"అమ్మగారూ మీకు ఫోను..." పనిమనిషి వచ్చి చెప్పింది.
"ఎక్కడ నుంచి" చిరాగ్గా అడిగింది సుదేష్ణాదేవి.
"కళ్యాణి మేడమ్"
కళ్యాణి పేరు వినగానే ఒక్కఉదుటున లేచి, ఆ రూమ్ లోంచి బయటకొచ్చి, గబగబా మెట్లుదిగి రిసీవర్ అందుకుంది. కళ్యాణి, సుదేష్ణ క్లోజ్ ఫ్రెండ్!
"తేజాకు ఫీవర్. నువ్విప్పుడా నాకు ఫోనుచేయడం?" అసహనంగా అందామె.
"తేజాకు ఫీవారా. నాకు తెలీదు గదా"
"అయ్యో నామతి మండా....నీకు తెలీదుగదా. అస్సలు నిన్న" కథంతా చెప్పడం ప్రారంభించింది సుదేష్ణాదేవి.
మామూలు రోజుల్లో కళ్యాణితో, గంటలుతరబడి మాట్లాడుతుంది సుదేష్ణాదేవి. ఆరు నిమిషాలు గడిచాక కొడుకుగుర్తుకు రావటంతో__
"నువ్వు చూడ్డానికి వస్తావా....సరే రా ఫోను పెట్టేస్తాను" అంటూ రిసీవర్ పెట్టేసి మెట్లెక్కుతున్న సుదేష్ణాదేవికి, చేతిలో కిట్ తో ఎదురొచ్చాడు ఫామిలీ డాక్టర్.
"హి విల్ బి ఆల్ రైట్. డోంట్ వర్రీ" అంటూ క్రిందకు దిగిపోతున్న అతనివేపు ఆశ్చర్యంగా చూసిందామె.
సరిగ్గా మూడు గంటల తర్వాత తేజ నెమ్మదిగా కదిలాడు.
"బాబు కదిలాడు" సంతోషంగా అంది సుదేష్ణాదేవి.
మరొక పది నిమిషాల తర్వాత, కళ్ళిప్పి చూశాడు తేజ.
"ఏవండీ...తేజ కళ్ళిప్పాడు"
ఆరోజు సాయంత్రానికి తేజ "అమ్...మ్....మ్" అన్నాడు తల్లి వేపు చూసి.
వెంటనే ఎత్తుకుని, అక్కున చేర్చుకుందామె.
అంతవరకూ మబ్బులచాటు చంద్రునిలా ఉన్న ఆమె ముఖం, ఒక్కసారిగా నిండుపున్నమిలా ప్రకాశించింది.
ఆ తల్లీ బిడ్డల్ని చూస్తున్న కాళేశ్వరప్రసాద్ మనసు, పన్నెండు గంటల తర్వాత పాలకడలిలా ఉప్పొంగిపోయింది.
౦ ౦ ౦
సరిగ్గా పన్నెండు గంటలకి, ఆ ముగ్గుర్నీ కోర్టుకు పంపండి" ఉదయం ఎనిమిది గంటలవేళవచ్చి చెప్పాడు సర్కిల్ ఇన్సపెక్టర్.
"వాళ్ళను తీసికొని నేనే స్వయంగా వస్తానుకదా జైల్లో వాళ్ళు చేసిన అల్లరి, తప్పించుకొని వెళ్ళిపోవడానికి వాళ్ళు వేసిన ప్లాన్, నన్ను మర్డర్ చేస్తామని వారనడం__అన్నీ చెప్పేస్తాను" అన్నాడు జైలరు ఆందోళనరావు కోపంగా.
సరిగ్గా అదే సమయంలో ఇద్దరు వార్డర్లు పరుగెత్తుకొనివచ్చి__
"సార్....సార్....ఆ ముగ్గురూ కనిపించడం లేద్సార్" అని అనగానే.
"ఆ మామిడి చెట్టుమీద జామకాయలు కోసుకుంటూ వుంటారు. చూడండి" అని ఎందుకయినా మంచిదని, సీట్లోంచి లేచి బయటకు ఉరికొస్తూ అన్ని బ్యారెక్సులూ సెల్స్ వెతికారు.
