Previous Page Next Page 
హిమసుందరి పేజి 18

    "వాళ్ళిద్దరూ హాయిగా సినిమాకెళితే మధ్యలో నీకెందుకు సీతా భాధ?"

    ఇంతేనా మీకర్థమయింది -అన్నట్లు చూసింది సీత.

    "చెప్పు సీతా!"

    "రంగి మొగుడు రాత్రి తాగొచ్చి కొట్టాడు రంగిని.కాని,వాడి తప్పు వాడికి తెలుసు కాబట్టి-రంగిని బతిమిలాడి సినిమాకి తీసుకువెళ్ళాడు ....."

    "బస్ ..."అన్నాడు రామకృష్ణ.

    "మీ బస్సునీ ,రైలుని అక్కడే ఆపండి.రంగిని కొట్టిందేగాక-జయమాలిన్ని తెచ్చుకుంటానన్నాడు.అప్పుడు రంగి హృదయం ఎంత సోభిక్షి వుంటుంది!  దిక్కుమాలిన మొగుడుతో కాపురం చేయనని చెప్పిన రంగి,ఎలా ఆత్మభిమానం వదులుకుని సినిమాకి వెళ్ళింది? దానికి ఆత్మాభిమానం లేక కాదు - లోకం నవ్వుతుందన్న భయం, సమాజం ఎత్తి పొడుస్తుందన్న కించ, భర్త లేకుండా బతకలేనేమోనన్న పిరికితనం! తరతరాలుగా, యుగయుగాలుగా స్త్రీ ఎందుకు అణిగి మణిగి వుంటున్నది? విషపు కత్తులు లాంటి సమాజం - గంటుముళ్ళులాంటి భర్త....."

    "హౌ సీతే! పురుష ద్వేషిణే!" అన్నాడు రామకృష్ణ.

    "మధ్యలో ఏమిటి గోల! నేను అన్యాయం అయిపోతున్న ఆడకూతుళ్ళ గురించి మాట్లాడుతున్నా గాని, పురుష ద్వేషంతో మాట్లాడటం లేదు. నాకు పురుషుల రాక్షసచర్యల మీద కోపంగాని- పురుషులమీద లేదు!" సీత తీవ్రంగా అంది.

    "భార్యాభర్తల బంధం చాలా బలమైంది సీతా! ఒక భార్యా, భర్త చిన్న సంఘటనతో ఆవేశంగా విడిపోతే విచారించాలి గాని - మబ్బులు విడిపోయి, వారి మధ్య పోట్లాట సమసిపోయి కలసి వుంటే మనం సంతోషించాలి....." అంటూ రామకృష్ణ గంటసేపు చెప్పింది చెప్పకుండా చెప్పగలడు. కానీ ప్రస్తుతం సీతామనోహరి కోపం, ఆవేశం నిండా భోంచేసి వుంది కాబట్టి, ఇప్పుడు మాట్లాడి ప్రయోజనం లేదనుకున్నాడు.

    రంగికేదో తీరని అన్యాయం జరిగిపోయినట్లు సీత అనుకుంటున్నది గాని, ఆ అన్యాయం ఎలాంటిది? ఎంతవరకూ సమంజసం అన్నది సీతకి తెలియదు. ఈ విషయం రామకృష్ణకి బాగా తెలుసు.

    సీతామనోహరి తల్లి, తండ్రి దగ్గర బహుగారాబంగా పెరిగింది. తండ్రి స్త్రీజనోద్ధరణ సంఘ అధ్యక్షుడు. ఆయన గురువు గుడిపాటి వెంకటాచలం. ఆయన రచనలు చదివి ప్రభావితం చెందాడు ఈయన. ఏ అబలకైనా అన్యాయం జరిగితే స్ర్తీ జనోద్ధరణ సంఘం ఆ అబలపక్క నిలిచి పోరాడుతుంది ఇదంతా సీత చిన్నతనంలో ఒకానొకనాడు. సీత తండ్రికి వయసు మీదపడ్డ తర్వాత అలాంటివి వదిలేసి మామూలుగా వుండిపోయాడు.

    ఆ తానులోని పీలికే అన్నట్లు - ఆ తండ్రి కూతురు సీత. అదే గుణగణాలు వచ్చాయి. ఇది బాగా తెలిసిన రామకృష్ణ - సీత మంచితనం, అమాయకత్వం, ఆవేశం తెలుసు కాబట్టి అర్ధం చేసుకుని మెలుగుతున్నాడు. ఇప్పుడు కూడా అలాగే.....

    "సీతా! నేనో విషయం చెప్పనా?" అన్నాడు రామకృష్ణ వేడి కాఫీ చిన్నగా సిప్ చేస్తూ.

    "చెప్పండి" అంది సీత.

    "నీవంటే చదువుకున్నావు. ప్రపంచజ్ఞానం కూడా అపారమే. పైగా రక్తంలోనే బానిసత్వం వుందా అన్నట్లు - నేరం చేయకపోయినా తలవోగ్గే తత్వం చాలామందిలో వుంది. ముఖ్యంగా బీదవాళ్ళు, కింద తరగతి వాళ్ళు అణిగి మణిగి వుండే విధానానికి తలవొగ్గి వున్నారు. మనం ఏం చేయగలం? రంగి లేబర్ జాతి స్ర్తీ సలహా అన్నది చెప్పగలం. ఇది మంచి, ఇది చెడు- అంతవరకే. రంగి ఖర్మ రంగిది. దాని విషయం వదిలేసేయ్యి!" అన్నాడు రామకృష్ణ, విషయాన్ని అటునుంచి నరుక్కువస్తూ.

    "అంతేనా!"

    "అంతే!"

    "ఈరోజు నా మనసంతా పాడయిపోయింది."

    "నేను వూహించగలను. దీనికి ఒకటే మందు."

    "ఏమిటో?"

    "టింగురంగా అంటూ మనం సినిమాకి వెళ్ళటం."

    సీత కాస్త ఆలోచించి "అదే మంచిది. వెళదాం" అంది.

    "గుడ్! వెంటనే తయారుకా!" అంటూ రామకృష్ణ లేచాడు.

    మరో ఇరవై నిమిషాల తర్వాత రామకృష్ణ, సీతామనోహరి సినిమా హాలుదగ్గర వున్నారు. మరో పడి నిమిషాల తర్వాత హాలులో పక్కపక్క కుర్చీలలో కూర్చున్నారు.

 Previous Page Next Page