Read more!
Next Page 
దీప పేజి 1

                                 

           
                                                   దీప
                                                                             --కురుమద్దాలి విజయలక్ష్మి

    
                                     
    

 

     మునిమాపు వేళ దీప బిందె తీసుకుని బయలు దేరింది నీళ్ళకి.


    
    ఊరినిండా బావులున్నాయి. కాని కొన్ని బావుల్లో నీళ్ళు చవ్వగా వుంటే, తతిమ్మా బావుల్లో నీళ్ళు ఉప్పు కషాయం. మంచి నీళ్ళు చింతలతోపు వద్ద చెరువులోని చెరుకు పానకంలా వుంటాయి. మూడు వంతులు ఆ వూరి వారంతా చెరువులోని చెరుకు పానకంలా వుంటాయి. మూడువంతులు ఆ వూరి వారంత చెరువులో నీళ్ళే తాగటానికి తెచ్చుకుంటారు.

 

    వెంకటరావు ఇంట్లో వుదయం సాయంత్రం రెండు బిందెల మంచినీళ్ళకొచ్చి వెళ్ళినట్లున్నారు. దారంతా తడితడిగా వుంది.

 

    ఎంతో అవసరం అయితే తప్ప నీళ్ళకోసం చీకటిపడ్డ తర్వాత చింతలతోపు పక్కనుండి చెరువుకి రారు ఆడవాళ్ళు. తప్పని పరిస్థితి అయితే మగవాళ్ళొచ్చి మంచినీళ్ళు పట్టుకెళతారు.

 

    మగాళ్ళకన్నా భయముందేమోగాని దీపకి భయం లేదు. ఓ పక్క నలువైపులా చీకట్లు ముసురుతుంటే కూని రాగం తీస్తూ బిందె పుచ్చుకు నీళ్ళకోసం చెరువుకొచ్చింది.

 

    చెరువులో దిగి కాళ్ళు చేతులు కడుక్కుంది. బిందెని తొలిచి చేత్తో నీళ్ళని పక్కకి నెట్టి బిందెనిండా నీళ్ళుముంచి నిండు బిందెను చంకనెత్తుకుని గట్టుపైకి వచ్చింది.

 

    దీప చెరువు గట్టుపైకి రాగానే అటూ ఇటూ చూసింది. నిర్మానుష్యంగా వుంది. "పొద్దుగూకితే చాలు ఒక్క పురుగు ఇటు రారు. ఈ చింతలతోపులో దెయ్యాలున్నాయా? భూతాలున్నాయా? లేక పట్టపగలే దొంగలు దోచుకుపోరు. రాత్రి వారి నివాసం ఈ ప్రదేశం అని భయమా?" అనుకుంది.

 

    దీప చకచక అడుగులు వేస్తు చింతలతోపు దగ్గరకు వచ్చింది.

 

    హఠాత్తుగా పక్కనే వున్న చింతచెట్టు చాటునుంచి ఓ యువకుడు ముందుకు వచ్చాడు. రెప్పపాటు కాలంలో దీప నడుంనున్న బిందెపై చెయ్యివేసి వేళ్ళకి నీళ్ళు తడుపుకుని దీప ముఖంమీద నీళ్ళు చిలకరించాడు. "షూ" అంటూ ఈలవేశాడు మూతి ముందుకు జాపి.

 

    దీప హఠాత్ పరిణామానికి జంకలేదు.


    
    దీప ఎడం చంకకి బిందె వుండటంవల్ల ఎడంచెయ్యి బిందెని చుట్టివుంది. కుడిచెయ్యి ఖాళీగానే వుంది. కుడిచెయ్యి గాలిలో లేవటం ఆ యువకుడి చెంప ఛెళ్లుమనటం కన్నుమూసి తెరిచేంతలో జరిగిపోయింది.

 

    "అబ్బా!" అన్నాడు అతను చెంపను తుడుముకుంటూ.

 

    "అబ్బ కనపడ్డాడు కదా? ఇహ కనపడాల్సింది అమ్మ. చూపించనా?" దీప ఉగ్రరూపం దాల్చి అంది.

 

    "దీపా!" అన్నాడు అతను.

 

    "ఓ నా పేరు కూడా తెలిసిందా? ఏయ్ పురుగూ, దీపందగ్గర కొచ్చిన పురుగు గతి ఏమవుతుందో తెలుసా."

 

    అతను ఫక్కున నవ్వాడు.

 

    దోవ కడ్డంగా అతను వుండటం వల్ల నొసలు ముడేసి తీవ్రంగా చూస్తూ వుండిపోయింది దీప.

 

    "అమ్మా, కడుపులో నొప్పిపుడుతున్నది. కొట్టావ్, నొప్పికి కళ్ళల్లో నీళ్ళుతిరిగాయి. నవ్వించావ్, కడుపులో నొప్పివచ్చింది. దీపా! నువ్వేం మారలేదు" అతను యాక్షన్ చేస్తూ అన్నాడు.

