Previous Page Next Page 
సృష్టి పేజి 19


     తుషార్ కి  పాతికేళ్లుంటాయి. సన్నగా, పొడవుగా వుంటాడు. చేతిలో రెడ్ విల్స్ సిగరెట్  పెట్టె, లైటర్.

 

    "మీరేనా నందిని? మా బావ ఉత్తరంలో డిటైల్స్ అన్నీ  రాశాడు. నేనిక్కడ మిమ్మల్ని మిస్సవుతానని. అసలు నేను దూరం నుంచే చూసి మిమ్మెల్నెలా గుర్తుపట్టాను చెప్పండి?" తనో సూట్ కేస్ అందుకుంటూ అన్నాడు తుషార్.

 

    "తెలీదు" ముందుకు నడుస్తూ అన్నాడు అతను.

 

    "మీ చేతిలో కుంచెను చూసి, మిమ్మల్ని నేను  గుర్తుపడతానో లేదోనని చేతిలో కుంచెతో దిగమని మా బావ మీకు సజెస్ట్  చేశాడు కదా? ఆ విషయం లెటర్ లో రాశాడు" నవ్వుతూ అన్నాడు  తుషార్.

 

    తనని తుషార్ గుర్తుపట్టడానికి వీలుగా కుంచె పట్టుకున్నాడు. కానీ తను కుంచె ఎందుకు పట్టుకున్నాడో మరిచిపోయాడు అభినవ్.

 

    ముగ్గురూ ఆటో స్టాండ్  దగ్గరకొచ్చారు. ఆటో స్టాండ్ దగ్గర నిలబడిపోయాడు అభినవ్.

 

    "అయ్యా ఆర్టిస్టుగారూ! మనం ఆటోలో వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకి కారుంది" చనువుగా చెప్పి ముందుకు కారు పార్కింగ్ వైపు నడిచాడు తుషార్.

 

    సరిగ్గా  అదే సమయంలో.

 

    సెంట్రల్ స్టేషన్ లోంచి బయటికొచ్చి వరసగా వెళుతున్నాయి ఆటోలు! ఆ ఆటోల్లో ఒక ఆటోలో లిపి, వాళ్ళమ్మ కూర్చోగా , రెండో ఆటోలో లిపి తమ్ముడు భాస్కరం, వాళ్ళ నాన్నగారు కూర్చున్నారు.

 

    "మనం ఎక్కడకు వెళ్తున్నాం?" అడిగాడు లిపి తండ్రి తిరుమలరావు.

 

    "వెల్లివాకం" చెప్పాడు భాస్కరం.

 

    "ఇక్కడకు ఎంత దూరం వుంటుందేమిటి." అడిగాడాయన.

 

    "పదిహేను కిలోమీటర్లు వుండొచ్చు" చెప్పాడు భాస్కరం.

 

    "నాకు కిలోమీటర్ల లెఖ్ఖ తెలీదు. యోజనాల్లో చెప్పు" అడిగాడు ఆయన.

 

    "నాకు యోజనాల్లో చెప్పడం తెలీదు" చాదస్తంగా అడిగిన తండ్రి వైపు చిరాగ్గా చూశాడు భాస్కరం.

 

    పూనమల్లె రోడ్డులో ట్రాఫిక్ ఐలాండ్ దగ్గర ఆటోలు వరసగా ఆగిపోయాయి.

 

    అటూ ఇటూ చూస్తోంది లిపి.

 

    "పరాయి భాష మనకు రావడానికి పదేళ్ళు పడుతుందా?" చాదస్తంగా  అడిగింది లిపి తల్లి రాజ్యం.

 

    ఆ ప్రశ్నకు జవాబు చెప్పలేదు లిపి. పక్క వరసలో ఆగిన కారు  వైపు చూస్తోంది ఆమె ఆసమయంలో.

 

    ఆ కారు ఫ్రంట్ సీట్లో డోరు మీద  మోచేయి పెట్టుకుని సూటిగా చూస్తున్న  వ్యక్తిని చూసిందామె యథాలాపంగా.

 

    ఆ వ్యక్తిని ఎక్కడో  చూసింది తను. ఎక్కడ చూసిందో జ్ఞాపకం  రావడం లేదు.

 

    ఎక్కడో బాగా  చూసినట్టు, అతనో ఏదో మాట్లాడినట్టు గుర్తు. కానీ  ఏదీ  జ్ఞాపకం రావడంలేదు.

 

    రెడ్ లైట్ గ్రీన్ లైట్ గా మారడం, కారు సర్రున ముందుకు సాగడంతో  చూపుమరల్చిన లిపికి చటుక్కున అప్పుడు గుర్తుకొచ్చింది తను ఆ  వ్యక్తిని రైల్లో చూసిన విషయం.

 

    మళ్ళీ ఆ వ్యక్తి తనకు కనబడడం గమ్మత్తుగా అనిపించిందామెకు. తనలో తాను నవ్వుకుంది.

