"బొమ్మలు చాలా బాగున్నాయి. సిగరెట్ పెట్టెలు అగ్గిపెట్టెలు పోగుచేయటానికి చాలా శ్రమపడి వుంటారు" అంది సీత.
"మా వారు చైన్ స్మోకరు. ఆయన పెట్టెలు పెట్టెలు ఖాళీ చేస్తుంటారు, నేనేమో ఇలా బొమ్మలు చేస్తుంటాను" నవ్వుతూ చెప్పింది సరోజ.
సీతకి నవ్వు రాలేదు. ముఖం చిట్లించి "అలాగా!" అంది. తర్వాత ఓ పావుగంట కూర్చుని యింటికి వచ్చింది సీత.
ఇది జరిగి వారం అయింది.
సీత ఏదో వారపత్రిక తిరగేస్తుంటే సరోజ వచ్చింది.
సీత ఆనందంగ సరోజని ఆహ్వానించింది.
సీత ఫ్రిజ్ లో వున్న డ్రింక్ వాటర్ లో కమలాలతో నేనే తయారుచేశానని కూడా చెప్పింది.
"చల్లగ పళ్ళరసం తాగేసరిగి ప్రాణం లేచి వచ్చింది. ఫ్రిజ్ వుంటే ఆ యిదే వేరు" అంది సరోజ.
"మీడియం సైజు ఫ్రిజ్ కొనండి. కొన్ని షాపుల్లో వాయిదాల పద్దతి మీద కూడా యిస్తున్నారు" సీత చెప్పింది.
"మా వారి సిగరెట్లకే ఎంత డబ్బు చాలదు. ఇంక ఫ్రిజ్ కొనాల్సిందే" సరోజ నవ్వుతూ చెప్పింది.
"మీరు తలుచుకుంటే మానిపించడం ఓ లెక్కా!"
"ఆయన సంగతి మీకు తెలియదు. మొదట్లో సిగరెట్ పొగ వాసన భరించలేకపోయేదాన్ని. వూరికే కడుపులో తిప్పుతుండేది. ఆయన కూడా ఎందుకో మానేయాలనుకున్నారు. మానేయటానికి నోరు బాగుండక కిళ్ళి అలవాటు చేసుకున్నారు. దరిమిలా వారు సిగరెట్టు మానటం చాతకాలేదు దాంతోపాటు కిళ్ళి అలవాటు కూడా అయింది. ఒకటికి రెండు ఖర్చు."
సరోజ ఆ విషయం చాలా తేలిగ్గా తీసుకుని చెపుతుంటే సీతకి వింతగా అనిపించింది.
"మీకు సిగరెట్టు పొగ పడదని...... కడుపులో తిప్పేదని...... చెప్పారు!"
"ఆ...... అది మొదట్లో రాను రాను అదే అలవాటు అయింది. అయినా మగవాళ్ళు కాకపోతే ఆడాళ్ళు తాగుతారా సిగరెట్టు?"
సరోజ అలా అనటంతో సీత యింక ఆ విషయం వదిలేసింది. ఆ తర్వాత ఫ్యామిలీ విషయాలు మాట్లాడుకుంటూ కూర్చున్నారు. తన పెళ్ళిలో మగపెళ్లి వారైన అత్తగారి తరపున అందరూ గిల్లికజ్జాలు పెట్టుకుని పెళ్ళిపీటల మీద ఎంత గోల చేసింది సరోజ చెప్పింది. పెళ్లికొడుకు బాబాయి కొడుకు యొక్క ఫ్రెండ్ భోజనాల సమయంలో కూర కావాలని రెండుసార్లు చెప్పినా కూర తీసుకుని ఎవరూ రాలేదుట. దాంతో అంతా కోపగించుకుని లేవబోయారుట" భోజనాల మధ్యలో లేవద్దు బాబూ!" తప్పు మాది అని సరోజ తండ్రి కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ పెళ్ళికొడుకు యొక్క బాబాయి కొడుకు యొక్క ఫ్రెండ్ చేతులు పుచ్చుకుని బతిమిలాడాదుట. దాంతో శాంతించారు.
వీళ్ళు గజ గజ లాడుతూ అన్నీ మరీ మరీ అడిగి వడ్డిస్తుంటే ప్రతి పదార్ధం కావాలంటూ నలుగురు తినేంత వేయించుకుని అన్నీ విస్తళ్ళలో వదిలేసి లేచిపోయారుట. ఆడపెళ్ళి వారికి ఏ పదార్ధాలు మిగలకపోయేసరికి మళ్ళి కూరలు పచ్చళ్ళు అన్నీ చేసుకోవాల్సి వచ్చిందట. ఇలా ప్రతిదానికీ పేచిలతో సగానికి సగం నష్టంతో పెళ్లి అయిందిట.
సరోజ తన పెళ్లి ఫార్స్ శశిరేఖా పరిణయం అంత గోప్పదన్నట్లు ఫోజుపెట్టి చెప్పింది.
"ప్రతి విషయాన్ని ఎంత తేలికగా తీసుకుని చెపుతారు? వీళ్ళకేమి అనిపించదా?" అనుకున్న సీత "వాళ్ళలా చీటికిమాటికీ కయ్యాలు పెట్టుకుంటే ఆ సమయంలో మీరేం చేశారు?" కుతూహలంగా అడిగింది.
"నాకు చాలా భయం వేసింది. ఏడుస్తూ కూర్చున్నాను" సరోజ చెప్పింది.
"మగపెళ్ళి వారిమీద అసహ్యం కలగలేదా?"
"అసహ్యం ఎలా కలుగుతుంది? మగపెళ్ళివారు కాకపోతే ఆడపెళ్ళివారు ఎక్కడైనా గోల చేస్తారా?" ఎదురు ప్రశ్న వేసింది సరోజ.
"మగపెళ్ళి వారైతే మాత్రం ఎంతలో వుండాలో అంతలో వుండక్కరలేదా? వాళ్ళలో ఎవరికీ ఆడపిల్లలు లేరా? లేబర్ కూడా పెళ్ళిళ్ళలో యింత అల్లరి చేయరు. ఈ మధ్య రకం ఫామిలీలల్లోనే మిడి మిడి రోగాలు" ఆవేశంగా అంది సీత.