Previous Page Next Page 
సృష్టి పేజి 18


    ఆ మాట అంటున్నప్పుడు ఆగ్రాలో తాజ్ మహల్ ఎదురుగా తన  పెయింటింగును తీసుకున్న చీనంబర చటుక్కున గుర్తుకొచ్చిందతనికి.

 

    అదే సమయంలో అక్కడికొచ్చిన కావ్య ఆశ్చర్యంగా ఆ పెయింటింగు వేపు చూస్తూ "చూడండి సార్! మా అభినవ్ గొప్ప ఆర్టిస్ట్ అని చెప్పానా లేదా." అతడ్ని పొగడ్తల్లో ముంచెత్తిందామె.

 

    "మా అభినవ్" కావ్య నోటిలోంచి కొత్తగా వచ్చిన పదం అది.

 

    అదే  రోజు మధ్యాహ్నం ప్లైట్ లో మద్రాసుకు వెళ్ళి పోయాడు హరిహరన్ ఆ పెయింటింగుతో.

 

                                            *    *    *

 

    ఎయిర్ పోర్ట్  నుంచి ఆటోలో తిరిగొస్తున్న సమయంలో "గురూ! నీ పెయింటింగు చూసి ఆ హరిహరన్ ఎలా క్రిందపడిపోయాడో చూడు. నువ్వు  తల్చుకుంటే కోట్లు, కోట్లు అవలీలగా సంపాదించగలవు. నేనో ప్రపోజల్ చెప్తాను వింటావా?"

 

    "చెప్పు..... చెప్పండి" తత్తరపడుతూ అడిగాడు అభినవ్.

 

    "ఎన్నో సార్లు నీకు చెప్పిందే. మనం ఒన్ ఎడ్వర్టయిజింగ్ ఏజెన్సీ  స్టార్ట్ చేద్దాం. నువ్వు వెనక వుంటే  యాడ్ మీడియాలో వండ్రఫుల్ ఎక్స్  పరిమెంట్స్ చేసే పూచీ నాది. అందరూ ఫోటోల్ని వాడితే, మన పెయింటింగ్స్ ని  వాడదాం. మన చేతుల్లో మల్టీ నేషనల్ కంపెనీల్ని తీసి కొచ్చే రెస్పాన్స్  బిలిటీ నాది. హాయిగా మనిద్దరం....." ఏదో చెప్పబోయి ఆగిపోయింది కావ్య.

 

    "హాయిగా మనిద్దరం....." ఆమె కళ్ళవేపు అర్థంకానట్లు చూస్తూ  అన్నాడు అతను. వెంటనే మాట మార్చేసింది కావ్య.

 

    "హాయిగా మనిద్దరం మన ప్రతిభతో మనం బ్రతకొచ్చు. యాడ్  ఫీల్డ్ ను దున్నేయొచ్చు. వద్దంటే  డబ్బు. వద్దంటే లక్షలు. ఇలా ఆటోల్లో తిరిగే దరిద్రం  మనకు వుండదు."

 

    "అయామ్ నాట్  ఏ డ్రీమర్. మద్రాసులో ఏదో  హాస్పిటల్లో కాంటాక్ట్ చేస్తానన్నారు చేశారా?" అడిగాడు అతను.

 

    "నీతో వచ్చిన చిక్కే ఇదే బాసూ! నాకు నువ్వు రెస్పెక్ట్ ఇవ్వడం  ఏమిటి? ఫ్రెండ్స్ మధ్య ఆత్మీయత వుండాలి. రెస్పెక్ట్ కాదు" అని "ఆ హాస్పిటల్ సూపరింటెండెంట్ లీవ్ లో వున్నాడు. రేపు మాట్లాడతాను" అంది.

 

    ఆటో అభినవ్ ఇంటి ముందు ఆగింది.

 

    "సీయూ రేపు కలుస్తాను" నవ్వుతూ చెప్పింది కావ్య. ఆ నవ్వు లోని కృత్రిమతను జీర్ణించుకోలేకపోయాడు అతను. ఆటో  కదిలాక లోపలికి నడిచాడు అతను.

 

    
                                          *    *    *

 

    "పెయింటింగ్ అయిపోయిందా అన్నయ్యా!" లోపలకొస్తున్న అభినవ్ వేపు అభిమానంగా చూస్తూ అడిగింది నందిని.

 

    "పెయింటింగు ఎంత బాగా వచ్చిందో తెలుసా?" హేండ్ బ్యాగ్ ను కొక్కేనికి తగిలిస్తూ అన్నాడు అభినవ్.

 

    "అన్నీ బాగానే వస్తాయి నేను తప్ప. నా గురించి నువ్వేం పట్టించుకోవడం లేదు. పెయింటింగుల పేరుతో ఎక్కడెక్కడో తిరుగుతావు. పక్కింటి పిన్నిగారు ఉండబట్టి సరిపోయింది. కదలలేని నన్ను చూసుకోడానికి ఓ వదినను  తీసుకురారాదు. అప్పట్నించీ నువ్వెక్కడున్నా నేనడగను" మంచం  మీద లేచి కూర్చోడానికి ప్రయత్నిస్తూ అంది నందిని.

