"శ్రీరాం అంతటి అవమానాన్ని దిగమింగి వెళ్ళిపోయాడంటే కేవలం నీ మీద ఉన్న ప్రేమతోనే అయి ఉండాలి. అతనిది ఎంత తీవ్రమైన స్వభావమో నీకు తెలియదు. చిన్నమాట అన్నా పడడు అతను. కాలేజీ రోజుల్లో ఏం జరిగిందో తెలుసా? అప్పట్లో శ్రీరాంకి మీసాలు ఉండేవికావు. నున్నగా షేవ్ చేసుకునేవాడు. పెద్ద మీసాలు పెంచిన ఫ్రెండు ఇతన్ని చూసి నవ్వాడుట - 'ఏరా! నువ్వు మొగా? ఆడా?' అని అంతే! శ్రీరాం జేబులోనుంచీ అగ్గిపెట్టె తీసి, పుల్లని వెలిగించి వాడి మీసాలు అంటించబోయాడు. ఆ తరువాత పెద్ద కొట్లాట! అలాంటి శ్రీరాం, మీ నాన్నగారు అంత అసభ్యంగా ప్రవర్తించినా తిరగబడి ఏం చేయకుండా వెళ్ళిపోయాడంటే, ప్రతిమా - అతనికి నీ మీద ఉన్న ఇష్టాన్ని తెలుసుకోవడానికి ఈ సంఘటన యాసిడ్ టెస్ట్ లాంటిది. ప్రతిమా! అతను నిన్ను విపరీతంగా ప్రేమిస్తున్నాడు."
వింటూ ఉండిపోయింది ప్రతిమ.
అప్పుడు వినబడింది పరిచితమైన అడుగుల చప్పుడు.
ఒక అడుగు శబ్దం వినపడిన తరవాత ఒక అరక్షణం వ్యవధి. తరవాత రెండో అడుగు చప్పుడు పెద్ద పెద్ద అంగలతో సింహంలాగా నడుస్తాడు శ్రీరాం.
శ్రీరాం మొహం కందిపోయినట్లు వుంది. అతని పెదిమలు బిగుసుకుపోయి ఉన్నాయి.
"ఐయామ్ ఫైట్ ఫుల్లీ సారీ! సారీ! సారీ ఎగెయిన్!" అంది ప్రతిమ గబగబా. అతనివైపు సూటిగా చూడ్డానికి ధైర్యం చాలక తలదించుకుంది.
"ఇట్సాల్ రైట్!" అన్నాడు శ్రీరాం ముభావంగా అతని గొంతు కొత్తగా వినబడింది.
"నేను చాలా ఫీలయ్యాను ఆ రోజు" అంది మళ్ళీ.
"ఏం ఫరవాలేదు."
కొంతసేపు మౌనం.
"నేను వెళ్ళిపోయాక ఇంకా ఏమన్నా గొడవ జరిగిందా?" అన్నాడు శ్రీరాం.
"ఆ! మిమ్మల్ని గురించి చాలా అన్నారు" అంది ప్రతిమ మెల్లిగా.
"ఏమని?"
తటపటాయించింది ప్రతిమ. ఆ మాటలన్నీ మళ్ళీ అతనితో చెప్పాలంటే కష్టమనిపించింది తనకి.
"ఫరవాలేదు చెప్పండి!" అన్నాడు శ్రీరాం సీరియస్ గా.
"మీరు రోజుకో అమ్మాయితో తిరుగుతుంటారుట. మిమ్మల్ని చూడరాని స్థలాల్లో చాలాసార్లు చూశాడట ఆయన."
శ్రీరాం నొసలు ముడిపడ్డాయి.
"మీరు నమ్మారా?"
"ఛ ఛ! నేనెలా నమ్ముతాను?"
"థాంక్స్ ! నమ్మనందుకు!" అని అప్పుడు మొదటిసారిగా చిరునవ్వు నవ్వి, ప్రతిమని మొహంలోకి నిశితంగా చూశాడు శ్రీరాం.
"నేనలాంటివాణ్ణి కానని మీకెలా తెలుసు?" అని రెట్టించాడు శ్రీరాం.
ఒక్క క్షణం అయోమయంగా చూసింది ప్రతిమ. అంతలోనే ఏదో తట్టినట్లుగా చెప్పింది. "మీలో ఏదన్నా చెడు ఉంటే శృతి నాకు చెప్పి ఉండేది."
"శృతి నా కజిన్ అన్న సంగతి మరిచిపోతున్నారా? వెయ్యి అబద్దాలన్నా చెప్పి ఒక పెళ్ళి చెయ్యమన్నారు. అందుకని నాలోని చెడు కప్పిపుచ్చడానికి చూస్తున్నదేమో తను?" అన్నాడు శృతి వైపు తిరిగి కన్ను గీటుతూ.