 

    "ఆ వ్యక్తి తనకు మద్రాసులో ఇంకెన్నిసార్లు కన్సిస్తాడో" ఆ  ఆలోచనే వింతగా వుంది లిపికి.

 


                                       *    *    *

 

    మరో ఇరవై అయిదు నిమిషాల తరువాత కారు వెల్లివాకం  ఏరియాలో ఒక రెండతస్తుల భవనం ముందు ఆగింది.

 

    "ఇదే మా కుటీరం సార్ దిగండి" అన్నాడు తుషార్.

 

    "ఉండేది మీరు ఒక్కరే  కదా. ఇంత బిల్డింగ్?" నందిని అంది.

 

    "హస్పిటల్లో పి.ఆర్.ఓని కదా. గెస్ట్ హౌస్  కమ్ రెసిడెన్స్  అన్నమాట  గెస్టులు మాత్రం ఎప్పుడో ఏడాదికొకసారి వస్తారు. రెంట్  హాస్పిటలే బేర్ చేస్తుంది" తనే రెండు  సూట్  కేసుల్ని పట్టుకుని లోనికి నడుస్తూ అన్నాడు తుషార్.

 

    విశాలమైన రోడ్లు, పత్రి ఇంటిలో కొబ్బరి చెట్లు. ఇళ్ళ  ముందు కర్రఫెన్సింగ్స్.

 

    "ఈ  ఎట్మాస్ఫియర్ పల్లెటూరు ఎట్మాస్పియర్లా వుంది కదూ?" నలుగు  వైపులా చూస్తూ అన్నాడు అభినవ్.

 

    "అసలు మాద్రసే పెద్ద  పల్లెటూరు కదండీబాబూ. ఈ స్టిండియా కంపెనీ వాళ్ళ పుణ్యం వల్ల సిటీ అయింది. లేకపొతే జాలరి గ్రామం లాగే వుండేది."

 

    "మీకు హిస్టరీ తెలుసా." సోఫాలో కూర్చుంటూ అంది నందిని.

 

    "నాకు చాలా సబ్జెక్టులు తెలుసండీ బాబూ. కాలం కలిసిరాక, హస్పిటల్లో మందుల వాసనల మధ్య గడుపుతున్నాను. గానీ ఎప్పుడో ఒకప్పుడు నేను పెద్ద డైరెక్టర్  ని అయిపోతాను" ఫ్లాస్క్ లోని కాఫీని రెండు కప్పుల్లో పోసి తెచ్చిస్తూ అన్నాడు తుషార్.

 

    "మందుల కంపెనీ డైరెక్టరా?" తుషార్ చేతిలోని కప్పును అందుకుంటూ అన్నాడు అతను అమాయకంగా.

 

    "కాదండీ బాబూ, సిన్మా డైరెక్టర్. పూర్తిగా తమిళ యాక్టర్స్ తో  ఒక డైరెక్టు తెలుగు సినిమా, పూర్తిగా తెలుగు యాక్టర్స్ చేత డైరెక్టు తమిళ సినిమా ఎప్పటికైనా తియ్యాలని నా కోరిక మీరు  చూస్తుండండి. బైదిబై ఆర్టిస్టుగారూ ఇది మీ ఇల్లు. మొహమాటం వద్దు. వంట  మనిషి తమిళపొన్ను. ఒక  అరగంటలో వస్తుంది. అసలైన  విషయం పదిగంటలకల్లా రెడీ అయితే మిమ్మల్ని హాస్పిటల్ కి తీసికెళతాను. స్పెషలిస్ట్ కుమరన్ మీ సిస్టర్ కి ప్రిలిమనరీ చెకప్ లన్నీ  చేస్తారు. డోన్ట్ వర్రీ ఆర్టిస్ట్ సాబ్! మీ సిస్టర్  కి నయమైపోతుంది" గడగడా, గబగబా చెప్పేస్తున్న తుషార్ వైపు ఆశ్చర్యంగా చూశాడు అభినవ్.

 

    తుషార్ జోవియల్ మనిషి. దాంతోపాటు బోళాతనం కూడా అతనిలో ఎక్కువ శాతం వున్నట్టనిపించింది అభినవ్ కి.

 


                                           *    *    *

 

    విజయా హెల్త్ సెంటర్ !

 

    స్పెషలిస్టు కుమరన్ అభినవ్ తో మాట్లాడుతున్నాడు......

 

    "ఇదొక విచిత్రమైన జబ్బు. నరాల్లో, రక్తనాళాల్లో ఎప్పుడు చలనము వస్తుందో తెలీదు. ఎప్పుడు ఆ కణాలు చలనరహితమైపోతాయో తెలీదు. ఎప్పుడు పెయిన్ వస్తుందో తెలీదు, ఎప్పుడు పెయిన రాదో తెలీదు.

 

    ఈ డిసీజ్ మీద ప్రస్తుతం అమెరికన్ హెల్త్ ఇన్ స్టిట్యూట్స్ లో పరిశోధనలు జరుగుతున్నాయి.       

 Previous Page Next Page