Previous Page Next Page 
యమదూత పేజి 18

 

    ఇక వర్తమానంలోకి వస్తే -
    
    ఇన్ స్పెక్టర్ జలీల్ కన్నుగప్పి రైలు దిగి పారిపోయిన దినకర్ ఆ స్పాట్ నుంచి సాధ్యమైనంత త్వరలో సాధ్యమయినంత దూరంగా వెళ్ళిపోవడానికి నిశ్చయించుకున్నాడు.
    
    రైలు ట్రాక్ వెంబడి కాస్త దూరం పరిగెత్తి, తర్వాత స్టేషన్ బయటికి వెళ్ళిపోయాడు అతను.
    
    అక్కడొక షాపు ముందు అప్పుడే మోటార్ సైకిల్ మీదనుంచి దిగాడు ఒక వ్యక్తి గుడుంబా అమ్మే గూండాలాగా వున్నాడతను. మోటార్ సైకిల్ లాక్ చేయకుండానే షాపులోకి వెళ్ళి ఏదో కొంటున్నాడు.
    
    కన్నుమూసి తెరిచేటంతలో ఆ మోటార్ సైకిల్ మీద కూర్చున్నాడు దినకర్. మెరుపు వేగంతో ఆ మోటార్ సైకిల్ కనుమరుగయిపోయింది. మోటార్ సైకిల్ ఓనరు బయటకు వచ్చి, జరిగింది గ్రహించి గగ్గోలుగా అరవడం మొదలెట్టాడు.
    
    దాదాపు యాభయ్ కిలోమీటర్లు వెళ్ళేదాకా వేగం తగ్గించలేదు దినకర్. అప్పుడు గుర్తొచ్చింది అతనికి, పాతగాయాలన్నీ రేగి తన శరీరం పచ్చి పుండుగా వుందని ఒక్క అయిదు నిముషాలన్నా నింపాదిగా కూర్చుని వేడిగా టీలాంటిది ఏమన్నా తాగాలన్పించింది అతనికి. తాగుతూ తన భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలనిపించింది.
    
    హోటల్ ఒకటి కనబడితే అక్కడ మోటార్ సైకిల్ ఆపాడు దినకర్. ప్రక్కనే వున్న పాన్ షాపులో ఒక న్యూస్ పేపరు కొని, హోటల్లోకి వెళ్ళి తందూరీ రోటీ, కుర్మా, టీ ఆర్డరిచ్చి పేపరు చూడటం మొదలెట్టాడు.
    
    ఈలోగా -
    
    ఆ హోటల్ కి ఎదురుగా వున్న ఒక మోటార్ రిపేరింగ్ షాపు ఓనరు దినకర్ మోటార్ సైకిల్ మీద వచ్చి దిగడం చూశాడు.
    
    దినకర్ ఎక్కడ కనబడినా సరే, తక్షణం చంపెయ్యాలని స్టాండింగ్ ఆర్దర్సు వున్నాయి అతనికీ, అతనిలాంటి మరికొందరు మనుషులకీ కూడా ఆ మరణ శాసనాన్ని అమలు చేయడానికి వాళ్ళందరూ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.
    
    హోటల్ లోకి వెళ్ళిన దినకర్ ని చూస్తూ అలాగే నిలబడిపోయి, కొద్దిక్షణాలు ఆలోచించాడు మోటార్ రిపేరింగ్ షాపు యజమాని. తర్వాత ఒక నిర్ణయానికి వచ్చినట్లు తలపంకించి, అల్మార్లో ఉన్న ఒక టైంబాంబు తీశాడు. దాన్ని సెట్ చేసి, పాతగుడ్డలో చుట్టి పట్టుకుని, నెమ్మదిగా దినకర్ మోటార్ సైకిల్ దగ్గరికొచ్చి ఆగి అటూ ఇటూ చూసాడు.
    
    పేపర్ చదువుతూ రోటీ తింటున్నాడు దినకర్.
    
    గ్రీజు మరకలతో నల్లగా బట్టలేసుకున్న మోటార్ రిపేరింగ్ షాపు యజమానినీ, అతని చేతిలో వున్న మరకలగుడ్దనీ చూసినవాళ్ళు అతను మోటార్ సైకిల్ ని రిపేర్ చేస్తున్నాడనుకుంటారు తప్ప వేరే విధంగా భావించే అవకాశం లేదు.
    