"సార్....డైనింగ్ హాల్లోంచి పన్నెండు సత్తుగిన్నెలు మాయమైపోయాయి సార్...." చెప్పాడొక గార్డు.
"నాలుగు పారలు మాయమైపోయాయి సార్" చెప్పాడు ఇంకొక గార్డు.
అవ్వన్నీ వింటుండగా, ఏదో ఫ్లాష్ లాంటి ఐడియా రావడంతో గుండెలు బాదుకుంటూ, క్వార్టర్సులోకి పరుగెత్తుకెళ్ళి వాళ్ళావిడ జగదంబ ఎక్కడకూ వెళ్ళలేదని నిర్ధారించుకొని__
ఠీవిగా వెనకొచ్చి__
"వాళ్ళేక్కడికి వెళ్తారు....వెతకండి__వెతకండి. వాళ్ళని పట్టుకొని కోర్టులో హాజరు పరచందే నేను నిద్రపోను" అంటూ తనూ వెతకడం ప్రారంభించాడు ఆందోళనరావు.
౦ ౦ ౦
సరిగ్గా అదే సమయంలో సగం తవ్విన జైలు క్వార్టర్సు పునాదుల్ని తవ్వుకొని, డ్రైనేజీ కాలువకొచ్చి, ఈదుకొంటూ వెళ్తున్నారు ఆ ముగ్గురూ.
"ఇలా మనం ఈదుకుంటూ ఏ అమెరికాయో వెళ్ళిపోతామేమో?"
"ఏం ఫర్వాలేదు. అక్కడ హాయిగా కార్లల్లో వెళుతూ, దొంగతనాలు చేసుకోవచ్చు"
"మరి నా జగదాంబో" అన్నాడు వీర్రాజు.
"అక్కడ బోల్డు బోసి అంబలుంటారు కానీ, త్వరగా పద" తొందరచేశాడు సేతురాజు.
౦ ౦ ౦
"వీర్రాజు.... వీర్రాజు... పోతురాజు...పోతురాజు....సేతురాజు...సేతురాజు" కోర్టు గుమాస్తా రెండవసారి పిలిచాడు.
కోర్టులో జడ్జీగారు, లాయర్లు, మిగతా ప్రేక్షకులు, సి.ఐ., జైలరు అందరూ ద్వారంవేపు చూస్తున్నారు.
వాళ్ళు జైల్లోనే ఎక్కడో నిద్రపోతూ వుంటారని వెతికి పట్టుకుని కోర్టుకు తీసుకురమ్మని అసిస్టెంట్లకు చెప్పేసి, తను కోర్టుకొచ్చేశాడు జైలరు. పన్నెండు గంటలయినా ఎవరూ రాకపోవడంతో, అతని గుండె బితుకు బితుకులాడుతోంది.
"జైలరు...ముద్దాయిలేరీ" సి.ఐ. కంగారుగా అడుగుతున్నాడు.
జడ్జీగారు అసహనంగా అందరివేపూ చూస్తున్నారు.
"ఏరండీ వాళ్ళు. తీరుబడిగా లంచ్ చేసి వస్తారా" జడ్జీగారు జోక్ వేశారు.
"సార్. వాళ్ళు చాలా మంచివాళ్ళు సార్. అసలు నేరస్థులు జన్మతా నేరస్థుడిగా పుట్టడు సార్. ఎంత గొప్ప వ్యక్తికయినా, చిన్నదో, పెద్దదో దొంగబుద్డి ఉంటుంది సార్, అంచేత దయుంచి, ఆ ముగ్గుర్నీ, వదిలేయమని కోర్టువారిని కోరుతున్నాను" జైలరు అలా ప్లేటు ఫిరాయించడంతో సి.ఐ. కోపంగా చూశాడు.
"నువ్వేం మదరు థెరిసావి, గౌతమ బుద్దుడివి అనుకుంటున్నావా?" గయ్ మని ఉరిమాడతను.