నేను సైకిలెక్కి తొక్కి వెళ్ళుతూ అందరూ నన్నే చూస్తున్నట్టు భావించుకోనేవాణ్ణి. అందరి కళ్ళు నా సైకిల్ మీదే ఉన్నట్టుగా తోచేది. నా సహాధ్యాయ ఎవరడిగినా, నేను నా సైకిల్ ఎప్పుడూ ఇయ్యలేదు.నేను క్లాసులో ఉన్నప్పుడు రెండుసార్లిద్దరు స్నేహితులు నా సైకిలెక్కి త్రొక్కాలని ప్రయత్నించారు. కాని ఎక్కిన తక్షణమే తల్ల క్రిందులుగా పడి గడ్డం బ్రద్దలు కొట్టుకొన్నవా డొకడు,ఎడమ ముంజేయి విరగగొట్టుకొన్నవా డొకడు! నా సైకిల్ కు రంగై నా చెదరలేదు.
అలాంటి నా సైకిల్ మా శకుంతలకు చూపేటప్పటికి, నాతో పాటు ఆనందంతో పొంగిపోయింది. పెడలు అందకపోయినా పరికిణీ వెనక్కు విరిచి కట్టుకొని అతి సునాయాసంగా సైకిల్ త్రొక్కడం నేర్చుకొన్నది. మా ఊళ్లో కాలువగట్టుమీద డొంకల్లో మా శకుంతలను కూర్చోపెట్టి సైకిల్ త్రొక్కుతుండేవాణ్ణి. ఇది ఫోర్తుఫారం సెలవలకి నేనింటికి వెళ్ళి నప్పుడు జరిగిన సంగతి. నాతో గుంటూరు చదువుకు రావాలని తండ్రి గారితో పోరు పెట్టిండి. కాని ఇంటిదగ్గరే ప్రయివేటుగా చదువు చెప్పించారు వినాయకరావుగారు.
o o o
ఆ రోజు ఉదయం తోటనుంచి హేమ ఏదో ఒకవిదమైన తొందరతో ఒకవిదమైన సిగ్గుతో, ఒకవిధమైన పరుగుతో ఆమెకు సహజమైన గంభీర నదీ ప్రవాహంవంటి నడకగాక, భయము నిండిన నడకతో తోటలోంచి నా దగ్గరకు వచ్చిన క్షణంలో, నాయీ చిన్ననాటి జీవితము అద్భుతవేగంతో ప్రత్యక్షమై, మాయమైపోయింది. ఆమెను తోటలో తీర్ధమిత్రుడు తనధూర్తత్వముతో బాధించినాడని నాకామేను చూడగానే అర్ధమైనది. పురుషులలోని పశుత్వము తన కోరలకు ఆడదాని వేడినెత్తురు తగిలితేగాని, తృప్తి అనేది పొందరు. చక్కని గులాబీపువ్వును చేతికిస్తే కొందరు రసిక శ్రేష్టులు రేకు రేకు త్రుంపి, కొన్ని చేతుల్తో నలిపి, కొన్నిటిని పళ్ళతో కొరికి, ఆ సుందరకుసుమాన్ని అయిదు చిటికలలో రూపుమా పేస్తారు. మనోజ్నమానినీ జీవితాన్ని కూడా మనుష్యపిశాచుల కొందరు ఖండఖండాలుగా చీల్చి, నలిపి గిరవాటు వేస్తారు. తీర్ధమిత్రుడు ఎంతటి కర్పూరశలాకలాంటి శరీరం కలవాడో అంతటి కఠినహృదయుడు. అతని జీవిత రేఖలన్నీ హేమ కుసుమదేవి చూచాయగా కని పెట్టినట్టే తోస్తుంది. కాని ఏమో?
అయినా నిప్పుతో చెలగాటాలెందుకాడుతుందో? చపలాక్షులైన స్త్రీల హృదయం ఎంతటివారికైనా అగోచరము కదా? హేమాదేవి తీర్ధమిత్రుని ప్రేమిస్తున్నదా? అయితే ఆ ప్రేమ ఎలాంటిది? నా దివ్యదేవతైన శకుంతల చెల్లెలు తుచ్చప్రేమకు దాసురాలు కాగలదా?
