Previous Page Next Page 
ప్రేమ పురాణం పేజి 18


    
    తల్లి మనకు తెలుసు. పేరు డాక్టర్ సునీతా సుందరి. ఎం.బి.బి.యస్., యం.డి., డి.జి.వో., ఎట్ సెట్ రా.... ఎట్ సెట్ రా.
    
    జెయ్ చంద్ర ఫైనలియర్ బియస్సీ స్టూడెంట్! బ్రిలియంట్! చదవడం, కాపీకొట్టడం రెండూ చెయ్యకుండానే కాలీజీ ఫస్టు వచ్చే ప్రతిభాశాలి. అతను కాలేజీ క్రికెట్ టీముకీ కెప్టెన్, మరియూ సమయానుకూలమూ, మరియూ వాలీబాల్ కూడా ఆడగలడు. ఎన్.సి.సి.లో అండర్ ఆఫీసర్......స్విమ్మింగ్ ఛాంపియన్. పాటలు పాడగలడు. రాత్రిళ్ళు తరచూ డిస్కోలలో కనబడతాడు.
    
    నవమన్మథుడు....
    
    అతని ఫేవరెట్ డ్రెస్ బాగీస్.
    
    అతని ఫేవరెట్ కలర్ 'బ్లూ.'
    
    అతని గర్ల్.....సితార......
    
    ఫేవరేట్ హీరోయిన్ - సితారనే అని అతను చెప్పినా సితార నమ్మదు.
    
    సరే!
    
    మళ్ళీ రేడియో కార్యక్రమాలలోకి వస్తే-
    
    పక్కింటి పార్వతీశంగారు అంత శ్రద్దగా ఆలకిస్తున్న ఆ ప్రోగ్రాం ఏమిటో బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్ధంకాలేదు జెయ్ చంద్రకి.
    
    వినీ వినీ విసుగెత్తి శేషు వైపు చూశాడు జెయ్.
    
    "ఏంట్రా ఆ ప్రోగ్రాం?" అన్నాడు లోపాయికారిగా.
    
    "ఏమో! అది పార్వతీశం బాబాయిగారికే తెలియాలి" అన్నాడు శేషు నిస్సిగ్గుగా ఓటమిని ఒప్పుకుంటూ.
    
    పార్వతీశంగారు నవ్వాపుకుంటూ బయటికెళ్ళి నోట్లో వున్న తమలపాకుల కట్టలో సగం తుపుక్కున ఉమ్మేసి వచ్చాడు.
    
    "బ్రోక్రాం రావల్డే! యాంధా సౌండప్పన్" అన్నాడు. ఆయనలా మాట్లాడుతూ వుంటే నోట్లో మిగిలిన మిగతా సగం తాంబూలపుకట్ట అటూ ఇటూ మెదులుతూ, నెమరువేస్తున్న గేదెని గుర్తుతెస్తోంది.
    
    ఒక్కోసారి రేడియో ప్రోగ్రాం అన్నా అర్ధం కావచ్చేమోగానీ, ఈయన మాటల సారాంశం మాత్రం ఆస్సలు అర్ధంకావట్లేదురా దేవుడా అన్నట్లు దీనంగా శేషు వైపు చూశాడు జెయ్ చంద్ర.    

 

    'నాకూ అంతే' అన్నట్లు విషాదంగా తల ఊపాడు శేషు.
    
    ఈలోగా పక్కింటి పార్వతీశం బాబాయ్ అది గమనించి, లేచి వెళ్ళి మిగతా సగం తాంబూలం  ఉమ్మేసి వచ్చాడు.
    
    "ప్రోగ్రామేం రావటంలేదు. అవి ఉత్త సౌండ్సే" అన్నాడు అచ్చ తెలుగులో నవ్వాపుకుంటూ వాళ్ళని ఉద్దరిస్తున్నట్లు.
    
    వింటున్న జెయ్ చంద్రకి చిర్రెత్తుకొచ్చింది.
    
    సారీ! అతన్ని గురించి ఇంకో సంగతి చెప్పడం మర్చేపోయా. అతగాడు ఎలక్ట్రానిక్స్ లో ఎక్స్ పర్ట్ కూడా!
    
    తన రేడియో, తన వీడియో, తన స్టీరియో అన్నీ తనే సొంతంగా రిపేర్ చేసుకుంటారు.
    
    ఛస్తే ఇంకోళ్ళని తాకనివ్వడు.
    