 

    "నువ్వు కదలలేవని , నడవలేవని ఎవరన్నారు?" పక్కనే  కూర్చుని జుత్తుమీద చెయ్యేస్తూ అన్నాడు అభినవ్.


    
    "ఏం !నేను ఈ మంచం మీద నుంచి దూకి ఒలింపిక్స్ లో పొల్గొంటానా?" నవ్వుతూ అందామె.

 

    "అవును. నువ్వు  కూడా చాలామందిలాగే కాలాన్ని, వ్యక్తుల్ని తక్కువగా అంచనా వేస్తున్నావు. నేను ఆర్టిస్టుని. ఏ ఆర్టిస్టయినా భూత, భవిష్యత్తులను తన వర్తమాన దృశ్యంలోంచి అనుభవంలోంచి చూడగల్గుతాడు" సీరియస్ గా అన్నాడు అతను.

 

    "అయితే చెప్పువింటాను. నాకు  లేచే ఓపిక ఉంటే రెండు ఉమ్మెత్త పువ్వులు తెచ్చుకొని చెవుల్లో పెట్టుకుని వినేదాన్ని" పెద్దగా  నవ్వుతూ అంది  నందిని.

 

    "నందినీ! మీ అన్నయ్య దురదృష్టవంతుడే కానీ నీ విషయంలో కాడు. నీ  అన్నయ్య బద్దకస్తుడే కానీ నీ విషయంలో కాడు. ఆ కావ్య  చేసే సహాయం  ద్వారా మనం  మద్రాసు  వెళ్ళలేమేమో అని అనుకుంటున్నావు కదూ. లేదు. నిన్ను తీసుకుని నేను మద్రాసు వెళుతున్నాను. రేపే వెళ్దాం" నిశ్చయంగా అన్నాడు అతను.

 

    "రేపేనా.....? నిజంగా.....? మరి డబ్బు....... ఆ ఢిల్లీ చెక్ క్యాష్  అయ్యిందా?"

 

    అయ్యిందన్నట్టుగా తలూపాడు అతను ఆనందంగా.

 

    పట్టలేని ఆనందంతో కదిలిపోయింది నందిని.

 


                                                            *    *    *

 

    మద్రాస్ సెంట్రల్.....


    
    అప్పుడే చార్మినార్  ఎక్స్ ప్రెస్  ఫ్లాట్ ఫారమ్మీదకు అడుగుపెట్టింది.

 

    కంపార్టుమెంటు డోరు  దగ్గరికొచ్చి ఎవరికోసమో ఆత్రుతగా చూస్తున్నాడు అభినవ్.

 

    నెమ్మదిగా ట్రైన్ ఫ్లాట్ ఫారాన్ని ఆక్రమించుకుంటోంది. తనకు కావలసిన వ్యక్తి కనిపించకపోవడంతో అతనికి చికాగ్గా వుంది ట్రైను ఆగగానే ట్రైన్ లోంచి చెల్లెలు నందినితో పాటు ఫ్లాట్ ఫారమ్మీదకు అడుగుపెట్టి సూట్  కేసుల్ని కిందపెట్టి అటూ యిటూ చూడసాగాడు అభినవ్.

 

    "ఎవరైనా వస్తారా?" అడిగింది నందిని.

 

    "అవును!"

 

    "ఎవరు?"

 

    "పేరు మార్చిపోయాను. హైద్రాబాద్ హాస్పిటల్లో నిన్ను ట్రీట్  చేస్తున్న డా|| కూర్మారావు బ్రదరిన్లా. ఇక్కడ విజయా హాస్పిటల్ లో పని చేస్తాడట" అన్నాడు  అతను అటూ యిటూ చూస్తూ.

 

    "ఇక్కడుండేవాడు నీకెలా తెలుసు?" అనుమానంగా అడిగింది నందిని.

 

    "మూడేళ్ళక్రితం  చూశాను."

 

    అన్నయ్య అమాయకత్వానికి నందనికి నవ్వొచ్చింది.

 

    "మీ ఆర్టిస్టులందరూ యింత అమాయకత్వంగానే  వుంటారా అన్నయ్యా?" ఆమె పెదిమల వెనక చిన్న నవ్వు.

 

    ఏదో జవాబు చెప్పబోయి ఆగిపోయాడు అభినవ్. అదే  సమయంలో అతని భుజమ్మీద చెయ్యి పడడంతో-

 

    "హల్లో ఆర్టిస్టు సార్! హౌ ఆర్యూ" తల తిప్పి వెనక్కి చూశాడు అభినవ్.

 

    పక్క  నుంచి వస్తూ తుషార్  కనిపించాడు.

 

    "నా పేరు తుషార్. మార్చిపోయారా?" తనని తాను పరిచయం చేసుకున్నాడు తుషార్. ఆ ఆకారాన్ని చూడగానే గుర్తుపట్టేశాడు అభినవ్.

 Previous Page Next Page