Previous Page Next Page 
హిమసుందరి పేజి 19

    అర్ధం అపార్ధం సినిమా మొదలయింది.

    అర్ధం అపార్దం సినిమా తాలూకా కదా, కమామీషా వీళ్ళకు ముందు తెలియదు. మధ్య మధ్య కబుర్లు చెప్పుకున్నా, శ్రద్దగా సినిమా మొత్తం చూశారు.

    ఇద్దరు మొగుళ్ళు, వాళ్ళ తాలూకా ఇద్దరు పెళ్ళాలు వుంటారు. ఓ భర్త తాగటం, తిరగటం, పేకాడటం- అప్పుడప్పుడు పెళ్ళాం దవడలు వాయగొట్టటం చేస్తుంటాడు. ఐనా ఆ మహా ఇల్లాలు భర్తని పల్లెత్తుమాట అనదు. అణిగిమణిగి వుంటుంది. లాస్ట్ సీనులో భార్తా మారిపోయి, మంచివాడు అయి "నన్ను క్షమించు శాంతా!" అంటాడు. వెంటనే శాంత భర్త కాళ్ళమీద పడి 'నన్ను క్షమించండి' అంటుంది. ఆ సినిమాలో హాయిగా ఉద్యోగం చేసుకుంటుంటుంది. దాంతో ఈయన గారు రెండో పెళ్ళి చేసుకున్నారు. దాంతో ఈయనగారు రెండో పెళ్ళి చేసుకున్నారు. ఉద్యోగం చేసే ఆవిడ సిటీ బస్సుకోసం ఎదురుచూస్తూ బస్సు స్టాపులో నుంచుని ఉంటుంది. ఆవిడ ముందునుంచి ఓ జంట ఎవరంటే ఆమె భర్త, ఆ భర్తగారి రెండోభార్య. ఆ తర్వాత మరో స్కూటర్ మీద యింకో జంట రయ్యిన వెళ్ళిపోతారు. వాళ్ళేవరంటే భర్త తాగి తందనాలు ఆడినా క్షమించిన భార్య ఆ జంట.

    చివరికి దర్శకుడి నీతి బోధతో తెర వాలుతుంది.

    స్త్రీ అమృతమూర్తి, క్షమా ధరిత్రి భర్త చేసిన తప్పులని ఏ స్త్రీ క్షమిస్తుందో, ఆ స్త్రీ దైవస్వరూపిణి. ఆమెకి చివరికి దక్కుతాయి సుఖశాంతులు. అంటూ ఉదాహరణకి ఇరువురు స్త్రేలనీ పోల్చి - బస్సుస్టాపులో నిరాశగా, ఒంటరిగా జీవితంలో తోడు-నీడ లేకుండా నిర్భాగ్యంగా, దౌర్భాగ్యంగా ఎలా నిలిచిందో ఆమెని చూడండి - అంటాడు.

    ఇవి దర్శకుడు చెప్పిన చివరి మాటలు.

    సినిమా హాలులో జనం అంతా కళ్ళు తుడుచుకుని హాలులోంచి బైటికి వచ్చారు.

    రామకృష్ణ, సీతామనోహరి కూడా కళ్ళు తుడుచుకోలేదు గాని, హాలులోంచి బైటికి వచ్చి స్కూటర్ ఎక్కి ఇంటికి వచ్చారు.

    ఇంట్లో అడుగుపెడుతూనే -

    "దర్శకుణ్ణి నరికిపోగులు పెట్టాలి" అంది సీత.

    "అది నీ అభిప్రాయం. జనాభిప్రాయం కాదు. సెంటిమెంటు, నీతులు, త్యాగాలు చిత్రం నిండా గుప్పిస్తే నాలుగు రాళ్ళు రాలతాయని - ఓ విషయాన్ని పట్టుకుని మసి పూసి మారేడుకాయ చేసి చూపిస్తారు. ముఖ్యంగా ఈ ఆడమళయాళమే ఇలాంటి చిత్రాలు ఒకటికి రెండుసార్లు చూసేది-" చల్లగా అంటించాడు రామకృష్ణ.

    "సినిమాకి వెళ్ళివస్తే మనసు హాయిగా వుంటుందనుకుంటే అదేం కనిపించలేదు. తలనొప్పి కొని తెచ్చుకోటం" అంది సీత.

    "ఆ..... మరే" అన్నాడు రామకృష్ణ.

    సీతకి నిజంగానే తలనొప్పి పట్టుకుంది. అందుకే అంతటితో వదిలేసింది. అదే మరొకసారి అయితే చూసి వచ్చిన సినిమాని పట్టుకుని మాటలతో చీల్చి చెండాడి తూర్పార బట్టేది.

    ఆ రాత్రికిహ రామకృష్ణ గాని సీత గాని సినిమా గురించి మాట్లాడుకోలేదు.




                                         8


    ఆమె పేరు సరోజ.

    సీత వున్న యింటికి మూడిళ్ళ అవతలనే సరోజ వుండేది. ఒకరింట్లో పేరంటం సందర్భంలో ఇరువురు కలిశారు. ఒకరింటికొకరు ఆహ్వానించుకున్నారు. ఆ తర్వాత ఓ రోజు సరోజ యింటికి వెళ్ళి వచ్చింది సీత.

    సరోజ ఇల్లు వున్నంతలో నీట్ గా వుంది. కాని ఆ ఇల్లాలుకి ఏది ఎక్కడ సర్దాలో తెలియనట్లు లేదు. సరోజ అగ్గిపెట్టేలతోను సిగరెట్టు పెట్టేలతోను బొమ్మలు తయారుచేసింది. నేనేనంటూ చూపించింది.

 Previous Page Next Page