Read more!
Next Page 
ముగ్ధ పేజి 1

                                 

                                             ముగ్ధ
    
    
                                                --సూర్యదేవర రామ్ మోహనరావు

    
                                        
    
    జీవితం కొందరికి విశాలమైన ఆకాశం. మరికొందరికి ఉరకల, పరుగుల, విలాసమైన సముద్రం. జీవితం కొందరికి లేత బుగ్గమీద కన్నీటి చుక్క మరికొందరికి పున్నమి వెలుగుల్లో పూలమొక్క జీవితం కొందరికి కనబడని కంటి కాటుక మరికొందరికి సప్తస్వరాల్ని కాళ్ళకు కట్టుకున్న బంగారు పట్టీల సంజె వెలుగు.
    
    పురుషుడికైనా, స్త్రీకయినా బతుకు నిండుసున్నా దగ్గరే ప్రారంభమవుతుంది. బాల్యం, అస్పష్టపు జ్ఞాపకాలు, పెరుగుదల, మరచిపోలేని వాతావరణం, యౌవనం, కలలు, ఆశలు, ఆకాంక్షలు, జడివానలా ముంచెత్తి, ఉక్కిరి బిక్కిరి చేసే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ఒక అధ్యాయమైతే, పెళ్ళయిన తర్వాత మరో అధ్యాయం ప్రారంభమవుతుంది.... వ్యామోహం, పిల్లలు, అస్పష్టపు దారిని సరైన దారిగా మార్చుకోడానికి చేసే విశ్వ ప్రయత్నం....ఆ ప్రయత్నంలో సఫలాలు, విఫలాలు, భోగాలు, త్యాగాలు, యోగాలు, చివరికి రోగాలు, మనిషిని చివరి వరకూ అంటి పెట్టుకునే వుంటాయి. ఎన్నెన్నో మలుపులు, ఎన్నెన్నో మజిలీలు, ఎన్నెన్నో మెరుపులు, ఎన్నెన్నో మసకలు.
    
    క్షణక్షణం ఉద్వేగం...
    
    క్షణక్షణం ఉల్లాసం...
    
    క్షణక్షణం ఉత్సాహం...
    
    క్షణక్షణం ఉచ్చ్వాసం....
    
    ఈ నాలుగు దారంట్ల ఊపిరి బిగబట్టుకుని నడిచే మనిషి చివరి కేంద్రం మళ్ళీ బిందువే. నిండుసున్నా దగ్గర ప్రారంభమయ్యే జీవితం ఫలించినదనడానికి సంకేతం 'ఒకటే'. సార్ధకత, సఫలత, ఆశ, దీక్ష కలగలసి ఒకటై ఆ సున్నాకు ముందు చేరాయి? వెనక చేరాయా?
    
    ఈ ప్రశ్నకు జవాబు లేదు. ఇదొక అనంతం. ఆ అనంతంలో ఒక చివరే ముగ్ధ.
    
                                      *    *    *    *    *
    
    ఆ అమ్మాయి ఆనందంతో గుప్పెడు ముద్దుల్ని గాల్లోకి విసిరింది. అవి అలా అలా అలల్లా ప్రేమకు పవిత్ర చిహ్నమైన ఆగ్రాలోని తాజ్ మహల్ పాలరాతి గోడలకు రాసుకుని, హైదరాబాద్ లోని ప్రణయదేవత భాగమతి మనోస్మ్రుతి చార్మినార్ బురుజుల్ని తాకి, రాజమండ్రి గోదావరి తేటనీటి తెరచాపమీద ప్రయాణించి, కర్నూలు కొండారెడ్డి బురుజును లతలా అల్లుకుని కదిలి, పుల్లంపేట గులాబీ పరిమళాల్లో మునిగి, శ్రీకాళహస్తి స్వర్ణముఖిలో తేలి, కార్వేటినగరం కోటగోడలమీద వాలి, శ్రీకృష్ణ దేవరాయల చెరువు'గట్టుమీద సేదతీరి, తిరుపతి కొండల మాటున దాగిన అపురూప శిలాతోరణాన్ని మెత్తగా స్పృశించిమ్ చంద్రగిరి కోట ప్రాంగణంలో వున్న కొలను పాయల్లోంచి బయటికొచ్చి అక్కడేవున్న రక్తపలాశ పుష్పాల్లా మారిపోయి, అంతలోనే ఎండిన పువ్వుల్లా జలజలా కిందకు రాలిపోయాయి.
    
    ఆ అమ్మాయి పేరు ముగ్ధ.
    