    అతను వంగి, రెండు మూడు క్షణాలపాటు ఏదో సరిచేస్తున్నట్లు నటించి, తర్వాత చల్లగా టైంబాంబుని మోటార్ సైకిల్ పక్కన వున్న బాక్సులో పెట్టేసి గబగబ తన షాపులోకి వెళ్ళిపోయాడు.
    
    టిక్ టిక్ టిక్ అంటూ అంతిమ క్షణాలని తెచ్చిపెట్టడం మొదలెట్టింది టైంబాంబు.
    
    రోటీ తినడం పూర్తిచేసి, సిగరెట్ ప్యాకెట్ జేబులోనుంచి తీశాడు దినకర్. అగ్గిపెట్టె కనబడలేదు.
    
    ఎదురుగా ఒక మనిషి కూర్చుని వున్నాడు. అతని మొహానికి అడ్డంగా న్యూస్ పేపరు వుంది.
    
    అతని చేతిని తట్టి "అగ్గిపెట్టె వుందా?" అని అడిగాడు దినకర్.
    
    ఆ వ్యక్తి యధాలాపంగా అగ్గిపెట్టె తీసి, అందించబోతూ అప్రయత్నంగా దినకర్ మొహంలోకి చూశాడు.
    
    వెంటనే అదిరిపడ్డాడు అతను.
    
    తక్షణం లేచి నిలబడి ద్వారంవైపు పరిగెత్తాడు.    

 

    నివ్వెరపోయాడు దినకర్.
    
    అప్రయత్నంగానే అతను కూడా లేచి, ద్వారంవైపు ఉరికాడు.
    
    అప్పటికే ఒక మోటార్ సైకిల్ మీద కూర్చుని ముందుకు దూసుకుపోయాడు ఆ వ్యక్తి.
    
    ఆశ్చర్యంగా చూస్తున్న దినకర్ కి అనిపించింది.
    
    ఇతనెవరో తనకి తెలియదు.
    
    కానీ ఇతను తనని చూసి ప్రాణభయంతో పారిపోయాడంటే, ఇతనికి తప్పనిసరిగా తనెవరో తెలిసే వుంటుంది!
    
    అంటే...
    
    ఒక్కసారిగా చెప్పలేనంత రిలీఫ్ కలిగినట్లయింది దినకర్ కి.
    
    అంటే...... ఇతన్ని పట్టుకుంటే చాలు. తను ఎవరో తనకి తెలుస్తుంది!
    
    అంతేకాదు, ఇంకా చాలా చిక్కు ప్రశ్నలకి జవాబులు దొరకవచ్చు, ఇతనివల్ల!? ఈ దుర్భరమయిన అయోమయంలోనుంచి బయటపడవచ్చు తను!!
    
    అలా అనుకోగానే, ఇంకా క్షణం ఆలస్యం చేయకుండా పరిగెత్తి, తను ఎత్తుకొచ్చిన మోటార్ సైకిల్ మీద ఎక్కి ముందుకు పోనిచ్చాడు దినకర్.
    
    వాయువేగంతో దూసుకుపోతున్నాడు ముందు మోటార్ సైకిల్ మీద ఉన్న వ్యక్తి డేంజరస్ స్పీడ్ లో.
    
    ఆ వ్యక్తిని పట్టుకుంటేగానీ తనెవరో తనకి తెలియదనే తాపత్రయంతో మనోవేగంగా ముందుకు వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు దినకర్.
    
    ఆ స్పీడులో రోడ్డుమీద ఉన్న మనుషులు భయంతో పక్కకి గెంతుతున్నారు. వాహనాలు ఒక ప్రక్కకి తప్పుకుని దారి ఇస్తున్నాయి.
    
    దినకర్ మోటార్ సైకిల్ బాక్స్ లో వున్న టైంబాంబు నిర్విరామంగా టిక్ టిక్ మంటూ ఆఖరి క్షణాలను మింగేస్తోంది.
    
    పారిపోతున్న ఆ వ్యక్తికి ప్రతిక్షణం తానూ దగ్గరవుతున్నాననుకుంటున్నాడు దినకర్.
    
    కానీ ప్రతిక్షణం తను మృత్యువుకి దగ్గరయిపోతున్నానని అతనికి తెలియదు. టాప్ స్పీడులో వెళ్ళిపోతున్నాయి రెండు మోటార్ సైకిల్స్.
    