సపోర్టు కోసం అర్ధిస్తున్నట్లు శృతి వైపు చూసింది ప్రతిమ.
శృతి నవ్వి, అభయముద్ర పట్టి, "ఫర్లేదు! మంచోడే!" అంది సరదాగా.
ప్రతిమ మనసు కుదుటబడింది. శ్రీరాం మామూలుగానే సరదాగా మాట్లాడుతున్నందుకు శృతి కూడా సంతోషించింది.
"పాయింటు కొద్దాం! చెప్పండి -ఇప్పుడు మనమేం చెయ్యాలి?" అన్నాడు శ్రీరాం.
"తనేం చెబుతుంది? నువ్వే చెప్పు!" అంది శృతి.
"ఇంక ఒకటే పద్దతి! ముందు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలి! ఆ తరవాత కాళ్ళ బేరానికి వస్తాడు వీళ్ళ ఫాదరు!"
"రిజిస్టర్ మ్యారేజా?" అంది ప్రతిమ వెంటనే. ఆమె గొంతులో అయిష్టం ధ్వనిస్తూంది.
"ఏం? భయంగా ఉందా?"
"భయమని కాదూ కానీ..."
ఇంతలో వార్డ్ బోయ్ బాలయ్య వచ్చాడు.
"చీఫ్ సాబ్ పిలుస్తుండమ్మా!" అన్నాడు ప్రతిమతో.
"ఎక్స్క్యూ జ్ మీ... ఇప్పుడే వస్తాను" అని శ్రీరాంతో చెప్పి, త్వరత్వరగా చీఫ్ రూం వైపు వెళ్ళింది ప్రతిమ. ఆయన ఎప్పుడూ తనతో ప్రత్యేకంగా మాట్లాడలేదు. ఇవాళ పిలిపించడానికి ఏమయి వుంటుందో కారణం?
చీఫ్ రాజారాంగారికి యాభై ఏళ్ళుంటాయి. నిగనిగలాడే బట్టతల.
"ప్లీజ్ సిట్ డవున్!" అన్నాడాయన ప్రతిమకి కుర్చీ చూపిస్తూ.
కూర్చుంది ప్రతిమ.
"మీ ఫాదర్ నిన్న మా ఇంటికి వచ్చారు."
తెల్లబోయి చూసింది ప్రతిమ. ఎందుకు వెళ్ళి ఉంటారు?
"నా ఫ్రెండు సోమసుందరం మీ ఫాదర్ కి తెలుసుట. అతని దగ్గర నుంచీ ఒకరి మెండేషను లెటరు పట్టుకొచ్చారు."
"ఏమని?" అని అడగాలనిపించినా, గొంతులో నుంచీ మాట రాలేదు ప్రతిమకి.
"వీలయితే నిన్ను గుంటూరు ట్రాన్స్ ఫర్ చేయించమంటారు."
ఆశ్చర్యంతో కళ్ళప్పగించి ఆయన్ని చూసింది ప్రతిమ.
"మిస్ ప్రతిమా! ఎవరికీ ఉండే ఇబ్బందులు వాళ్ళకుంటాయి. అన్నీ మనకి అనుకూలంగానే జరగాలంటే అయ్యే పని కాదు నీకు గుంటూరు ట్రాన్స్ ఫర్ కావడం కలలో మాట అని నీకూ తెలుసు. ఆ సంగతే నిన్న మీ నాన్నగారితో చెప్పాను. అయినా వినలేదు ఆయన. ఇంకో సంగతి కూడా చెప్పారు" అంటూ ఇబ్బందిగా ఆగిపోయాడు.
ప్రతిమకి వూపిరాడనట్లు అనిపిస్తూంది. ఏమిటిదంతా అసహ్యంగా? ఛ ఛ!
"చాలా పవర్ ఫుల్ వ్యక్తి ఎవడో ఒకతను నీ వెంటపడి టీజ్ చేస్తున్నాడనీ, అందుకని నువ్వు ఇక్కడనుంచీ దూరంగా వెళ్ళిపోదామని చూస్తున్నావనీనూ! వెల్, మిస్ ప్రతిమా! ఇన్నాళ్ళ నా అనుభవంలో నేను నేర్చుకున్నదేమిటంటే, మనం సమస్యలని ఎదుర్కోవాలి కానీ, పారిపోయి నెగ్గలేం! నాకూ ఈ వూళ్ళో కాస్తో కూస్తో ఇన్ ఫ్లుయెన్స్ ఉంది. ఇద్దరు టాప్ రాంకింగ్ పోలీసు ఆఫీసర్స్ తెలుసు నాకు. వాళ్ళతో చెప్పి ఆ రౌడీ వెధవెవడో నీ వెనక పడకుండా చూస్తాను. అంతేకానీ ట్రాన్ స్ ఫర్ మాత్రం... వెల్....ఇంపాజిబుల్."