 

    దీప కళ్ళల్లో అనుమానం, ఆశ్చర్యం, ఆనందం ఒక దాని వెంట ఒకటి చోటు చేసుకున్నాయి.

 

    "మనూ!" అంది కళ్ళార్పకుండా అతన్నే చూస్తూ.

 

    మన్ మోహన్ రెండు చేతులు ఛాతీమీద వేసుకున్నాడు.

 

    "అమ్మయ్య, గుర్తించావ్!"

 

    "నిజంగా నువ్వేనా?"

 

    "అబ్బే ఉట్టిట్టిగా."

 

    "తర్వాత ఎక్కిరిద్దువుగాని, ఊరునుంచి ఎప్పుడొచ్చావ్?"

 

    "ఓ గంటయింది."

 

    "నువ్వొస్తున్నట్లు నాకు తెలియదు సుమా?"

 

    "తెలిస్తే ఏం చేసేదానివో?"

 

    దీప సిగ్గుపడింది. అంతలోనే ముఖం గంభీరంగా మార్చుకుని "ఇందాకటి బహుమానం తప్పేది" అంది.

 

    "అవునవును, ఆ సంగతే నే మర్చిపోయాను సుమా? ఆ బహుమతి సరే! తెలిసి ఈ బహుమతి ఏమిటోయ్? నిలువు కాళ్ళమీద శిక్ష."

 

    "ఇంటికి పద, అతిధి సత్కారం చక్కగా చేస్తాను"

 

    "అక్కరలేదులే. మీ ఇంటి కెళ్ళే వస్తున్నాను. కాసేపు ఇక్కడే కూర్చుందాము" అంటూ మన్ మోహన్, దీప చంకనున్న బిందె చనువుగా తీసుకుని కిందపెట్టాడు. "మళ్ళీ చెంప ఛెళ్ళుమంటుందేమో అనుకున్నా అదృష్టవంతుడ్ని" అంటూ అక్కడే వున్న చిన్న బండమీద కూర్చున్నాడు.

 

    దీప ముఖంమీద కనీ కనపడని నవ్వు చిందింది.

 

    "చాలా మారిపొయ్యావ్ మనూ!" అంది తనూ రాతి మీద కూర్చుంటూ.

 

    "నేనా? మారటమా? ఛా...ఛా... ఎవరు చెప్పారు? అప్పుడెట్లా వున్నానో ఇప్పుడూ అంతే."

 

    "ఎవరు చెప్పాలి, అబ్బాయిగారి ముఖమే చెపుతున్నది. ఓ సారి నిన్ను నీవే చూసుకో."

 

    దీప నఖశిఖ పర్యంతం మన్ మోహన్ ని చూసి "మారకేం, చాలా మార్పు వచ్చింది. అందుకే గుర్తుపట్టలేక పోయాను" అనుకుంది.

    "అదే ముఖం... అదే పేరు..."

    చాలు అన్నట్లు దీప చెయ్యి అడ్డంపెట్టింది. మన్ మోహన్ చటుక్కున నోరు మూసుకున్నాడు.

 

    "పేరు అదేగాని ముఖం మటుకు అదిగాదు. మనం ఒకరినొకరం చూసుకుని ఎన్నాళ్ళయింది? మూడేళ్ళు దాటింది. కిందటేడు శలవులకి ఇంటికొచ్చావ్, అప్పుడు నేను మా బాబయ్యగారింట్లో పెళ్ళికి ఊరెళ్ళాను. మూడేళ్ళక్రితం ఎలా వున్నావ్? నీట్ గా క్రాపు, తెల్లపాంటు, పొడుగుచేతుల తెల్ల చొక్కా, శుభ్రంగా కనపడుతూ సన్నగా వుండేవాడివి. మరి ఇప్పుడో? తిరుపతి మొక్కున్నట్లు ఆ క్రాపు, మరొకరు దూరేట్లున్న ఆ పాంటు, పూల పరికిణీ గుడ్డతో కుట్టించిన బుష్ కోటు, దెయ్యం కళ్ళలా కళ్ళకి ఆ జోడు మారకేం పూర్తిగా మారిపొయ్యావు. పైగా కాస్త లావెక్కావేమే అసలు గుర్తు పట్టేటట్లు లేవు."

 

    "ఈ దుస్తులు ఇప్పటి ఫాషన్ తెలుసా?"

 

    "ఫాషన్ మారినప్పుడల్లా మనిషి మారాలా? నేను చూడు అప్పుడు ఇప్పుడు ఒకేలా వున్నాను. అందుకే నన్ను గుర్తించావు. మరి నువ్వు మారటం వల్ల ఏమయింది?"

Next Page