మనసులోని చీకట్లు మపలేక పోయాడు.
బయట వెలుగు. మనసులో చీకట్ల గుంపులు. మంగమ్మ ముంగురులు . ముంగురులు ముంచాయి రాముణ్ణి. ముందడుగు వేశాడు. తోవలో అతడు ఎవరితోనూ మాట్లాడలేదు. వేలికి తాళం చెవులు లేవు. అవి గిరగిరా తిరగటం లేదు. కాళ్ళలో సైతం కలవరం కనిపించింది. కదులుతున్న కదలనట్లే ఉంది. అయినా మంగమ్మ గుడిసె వచ్చింది. రాముడు గుడిసె ముందు నుంచున్నాడు. తరవాత ఏం చేయాలో అర్ధం కాలేదు. కాస్త తికమక పడ్డాడు. తరవాత సాగాడు. అరుగు మీద కూర్చున్నాడు. ఏదో అనుమానం. ఏదో గుబులు. ఏదో భయం ఏదో లజ్జ. ఏం చేయాలో అర్ధం కాలేదు.
"మంగమ్మా!' పిలిచాడు.
మంగమ్మ వచ్చింది. "ఏంది?" అని నుంచుంది. రాముడు ఆపాదమస్తకం కొలిచాడు. నిన్నటి అందం లేదు. వన్నె లేదు. వయ్యారం లేదు. హొయలు లేదు. సింగారం లేదు. సిగలో మబ్బుల్లేవు. చెక్కిళ్ళలో అద్దాలు లేవు. ఆమె అప్పుడే లేచింది. వచ్చింది. భిన్నుడయినాడు రాముడు. ఏదో భిన్నత కనిపించింది.
"నీ దగ్గరికే వచ్చిన"
"ఏమని?"
ప్రశ్న చిత్రంగా ఉంది. ఎందుకు వచ్చాడు తాను/ ఏమని వచ్చాడు ఏమనాలి? కాస్త తికమక పడ్డాడు రాముడు.
"కరణపోరి ఇల్లు తీసుకున్న.'
" ఆవు , అయితే"
"జర అలికి ముగ్గులు పెట్టాలె. ఎవరున్నారు చెప్పు నాకు. జర రావాలె. ఏమంటావ్?"
ఇరకాటంలో పడ్డది మంగమ్మ. ఇంట్లో గింజల్లేవు. పని ఇచ్చేవాడూ లేదు. ఆ పనిచేయడం ఆవిడకు ఇష్టం లేదు. ఎందరు తమ ఇచ్చను బట్టి పనులు చేస్తున్నారు? మంగమ్మ లొంగింది లొంగక తప్పలేదు.
"సరే వస్త"
"నేను పోతున్న జర జల్ది రావాలె" అని రాముడు సాగిపోయాడు. పండ్ల పుల్లవేసుకొని కరణం ఇంటి అరుగు మీద కూర్చున్నాడు - మంగమ్మ కోసం ఎదురు చూస్తూ.
మంగమ్మ వస్తుందా/ ఏమో ఇంకా రాదెం? ఇంకా రాదేం? ఎక్కొట్టదు గాదా? ఏమేమో ప్రశ్నలు రాముని మనసును కలత పెట్టాయి.
మంగమ్మ రానే వచ్చింది.
మళ్ళీ ఏదో సోయగం కనిపించింది.
మంగమ్మను తీసికెళ్ళాడు లోనికి. ఎర్రమన్ను. పెడ వగైరా చూపించాడు. ఆమె అలుకు ప్రారంభించింది. రాముడు ఆమె వెంటనే ఉన్నాడు. "ఇదిగో ఇక్కడ అలకలేదు. ఇక్కడ పొడిగా ఉంది." అని పని చేయిస్తున్నాడు. మధ్య మధ్య ఏవేవో ముచ్చట్లు చెపుతున్నాడు. కల్పించుకొని మాట్లాడుతున్నాడు. సాయంకాలం అయింది. ఇల్లు లంకంతది . ఒక్కరోజులో అవుతుందా? చేతులు కడుక్కుంది మంగమ్మ కూలి బాగానే యిచ్చాడు రాముడు. మళ్ళీ రేపు రమ్మన్నాడు.