    ఊరి బయటికొచ్చేశారు.
    
    ఇప్పుడు రెండు మోటారు సైకిళ్ళ మధ్య దూరం కేవలం కొన్ని అడుగులే వుంది. యాక్సిలేటర్ ని మరికొంత రైజ్ చేశాడు దినకర్. క్షణాల్లో ముందు మోటార్ సైకిల్ ని సమీపించి డాష్ కొట్టాడు. బాలన్స్ తప్పింది ఎదుటివ్యక్తికి. కానీ కిందపడలేదు అతను.
    
    అంతలో -
    
    రోడ్డు మలుపు తిరగ్గానే ఎదురుగా కనబడింది చిన్న చెరువులాంటిది.    

 

    దాన్ని చూశాడా ఆ వ్యక్తి. సడెన్ బ్రేక్ వేయబోయాడు. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది.
    
    వెర్రికేక పెట్టి విపరీతమయిన వేగంతో మోటార్ సైకిల్ తోబాటు దభేలుమని చెరువులో పడిపోయాడు ఆ వ్యక్తి.
    
    తన మోటార్ సైకిల్ ఆపి, ఒక్కక్షణం ఆలోచించి పరిగెత్తి తను కూడా చెరువులోకి దూకేసి సునాయాసంగా ఈదుతూ ముందుకెళ్ళి పోయాడు.
    
    అప్పుడు అనిపించిందతనికి!
    
    అయితే తనకు ఈత కూడా వచ్చన్నమాట!
    
    తనని గురించి తనకే తెలియని విషయాలు ఒక్కొక్కటిగా తెలుస్తున్నాయి.
    
    తనని గురించిన సమాచారం అంతా పూర్తిగా తెలియాలంటే ఈ వ్యక్తిని పట్టుకోవాలి. వాణ్ని చావనివ్వకూడదు.
    
    వాడు ఛస్తే తానెవరో తనకి తెలియజేసే ఆ ఒక్క ఆధారమూ లేకుండా పోతుంది.
    
    ఎక్స్ పర్ట్ లాగా ఈదుతూ, చెరువులో పడిపోయిన ఆ వ్యక్తికోసం గాలిస్తున్నాడు దినకర్.
    
    అప్పుడు భయంకరమయిన జలచరంలా హఠాత్తుగా నీళ్ళు చిమ్ముతూ పైకి లేచాడు ఆ వ్యక్తి ఒక్కసారి గుండెలనిండా గాలి పీల్చుకుని, మళ్ళీ నీళ్ళలోకి వెళ్ళిపోతూ దినకర్ కాళ్ళు పట్టుకుని బలంగా లాగాడు.
    
    నీళ్ళలోపలికి వెళ్ళిపోయాడు దినకర్.
    
    అతనికి ఊపిరందడంలేదు. తన కాళ్ళని మొసలిలా పట్టుకున్న ఆ వ్యక్తిని పట్టుకుని అతికష్టమ్మీద తప్పించుకుని, రెండుకాళ్ళతో అతన్ని ఒక్కసారి బలంగా తన్ని పైకి వచ్చేసి ఊపిరి పీల్చుకున్నాడు.
    
    అంతలోనే మళ్ళీ పైకి వచ్చాడు ఆ వ్యక్తి. వెంటనే అతని జుట్టుని తన చేతిలో ఇరికించుకున్నాడు దినకర్. ఒడ్డువైపు లాక్కెళ్ళడం మొదలెట్టాడు. అతని దేహంలోని అణువణువూ బాధతో నిస్తేజంగా అయిపోయి, సహాయ నిరాకరణ చేస్తున్నట్లు వుంది.
    
    అయినా పట్టు వదలకుండా సర్వశక్తులూ కేంద్రీకరించి పళ్ళబిగువున బాధని సహిస్తున్నాడు అతను.
    
    వేగంగా చిన్న బాకు ఒకటి తీశాడు ఆ వ్యక్తి. అదే వేగంతో దినకర్ భుజంమీద పొడిచాడు. మరుక్షణంలో అక్కడి నీళ్ళు దినకర్ రక్తంతో ఎర్రగా మారడం మొదలెట్టాయి. ఆ వ్యక్తిమీద అతని పట్టు తప్పింది.

 Previous Page Next Page