దరిద్రనారాయణులు, తాడిత పీడిత ప్రజలు........
అప్పట్లో వాళ్ళందరిని ఆకర్షించినది రాజా మెడలో వేళ్ళాడుతుండే ఒక తెల్లటి రాతి ముక్క!
దానికి సరైన షేపు కూడా లేదు. ఆ రాతి ముక్కని రాజా మెడలో ఎవరు ఎప్పుడూ ఎందుకు కట్టారో కూడా ఎవరికి తెలియదు.
కానీ ఎవరు కట్టి ఉంటారు?
తన తల్లిదండ్రులా?
ఇంతకీ అసలు తన తల్లిదండ్రులెవరు?
ఏమో?
అసంగతి కూడా ఎవరికి తెలిదు.......తనకి తెలిదు!
రాజా మెడలో వేళ్ళాడుతూ ఉండే స్పటికం లాంటి ఆ రాతి ముక్కని చూస్తే అందరికి ఆటగా ఉండేది. వాడి మెళ్ళో, వేళ్ళాడేది డైమండ్ రా!" అని చెప్పుకుని నవ్వుకుంటుండేవాళ్ళు.
క్రమంగా ఆ రాతి ముక్కవల్లె రాజా పేరు కూడా "డైమండ్ రాజా" అయిపొయింది!
రాజా మెళ్ళో ఆరాతి ముక్కని ఎవరు కట్టారో గానీ, అతని మంచికోరే కట్టి వుంటారు. అయితే దాని వల్ల రాజాకి నిత్యం కష్టాలే తప్ప ఇప్పటిదాకా ఒరిగిందేమీలేదు.......... కానీ.......చూద్దాం .......నేను మొండివాడినో, నువ్వు మొండిదానివో..........." అన్న పద్దతిలో దాన్ని మెళ్ళోనే ఉంచుకున్నాడు అతను.
"డైమండ్ రాజా" అనే నిక్ నేమ్ ఇప్పుడతను సింగర్ అయ్యాక, స్టేజ్ నేమ్ గా బాగా సూటయింది.
తన పేరు డైమండ్ రాజా.....
బాగానే ఉంది!
కానీ ఆ ఆఠీన్ రాణీ ఎవరూ?
తను ఇంతవరకూ ఆ అమ్మాయిని చూడలేదు.
ఆ అమ్మాయి అసలు పేరేమిటో?
పాపం ఎందుకని క్లబ్ డాన్సర్ గా చేరిందో?
క్లబ్ డాన్సర్ ల జీవితం ఎలా ఉంటుందో రాజాకి బాగా తెలుసు!
ఈ హైదరాబాద్ మహానగరమే ఉంది. ఈ సిటిలో ఏడెనిమిది పెద్ద హోటల్స్ లో ప్రతిరాత్రి కాబరెలు జరుగుతూ వుంటాయి. పోలీసులు అప్పుడప్పుడు రెయిడ్ చేస్తూ వుంటారు. కేసులు పెడుతూ ఉంటారు. పైనులు పడుతూనే వుంటాయి.
ఇంకో నెల గడుస్తుంది.
ఆతర్వాత మళ్ళీ అంతా మాములే!
కాబరెలు హైదరాబాద్ లో బ్యాన్ చేశారు.
కానీ.-
"ఇండియన్ డాన్సేస్ " అనే పేరుతొ కాబరెలు జరిగిపోతూనే ఉన్నాయి.
అంతే కాకుండా హోటల్స్ లో రెగ్యులర్ గానూ, ఇంకొన్ని హోటల్సులో ప్రత్యెక సందర్భాలలోనూ- టాప్ లెస్ డాన్సులు న్యూడ్ డాన్సులు జరిగిపోతూనే ఉంటాయి.
ఈ స్పెషల్ నైట్స్ కి స్పెషల్ రేట్స్ ఉంటాయి. అందమైన అమ్మాయిలు డాన్సులు చేసే డైస్ ని అనుకుని ఉండే పది టేబుల్స్ దగ్గర కూర్చోవాలంటే ఒక్కొక్కరికి పదిహేను వందలు అవుతుంది. ఆ వెనగ్గా ఉన్న ఇంకో పది టేబుల్స్ కి మనిషికి పన్నెండు వందలు అవుతుంది. మిగతా టేబుల్స్ దగ్గర వెయ్యేసి చొప్పున చార్జి చేస్తారు-
రోజు మాములు డాన్సులు చేసే అమ్మాయిలు కూడా స్పెషల్ నైట్స్ కి స్పెషల్ డాన్సేస్ చేస్తారు - అంటే న్యూడ్ డాన్సేస్ అన్నమాట! అలాగే-
రెగ్యులర్ గా వచ్చే కస్టమర్స్ కి ఒక సిక్రెట్ కోడ్ ఇస్తారు - ఆ కోడ్ చెబితే, స్తివార్డ్ కస్టమర్ని ఖాళీగా ఉన్న ఏదైనా గదిలోకి తీసుకెళ్తాడు. అక్కడ వేచివున్న అందగత్తెతో కస్టమర్ రాత్రి గడుపుతాడు.
ఈ డాన్సర్లు , రాత్రి పూటే గాక, పగటిపూట కూడా తమ "సేవలు" అందిస్తారు. ఇలాంటి హోటల్సులో "మిడ్ డే సర్విస్" అని ఒకటి ఉంటుంది. రెండువందల రూపాయలు పే చేస్తే ఒక అందమైన అమ్మాయి వచ్చి కస్టమర్ కి "కంపెని" ఇస్తుంది.
మద్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఆరున్నర దాకా "కంపెని సిట్టింగ్" అనే ఇంకో తతంగం నడుస్తుంది. వెయ్యి రూపాయలు పే చేస్తే, ఏ డాన్సరుతో అయినా కులాసా చెయ్యొచ్చు.
అక్కడ లైట్లు అన్ని డిమ్ గా ఉంటాయి. ఏం చేసినా నడిచి పోతుంది. అక్కడికి వచ్చే కస్టమర్స్ లో నగరంలో ఉండే బిగ్ షాట్స్ కూడా ఉంటారు.
అలా ఆలోచిస్తూ అసహనంగా గిటారు మీటాడు డైమండ్ రాజా. తను, డైమండ్ రాజా హోటల్ లో వున్నంత వరకూ అలాంటివి జరగవు.......
తను జరగనివ్వడు కూడా!
కానీ-
తన పాట పూర్తయి తను వెళ్ళిపోయాక ఇంక ఇలాంటి తతంగం మొదలవుతుంది.
దానికి తనేం చెయ్యలేడు!
మోజరిటి ఆడపిల్లలు అన్ని తెలిసే ఇక్కడికి వస్తారు - అది వాళ్ళ ఇష్టం.........వాళ్ళ బతుకు తెరువులోకి తను అడ్డం పడలేడు.
కానీ-
కొద్దిమంది అమ్మాయిలు మాత్రం తెలిసి తెలియని తనంతో వచ్చి ఇక్కడ ఇరుక్కుపోతారు.
అలాంటి వాళ్ళని తను పూనుకుని మరీ ఈ రొంపిలోంచి బయటికి లాగుతాడు.
ఇంతకీ ఈ ఆఠీన్ రాణీ ఎవరు?
"ఏ రకం?
ఎంతకీ స్టేజీ మీదికి రాదేం?