    ముగ్ధ నల్లగా వుంటుంది. ఐనా ముగ్ధ బావుంటుంది. బాపుబొమ్మలా, వయ్యారంగా, నండూరి ఎంకిలా బాగుంటుంది. సన్నగా, పొడవుగా వుంటుంది. ఆ అమ్మాయి అంతంత కళ్ళల్లోంచి ఆనందం, ఆశలు కలగలసి తొంగి చూస్తున్నాయి. పొడవాటి వత్తయిన తెలుగు జడ ఆ అమ్మాయి సొత్తు ఆ అమ్మాయి నవ్వుకూడా చాలా అందంగా వుంటుంది. నిరాశతో చచ్చిపోవడానికి వెళుతున్నవాడు, ఆ అమ్మాయి నవ్వుని చూస్తే తిరిగొచ్చేసి, చక్కగా ఓ అమ్మాయిని ప్రేమించి, మరీ పెళ్ళి చేసుకుంటాడు.
    
    "ఎంత బావుందో చంద్రగిరి కోట" విప్పారిన కళ్ళతో ఇటుక రంగులో కనిపిస్తున్న ఆనాటి చంద్రగిరి కోటను ఆశ్చర్యంతో చూస్తూ అంది ముగ్ధ.
    
    ముగ్ధతోపాటు అక్కడ మరికొంతమంది అమ్మాయిలు, అబ్బాయిలున్నారు. వాళ్ళందరూ తిరుపతి వెంకటేశ్వరా విశ్వవిద్యాలయం స్టూడెంట్స్ అందరూ పోస్టు గ్రాడ్యుయేషన్ ఆఖరు పరీక్ష రాసి, ఆనందంగా విడిపోయే ముందు, స్వంత ఊళ్ళకు వెళ్ళిపోయే ముందు చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి కోటను చూడ్డానికి వచ్చారు.
    
    "పుట్టపర్తి దేవాలయంలా వుందికదూ కోట" మెట్లెక్కుతూ అంది సురభి.
    
    "తల్లీ! ఇక్కడకూడా నీ దేవాలయాల గోలేనా నువ్వు పూర్వజన్మలో భక్త వీరాబాయివో, సతీసక్కుబాయివో అయ్యుంటావు" జోకేసింది అలక.
    
    "పోనీ దానికి దైవభక్తయినా వుంది. నీకదీ లేదుగదే! ఎప్పుడూ అబ్బాయిల గోలేకదా, నీకు హీమాన్ కనబడగానే హైపిచ్ లో వుంటావ్ గదా" ఓరకంట అలకవేపు చూస్తూ అంది నీలిమ.
    
    "కుర్రాళ్ళను తక్కువగా చూడకోయ్! 'కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు' బాలచందర్ సిన్మాలో పాట వినలేదా? ఎప్పుడూ సీతారామ కళ్యాణం, లవకుశ, పాదుకా పట్టాభిషేకం సిన్మాలు రెండేసిసార్లు చూసే నీకేం తెలుస్తుందిలే కుర్రాళ్ళ గురించి. కుర్రాళ్ళంటే వరల్డ్ లో ఫ్యాషన్స్, కుర్రాళ్ళంటే వరల్డులో సెన్సేషన్ అవసరమైతే వాళ్ళు నిప్పుకణికలు. కుర్రాళ్ళ శక్తి నీకేం తెలుసు" అలక ఉక్రోషంగా అంది.
    
    "వాళ్ళు ఫైర్ బ్రిగేడ్సని నాకూ తెలుసుగానీ నేను మాట్లాడింది నీ గురించి మహాతల్లీ" నీలిమ జవాబిచ్చింది.
    
    "ముందు నీ గురించి ఆలోచించుకో, తర్వాత దాని గురించి ఏం అబ్బాయిల్ని చూస్తే తప్పా? ప్రేమిస్తే తప్పా?" కోపమొచ్చింది అలకకు.
    
    "ప్రేమించు తల్లీ! ప్రేమించు! ప్ర్తతి అడ్డమైనవాణ్ణీ ప్రేమించు, నేనేం కాదన్నానా? అడ్డొస్తానా? ఫ్రెండ్ వని చెప్తున్నాను. సుఖాలకోసం, ఆలోచన లేకుండా పరుగెత్తే ప్రతి ఆడపిల్లా ఎలా ఔతుందో మన కళ్ళెదురుగా ఎన్నో ఉదంతాలున్నాయి. హిందీ నటి రేఖ, మార్లిన్ మన్రో, పామెల్లా బోర్డస్, పర్విన్ బాబీ, ఎంతోమంది...ఎంతో మంది. వాళ్ళ జీవితాల్ని చూడు పండులా ఆకర్షణీయంగా కనిపించినా, ఆ జీవితాలకు రెండోపక్క చూడగలిగితే ఎంతో విషాదం, అంతులేని అగాధం. నీక్కావల్సింది అదా? ఆ జీవితమే నీక్కావాలను కుంటున్నప్పుడు నిన్నా దేవుడు కూడా మార్చలేడు" కాస్త సీరియస్ గా తన కోపాన్ని వెళ్ళగ్రక్కింది నీలిమ.

Next Page