    చివరికి వాటిని తయారుచేసిన కంపెనీ వాళ్ళనీ, ఇంకా మాట్లాడితే వాటిని కనిపెట్టిన సైంటిస్టులని కూడా వాటి మీద చెయ్యివెయ్యనివ్వడు.
    
    అతఃను తన బెడ్ రూంలో తన స్టీరియోని, వీసీఆర్ నీ తన పక్కమీద పెట్టి, తను కిందపడుకుని వింటూ నిద్రపోతాడని ఓ గట్టి పుకారు వుంది కాలేజీలో.
    
    అలాంటి జెయ్ చంద్ర ఇలాంటి రేడియోని చూస్తూ ఎంతో సేపు ఎలా వూరుకోగలడు?
    
    అందుకని తక్షణం రంగంలోకి దూకాడతను యుద్దానికి సన్నద్దమవుతున్నట్లు.  

 

    షర్టు విప్పేశాడు.
    
    లోపల బనీను వుంది.
    
    ప్యాంటు విప్పేశాడు.
    
    లోపల షార్ట్సు వున్నాయి.
    
    ఇప్పుడు అతని దృష్టి అంతా రేడియో మీదే వుంది.
    
    మహాభారతంలో మత్ష్యయంత్రాన్ని కొట్టే అర్జునుడికి పైనగిరగిరా తిరిగే చేపతప్ప యింకేం కనబడనట్లు, అతనికి ఆ పాతకాలపు డొక్కు ట్రాన్సిస్టరు తప్ప యింకేం కనబడట్లేదు.
    
    శేషు, పార్వతీశంగారూ కనబడట్టేదు.
    
    చివరికి సితార కూడా గుర్తురావట్లేదు.
    
    ఆపరేషన్ కి తీసుకువెళుతున్న పేషెంటుని తెచ్చినట్లు రేడియోని మోసుకొచ్చి చాపమీద వెల్లకిలా పడుకోబెట్టాడు.
    
    ఆ తర్వాత కత్తితో పొట్ట చీల్చినట్లు స్క్రూడ్రైవర్ తో దాన్ని ఓపెన్ చేశాడు.
    
    ఎక్స్ పర్ట్ హాండ్స్ తో అవీ ఇవీ కదిలించాడు.
    
    తర్వాత తన హాండ్ బ్యాగ్ లో ఉన్న సరంజామా ఒక్కొక్కటిగా తీశాడు.
    
    వాటిలో ఉన్న స్పేర్ పార్టులు చూశాడు.
    
    రేడియో ఆన్ చేశాడు.
    
    అంతే!!
    
    జానపదకథల్లో బ్రహ్మరాక్షసి శాపవిమోచన పొంది, దేవకన్యలా మారినట్లు ఆ రేడియోలో ఊహాతీతమైన మార్పు వచ్చేసింది.
    
    రేడియోలో దయ్యాల, పిశాచాల గొంతులు కాక- అతి శ్రావ్యంగా మానవ కంఠాలు వినబడడం మొదలెట్టాయి.
    
    "సుశీల" అన్నాడు జెయ్ చంద్ర గంభీరంగా.
    
    "అవును" అన్నాడు శేషు ఆనందంగా.
    
    "అవును" అన్నాడు పక్కింటి పార్వతీశం ఆశ్చర్యంగా.
    
    అంటూనే పోలోమని అక్కడ్నుంచి పరిగెత్తి వెళ్ళిపోయారు పార్వతీశంగారు.
    
    శేషు రేడియో సరిగ్గా పన్జేస్తోందన్న షాకింగ్ న్యూస్ ఆఘమేఘాల మీద ఆ లొకాలిటీలో అందరికీ తెలిసిపోయింది.
    
    అతి జిజ్ఞాసువులు కొందరు ఆ విశేషాన్ని చూడటానికి ఆఘమేఘాల మీద అక్కడికి వచ్చేశారు.
    
    కొంతమంది ఆశావాదులు "చూశారా! శేషురేడియోనే బాగుపడిందంటే యింక యీ ప్రపంచం కూడా ఏదోరోజున బాగుపడక తప్పదన్నమాట!" అనుకుని పొలోమని ఆనందించారు.
        
    ఇంకొంతమంది నిరాశావాదులు మాత్రం "అంతా మిధ్య" అన్నట్లు చప్పరించేసి-
    
    "ఆఁ చేటుకాలం దాపురించింది. శేషుగాడి రేడియోనే పాడుతుందంటే, ఇంక యివాళో రేపో జలప్రళయం తప్పదన్నమాట! ఇట్లాంటి విడ్డూరాల్ని గురించి వీరబ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పారు" అన్నారు.

 Previous Page Next Page