అలుకు మూడు రోజులు సాగింది. నాలుగవనాడు నాముతో ముగ్గులు పెట్టింది. ఈ నాలుగు రోజులలోనూ పరిచయం పెరిగింది. ఒక్కొక్కసారి చేతులు, ఒక్కొక్కసారి కాళ్ళూ తాకాయి. అతడు ఆమెను చూచాడు. ఆమె అతనిని చూచింది. అయినా మంగమ్మ ఏమనుకుంటుందో రామునికి అర్ధం కాలేదు.
గృహప్రవేశం ఏర్పాటు చేశాడు రాముడు. పోలీసులను భోజనానికి పిలిచాడు. మంగమ్మను వంటకు పెట్టాడు. వంటలు బాగా చేసింది మంగమ్మ. భోజనాలు అయ్యే వరకు సాయంకాలం అయింది. వెలుగును చీకట్లు కమ్మేశాయి. ఇల్లు ఖాళీ అయింది. చివరకు మంగమ్మ భొజనానికి కూర్చుంది. రాముడు వడ్డించాడు. భోజనం ముగించి వెళ్ళటానికి సిద్దం అయింది. ఏదో సర్ధమన్నాడు. సర్దింది. రాత్రి మించి పోతున్నది. రాముడు మించి పోతున్నాడు.
మంగమ్మ చేయి పట్టుకు లాగాడు.
ఊపిరి సల్పకుండా కౌగలించుకున్నాడు.
ఒక్కోసారి ఇంద్రియ దౌర్భల్యం మనసును చంపేస్తుంది. ఆలోచనలను అణచేస్తుంది, మనిషిని మసి చేస్తుంది.
మంగమ్మ ఇంద్రియాల ఆకలికి లొంగిపోయింది.
లొంగిన ఆడది మగవానికి లోకువ.
లొంగటం ఒకేసారి. తరువాత టెక్కు చూపలేదు. తరువాత అన్నీ మామూలే. వడ్డించటం , భోజనం చేయడం లాంటిది. అలాంటిదే రాముడు - మంగమ్మ మధ్య సాగింది.
మంగమ్మ గుడిసెలోనూ వుంటుంది.
రాముడు కరణం యింటికి మారాడు.
వంటకని వస్తుంది మంగమ్మ రాముని యింటికి.
కరణం ఇల్లు రాముని ఇల్లుగా మారింది.
రాముడు ఇంటి ముందరి అరుగు మీద కూర్చొని తగాదాలు - తీర్పులు చేస్తున్నాడు. యాదగిరి సారాయి దుకాణంలో పెత్తనం చేస్తున్నాడు. శేషయ్య పెకాడుతున్నాడు.
కాలానికి కళ్ళుండవు. చెవులు అసలే ఉండవు. దానికి వేగం మాత్రం ఉంది. ఆ వేగానికి తట్టుకోగల వాళ్ళనే నిలుపుతుంది. కానివాళ్ళని నలిపెస్తుంది. ఇనుప పాదాల క్రింద తొక్కేస్తుంది. అది గమనించాడు వీరభద్రం. ఆయుధం విస్తర్జించాలని నిర్ణయించాడు. అతడు మధ్యవర్తులతో ప్రభుత్వానికి రాయబారం పంపాడు. తాము పంచిన భూములు పంచుకున్న వారికి ఉంచినట్లయితే తుపాకులు వదుల్తామన్నారు. ప్రభుత్వం వినలేదు. ప్రభుత్వం ఎన్నికలు జరుగుతాయని ప్రకటించింది. వీరభద్రం తుపాకితో మెజిస్ట్రేటు ముందు హాజరైనాడు! ఊరూ ఆశ్చర్యంలో మునిగింది. ఆశ, నిరాశ రెండు వ్యాపించాయి. శివరావు వీరభద్రాన్ని అరెస్టు చేశాడు. అందుకతడు గర్వించాడు. బలరామయ్య కొడుకుని హత్య చేశాడని, కరణాన్ని కాల్చి చంపాడని జగ్గయ్య చావుకు అతడే కారణమని ఇంకా ఇలాంటివే అనేకం ఆరోపించబాడినాయి. వీరభద్రం మీద, విచారణ జరుగుతున్న రోజుల్లో ఊరంతా కటాన కదిలింది. బస్తీలో కోర్టుకు చేరింది. సర్కారు వకీలు గట్టీగా వాదించాడు . సాక్ష్యం ఒకటీ దొరకలేదు. నిజమైన సాక్షి ఒక్కడూ రాలేదు. వచ్చిన సాక్ష్యులు వంకర టింకర్లు చెప్పారు అయినా విచారణ పేర జైల్లో పెట్టారు వీరభద్రాన్ని.