దివ్యదేవీ శకుంతలా! నువ్వు నడిచినది సర్వకాలము పవిత్రవ్యోమ నదీతీరాలే కదా! దివ్యలోక వాసినినైన మహాదేవివి నీవు. కారణ మాత్రుణ్ణయి నీ జీవితంలో ఒక అణుమాత్రం పంచుకొన్నాను నేను! మళ్ళీ నా మనస్సు నా చిన్ననాటి కథమీదికి పోయింది.
o o o
శకుంతల ఎప్పుడూ అబద్దము చెప్పి ఎరుగదు. కాని తియ్యటి ముద్దు మాటలతో చిన్నపిల్లలకు తగిన హాస్యపు సంభాషణలతో సర్వకాలమూ సంతోషముతో ఉప్పొంగిపోయేది. ఆమె వేళాకోళాల కందరము గురి ఔతుండేవాళ్ళము. వాళ్ళమ్మమ్మ మా ఊరు వచ్చినప్పుడనేది'' అమ్మమ్మా! నీ ఆచారంకోసం ప్రపంచమంతటా తడిపేట్టున్నావే! మనింటి ముందర గేటును బిచ్చగాడు ముట్టుకోవస్తే అంటైపోయిందని, గేటు కడిగి వేస్తావే! వంటిల్లున్నందుకు ఇల్లంతా కడిగించవేం'' అని, నేనొకరోజున యిప్పుడే వస్తానని తోటకు వెళ్ళి మూడుగంట లాలస్యంచేసి వచ్చాను. '' మూర్తి బావా! ఇప్పుడే వస్తానన్నావు,ఇప్పుడంటే ఎన్నిగంటలో? '' అన్నది. నేను తెల్లబోయినాను. ఆమె పకపకా నవ్వినది.
ఆ నవ్వులలో వెన్నెలలు విరిసినవి. ఉదయకాలపు ఎర్రని కిరణాలు ప్రసరిస్తుంటే కృష్ణానది చిరుకెరటాలలో ఆ నవ్వు అన్నివేపులా ఆక్రమించినది. ఆ నవ్వులలో కోకిలలు పాటలు పాడినవి. తమలపాకుతీగె లేత ఆకులు తొడిగినది. మా అమ్మగారి పూజావేదికపైన చిత్ర చిత్ర పుష్పముల ఆ నవ్వు సౌరభాలను వెదజల్లినది.
నేను ఊళ్ళో ఉన్నానంటే, నిమిషానికో వింతకై సేత చేసికొనేది. '' ఈ పరికిణీ బాగుందా బావా? ఈ చొక్కా అందంగా ఉందా? '' అని నేనేదో సమాధానం చెప్పినదాకా అడిగేది. నేను బాగుండ లేదంటే బట్టలు మార్చుకొనివచ్చేది. నేను బాగున్నాయంటే గంతులు వేసుకుంటూ వాళ్ళమ్మమ్మ వద్దకు పోయి '' అమ్మా, ఓ అమ్మా ! నా బట్టలు బాగున్నాయన్నాడే బావ!'' అనేది ''అట్లాగటమ్మా! బావ మెచ్చుకున్నాడటమ్మా! నా తల్లివిగా'' అని వాళ్ళమ్మ సంతోషముతో మాట్లాడేది.
ప్రతి ఆభరణమూ నేను మెచ్చుకోవలసినదే. లేకపోతే ఆ నగ ధరించేది కాదు. ఒక్కొక్కప్పుడల్లరితో తన హారాలన్నీ నా మేడలో వేసి '' బావ నగలు పెట్టుకొంటే ఎంత అందంగా ఉంటాడు. రా! రా!మా అమ్మ చూస్తుం''దని నన్ను వాళ్ళమ్మగారివద్దకు తీసుకుపోయేది.
''అమ్మా. బావ పెండ్లికొడుకులా లేడటే!''
'' బావ పెళ్ళికొడుకు లాగున్నాడు, నీవు పెళ్ళికూతురుళా ఉన్నావు.''
'' నాతో వేళాకోళా లాడొద్దమ్మా!''
'' నీతో నాకు వేళాకోళాలేమిటే పిచ్చితల్లీ! నిజం చెప్పాను ''
'' అబ్బా! నాకు సిగ్గువస్తుంది '' అని తుర్రున పారిపోయింది.
3.విష్కంభము
హేమసుందరి ఇంతవరకు ఆ వ్రాతపత్రికని చదువుకొన్నది. ఆమె హృదయం ద్రవించిపోయింది. ఏమిటీ,త్యాగతి తన బావగారా! త్యాగతి పేరేమిటి? ఎంత తన్ను మోసపుచ్చినాడు! తన తల్లిదండ్రులూ ఆ మోసం లోనే చేరారూ! ఏమిటి దీనికంతకూ కారణం? ఎందుకీ సంవత్సరము పాటూ త్యాగతి తనకు బావగారని తెలపకపోవటం? అందుకనే తన తండ్రి కతడంటే అంత ప్రేమ, అంత గౌరవం! తన తల్లి అతడు వచ్చాడనేప్పటికే ఎంతో ఆనందంతో పొంగి అల్లుణ్ణి చూచుకొన్నట్లు చూచుకోవడము.